Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 22

అతనిది తల్లి పోలిక. పసుపు పచ్చటి వంటి రంగు. నల్ల జుట్టు - నీలం టీషర్టుని తెల్లటి ప్యాంటులోకి టకప్ చేసుకుని వున్నాడు. "హాప్ మూన్ గ్లాసెస్" అనబడే అర్ధ చంద్రాకారపు అద్దాలు వున్న కళ్ళజోడు. ఇంత ఎత్తున వున్న రబ్బరు శాండిల్సు -
మనిషి కాస్త పొట్టిగా వున్నాడు- చాలామంది జపనీయులలాగే!
మనిషి పొట్టిగా వుండడమే కాదు- అతనికి సంబంధించినవన్నీ కూడా మినియేచర్ లెవెల్లోనే వున్నట్లు అనిపిస్తున్నాయి. చాలా చిన్నదే అయినా, పరిశుభ్రంగా వున్న ఇల్లు - అందులో చిన్న తోట!
ఆ తోటలో -
చిన్ని చిన్ని "మహా వృక్షాలు!"
మర్రి చెట్లు, రావిచెట్లు, మామిడి చెట్లు...
అందులో ఏవీ కూడా ఆరంగుళాల సైజుకి మించకుండా....
వినయంగా నిలబడి వున్నాయి!
అన్వేషిది చిన్న టేబులు.
దానిమీద-
నాలుగు అంగుళాల సైజు బొచ్చు కుక్కపిల్ల ఒకటి నిలబడి వుంది.
కార్లో విండ్ స్క్రీన్ దగ్గర వేళ్ళాడదీసే చిన్న బొచ్చుకుక్క బొమ్మ - సరిగ్గా ఆ సైజులోనే వుంది!
అదాటున చూస్తే, అచ్చం బొమ్మలాగానే వుంది కూడా-
వచ్చిన ఆగంతకుల వైపు చూసి అది అరవకపోతే!
ఆ వచ్చిన ఆగంతకులు ఒక యువతీ, ఒక యువకుడు!
వాళ్ళ వయసు పాతికేళ్ళలోనే వుంటుంది.
కానీ -
సుఖలాలసత్వంతో వయసు మీద పడిపోతున్న వాళ్ళలాగా వున్నారు. పాతికేళ్ళ వయసే అయినా, ముప్ఫయ్ అయిదేళ్ళ వయసు వాళ్ళలాగా కనబడుతున్నారు.
వాళ్ళని చూశాడు అన్-వే-షీ.
"కమ్! కమ్!" అన్నాడు సాదరంగా.
వాళ్ళిద్దరూ వచ్చి, అన్-వే-షీకి ఎదురుగా కూర్చున్నారు.
వాళ్ళవైపు నిశితంగా చూసి, "నేను చేస్తున్న కొత్త పరిశోధనల ఫలితం అప్పుడే మీక్కూడా తెలిసిందీ?" అన్నాడు అన్ వేషి.
"ఇది బ్రహ్మ రహస్యం అనీ, ఇంకెవరికీ చెప్పకూడదని ఒట్టేయించుకుని, ఒకళ్ళు చెప్పారు" అన్నాడు ఆ యువకుడు.
"ఎవరా ఒకళ్ళు?" అని కాస్త కఠినంగా అని, మళ్ళీ అంతలోనే "ఎవరయితేనేంలే! రహస్యం బయట పడిపోయాక - గతం గతః" అని, "ఇంతకీ మీకేం కావాలీ?" అన్నాడు.
వాళ్ళిద్దరూ మొహమాట పడుతున్నట్లు మొహమొహాలు చూసుకున్నారు.
అన్ వేషి అసహనంగా అన్నాడు.
"చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకూ? 'నిత్య యవ్వనం' పొందాలని మీ కోరిక! అవునా?" అన్నాడు.
అవునన్నట్లు మెల్లిగా తలలు ఆడించారు ఇద్దరూ.
కొంచెంసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు అన్ వేషి.
ఆ తర్వాత అన్నాడు.
"మానవ దేహంలోని బయోలాజికల్ క్లాక్ ని ముందుకు తిరక్కుండా ఆపేసి వృద్ధాప్యం మీద పడకుండా చెయ్యాలని ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నించారో చెప్పలేం! ఏజ్-వన్ అనే జీన్ ని అదుపులో పెట్టడం ద్వారా వానపాములూ వగైరాల ఆయర్దాయాన్ని పెంచగలిగారు. మనిషి శరీరంలో ఎన్నెన్నో జీన్ లు - హార్మోన్ లు- ఎంజైములు - బ్రెయిన్ ప్రొటీన్లూ వుంటాయి. వాటిలో ఎక్కడో దాక్కుని వుంటుంది ఇంకో రహస్యం - వృద్ధాప్యాన్ని నిరోధించేది.
దానిని గురించి ఎన్నెన్నో పరిశోధనలు!
చివరికి సాధించాను - నేను సాధించాను" అని ఆగి, సగర్వంగా పైపు వెలిగించాడు అన్ వేషి.
ఎగ్జయిటెడ్ గా అన్నాడు యువకుడు.
"సర్! నేనెవరో మీకు తెలుసు - ఒక మల్టీ బిలియనీర్ కొడుకుని - నాకూ నా ప్రియురాలికీ నిత్య యవ్వనం కావాలి - ఎంత ఖర్చయినా సరే ప్రసాదించండి! ప్లీజ్!"
నిర్లక్ష్యంగా ఎడం చెయ్యి విదిలించాడు అన్వేషి.
"ఖర్చు - డబ్బు సంగతి సెకండరీ - నేను కనిపెట్టిన ఈ అత్యద్భుతమైన మందుని టెస్ట్ చెయ్యడానికి నాకు వాలంటీర్లు కావాలి. మీ అంతట మీరుగా ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషం!"
ఆ యువకుడు, యువతీ చాలా హ్యాపీగా ఫీలయ్యారు.
చటుక్కున లేచి నిలబడ్డాడు అన్ వేషీ.
"కమ్ విత్ మీ!" అన్నాడు క్లుప్తంగా, పక్క గదిలోకి దారితీస్తూ.
ఆ యంగ్ కపుల్ కూడా అతని వెంట నడిచారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS