Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 21

"ఇక్కడి కొండల్లో అద్భుత నగరం ఏదో వుందని చిరకాలంగా వదంతి ఒకటి వుంది. కానీ - ఇన్నాళ్ళ నుంచి దాన్ని కళ్ళతో చూసిన వాళ్ళెవరూ లేరు"
"ఎందుకనీ?" అన్నాడు అంకుష్.
"దానికో కారణం వుంది!" అన్నాడు సాహస్.
ఈ మహా నగరం దట్టంగా పెరిగిపోయిన చెట్ల మధ్య కప్పడిపోయి వుండవచ్చును. ఇలాంటి ఉదాహరణే ఇంకొకటి చెప్పాలంటే, కాంబోడియా దేశం తెలుసు కదా! కాంబోడియా అంటే పురాతన కాలంలో కాంభోజ రాజ్యం అన్నమాట! అక్కడ ఒకప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన రాజులే రాజ్యం చేశారు. ఆ ప్రాంతాలలో భారతదేశ ప్రభావం ఇప్పటికీ చాలానే వుంది. చాలా పేర్లు కూడా వైష్ణవ సాంప్రదాయాన్ని సూచిస్తూ వుంటాయి. భూమిబోల్ అదుల్యదేజ్ (భూమిపాల అతుల్య తేజ్), నరోదమ్ సిహనౌక్ (నరోత్తమ సిహనౌక్)...అలా! అక్కడే వుంది అంగ్-కోర్-వాట్ అనే ఒక అద్భుత ఆలయం! ఆ ఆలయం అక్కడ వున్న సంగతి కొద్దికాలం క్రితందాకా ఎవరికీ తెలియదు. ఆ తెలియడం కూడా చాలా కాకతాళీయంగా తెలిసింది. అడవుల మధ్య, చెట్లూ, చేమలతో కప్పబడిపోయి వున్న ఆ ఆలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదీ అలాగే అయి వుండవచ్చును" అని హఠాత్తుగా ఆగి, అంకుష్ మొహంలోకి చూశాడు సాహస్.
"అంటే..." అన్నాడు అంకుష్ అనుమానంగా.
దీర్ఘంగా శ్వాసవదిలి అన్నాడు సాహస్. "అంటే... ఈ శిథిల నగరం చుట్టూ వున్న చెట్లన్నీ ఈ మధ్యనే ఎవరో కొట్టేశారన్నమాట!"
"ఎవరూ?"
"అదే తెలియాలి!" అన్నాడు సాహస్.
"గుడ్!" అని భుజాలు ఎగరేశాడు అంకుష్. "ఇంతకీ... మనం ఇప్పటిదాకా దేనిమీదో నడుస్తున్నాం అన్నావ్? దేనిమీదా?"
"మనం ఒక డినోజార్ మీద నడిచి వచ్చాం" అన్నాడు సాహస్.
"వ్వాట్...డినోజార్...అంటే రాక్షసి బల్లి...మనం రాక్షసిబల్లి మీద నడిచామా? అదెలాగ?" అన్నాడు అంకుష్.
చిన్నగా నవ్వాడు సాహస్.
"రాక్షస బల్లంటే నిజమైన డినోజార్ కాదు. ఒక రాక్షసి బల్లి ఆకారంలో పేర్చిన రాళ్ళగుట్ట! దానిమీద మట్టి! ఎన్నో కిలోమీటర్ల పొడవున వుంది. ఇప్పుడు మనం దాని తలమీద నిలబడి వున్నాం."
"మైగాడ్!" అని చుట్టూ తిరిగి, పరిశీలనగా చూశాడు అంకుష్.
నిజంగానే వాళ్ళు ఇప్పటిదాకా నడిచిన గుట్ట ఎంతో దూరం సాగి వుంది. అది డినోజార్ ఆకారంలో వుందని నేలమీద నుంచి చూస్తే కనబడదు. ఆకాశంలోనుంచి చూస్తేనే కనబడుతుంది.
అదే చెప్పాడు సాహస్. ఆ తర్వాత అన్నాడు.
"అతి పురాతనమైన కాలంలో, పక్షుల ఆకారంలో, పాములూ, గుర్రాలూ మొదలైన జంతువుల ఆకారాలలో ఇలాంటి రాతి గుట్టలూ, మట్టి దిబ్బలూ పేర్చి వుంచడం మనకి చాలాచోట్ల కనబడుతుంది. అమెరికాలో ఓహియోలో వున్న గ్రేట్ సర్పెంట్ మౌంట్ బ్రహ్మాండమైన పాము ఆకారంలో వుంటుంది. అమెరికాలోనే జార్జియాలో వుండే రాళ్ళ కుప్ప జెయింట్ సైజు గద్దలాగా వుంటుంది. అలాగే నెజ్ కాలో గద్ద, నెజ్ కాలోనే రోడ్లలాంటి గీతలు, ఉఫ్ఫింగ్ టన్ గుర్రం - ఇలా ఉదాహరణలు అనేకం! ఈ డినోజార్ కూడా అలాంటిదే అయి వుండాలి. నేలమీద నుంచి దీని రూపం అర్థం కాదు. కానీ ఆకాశంలో నుంచి చూస్తే స్పష్టంగా కనబడుతుంది" అన్నాడు సాహస్.
"మరి ఇవి బహు పురాతనమైనవని అంటున్నావు. మరి అప్పట్లో ఆకాశంలో నుంచి చూడడం ఎలా సాధ్యం? అప్పట్లో విమానాలు లేవు కదా!" అన్నాడు అంకుష్.   
"నో సన్నీ...అప్పట్లో కూడా విమానాలు వుండేవని ఇప్పటి శాస్త్రజ్ఞులలోనే కొందరు ఇప్పుడు చెబుతున్నారు. విమానాలు వుండడమే కాదు, వాటి కింద 'చుంబక్ మణి' అనే దానిని పెట్టి, ఆ మణి సాయంతో భూగర్భంలో వుండే ఖనిజాలని కనిపెట్టేవాళ్ళని కూడా కొద్ది సంవత్సరాల క్రితం జరిగిన ఒక సైన్సు కాన్ఫరెన్స్ లో చెప్పారు."
"బాప్ రే!" అని వింతగా చుట్టూ చూశాడు అంకుష్.
"పద! ఆ మాయా నగరం కొండ మొదలుదాకా నడిచి, అక్కడ ఆలోచిద్దాం!" అన్నాడు సాహస్.
వాళ్ళు అలా మాట్లాడుకుంటూ వుండగానే, ఒక త్రాచుపాము జరజర చప్పుడు చేస్తూ అంకుష్ కాళ్ళ మధ్యనుంచి పాకుతూ వెళ్ళింది.
"పాము నన్ను చూసి భయపడినట్లుంది పాపం!" అన్నాడు అంకుష్ తేలిగ్గా.
"యూ సన్ ఆఫ్ ఏ గన్!" అన్నాడు సాహస్, అంకుష్ భుజం తడుతూ.

                           *    *    *    *

అతని పేరు అన్-వే-షీ.
 ప్రొఫెసర్ అన్-వే-షీ.
అతని తండ్రి ఇండియన్ - అతని తల్లి జపనీస్.
అందుకనే అతని పేరు ఇండియన్ పేరు అయి వుండేటట్లూ, కానీ అది జపనీస్ పేరులా ధ్వనించేటట్లూ పెట్టారు అతని తల్లిదండ్రులు.
అన్వేషి!
పేరుకి తగినట్లే అతనిది నిరంతరమైన అన్వేషణ! సృష్టికి ప్రతిసృష్టి చేయడం కోసం, సృష్టి రహస్యాలని ఛేదించడం కోసం - నిరంతరమైన అన్వేషణ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS