రుక్మిణి ఆలోచించింది.
ఎలా అవుతుంది?
ఒక భవంతి కొనాలి. ఒక లాబ్ కొనాలి. ఫర్నిచర్ కొనాలి. పరికరాలు కొనాలి.
చెప్పేవారికి అవసరాలకు సరిపడ ఇచ్చినా, వినేవారినుండి ఏం తీసుకోకపోయినా అసలు మనీ లేకుండా ఎలా సాగుతుంది?
మరోసారి కాస్త నిదానంగా ఆయన తన దగ్గర కొచ్చినప్పుడు ప్రయత్నించాలి.
లోహాలు అంత తేలిగ్గా కరగవు-
బండలు అంత తేలిగ్గా అరగవు__
కానీ వేడి చేయగా చేయగా లోహమూ కరుగుతుంది. రాపిడిచేయగా చేయగా బండలు అరుగుతాయి.
తనకు చిన్ననాటి విషయం ఒకటి గుర్తుకు వస్తుంది. తమ ఊరిమధ్య బావి. బావికి కొండరాళ్ళ అంచు. తాగునీరు తేవటానికి కడవలు-బిందెలు తీసుకొని తాము రాతి అంచుమీద పెట్టేవారు. ఆ రాళ్ళు కొన్ని సంవత్సరాలకు గుంటలు పడేవి.
ఈసారి ఆ గుంతల కుడురులో కడవలు భద్రంగా నిలబడేవి. మట్టి కడవల రాపిడికి కూడా రాళ్ళు అరగటం చూస్తే- నిజంగా కాలం మనిషికి ఒక సత్యాన్ని చెప్పకుండానే చూపిస్తుంది.
ఒక్కసారి అడిగి విరమించటం- పంజరంలోని చిలుక జోలికి పోవటం.....జరగరాని కొన్ని సంఘటనలు జరగటం....అందుకు కారణం తనే అవ్వటం....మనసు అంగీకరిచటంలేదు!
మనిషి ప్రయత్నాన్ని మించింది లేదు. ప్రత్యామ్నాయం వుంది కదాని ప్రయత్నం మానుకోకూడదు. ప్రయత్నాలు ఫలించినప్పుడే ప్రత్యామ్నాయాన్ని వెదుక్కోవాలి.....
అన్నట్టు ఈ చిలుక పంజరంలో చేరి రోజులు గడుస్తున్నాయి. తనకు మరెలాంటి సమాచారం దొరకలేదు.
తను ఫూల్ ని చేయటానికి ఎవరూ దీన్ని తన గడపముందు పెట్టలేదు కదా?!
అలా తీసిపారవేయటానికి ఆలోచించటానికి అవకాశం లేని హైటెక్ సిటీలో తాము కాపురం చేయటం జరుగుతోంది. ఏమో....ఇదంతా రిమోట్ యుగం. ఎక్కడ ఏది నొక్కితే ఏది బ్లాస్ట్ అవుతుందో....
రుక్మిణికి శరీరం కంపించింది.
"నో....నిజంగానే ఎక్కడో బాంబుపేలుతుంది. అక్కడ ఒకరిద్దరు వుంటారు. ఇంకా ఎక్కువ మందే వుండవచ్చు. వారంతా చనిపోతారు. జనం పారిపోవటం మొదలెడతారు. ముందు జాగ్రత్త చర్యగా సిటీలో సైరన్ మ్రోగుతుంది!
గూండాలు, వీధి రౌడీలు రంగంలోకి దిగుతారు. యజమానులు భయపడి తమతమ షాపులు మూసి ఇంటికి వెళతారు. పోలీసులు రంగప్రవేశం చేస్తారు."
తనకు మొదట్లో అర్ధం కాలేదు.
ఇదా తన చేతిలో వుంది...?! ఒక బాంబును బ్లాస్ట్ చేసే రిమోట్ కంట్రోలా?
ఇంతవరకు బాగానే వుంది. మరి తనకు రెండు మూడు రోజుల్లో కోటి రూపాయలెలా వస్తాయి?
రుక్మిణికి ఎంత ఆలోచించినా విషయం అంతుపట్టటంలేదు. ఆలోచన ఒక కొలిక్కి రావటంలేదు!
సరే__
అయ్యేదే అవుతుంది.
