"అది నిజమైన జోగిని కాదని నా అనుమానం. అందుకనే మిమ్మల్ని..." అంటూ తన పెదవులతో అతని పెదవులు మూసింది....
5
ఆదివారం సాయంత్రం శ్రీహర్ష హరిజనవాడలోకి వెళ్ళి వర్షకు పాఠాలు చెబుతూ చాలాసేపు ఉండిపోయాడు. అతను లెక్కలూ అవీ చెబుతుంటే వర్షకు మైమరుపుగా వుంటుంది. అతను మాట్లాడుతూంటే ఇంకా ఇంకా వినాలని వుంటుంది.
"మీ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటే నిజంగానే స్టేట్ ఫస్ట్ వస్తాను" అంది.
"రావాలనే నా అభిలాష" అని వాచీ చూసుకుని "అయ్యో_ఎనిమిది దాటిపోయింది. కాసేపాగితే హోటలు కూడా కట్టేస్తారు" అన్నాడు కంగారుగా.
"ఏం? ఆకలేస్తోందా?"
"వెయ్యదామరి?"
"మా ఇంట్లో భోజనం చేయండి."
"మీ ఇంట్లోనా?"
"ఏం చెయ్యకూడదా?"
"అదికాదు. నాకు చాలా మొహమాటంగా వుంటుంది. అంతే కాకుండా మీ నాన్నగారేమైనా..."
"వాళ్ళలా అనుకునే మనుషులు కాదు."
ఇహ తప్పలేదు. వర్ష అతను తినడానికి వీలుగా ఉండేలా స్టెయిన్ లెస్ స్టీల్ కంచం పెట్టింది.
"నువ్వో..."
"నేను తరువాత తింటానులెండి."
ఆమె కంచంలోకి అన్నం, కూరా, ఊరగాయ చాలా నీట్ గా వడ్డించింది. అతనాశ్చర్యంగా చూస్తున్నాడు.
"ఏమిటలా చూస్తున్నారు?"
"ఊ....?"
"ఏమిటలా...?"
"నీలోని..."
"ఊ....?"
"కళాత్మకమైన సౌందర్యాన్ని...."
వర్ష సిగ్గుపడింది __ "అన్నం తినండి" అన్నది కళ్ళు క్రిందికి వాలుస్తూ__
"ఎన్నాళ్ళయింది?" అన్నాడు.
"ఏమిటి?"
"ఇలా ఆదరంగా దగ్గరగా కూర్చొని వడ్డిస్తోంటే తిని...."
"మీ అమ్మగారు గుర్తొచ్చారా?"
అతనేమీ జవాబు చెప్పలేదు. కళ్ళలోంచి కురుస్తున్న ఆర్ధ్రత చూసి అర్థం చేసుకుంది."
"మీ అమ్మగార్నీ, నాన్నగార్నీ చూడాలని ఉంది"
"చూపిస్తాను"
"ఎలా?"
"నిన్ను నాతో తీసుకువెళ్ళి"
"అమ్మో" వర్ష మళ్ళీ సిగ్గుపడింది.
ఒక్క నిముషం నిశ్శబ్దంగా గడిచింది.
"ఓ విషయం చెప్పనా?"
ఏమిటన్నట్లు చూశాడు.
"సుఖంతో కూడిన జీవితాన్ని ఏదో సాధిద్దామన్న ఉద్దేశ్యంతో యిక్కడికి వచ్చి కష్టాలలో యిరుక్కుపోయారు. ఇంకా ఇంకా కష్టాల ఊబిలోకి వెళ్ళిపోతారనిపిస్తోంది."
"కష్టంలేని జీవితానికి అర్ధం లేదు. సుఖమనేది భ్రాంతి. కష్టమే సహజమైనది. సుఖంలో కల్తీ ఉంటుంది. కష్టంలో కల్మషం ఉండదు."
ఆమె ఆశ్చర్యంగా చూస్తోంది.
"ఏమిటలా చూస్తున్నారు?"
"నిజాన్ని ఎంత అందంగా చెప్పారు?"
భోజనం చెయ్యడం పూర్తయింది. ఇద్దరూ కలిసి వాకిట్లోకి వచ్చారు.
"అదిగో చూశారా?" అంది ఎదురుగా ఉన్న ఇంకోవైపు చూశాడు. లోపలనుంచి ఓ మనిషి చూరు తగలకుండా కొంచెం ఒంగి నడుస్తూ బైటకువచ్చి చీకటిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
"ఆ ఇంట్లో పుష్ప అనే జోగి ఉంది. అలాంటి ఇళ్ళు ఈ వాడలో అరవై, డెబ్భైదాకా ఉన్నాయి. చీకటి పడడం ఆలస్యం. ఒక్కోసారి పగలైనా సరే. రావడం, పోవడం, రావడం, పోవడం _ మీరీ దురాచారాన్ని అరికట్టలేరు, వాళ్ళను మార్చలేరా?"
