Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 21


    "మరిచిపోలేనా? అనుకుంటే అనేకం మరచిపోగలను" అని బెదిరినట్లు గురువుగారి ముఖం చూస్తూ ఉండిపోయేవారు హఫీజ్ గారు.
    తరవాత వీధి పెద్దయి అనేకుల అదృష్టాలను నిముషాల్లో తేల్చేశాడు- తగాదాల్లో తీర్పులు ఇచ్చి-
    ఒక శుభవేళ వీధిలో సన్నాయి మోగింది. వీధిలో హడావిడి కనిపించింది. వారు బాసింగం సవరించుకుంటూ గుర్రం ఎక్కారు. ఒకడు చిచ్చుబుడ్డి అంటించాడు. హఫీజ్ గారి వేలు చురుక్కుమంది. ఆ నిప్పు బట్టల్లో పడింది. అంటుకుంది. వారు గుర్రంమీంచి పడిపోయారు. ఉక్కిరిబిక్కిరి అయినారు. కాని కొండపల్లి బొమ్మలాంటి వధువు ఆప్యాయతతో మంటలు ఆరిపోయాయి. జీవితంలో ఆనందం ప్రవేశించింది- హాయిగా గడిచిపోతూంది.
    వేసవి పగలు కొడుకులు కూతుళ్ళతో మామిడి పళ్లు తినడానికి కూర్చునేవారు. బామ్మనుంచి వచ్చిన మామిడి పళ్లు హఫీజ్ గారి పళ్లు పులపించేవి, పులుపుదనం నరనరాల్లో వ్యాపించేది. ఆ చెట్టు పళ్లు ఇంత పులుపుదేరాయి!
    బామ్మ ఏండ్లకు పుట్టింటికి వచ్చేది.
    'అమ్మా, కలలు వస్తాయా! చాల కలల్లో ఈ మామిడి చెట్టు కనిపిస్తుంది. నేను కనిపిస్తాను. నేనే మామిడి చెట్టుకు నిప్పంటిస్తున్నట్లు కలగంటాను.'
    కలల వృత్తాంతం విని అంతా దిగ్గునలేచి కూర్చుంటారు. 'నువ్వేగదనే ఈ చెట్టును పసిపిల్లను సాకినట్టు సాకావు' అంటుంది అమ్మ.
    "ఆ రోజంతా గుండె దడదడలాడుతుంది. పిల్లలమీద కోపం తీర్చుకుంటాను. వాళ్ళతో పోట్లాడుతాను. అయినా వాళ్లు మాట్లాడరు. పాపం చూస్తూ ఉండిపోతారు."
    భర్త పోయింతరవాత ఈ ఇంటికే వచ్చేసింది. అప్పుడు అమాంతంగా తన పెత్తనం గుర్తుకువచ్చింది. ఉప్పునీటి నూతివాళ్ళు పాత వైరాన్ని గురించి పిల్లల బుర్రలకు ఎక్కించింది. వాళ్ళవల్లనే తనకు జీవితంలో అనేక ఇక్కట్లు వచ్చాయనీ నూరిపోసింది.
    ఇటు రజ్జూ హఫీజ్ అయినాడు. వీధిపెద్ద అయినాడు. తాత అయినాడు. అన్ని దశలు దాటి వీధి వాళ్ళకు హఫీజ్ అయ్యాడు. పిల్లలకు ఖురాన్ చదివించేవారు. ఎవరో ఒక తల్లి వచ్చి దీవెనలు కోరేది. వారి ఆయువు కూడా ఆనందంగా కొనసాగుతూంది. మంచంమీద కూర్చుని, జపమాల తిప్పుతూ సర్వజగత్తూనూ దూషిస్తారు. ప్రార్థన సార్థకం కావాలంటే మనస్ఫూర్తి కావాలి. ఎందుకో తెలియదు కాని వారెన్నడూ మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లులేదు. నమాజు చేసేప్పుడు పరధ్యానం, నమస్కరించేప్పుడూ అన్యమనస్కత వార్ధక్యంలోనూ వదల్లేదు. రాత్రులకు రాత్రులు జాగారంచేసి ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. గంటలతరబడి సాష్టాంగపడి ముక్కు నేలకు రాస్తారు. జీవితంలోని సుఖాలన్నీ అనుభవించారు. అయినా ఏమిటీ మనస్తాపం! జీవితాంతం ఒక దోసెడు చల్లని నీళ్ళకోసం నిరీక్షించినట్లు తల్లడిల్లిపోతారు. జపమాల నేలక్కొడ్తారు.
    "ముసలివాళ్ళను చాలామందిని చూచాను కాని మామగారివలె ముక్కు మీద కోపం ఉండేవాళ్ళను మాత్రం చూడలేదు." పెద్ద కోడలు అజిజా అంటుంది.
    "ఊరుకో-పెద్దమనిషి-ఏమిటిది?" కొడుకు వారిస్తాడు.
    ఇంతలో గజాలా పెద్దగా నవ్వేస్తుంది. ఆ నవ్వు విని వారి నరాల్లో చిచ్చురగుల్తుంది. "మేమూ ఒకప్పుడు పడుచువాళ్ళమే-కాని మీవలె కుక్కల్లా తిరగలేదు. మనుషుల్లా ప్రవర్తించాం....." మరేదో అనబోయారు కాని మరకు ఇచ్చిన బిస వడిసిపోయింది. దగ్గుతెర వచ్చి సతమతం అయినారు. "భగవంతుడు ఎల్లరను రక్షించుగాక!" అన్నారు సంపూర్ణ విశ్వాసంతో.
    అలా ఏదో మత్తులో ఉభయుల మధ్య కొన్ని గంటలు జారిపోయాయి. వారి మనో నేత్రాల్లో మరిన్ని దృశ్యాలు కనిపించాయో!
    "అయితే వెళ్ళనా..... ....." అమాంతంగా అన్నాడు- ఏదో స్వప్న జగత్తు నుంచి బయటపడినట్లు.
    "ఎక్కడికి వెళ్తావు, కూర్చో..... ..... ....." అనడం అన్నదికాని బామ్మకి గుర్తొచ్చింది, అది ఈనాడు అనాల్సిన మాట కాదని.
    "ఏమిటి నేనన్నది.... .... ....?" చెయ్యి నొసట పెట్టుకొని ఆలోచించసాగింది. ఆలోచనా తరంగాలు వచ్చీ వచ్చీ మామిడిచెట్టు తాకి ఆగిపోయాయి......
    "ఇంకా అనేదేమున్నది.....!" హఫీజ్ జీ వణికే చేతుల్తో కర్ర అందుకొని లేవబోయారు.
    "ఇప్పుడు నువ్వూ, నేను అంటే వినేదెవడు......." అంటూ చప్పున ఆగిపోయింది- నొప్పితో తల్లడిల్లేవానికి ముందు గుర్తుకు వచ్చినట్లు.
    "నేననేదేమంటే చేసెయ్యండి ఆ వెధవల పెళ్ళి-కనీసం అర్థంలేని ప్రార్థనలు చేయరు- మనసయినా నిర్మలంగా ఉంటుంది-"
    హఫీజ్ అన్నారు.

                                                                                  * * * *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS