Previous Page Next Page 
ఆదివిష్ణు నవలలు -3 పేజి 22


    చాలాసేపు నడిచేడు. జీతం గురించి ఆలోచిస్తూ నడిచేడు గనక చౌదరిగారిల్లు దాటి వెళ్ళిపోయిన సంగతి రైలుగేటు చూసేకగాని తెలీలేదు.

 

    ఏడుపు వచ్చినంత పనైంది!

 

    మళ్ళా వెనక్కి నడక ప్రారంభించేడు. ఈ తడవ జీతం గురించి ఆలోచించడం మానేసి నడవాలనుకున్నాడు. అనుకున్నది ఆచరణలో పెట్టగలిగేడు గనక, సరిగ్గా చౌదరిగారింటిముందు అగేడు.

 

    అప్పటికే అతను బాగా అలసిపోయేడు. ఎండదెబ్బకంటే జీతందెబ్బ ఎక్కవగా తీయడం వల్ల శరీరంలో ఓపిక పూర్తిగా నశించింది.

 

    అంచేత

 

    చౌదరిగారి గుమ్మం ఎక్కి తలుపు తట్టే శక్తిలేక సాక్షాత్తు ఆ గుమ్మంముందు కూలిపోయేడు.

 

    అతను కూలిపోవడం కళ్ళారా చూసిన ఇరుగూ పొరుగూ "అయ్యయ్యో" అని ఆర్తనాదాలు చేసేరు.

 

    ఆ ఆర్తనాదాలే తమ తలుపు తట్టినట్టు కాగా ఇంట్లో ఉన్న చౌదరి తలుపుతీసి బయటకు వచ్చేడు.

 

    గుమ్మం దగ్గిర శాస్త్రి శవములాగా పడి ఉండటం చూసి గాభరాపడి పోయేడు. గబగబా నీళ్ళు చల్లి కూచోబెట్టాడు.

 

    అతను కూచున్నాక ఇరుగూ పొరుగూ వెళ్ళిపోయేరు.

 

    మజ్జిగ తెప్పించి తాగమన్నాడు చౌదరి. చల్లటి మజ్జిగేమో కడుపులోకి వెళ్ళగానే ప్రాణంపోయి లేచి వచ్చినట్టయింది.

 

    శాస్త్రి కొంచెం తెప్పరిల్లేడు. తెప్పరిల్లగానే పాతిక రూపాయల జీతం మళ్ళీ గుర్తుకొచ్చింది. గుర్తుకురాగానే గాద్గదికంగా తన దీన పరిస్థితిని చౌదరిగారికి విన్నవించుకున్నాడు.

 

    "మా అయ్యగారికి తమరు ఇవ్వవలసిన బాకీ వెంటనే తీర్చకపోతేనేను అన్యాయమై పోతానుసార్! పేదముండాకొడుకుని, అనాధను, మీరే కాపాడాలి!"

 

    చెప్పడమే గాకుండా చేతుల రెండూ జోడించేడు కూడాను. చౌదరికి శాస్త్రి గోడేమిటో సమంగా అర్ధం కాలేదు. అంచేత అడిగాడు.

 

    "అప్పుపెట్టింది మీ అయ్యగారు! బాకీ పడింది నేను. ఇస్తే ఇస్తాను? ఎగ్గొడితే ఎగగొడతాను. అది మేమిద్దరం తేల్చుకోవలసిన విషయం. మధ్య నువ్వెందుకు అన్యాయం కావాలి?"

 

    కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగా అన్నాడు శాస్త్రి-

 

    "అయ్యా! అదొక రూలండి! అయ్యగారు పెట్టిన దిక్కుమాలిన రూలు. మీ బాకీ వసూలుచేసి ఆయన చేతుల్లో పెట్టకపోతే- నా జీతంలో ఏభై రూపాయలు తెగ్గోస్తానన్నారు!"

 

    చౌదరి మనసు కరిగింది. ఒక పేద బ్రాహ్మడ్ని కాల్చుకుతింటున్న లక్ష్మీపతిమీద వెర్రి కోపం కలిగింది.

 

    "అంతమాటన్నాడా? అయితే సరి! ఈ జన్మకివాడి బాకీ తీర్చనుగాక తీర్చను!" అన్నాడు కటువుగా!

 

    "అమ్మో! వారి మీద కోపంతో నాజీతం పాతిక చేయకండి మహా ప్రభో!" అని గావుకేక పెట్టేడు శాస్త్రి.

 

    చౌదరి శాస్త్రి భుజం తట్టేడు!

 

    "నీ జీతానికొచ్చిన భయమేమీలేదు. వాడు తెగ్గోస్తే ఏభై రూపాయలు నీకు నేనిస్తాను. సరా?"

 

    ఆ మాటతో శాస్త్రి కొంచెం స్థిమితపడ్డాడు చౌదరిగారి మంచితనానికి మురిసిపోయేడు. తనని పీడించే డవుట్సుని మాత్రం దాచుకోలేక కక్కేసాడు-

 

    "ఒక నెలే అయితే పర్లేదండీ. మీ అప్పుతీరేవరకు నెలనెలా ఏభై రూపాయలు కట్టేగదండీ?"

 

    చౌదరి రోషంగా అన్నాడు.

