శారద లేచి హృదయమున నమాటలెల గాటముగ నాటికొని ప్రత్యక్షమైన స్వామియెడ నిరసన భావమును, వైముఖ్యమును మొలకెత్తించినవి. అట్టి మనస్థితిలో నున్న శారదను నారాయణరావు పలుకరించినప్పుడామె యించుక యులికిపడినదనిన వింత యేమి! ఆమె భర్తకు బదులు పలుకక మోము వంచుకొన్నది. నారాయణరావు చిన్నబుచ్చుకొనియు, బాలిక సిగ్గుపడియుండబోలునని సమాధానపడినాడు.
"శారదా! నీకు ఇంగ్లీష్ బాగా వచ్చునట కాదూ? ఇంగ్లీషు చదువుకొన్న బాలికలు సిగ్గుపడరటగా! నువ్వీయేడు స్కూలు ఫైనలు పరీక్షకు వెళతావనుకొన్నారే. అట్లాంటప్పుడు నాతో మాట్లాడడానికీ సంకోచం ఏమిటి?' నారాయణరావింగ్లీషులోనే యామె నడిగినాడు.
శారద మారు పలుకలేదు. ఆమె నలముకొన్న ఆశ్చర్యపుదెర ఇంకను అలమినట్లే యున్నది. ఆమె మౌనముద్ర వహించియే యుండెను.
'ఈ యేడు గవర్నమెంటు పరీక్షలో మొదటి తరగతి మార్కులు వస్తాయని మీ దొరసానిగారన్నది. నువ్వు చదువుకోని బాలికవలె సిగ్గుపడవని ఆమె చెప్పిందే? సిగ్గెందుకు నీకు? ఆమె మాటే నిజం అయితే, ఏదీ మాట్లాడు చూద్దాం.' (ఇంకను ఇంగ్లీషు భాషలోనే...)
శారదకు పౌరుషము వచ్చినది. మద్రాసు యూనివర్శిటీ వారి మెట్రిక్యులేషను పరీక్షకు దరఖాస్తు పెడ్తున్నాను. స్కూలు ఫైనలు పరీక్షకు పాఠశాలలో జేరాలికదా!' అనినది ఇంగ్లీషులోనే.
'అదీ! ఆలాగు జవాబు చెప్పాలి. ఫిడేలంటే యిష్టమా, లేక వీణంటేనా?'
'రెండూనూ.'
'ఆ రెండింటిలోను ఏది మంచిది?'
'దేనికదే!'
'అలాంటే ఎలాగుమరి? వీణమీది తానం ఫిడేలుమీద రాదు. ఫిడేలు మీది సంగతి వీణకు రాదు. వీణ ఒదుగు ఫిడేలులో లేదు. వీణలో ధ్వని ఫిడేలులో లేదు. ఫిడేలు...'
'అందుకనే దేని అందం దానిది. దాని అందం దీనికి, దీని అందం దానికి రాదు.'
'నీవు సంగమయ్యగారి కచేరీ చూశావా?'
'మా మేడకి వచ్చి ప్రతియేడూ పదిహేనురోజులు మకాం చేస్తూ వుంటారు. ఆయన అద్భుత వాద్యము నాకు వినిపించి నా వీణ పాటకు మెరుగులు దిద్దేవారు.'
'ఏమిటీ! సంగమయ్యగారికే శిష్యురాలివా! ఎంత అదృష్టవంతురాలివి!'
ఇంతలో నూరేగింపు విడిదికాడకు వచ్చుటచే నా నూతనవధూవరుల సంభాషణ ఆగిపోయినది. నారాయణరావటులనే మూడు నాలుగు సార్లు భార్యతో మాట్లాడి ఆనందధామములో విహరించినాడు.
ఈనాడు తోటలో, భర్త సూర్యకాంతము నట్లు బలుకరించినప్పుడు, శారద కించుక రోత పుట్టినది. కనురెప్పమూత కాలములో జనించి మాయమయిన యా భావమును గ్రహించిన నారాయణరావు మనస్సు చివుక్కుమన్నది. సోదర ప్రాణయగు సూర్యకాంతము నునులేత యెదకు వారిరువురి భావములు స్పష్టమై తోచినవి. అన్నా వదినెల మనోమాలిన్యము తుడిచివేయుటకో యన బా బాల 'గుమ్మడిపండావును చూతము రం'డని తన చిన్నారిచేతులు సాచి వారిరువురి హస్తములు గ్రహించి బిరబిర గొని పోయినది.
గృహమేధి
సుబ్బారాయుడు గారింటి వెనుక పెరటిలో నొక తూర్పువెలమల కుటుంబము, రెండు బీదకాపుల కుటుంబములు, అయిదు తూర్పుగొల్లల కుటుంబములు కాపురమున్నవి. వారందరు సుబ్బారాయుడుగారి పాలేరులే. కాపులలో కుంకట్ల సోమయ్య యనునతడు పెద్దపాలేరు. సుబ్బారాయుడు గారుపాలేండ్ర కాపురమునకై శుభ్రమగు నిండ్లు కట్టించి యిచ్చిరి. సోమయ్య ఇల్లు తక్కినవానికన్న బెద్దది. సోమయ్య బహుకుటుంబీకుడు. వృద్దుడయ్యు జబ్బసత్తువయు చక్కని కంటిచూపును గల్గి వ్యవసాయము చేయించుటలో పేరుగన్న కాపు. సోమయ్య తండ్రినాటనుండియు సుబ్బారాయుడుగారి తండ్రికడ వారు పాలేరులుగా బ్రవేశించినారు. సంసారము బొత్తుగా జితికిపోయి, కడు పేదరికమున సోమయ్య తండ్రి వీరయ్య సుబ్బారాయుడుగారి తండ్రి శ్రీరామమూర్తిగారి నాశ్రయించి పాలేరుగా జేరి, తన తెలివితేటలచే, విశ్వాసముచే గ్రమముగా బెద్దపాలేరైనాడు. అప్పటికే సిగ యెగగట్ట నేర్చిన సోమయ్య, తండ్రికి కుడి భుజమై అతనికి దగిన కుమారుడనిపించుకొనుచు శ్రీరామమూర్తి గారికడ జీతము గొనుచుండెను.
ప్రథమమున సంవత్సరమునకు బదునెనిమిది బస్తాల దాన్యమునకు బ్రవేశించిన వీరయ్య పోనుపోను ఇరువదియైదు బస్తాలు, నేబది రూపాయల రొక్కముగూడ జీతముగా బుచ్చుకొని, తొంబదియేళ్ళ వృద్ధుడై చనిపోయినాడు. సోమయ్య నేడు పెద్దపాలేరు. సుబ్బారాయుడుగారతనికి పాలేరని పేరు మార్చివేసి గుమ్మస్తాయని పేరుపెట్టి నెలకు బదునేను రూప్యముల జీతము, బస్తా గింజలు చొప్పున నిచ్చుచుండెను.
తక్కిన పాలేళ్ళందరకు కూడ మంచిజీతములే యిచ్చుచు, సుబ్బారాయుడుగారు వాండ్రకు శౌచాదికము నలవరచిరి. దొడ్డిలో నున్నవారు గాక మూలలు, గౌడులు నలుగురితర పాలేళ్ళుండిరి. ఇంట్లో అంట్లు తోముటకు, నీరు తోడుటకు, బిడకలు చేయుటకు దొడ్డిలో గాపురమున్న కుటుంబములలోని స్త్రీలనే నియమించిరి. వారికిని సంబళము నేర్పరచిరి. సోమన్న కోడలు ఇంటిలో నాడు వారికి వలయుపనులన్నియు చేయుట, బియ్యము బాగుచేయుట, పిండిని విసరుట, బట్టలు సర్దుట, ఎక్కడి వస్తువులక్కడ నుండునట్లు చూచుట మొదలగు పనులను జేయుచుండును. గొల్లవారిలో నచ్చమ్మ నమ్మకమగు బంటు. దాని తల్లిదండ్రులు సుబ్బారాయుడిగారి ఇంటనే యుండువారు. అచ్చమ్మ తండ్రి గతించినాడు. తల్లి వృద్దురాలై ఇంటిపనులను జేయుచుండును. అచ్చమ్మ వివాహము చేసికొని భర్త నిల్లరికము తెచ్చుకున్నది. అచ్చమ్మ ఇద్దరు చెల్లెండ్రు నటులనే భర్తల నిల్లరికము తెచ్చుకొని సుబ్బారాయుడు గారింటనే కాపురముండినారు.
వారి భర్తలు సుబ్బారాయుడు గారి పాలేళ్ళు. వారి పిల్లలు గొడ్ల కాపరులు, వారు పనికత్తెలు.
సుబ్బారాయుడి గారి దొడ్డిలో గాపురమున్న రెండవ కాపుకుటుంబము సోమన్న యల్లునిది. సోమన్నకు ముగ్గురు కొమరితలు నలుగురు కుమారులు. సోమన్న కుమార్తెలు కుమారులు గూడ నాల్గవ తరగతి వరకు జదువుకొన్నవారే. సోమన్న తన పెద్దయల్లుని సుబ్బారాయుడుగారి దగ్గర పాలేరుగా ప్రవేశపెట్టి తన యింటి ప్రక్క యింటిలో గాపురముంచినాడు. తక్కిన యిరువురు కుమార్తెలను దొడ్డిపట్లలో నొకరికి, గోపాలపురములో నొకరికినిచ్చి పెండ్లి చేసినాడు. వారందరు కడుపులు ఫలించి సుఖముగా కాపురములు చేయుచున్నారు. సోమన్నకు ముగ్గురు కుమార్తెలు వరుసగా బుట్టుటచే, నిక కొడుకు పుట్టాడని నిరాశ చెంది, బీదకుటుంబపు బాలునికి పెద్దకూతురునిచ్చి ఇల్లరికము తెచ్చుకున్నాడు. ఇప్పుడు సోమన్న పెద్దకుమారుడు సత్తెయ్య ఇరువదిరెండేండ్లవాడు. చిన్నతనమున నారాయణరావుతో నాడుకొన్నాడు. నారాయణరావు రాజకుమారుడు, సత్తెయ్య బంట్రోతు. నారాయణరావు కలెక్టరు, సత్తెయ్య డఫేదారు.
సుబ్బారాయుడిగారి దొడ్డిలో కాపురమున్న వెలమలు పదియేండ్ల క్రితము సుబ్బారాయుడుగారి పనిలో చేరి వొళ్ళువంచి పనిచేయుచుండుత చేతను, వారు కడియములో మంచి పేరుగన్న పూదోటలో పనిచేసియుండుట చేతను, సుబ్బారాయుడుగారు వారిని పూలతోటపనికి నియోగించిరి. ఆలమండ గ్రామంలో మామిడితోటలో బనిచేసిన కుటుంబములు కొత్తపేట కనతిదూరమున నున్న తన ముప్పది యకరములతోటలో గాపురముంచినారు.
సుబ్బారాయుడి గారిదొడ్డిలో కాపురమున్న అయిదు గొల్ల కుటుంబములలో ఒక గొల్ల దూడల బెంచుటలో బేరుగన్నవాడు. అతని చేయి తగిలిన పశువుల దరికి రోగములు సేరవు. ఈతలుడిగిన పశువులు, అర్రుగడిగిన యెద్దులు వారి దొడ్డిలో పింఛనుద్యోగులవలె, వార్ధకమున సుఖించుచుండును.
సుబ్బారాయుడిగారికి బశువులన్న బరమ ప్రాణము. మానవులకన్న వాని నెక్కుడు ప్రేమతో జూడవలెనని యాయన మతము. దొడ్డిలోని దూడల నన్నిటిని బేరులు పెట్టి ముద్దుగా బిలుచుచు గోముగా బెంచుచుందురు. ఏ దూడకైన నించుక కాలు నొచ్చినచో నాయన ప్రాణము విలవిల లాడిపోవును.