ముందు మాస్టారు గారికి రెండులక్షల రూపాయలు అడ్వాన్సుగా ఇచ్చి- దానికి కావలసిన యాడ్ పబ్లిసిటీ ఇవ్వమనాలి. మరి కొందరు దాతల్ని స్వచ్చందంగా ముందుకు రమ్మనాలి.
అందుకు కరస్పాండెంటుగా తననీ, ప్రిన్స్ పాల్ గా ఆయన్నూ యాడ్ లో వచ్చేటట్టు చూడమనాలి.
మంత్రిగారి భార్య అంటే....ఆయనతో పనులున్న కొందరైనా స్వచ్చందంగా విరాళాలు ఇస్తారు. తాము తీసుకోబోయేప్పుడు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వుంటేనే విరాళాలు ఇవ్వమనాలి.
తామెలా అన్నా వారు ఇస్తారు.
ముందు ముందు కొన్ని అవసరాలు ఆయనతో వారికీ వుంటాయి. తననుండి కాకపోయినా- రేపు ఆయన సమక్షంలో....
అమ్మగారి కాలేజీకి అన్ని లక్షలిచ్చాం. ఇన్ని లక్షలిచ్చాం అంటారు. పని చేసిపెట్టమంటారు.
అప్పుడు తెలిసి వస్తుంది.
అడిగిన కోటి రూపాయలూ తనే ఇస్తే....మరింత పిండుకోవటానికి అవకాశం చిక్కేది. తన లాభసాటి వ్యవహారం కుంటుబడుతుందని చిరచిర లాడతాడు.
ఆయనకెలా చిరచిర లాడినా....ఒక మంచి ప్రాజెక్టు మొదలయి ముందుకు సాగిపోతుంది.
ఆయన్ను ప్రత్యక్షంగా కాకపోయినా- పరోక్షంగానయినా తానీ విధంగా ఇరికించిన ఘనత తనకు దక్కుతుంది.
రుక్మిణి ముఖంలో ఒక వెలుగు!
మరో సంతృప్తి!
రిలీఫ్ గా గాలిపీల్చి వదిలింది.
తరువాత బంగారు నగల్ని వుంచిన ప్లాస్టిక్ బాక్స్ వంక చూసింది. వీటిని తనూ కాష్ గా మార్చాలి. తమకు బంగారు నగలు చేసి ఇచ్చే వీరభద్రయ్యను పిలవాలి. ఆయన్ను ముందు కొన్ని రోల్డ్ గోల్డ్ నగలు అచ్చం నీటిని పోలినవే తేమనాలి.
తరువాత వీటిని పూర్తిగా అమ్మి తెచ్చిపెట్టమనాలి.
ఆ విషయాన్ని రహస్యంగా వుంచమనాలి.
అప్పుడప్పుడు తన అత్తగారు ఇంటికి వస్తుంది. తన ఒంటిమీద నగలు లేకపోవడం చూసి అనుమానపడుతుంది. ఆమెకు ఒక అబద్దపు సంజాయిషీ యివ్వాలి. లేదా ఒక కథ వినిపించాలి.
ఏవో నగలు వంటిమీద కనపడుతుంటే ఆమెకూ, తన భర్తకూ అనుమానం రాదు.
తనకు వివాహమై ఏడు సంవత్సరాలవుతోంది.
ఈ ఏడు సంవత్సరాలలో తనకు- అత్తగారికీ ఎలాంటి మానసికమైన అనుమానాలూ రాలేదు. కాకుంటే తనకు పిల్లలు కలగలేదని అంతరాంతరాలలో ఒక ఆవేదన వుంది. అది ఆమెగా ఎప్పుడూ బయటపెట్టలేదు.
ఆమె భర్త జయవర్ధన్ గారికి అత్యంత ఆప్తుడైన తన తండ్రికి తనూ ఒక్కతే కూతురు.
తన తండ్రి చేసినా ఒక త్యాగం తనను ఈ ఇంటికి కోడల్ని చేసింది. తనూ ఈ సంపన్నుల ఇంటికి ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. కాని ఎవరికీ వారె అన్నట్టు.....వేరు వేరు కాపురాలు. ఎవరి అభిరుచులు వారివే.
అత్తగారికి తన భర్త కట్టించిన ఇల్లే స్వర్గం. అది దాటి బయటకు రాదు. వచ్చినా ఒక గంట వుండి వెళ్ళిపోతుంది.
ఈయనకు క్షణ__క్షణం ఒక నూతనత్వం కావాలి.
ఉండే ఇల్లు కూడా ఆధునికంగా వుండాలి.
తనకు అన్నీ వున్నాయి. కానీ ఒక ఒంటరితనం.
బహుశా అది తనకు పిల్లలు లేకపోవడంతో, ఆయన ఇంటిపట్టున వుండకపోవడంతో, అత్తగారు దగ్గరలేకపోవటంతో వచ్చి వుంటుంది. ఏదో ఎలా వున్నా, తన మనసులో ఒక శూన్యం వుంది.
ఆ శూన్యం మాస్టారుగారి ప్రాజెక్టుతో పూరించబడితే, ఈ జీవితం ఒక ఫలవంతం అయితే-
అదే తను కోరుకుంటుంది.
తనకు అప్పట్లో ఒక లెక్చరర్ కావాలని వుండేది. ఉన్నంతలో తన తండ్రి తనను బాగానే చదివించాడు. మాస్టారు అప్పట్లో ఎంత బాగా చెప్పే వాడో! ఆయన ప్రతి విషయాన్ని సమగ్రమయిన విశ్లేషణతో, హృదయాల కత్తుకొనేట్టు వివరించేవాడు.
ఇప్పుడు తన ఊహలు తారుమారై-
పంజరంలో చిలకలా వుండిపోయింది. అది హైటెక్ చిలకైతే ...తనూ మరో రకం చిలక. దాన్ని మనిషి చేశాడు. తనను భగవంతుడు చేశాడు.
ఆ చిలక పీక నొక్కితే ఒక సంచలనం జరిగి ఒక కోటి రూపాయలు వస్తాయి.
తన పీక విధి ఎప్పుడు నొక్కుతుందో తెలీదు. అప్పుడు ఎలాంటి సంచలనం జరగదు.
తన జీవితాన్ని ఒక సూన్యమ్గా ముగించగూడదు. ఒక మంచిపనిచేసి ముగించాలి. విధి నొక్కేలోపు అది జరిగిపోవాలి.
తన జన్మ వృధా కాకూడదు- రుక్మిణి అనుకుంది.
ఆమెకు జన్మనిచ్చిన తండ్రి మరోసారి మనసులోకొచ్చాడు.
సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం.....
* * * *
సబ్ కలెక్టర్ కార్యాలయం....ఎప్పటిదో బ్రిటీషర్స్ నాటిది. అన్నీ పగుళ్ళిచ్చి-వర్ధంలాంటిది వస్తే పడిపోయేట్టు వుంది.
బిల్డింగ్ మొత్తం పడగొట్టి కొత్తది కట్టేట్టు జయవర్ధన్ గారు టెండరు పాడుకున్నారు.
తన తండ్రి ముకుందరావు జయవర్ధన్ గారి దగ్గర సూపర్ వైజింగ్ పనులు చేస్తుంటాడు. మరో రకంగా పర్సనల్ అసిస్టెంటు. మనీ వర్కర్స్ కివ్వటం గానీ, బ్యాంక్ నుండి జయవర్ధన్ గారు సంతకంచేసిన చెక్ మార్చుకొని మనీ తేవటం కానీ, తిరిగి మనీ వచ్చినప్పుడు బ్యాంక్ ల్లో వేయటం కానీ అంతా తన తండ్రే చేసేవాడు.
అప్పటికి అమ్మ చనిపోయింది. జాండీస్ ను నిర్లక్ష్యంచేసి, నాటువైధ్యం వాడటంవల్ల జబ్బు బాగా ముదిరింది. లివర్ ఎక్కువగా డామేజ్ అవటం జరిగిపోయింది.
జబ్బు తీవ్రత తెలుసుకొని హాస్పిటల్ లో చేర్చితే- ఫలితం దక్కలేదు. అప్పటినుండి తన తండ్రికి వండిపెట్టడం, చదువుకోవటం, అమ్మలేని లోటును తలుచుకొంటూ క్రుంగిపోవటం తన వంతైంది. తన తండ్రి అమ్మపోయిన దగ్గరనుండి ఎక్కువకాలం బయటే గడిపేవాడు. తిండి కూడా బయటే తినేవాడు. తనకూ పట్టుకొచ్చేవాడు.