 

    "నెలనెలా ఆ ఏభై నేనిస్తానయ్యా! నీకోసం వేలు ఖర్చయినా ఫర్లేదు. వాడికివ్వాల్సిన అయిదొందలు మాత్రం జన్మకివ్వను. చాలా? అవునూ ఇంతకీ భోం చేసేవా? లేదా?"

 

    "లేదండి. పుట్టెడు దిగులు పెట్టుకుని ఏం భోంచేయగలనండీ?"

 

    "అట్లాగా! ఆ భోజనమేదో మా యింట్లోనే భోంచేసి- సాయంత్రం వరకు రెస్ట్ తీసుకో! చల్లబడ్డాక బందరెళ్ళి చావు కబురు మెల్లిగా మీ అయ్యగారి చెవినెయ్యి"

 

    తెగగోసే జీతం తాను ఇస్తానని చెప్పడమే గాకుండా ఎంతో ఆదరంగా భోంచెయ్యమని అడిగిన ఆ పెద్దమనిషితో లక్ష్మీపతిని పోల్చి చూసుకుని కన్నీరు పెట్టుకున్నాడు శాస్త్రి.

 

    విస్తరిముందు కూచున్నప్పుడు- వడ్డన చేస్తున్న చౌదరిగారి భార్య లక్ష్మీపతి గారబ్బాయి గురించి అడిగింది-ఎల్లాంటి వాడూ అని!

 

    ఆమె ధోరణిచూస్తే ఆ ఎంక్వయిరీ పెళ్ళి సంబంధం నిమిత్తమే అయివుంటుందని శాస్త్రి చప్పున గ్రహించేడు.

 

    అన్నం పెట్టినవారికి నిజం చెప్పడం ధర్మంగా భావించిన శాస్త్రి ఒక ముక్కతో కోదండరాం హోదా ఏమిటో చెప్పగలిగేడు.

 

    "అమ్మా-అబ్బాయిగారి గురించి అడక్కండి. పేరుకి అయ్యగారికి కొడుకేగాని, ఆ ఇంట్లో అతనిస్థితి నాకంటే అధ్వాన్నం"


                                                                 *  *  *


    కోదండరాం గురించి శాస్త్రి యిచ్చిన స్టేట్ మెంట్ నూటికి నూరుపాళ్ళ నిజం!

 

    సొంతఇంటిలో సుఖంగా తినలేని కోదండరాం--- సుబ్బారావింటిలో పెరుగావడలు పుచ్చుకుంటూ సుఖపడుతున్నాడు.

 

    గొడుగుపేటలో అదొక పెంకుటిల్లు. ఆ ఇంటిలో అద్దెకుంటున్నాడు సుబ్బారావు. అతను ఆర్టీసీలో గుమాస్తాగా ఉద్యోగం చేస్తున్నాడు.

 

    ఆ యింటి యజమాని చేసిన అప్పు తీర్చలేక దాన్ని లక్ష్మీపతికి చెల్లురాసి యిచ్చేడు.

 

    అంచేత ఇప్పుడాయింటికి లక్ష్మీపతే యజమాని, అది పెద్ద ఇల్లు. రెండువాటాలు చేసి అద్దెకిచ్చాడు. ఒక వాటాలో సుబ్బారావు వున్నాడు. రెండోవాటా ప్రస్తుతానికి ఖాళీగా వుంది.

 

    సుబ్బారావుతోపాటు ఆ వాటాలో అతని భార్యా, ముగ్గురు పిల్లలూ, అతని చెల్లెలూ వుంటున్నారు.

 

    సుబ్బారావు చెల్లెలు పేరు సుమతి!

 

    పదోతరగతి పాసై చదువు మానేసింది. ఆ పిల్లకు పెళ్ళిచేసే ప్రయత్నంలో ఉన్నాడు సుబ్బారావు.

 

    కోదండరాంకి సుమతిమీద మనసుంది. సుమతిక్కూడా కోదండరామంటే చాలా ఇష్టం.

 

    అంచేత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనే పదార్ధం అంటుకుని ఏడాది గడిచింది. పెళ్ళి చేసుకుందామని ఇద్దరూ అనుకున్నారు.

 

    ఎంత ప్రేమించుకున్నా డ్యూయెట్లు పాడినా- పెళ్ళనే విషయం పెద్దల కొదిలేసి సాంప్రదాయంతో బతుకుతున్నారు గనక వాళ్ళు చేసుకుందామనే మాట దగ్గిర ఆగిపోయేరు.

 

    సుమతికి పెళ్ళవుతుందంటే సుబ్బారావు ఎగిరి గంతులేయగలడు. లక్ష్మీపతి విషయం అట్లాకాదు అతను గంతేయాలంటే దానికో ప్రొసీజరూ పద్ధతీ వున్నాయి. తన కొడుక్కి పిల్లనిచ్చేవాళ్ళు లక్షరూపాయలు కక్కాలి. కక్కే ఓపిక వుందని చెబితే చాలదు పెళ్ళికి ముందే ఆ కక్కేదేదో తన చేతిలో కక్కాలి. అప్పుడూ పెళ్ళి. ఆ తర్వాతగాని లక్ష్మీపతి గంతేయడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS