Previous Page Next Page 
జోగబాల పేజి 21


    అలా...ఒకటి...రెండు...మూడు...నాలుగు... ... ఏడెనమండుగురుదాకా సమాఖ్య పెరిగేది. తెల్లవారుఝామున దోసిలినిండా నోట్లు నింపుకొని తల్లి దగ్గరకు వెళ్ళి, నిజంగానే బడలిక ఉన్న మొహంతో "ఇదిగో డబ్బు. చాలా అలసిపోయాను. మధ్యాహ్నం పన్నెండుదాకా లేపకండి" అని తూలుకుంటూ వెళ్ళి పక్కమీద పడిపోయేది. ఆనందబాబు వచ్చి ఆమెను నిద్ర లేపకుండానే ఇంజెక్షన్ చేసి, ఆమె తల్లి యిచ్చిన డబ్బు తీసుకొని వెళ్ళిపోయేవాడు.


    ఇరుగు పొరుగుతో ఎంతో సౌమ్యంగా, నమ్రతగా ఉండే ఆమె తల్లి ఒంటరిగా ఉన్నప్పుడు కూతురుతో చాలా కఠినంగా ప్రవర్తించేది.


    "ఈ సంపాదన చాలదు. నువ్వింకా కష్టపడాలి" అనేది. డబ్బులు లెక్క చూసుకొన్నాక అసంతృప్తిగా.


    "ఇంకా ఏం కష్టపడాలి? అప్పటికీ ఒళ్ళంతా హూనం చేసుకొంటూనే ఉన్నాను. కావాలంటే చూడు" అంటూ చీర పైకితీసి తొడల దగ్గర రక్కులూ, గీతలూ చూపించింది. తర్వాత జాకెట్టు గుండీలు తీసి వక్షోజాల మీద రక్కులు కూడా చూపించింది.


    గోవిందమ్మ యివన్నీ సహజమేలే అన్నట్లు తేలిగ్గా చూసింది. "డబ్బు ... విన్నావా? డబ్బు కోసం యివన్నీ భరించాలి. వింటున్నావా? వాళ్ళు నిన్ను పిండుతున్న కొద్దీ, నువ్వూ వాళ్ళదగ్గర కావలసినంత పిండుకో. రావల్సినంత రాబట్టు." అంది ఉపదేశిస్తున్నట్లుగా.


    ఈ కుటుంబం హరిజనవాడలోకి వచ్చినప్పట్నుంచి వీళ్ళ వ్యవహారం పుష్ప గమనిస్తూనే వుంది __ అంతవరకూ జోగినులందరలోనూ పుష్ప ఆకర్షణీయమైన వ్యక్తిగా పేరుపొందింది. ఆమె ఎక్కువ సుఖాలందివ్వడంలో ప్రావీణ్యురాలని కూడా ప్రతీతి. రాగిణి వచ్చాక ఆమె గిరాకి బాగా తగ్గిపోయింది. ఒక్కోసారయితే రాత్రంతా ఖాళీగా ఉండాల్సివస్తోంది. ఆమె మిగతా జోగినులలా కల్లు తాగదు. తన దగ్గరకొచ్చే పురుషుల ఖర్చుతో బ్రాందీ సేవిస్తుంది. బ్రాందీ తాగకుండా ఒక్క రోజు కూడా ఉండలేదు. అంతవరకూ తన సొంత డబ్బంటూ ఒక్క పైసా తీసి ఖర్చు పెట్టడం పుష్ప కలవాటులేదు. అటువంటిది సొంత ఖర్చుతో ఈమధ్య బ్రాందీ తెచ్చుకొని తాగాల్సి వస్తోంది. రాగిణి, వాళ్ళ తల్లీ దండ్రీ వాలకం చూస్తోంటే తమ కులంవాళ్ళేనా అన్న అనుమానం కలుగుతుంది. వాళ్ళు ఎవరో, ఎక్కడివారో, ఉన్నట్టుండి ఇక్కడకు ఎగిరివచ్చారు. పుష్ప మహంకాళమ్మను పిలిపించింది. ఆమెను అదిలించీ, బెదిరించీ, డబ్బాశ చూపి ఆఖరుకు ప్రాధేయపడి రాగిణి గురించి నిజం చెప్పమని అడిగింది. "నిజమే చెబుతున్నాను. ఎల్లమ్మదేవత నా ఒంటి మీదికి వచ్చేవరకూ వాళ్ళెవరో కూడా నాకూ తెలీదు. ఎల్లమ్మదేవతే నా నోట రాగిణి జోగిని కావాలని పలికించింది. ఇందులో మోసమేమీలేదు." అని మహంకాళమ్మ ఏ ఒట్టుపడితే ఆ ఒట్టు వేసి చెప్పింది. పుష్ప తాను సొంతంగా ఆరాలు తియ్యడానికి ప్రయత్నించింది. ఫలించలేదు. ఒకరోజు ఊళ్ళోకి బయలుదేరి మోహన దగ్గరకు వచ్చింది.


    "ఏం పుష్పా? చాలా రోజులకి కనిపించావు" అని పలకరించింది మోహన ఆప్యాయంగానే.


    "మీతో పని ఉండి వచ్చాను." అని పుష్ప రాగిణిని గురించి తన అనుమానాలన్నీ బయట పెట్టింది.


    "అసలే రోజురోజుకూ బిజినెస్ తగ్గిపోతుంటే మధ్యలో ఇదొకటా?" అని మోహన విసుక్కుంది.


    "నన్నేం చెయ్యమంటావు?" అని అడిగింది.


    "ఎస్.ఐ.గారు మీకు బాగా దోస్తీ కదా. ఆయనతో చెప్పి ఒక్కసారి కోటింగిప్పిస్తే రాగిణి నోట్లోంచి నిజం బైటికి వస్తుందని...."


    ఈ ఆలోచన మోహనకు వచ్చింది. ఆ రాత్రికి ఒకసారి వచ్చి వెళ్ళమని కోదండపాణికి కబురు చేసింది. రాత్రి పదకొండు దాటాక కోదండపాణి వచ్చాడు. అప్పటికే మూడు పెగ్గులు బిగించి ఉన్నాడు. మరో రెండు పెగ్గులు మోహన అందించింది. దానికితోడు జర్దా కిళ్ళీ కూడా చుట్టి యిచ్చింది.


    "ఏం మోహనా? ఇవాళ మరీ మోహనరాగం కురిపిస్తున్నావు?"


    ఆమె అతని ఒళ్ళోకి వచ్చి కూర్చుని గారాలుపోతూ మెల్లగా రాగిణి గురించి చెప్పింది.


    "అది సాంఘికాచారాలకు సంబంధించిన విషయం. వాటి జోలికి పోవడం మంచిది కాదేమో" అన్నాడు ఎస్.ఐ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS