Previous Page Next Page 
మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేజి 21


    తనని తనే సర్ది చెప్పుకున్నాడు. శ్రీధర్ తనని చూసే అవకాశం తక్కువని నిర్ధారించుకున్నాడు.

 

    "తీసుకోవోయ్... ఏమిటీ విశేషం... ఊరెళ్తున్నావా..." అంటూ ఓ కప్పు అవినాష్ చేతిలో పెట్టాడు శ్రీధర్.

 

    ఆ కప్పును అందుకుంటున్నప్పుడు అవినాష్ చేతులెందుకో వణికాయి. ఆ వణుకు అవినాష్ వేళ్ళకు, ఆ కాఫీ కప్పుకు మాత్రమే తెలుసు.

 

    మరో పది నిముషాల తర్వాత అక్కడనుంచి బయట పడ్డాడు అవినాష్.

 

    రోడ్డుమీద కొచ్చాడు. అప్పుడు అవినాష్ చేతివేళ్లు అప్రయత్నంగా తన ఫ్యాంటు జేబులో బరువుగా ఉన్న 'ఆంటీమనీ' సీసాను తడిమాయి. ఆ సమయంలో అతని పెదవుల మీద ఓ చిన్న చిర్నవ్వు కదలాడింది. వచ్చి, ఆటోలో కూర్చున్నాడు.

 

    "రైల్వేస్టేషన్ కు పోనీ..." ఆటోవాడితో చెప్పాడు.

 

    ఆటో కదిలింది. రెండు మలుపులు తిరిగి, ఆటో డాబాగార్డెన్స్ మెయిన్ రోడ్లోకొచ్చి, అక్కడనుంచి రైల్వే క్వార్టర్స్ పక్కనున్న దారిమీదుగా రైల్వేస్టేషన్ కి వెళ్తోంది.

 

    ఆంటిమనీ దొరికిందని, తన పధకం దిగ్విజయం అవుతుందని ఆనందిస్తున్న అవినాష్ కి తెలియని విషయం ఒకటుంది.

    అవి-

 

    అవినాష్ జేబులో ఉన్న సీసాలో ఉన్నది ఆంటిమనీ కాదని. 'మార్ఫిన్' అని.

 

    ఓ చిన్న ప్రయోగంలో కొంచెం మిగిలిన మార్ఫిన్ ని ఖాళీ 'ఆంటిమనీ' సీసాలో పోసి శ్రీధర్ ఆ అరల్లో పెట్టాడు. ఆ సీసాలో 'మార్ఫిన్' ఉందని నిత్యం ప్రయోగాలు చేసే శ్రీధర్ కి మాత్రమే తెల్సు.

 

    జేబులోంచి సిగరెట్ తీసి వెలిగిస్తూ శనివారం తర్వాత - తన భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నాడు అవినాష్.

 

    అదే సమయంలో -

 

    డాబాగార్డెన్స్ లోని శ్రీధర్ ఏదో ఆలోచిస్తున్న వాడల్లా ఉలిక్కిపడ్డాడు.

 

    ఇంతకీ తన దగ్గరకు అవినాష్ ఎందుకొచ్చాడు...

 

    ఆ ప్రశ్నకు అతనికి జవాబు దొరకలేదు.

 

    ఈ దారంట వెళ్తూ, తనని చూడడానికి వచ్చాడా?

 

    లేకపోతే-

 

    ఇంకేమైనా ఉందా?

 

    శ్రీధర్ కు ఏం అర్థం కాలేదు.

 

    అవినాష్ ఆటో దిగి, డబ్బులిచ్చేసి, సూట్ కేసు పట్టుకుని స్టేషన్లోకి నడిచాడు.

 

    అప్పటికి ఫ్లాట్ ఫారమ్మీదకు ట్రైన్ రావడానికి మరికొద్ది క్షణాలే ఉంది.

 

    ఫ్లాట్ ఫారమీదున్న ఓ సిమెంట్ బెంచీమీద కూర్చుని, సూట్ కేసు తెరచి తన జేబులో ఉన్న 'ఆంటిమనీ' సీసాను సూట్ కేసు అడుగున బట్టల మడతల్లో పెట్టి మళ్ళీ సూట్ కేసుని మూసేసాడు.


                                                    *    *    *    *


    అదే సమయంలో తిరుపతిలోని భీమా హోటల్ లో ఏ.సీ, సూట్లో గౌతమి ఒక్కర్తె ఉంది.

 

    ఆమె చుట్టూ రంగురంగుల కలలున్నాయి.

 

    ఆ కలల్లో అవినాష్ ఉన్నాడు.-


                                                                      8


    సరిగ్గా ఉదయం ఎనిమిది ముఫ్పై అయిదు నిమిషాలకు తిరుపతి రైల్వేస్టేషన్ చేరుకుంది ట్రైన్.

 

    అక్కడనుంచి పదినిమిషాల్లో భీమా లాడ్జి చేరుకున్నాడు అవినాష్.

 

    "గౌతమి - ఫ్రమ్ - విశాఖపర్ణం - సూట్ నెంబర్ చెప్తారా."

 

    రిసెప్షన్లో అడిగాడు అవినాష్.

 

    చెప్పింది రిసెప్షనిష్టు.

 

    ముందుకి నడిచాడు అవినాష్.

 

    తను అనుకున్నట్టుగా గౌతమి పేరునే 'సూట్' ఉంది.

 

    ఎవరికీ అనుమానం రాదు.

 

    అదే కాకుండా బయటనుంచి ఓ నాలుగు ఫోన్ కాల్స్ గౌతమికి మారుపేర్లతో చేయిస్తే- 'కాల్స్' కూడా రిజిస్టరౌతాయి. తనకప్పుడు ఏం ఇబ్బంది రాదు.


                                                  *    *    *    *


    కాలింగ్ బజర్ నొక్కాడు అవినాష్.

 

    అవినాష్ కోసమే ఎదురు చూస్తున్న గౌతమి వెంటనే 'డోర్' తెరిచింది.

 

    "ఉదయం నుంచీ నీకోసం ఎదురు చూస్తున్నాను-" అంటూ లోనికి నడిచింది.

 

    గౌతమి-

 

    అప్పుడే తలస్నానం చేసినట్టుంది. ఫాన్ గాలికి వత్తైన జుత్తు ఎగిరి ఆమె పచ్చటి ముఖమ్మీద పడుతోంది.

 

    కనకాంబరం రంగు చీర - అదే రంగు జాకెట్టు, నుదుట మీద లేత గులాబీ రంగు బొట్టు. ఒక చేతికి గాజులు. రెండో చేతికి 'తెల్లటి పుట్టుమచ్చ'లా వాచీ.

 

    "అనవసరంగా మా ఊరెళ్ళాను.. గౌతమీ... మా డాడీ కండిషనేం బాగాలేదు..." లుంగీ మార్చుకుంటూ అన్నాడు అవినాష్.

 

    "ఎలా ఉంది..." మెల్లగా అడిగింది-

 

    "మూడ్రోజుల క్రితం బాగానే ఉన్నాడు... ఆ తర్వాత ఒక్కసారి కీళ్ళు పట్టేశాయి... అస్సలు నడవలేకపోతున్నాడు..."

 

    "పాపం..."

 

    "నిన్ను నేను కొండమీద, దేవుడుసాక్షిగా పెళ్ళి చేసుకుంటున్నానని చెప్పాను... పెళ్ళయిన మర్నాడే మా ఊరు రమ్మని నీతో చెప్పమన్నాడు. తీసుకురమ్మని నాతో మరీ... మరీ... చెప్పాడు..."

 

    గౌతమి ఏం మాట్లాడలేదు.

 

    అవినాష్ బాత్ రూంలోకి దూరాడు.

 

    మరో పావుగంట తర్వాత బయటి కొచ్చాడు.

 

    అతనొచ్చేసరికి వేడి, వేడి టిఫిన్ తెప్పించింది గౌతమి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS