12
శాస్త్రిగారి ఇంటి ముందు బండి ఆగింది. పావని బండిలోంచి దిగింది. తెచ్చిన సరుకులు ఒక్కొక్కటీ బండి లోంచి దింపుతూంటే శాస్త్రిగారు లోన పెట్టారు. బండి బాడుగది బండివాడు బాడుగ అందుకొని వెళ్ళిపోయాడు.
పావని బాగా అలసి ఉంది. ముఖం నిండా దుమ్ము, కళ్ళలో అలసటా కనిపిస్తున్నాయి. తువ్వాలు, సబ్బు అందుకొని దొడ్లోకి వెళ్ళిపోయింది.
శాస్త్రిగారు పావని తెచ్చిన పదార్ధాలను పరికించసాగారు వారికి ఏమీ అర్ధం కాలేదు అన్నీ డబ్బాలే అన్ని డబ్బాలు ఎందుకు తెచ్చిందో వారికి తెలియలేదు. ఉన్నది తామిద్దరు ఇన్ని సరుకులు పట్నం నుంచి తేవాల్సిన అవసరం ఏమో వారికి అంతు బట్టలేదు. మూతలన్నీ తీసి చూశాడు పొడుం పీల్చి, మంచం మీద వాలిపోయి , తల గోక్కున్నారు. పంచాంగం అందుకుని పరిశీలించసాగారు.
పావని స్నానం చేసింది. తల తుడుచుకుంటూ లోన ప్రవేశించింది . పంచాంగం పరిశీలిస్తున్న తండ్రిని చూసింది.
"ఏం నాన్నా! మూహూర్తం చూస్తున్నావా/ పెళ్ళి చేసేస్తావా ఏం?" వేళాకోళంగా అడిగింది.
శాస్త్రిగారు సీరియస్ గా లేచి కూర్చున్నారు. 'అవునమ్మా! నీకు పెళ్ళి చేసేయ్యాలే ఇహ లాభం లేదు. ఎన్నాళ్ళు తిరుగుతావు ఇట్ల, పిల్లవాడు కుదిరిండు ముహూర్తం చూస్తున్న"
"నాన్నా! ఏమిటి మీరంటున్నది? నాకు పెళ్ళేమిటి? ఒక్క రోజులో పిల్లవాడు ఎలా దొరికాడు? డబ్బు ఎక్కడిది?"
'అన్నీ సిద్దం అయినాయి ఇగ నువ్వు గూడేనికి పోవద్దు. నువ్వట్ల తిరుగుతుంటే నిన్నెవడు చేసుకుంటాడు?"
తండ్రి సీరియస్ గానే మాట్లాడుతున్నాడు. పావని కాస్త తడబడింది. ఆమె కేమీ అంతు పట్టలేదు.
"నాన్నా! నేను పెళ్ళి చేసుకోను. నేను తల్లిని, అందరికీ అమ్మను చేసుకోను నేను పెళ్ళి"
"చేసుకోవలసిందే , చేసుకోక తప్పదు లేకుంటే నా ఇంట్లోంచి వెళ్ళిపో ఊ, ఇప్పుడే ఫో"
"నాన్నా!" పావని కళ్ళలో నీరు తిరిగింది.
"అవును శివయ్య డబ్బిస్తనన్నపుడు నీకు పెళ్ళి చేయమన్నాడు. అతను అన్న మాట నీకు చెప్పిన" అని గలగలా నవ్వేశారు శాస్త్రిగారూ.
"నాన్నా! నా ప్రాణం తీసేశావు. ఏమిటో అనుకున్నా" అని నిట్టూర్చింది. పావని తానూ తండ్రితో పాటు నవ్వేసింది.
"శివయ్య ఎందుకన్న డంటావు - అట్ల?"
"నాన్నా! శివయ్య పెద్ద ప్లాను వేశాడు. పెండ్లి పేరుమీద మనిద్దరికీ పోట్లాట పెట్టాలనుకున్నాడు. నువ్వు నన్ను వెళ్ళగోడ్తావు . నేను వంటరిని అయిపోతాను. అప్పుడు నా మీద పగ సాధించ వచ్చునుకున్నాడు . అతడు పెండ్లికి డబ్బెందుకు ఇస్తాడు? ఆ పేరు చెప్పి మనను చీలదీయడం అతని ప్రధమ లక్ష్యం"
"ఎంత ఆలోచించానమ్మా పావనీ! నేను నిన్ను వదులుకుంటానా? నువ్వు మా అమ్మవు, తల్లివి అంతే కాదమ్మా, ఈ ఊరికి దేవివి, శివయ్య పాలిటి శక్తివి" అని లేచి పావని తల ముద్దాడారు.
"నాన్నా! నువ్వు ఎంత మంచివాడివి నాన్నా! నువ్వు ఈ చిన్న విషయం గ్రహించలేకుంటే కధ సాంతం అడ్డం తిరిగేది"
"అమ్మా! నీ మంచితనం , మానవత నాలో ఏంతో మార్పు తెచ్చినయమ్మా! నేను మామూలు శాస్త్రిని అవుతే శివయ్య వలలో పడివుండే వాడిని. నువ్వు నాకే కాదు ఈ ఊరికే జ్ఞాన భిక్ష పెట్టావు తల్లీ!"
"నాన్నా!' పావని తండ్రిని కావలించుకుంది. భుజం మీద తలపెట్టి అనండభాష్పాలు రాల్చింది.
"అమ్మా, నాకు భయం కల్గుతుంది తల్లి! ఈ జయం నీది కాదమ్మా! మంచిది మానవతది కలుగుతుందమ్మా , జయం కలుగుతుంది" -- కూతురు తల మీద చేయి వేసి నిమురుతూ అన్నారు.
పావని కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది, "నాన్నా ఇవన్నీ బడిపిల్లల కోసం గవర్నమెంటు పంపింది. మొక్క జొన్న, రవ్వ, నూనె, పాలపొడి ఉన్నాయి. వారికి మధ్యాహ్నం ఫలహారం చేసి పెట్టాలి. గవర్నమెంటూ చాలా కాలంగా ఇవి అందిస్తుంది పంతులూ, శివయ్యా కలిసి మింగేస్తున్నారు."
"ఎంత దుర్మార్గులు! పసిపిల్లల నోటి ముందరిది గుంజుకుంటారామ్మా!"
'అంతేకాదు నాన్నా! గవర్నమెంటు ఈ పిల్లలకానీ ఇచ్చే డబ్బు కూడా కాజేస్తున్నారు అదికూడా తెచ్చాను, వారికి అందిస్తాను"
'అమ్మా! నువ్వు మానవసేవ చేస్తున్నానమ్మా, మేము ఎక్కడనో కనిపించని మాధవుడు, మాధవుడు అని కొట్టుకు చస్తున్నాము. కానీ, తల్లీ కానీ ధర్మో రక్షతి రక్షిత"
పావని ఇంట్లోకి వెళ్ళింది , నిప్పు రాజేసింది, ఉప్మా తయారుచేసింది, పాల పొడితో పాలు చేసింది. బట్టలు మార్చుకుంది చింత కింద బడికి వెళ్ళేటప్పుడు తండ్రితో చెప్పి వెళ్ళింది, వెంకడు వస్తే వాటిని పంపించమని.
పావని చింత కిందికి వచ్చేసింది. పిల్లలు కూడా వచ్చేశారు. వారు కొంతలో కొంత శుభ్రంగా ఉన్నారు. ముఖాల మీద సంతోషం కనిపిస్తుంది . వారి ముఖాల్లో ఇంతకాలంగా లేని పసితనం, చిలిపితనం కనిపిస్తున్నాయి.
