Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 22


    "మనం మధ్యాహ్నం ఈ రూం ఖాళీచేద్దాం... సాయంత్రం కొండమీద కెళ్ళిపోదాం... ప్రస్తుతం... నేనొకసారి బయటికెళ్ళి, కొండమీద రూం బుక్ చేసి, పెళ్ళి పంతుల్ని బుక్ చేసి వస్తాను... మధ్యాహ్నం 'లంచ్' అయిపోయాక మాట్నీకి సిన్మాకెళ్దాం... ఓ.కె..."

 

    తలూపింది గౌతమి.

 

    గదిలో ఆమె చదువుకోడానికి కొన్ని మేగజైన్లు తెప్పించింది.

 

    ఆ తర్వాత-

 

    తెరచి ఉన్న తన సూట్ కేసుకి తాళం వేసి హోటల్లోంచి బయటకొచ్చాడు.

 

    అంతకు ముందు రెండుమూడుసార్లు తిరుపతి వచ్చాడు అవినాష్. అంచేత దార్లన్నీ తెల్సు.

 

    నేరుగా, నడుచుకుంటూ గాంధీనగర పోస్టాఫీసు దగ్గరికొచ్చాడు.

 

    "హోటల్ భీమా" కి ఫోన్ చేసాడు.

 

    "ఎస్... వాట్ కెన్ ఐడూ ఫర్ యూ సర్-" 'భీమాస్' రిసెప్షనిస్ట్ లైన్లో కొచ్చింది.

 

    "మిస్ గౌతమి ఫ్రమ్ విశాఖ" అడిగాడు అవినాష్.

 

    మరో క్షణంలో గౌతమి లైన్లో కొచ్చింది.

 

    "హలో... గౌతమి హియర్..."

 

    అవినాష్ ఏం మాట్లాడలేదు.

 

    "హలో... హలో..." గౌతమి గొంతు స్పష్టంగా విన్పిస్తోంది అవినాష్ కి.

 

    అవినాష్ టక్కున రిసీవర్ని క్రెడిల్ మీద పెట్టేశాడు.

 

    రాంగ్ నెంబరా... ఏమో- అనుకుని రిసీవర్ని మళ్ళీ యధా స్థానంలో ఉంచేసింది గౌతమి.

 

    పోస్టాఫీసులోంచి బయటికొచ్చి ఆర్టీసి బస్టాండువేపు నడిచాడు అవినాష్.

 

    ఎప్పుడూ రకరకాల మనుషుల్తో చిత్ర విచిత్రంగా సందడిగా ఉండే తిరుపతి బస్టాండు ఆ రోజు కూడా అలాగే ఉంది.

 

    విజిటర్స్ లాంజ్ లో ఓ గంట సేపు గడిపాడు.

 

    నాలుగు వేపుల్నించీ వస్తున్న బస్సుల్నీ, అందులోంచి దిగుతున్న భక్తుల్నీ చూస్తూ మరో అరగంట గడిపాడు.

 

    లేచి కూల్ డ్రింక్ తాగి సిగరెట్ వెలిగించుకొని, బస్టాండ్ లో ఉన్న పబ్లిక్ టెలిఫోన్' దగ్గరకు నడిచాడు.

 

    మళ్లీ భీమాస్ కి ఫోన్ చేశాడు. యధా ప్రకారంగా రిసెప్షనిస్ట్ లైన్లో కొచ్చింది.

 

    రూం నెంబర్ చెప్పి గౌతమి కావాలని అడిగాడు అవినాష్.

 

    మళ్ళీ గౌతమి లైన్లోకొచ్చింది.

 

    "హలో గౌతమి హియర్..."

 

    పదిసెకెండ్ల సేపు రిసీవర్ని అలాగే పట్టుకున్నాడు కానీ అవినాష్ ఏం మాట్లాడలేదు.

 

    "హలో-హలో-ఎవరూ-" గౌతమి గొంతు విన్పిస్తోంది.

 

    అవినాష్ టక్కున రిసీవర్ని మళ్ళీ యధాస్థానంలో పెట్టేశాడు.

 

    అక్కడ గౌతమికి ఇదంతా చికాగ్గా ఉంది.

 

    వెంటనే ఆపరేటర్ని అడిగింది.

 

    "మీ రూం నెంబరు చెప్పి-మీరు కావాలని అడిగారు-"

 

    ఆపరేటర్ చెప్పింది.

 

    "మేల్ వాయిస్సా-ఫిమేల్ వాయిస్సా-" గౌతమి అడిగింది.

 

    "మేల్ వాయిస్సే మేడం-"

 

    "ఓ.కె. థాంక్యూ-"

 

    ఎవరై ఉంటారు అవినాషే తన కోసం ఫోన్ చేసి ఉంటాడా?

 

    "మరి?!

 

    ఫోన్ చేస్తే, లైన్ దొరికితే-తనతో ఎందుకు మాట్లాడలేదు.

 

    అవినాష్ అయితే మాట్లాడడా?

 

    ఆమెలో ఎన్నెన్నో సందేహాలు మరెన్నో-భయాలు-ఇంకెన్నో అనుమానాలు...

 

    ఆలోచిస్తూ ఏదో వారపత్రిక తిరగేస్తూ కూర్చుంది గౌతమి.

 

    అరగంట గడిచింది.

 

    తలుపు చప్పుడైతే, గబుక్కునలేచి తలుపు తెరిచింది.

 

    ఎదురుగా...

 

    అవినాష్...

 

    చేతిలో పూలతో లోనికొచ్చాడు...అతని పెదవుల మీద చిరునవ్వు.

 

    "అంతా ఓ.కె. మైడియర్-కొండమీద మన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. రేపుదయం పదకొండు గంటలకి ముహూర్తం. లంచ్ చేశాక కొండెక్కెద్దాం-" అంటూ బాయ్ ని పిల్చి 'రెండు లంచ్' ఆర్డర్ చేశాడు.

 

    పావు గంటలో లంచ్ వచ్చింది.

 

    భోంచేస్తున్న సమయంలో గౌతమికి అకస్మాత్తుగా తన కొచ్చిన ఫోన్ల విషయం జ్ఞాపకానికొచ్చింది

.

    "అవినాష్-ఇందాక-నువ్వు బజార్లోకి వెళ్ళిన సమయంలో నాకు రెండు సార్లు ఎవరో ఫోన్ చేశారు-కానీ ఫోనెత్తితే ఎవరూ రిప్లయి ఇవ్వలేదు.

 

    ఆ మాటకు ఆశ్చర్యపోయినట్టు నటించాడు అవినాష్.

 

    "నీ కొలీగ్స్ ఎవరైనా వచ్చారేమో-" అన్నాడు అవినాష్.

 

    "నేనిక్కడకు వచ్చినట్టు ఎవరికీ తెలీదు కదా-" చెప్పింది గౌతమి.

 

    ఆ మాటకు మనసులోనే చాలా ఆనందించాడు.

 

    "అదీగాక-ఆ వాయిస్ ఫిమేల్ వాయిస్ కాదు- మేల్ వాయిస్సట."

 

    "మేల్ వాయిస్సా-ఎవరు చెప్పారు-" షాక్ తింటూ అడిగాడు అవినాష్.

 

    "ఆపరేటర్..." చెప్పింది గౌతమి.

 

    "రాంగ్ నెంబర్ అయి ఉంటుంది-" కొట్టిపారేసాడు అవినాష్.

 

    ఆ విషయం అప్పటితో మరిచిపోయింది గౌతమి, కానీ ఆ విషయం నువ్వింకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అవినాష్ కి హెచ్చరించినట్టయింది.


                                               *    *    *    *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS