Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 22

"ఇదెక్కడ ముసలాళ్ళురా బాబూ!" అని తిట్టుకున్నాడు రాజులుగాడు.
ఐదు నిమిషాల తరువాత.
"ఈ బ్యాగ్...."
పుండరీకాక్షయ్య చటుక్కున బ్యాగ్ ని దగ్గరకు లాక్కుని రాజులగాడు మాట పూర్తిచెయ్యకముందే అందుకుని "ఆ బ్యాగ్ నాదేనయ్యా! బ్యాగ్ గురించి అడగటంలో నీ ఉద్దేశ్యం ఏమిటీ అంట? అసలు నా బ్యాగ్ గురించి నీకు ఎందుకు అంట?" కోపంగా గడగడా అనేశాడు.
ఆయన అలా మాట్లాడతాడని అనుకోని రాజులుగాడు ముందు బిత్తర పోయాడు.
ఇప్పుడు ఈ బ్యాగ్ ని....
మళ్ళీ ఎలా?....
అలా ఆలోచిస్తూ అటువైపు చూశాడు. దూరం నుంచి పోలీసులు ఇటువైపుకి వస్తూ కనిపించారు.
"ఈ ముసలాడు అసలే కోపంగా వున్నాడు.
ఈ విషయంలో ఏం మాట్లాడినా అసలుకే ఎసరు వస్తుంది. ఈ ముసలాడు ఎక్కడికి పోయేను? ఈ బ్యాగ్ ఎక్కడికి పోయేను? నా దృష్టిలో పడ్డ ఏ వస్తువూ తప్పించుకుపోలేదు. తను ముందు చెయ్యవలసింది పోలీసులు కంటపడకుండా వుండటం. తను పాత కేడీ నన్న విషయం ఆ ఎర్ర టోపీలగాళ్ళకి ఎలాగూ తెలుసు. ఈ రోజు ఏ కేసూ దొరకకపోతే తనని తీసుకెళ్ళి జైల్లో కూలేస్తారు. కొద్దిసేపు వాళ్ళ కళ్ళు కప్పగలిగితే చాలు....
అలా అనుకున్న రాజుగాడు బెంచీ మీదనుంచీ లేచి నుంచున్నాడు.
"నేను అలా లావెట్రీకి వెళ్ళి వస్తాను తాతగారూ! మీరిక్కడే వుంటారుగా?" అని అడిగాడు.
పుండరీకాక్షయ్యకి ఇంకా కోపం తగ్గలేదు.
మొహం గంటు పెట్టుకుని "ఆ! ఇక్కడే వుంటాను! దేనికి?" అని ధుమ ధుమ లాడుతూ అడిగాడు.
"నేను కూడా వెళ్ళేది గుంటూరే కదా! బస్సు వస్తే మీతోపాటే ఎక్కుదామని. నేను లోపలినుంచి రావటం కాస్త ఆలస్యమయితే ఈ లోపల బస్సు వచ్చి మీరు వెళుతూంతే వెళుతూ వెళుతూ లావెట్రీ దగ్గర ఆగి ఒక కేకపెట్టి వెళ్ళండి. ఆ__ మరేం లేదు. లావెట్రీకి వెడితే నేను తొందరగా రాను. అదీ విషయం." అని చెప్పి వేగంగా లావెట్రీ వైపు వెళ్ళిపోయాడు రాజులుగాడు.
అలాగే నన్నట్లు తలవూపిన పుండరీకాక్షయ్య, 'మంచి పనే అప్పగించావు నాయనా!' అనుకున్నాడు.
పోలీసులు ఇటుగా రావటం వల్ల చిల్లరదొంగ రాజులుగాడు మొహం చాటెయ్యటానికి లావెట్రీలో దూరాడని, పుండరీకాక్షయ్య గ్రహించలేదు.
పోలీసులు లావెట్రీకి కొంతదూరాన నుంచొని, ఏదో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.
లావెట్రీలోంచి బయటకి రాబోయిన రాజులుగాడు అక్కడే వున్న పోలీసులని చూసి, మళ్ళీ గబుక్కున లోపలికి దూరాడు.
అదే సమయంలో ఏదో బస్సు వచ్చి షెడ్ లో ఆగింది.
కౌంటర్ దగ్గర అంతక్రితం పుండరీకాక్షయ్యతో మాట్లాడిన ఇద్దరూ, అప్పుడే వచ్చి ఆగిన బస్సును చూసి, ఆ బస్సు ఎక్కుదామని వెళుతూండగా, వళ్ళో బ్యాగ్ పట్టుకుని పుండరీకాక్షయ్య కనిపించాడు వారికి.
వాళ్ళు పుండరీకాక్షయ్య దగ్గర ఆగారు. "మీరు గుంటూరు కదూ వెళ్ళవలసింది?" అని అడిగారు.
"అవును, గుంటూరే వెళ్ళాలి. ఏమిటి? గుంటూరు వెళ్ళే బస్సు రాబోతున్నదా?" ఆత్రుతగా అడిగాడు పుండరీకాక్షయ్య వారిని.
"లేదు. మరో బస్సు వచ్చింది. ఈ బస్సు ఎక్కి వెళ్ళి పధ్నాలుగో మైలురాయి దగ్గర దిగితే, అక్కడినుండీ వేరే బస్సు పట్టుకుని గుంటూరు వెళ్ళవచ్చు. గుంటూరు వెళ్ళేబస్సు రెండు గంటలు కాదుట, నాలుగు గంటలు ఆలస్యంగా వచ్చేటట్టుంది. మీరుకూడా వచ్చేటట్టయితే మాతో రండి." అన్నారు వాళ్ళు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS