ఇప్పుడు ఆయన కూడా ఏదో ఒక బడిలో పంతులయి, ఎక్కడో పాఠాలు చెప్పుకుంటూ బ్రతుకుతుండేవాడు.
ఇప్పుడు తన చర్యలవల్ల కంట్రాక్టరుకు కొడుకయ్యాడు. ఆ కంట్రాక్టరు కొడుక్కు 'మనీ' ని నిచ్చెనగా వేశాడు, మెట్టు- మెట్లుగా పైకి పోయాడు. ఇప్పుడాయన చేతిలో పదవి వుంది. కోట్లల్లో పైకముంది. కో అంటే ఈగల్లా మూగే మందీ-మార్బలముంది.
అదేం చిత్రమో....
తర్వాత కంట్రాక్టరు గారికి పిల్లలు కలుగలేదు.
వాస్తవంలో అప్పట్లో పుట్టిన ఒక్క ఆడపిల్ల చనిపోయింది. అంటే ఆమెలోనో, ఆయనలోనో ఏదో లోపం వుండి వుంటుంది.
మాస్టారు తిరుమలరావుగారికి మాత్రం ఏడెనిమిది సంవత్సరాల తర్వాత ఒక ఆడపిల్ల పుట్టింది.
తనకు అంతవరకే గుర్తు. ఇప్పుడా ఆడపిల్ల ఏం చేస్తుందో? అప్పుడప్పుడూ వీధుల్లో మాస్టారు కనిపిస్తుంటారు. కాస్త వయసు పైనపడింది. అయినా చురుగ్గానే నడుస్తుంటాడు.
ఆమె మామూలు ప్రపంచంలోకి వచ్చింది.
ఈలోపు జానకమ్మగారు ఇంట్లోకి వెళ్ళి ఏభై రూపాయల కట్ట ఒకటి తెచ్చి నవనీతమ్మ చేతిలో పెట్టింది. నవనీతమ్మ జానకమ్మ కాళ్ళకు నమస్కరించింది. అలాగే మనవడిచేత కూడా పాదాభివందనం చేయించింది.
"జానకమ్మగారూ! తవారి ఋణం ఏ జన్మకు తీర్చుకుంటానో! వీడు చదివాక తమరో సాయం చేయాలి. అబ్బాయిగారు మన కళ్ళముందే ఎంతో ఎత్తుకు ఎదిగారు. మొట్టమొదటిసారిగా భూమిమీద పడ్డప్పుడు ఈ చేతుల్లోనే నమ్మా కేర్ మంటూ రాగం తీసింది.
అందుకే ఈ చేతుల్ని చూసి నేను మురుసుకుంటాను.
ఇప్పుడు మంత్రిగా మారి, మందీ మార్భలంతో, రాజఠీవీతో తిరుగుతున్న తమ బాబుని మొదటిసారిగా తీసుకున్న చేతులమ్మా నావి. నా చేతి పని వూకే పోరిలేదమ్మా!
తమరు బాబుగారికి చెప్పి వీడికేదయినా వుద్యోగం వచ్చేట్టు చేయాలమ్మా అంది.
జానకమ్మగారు 'ఆ చేతుల' మాటలు విని చిన్నగా నవ్వింది.
"అందుకేగా నర్సమ్మా! నీ చేతుల్లో కేర్ మన్న రాగం....ఇప్పుడు వేదికలమీద ఉపన్యాసమయింది. నీ మెత్తటి చేతులమీద వీపు ఆనించినవాడి శరీరం యిప్పుడు హైటెక్ పాన్పులమీద హాయిగా విశ్రమిస్తుంది.
చేతి చలవంటారు చూడు- అది నర్సమ్మదే!
నీ మనువడ్ని బాగా చదవమను. తప్పకుండా మావాడికి చెప్పి ఏదో ఒక ఉద్యోగం వేయిస్తాను. నీ చేతుల చలువ గురించి కూడా చెప్తాను" అంది.
నవనీతమ్మ మరోసారి జానకమ్మకు నమస్కరించింది.
అలా వారిరువురూ ఒక జీవి ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు అతని మొదటి మెట్టు నర్సమ్మ చేతులేనని చెప్పుకుంటున్న సమయానికి
వారికి దూరంగా....
హైటెక్ సిటీలో....
సదరు నర్సమ్మ చేతుల్ని మొదటి మెట్టుగా వుపయోగించుకొని సిటిజన్ స్థాయినుండి సర్కారు స్థాయికి పెరిగిన అమాత్యుడు అంబరీషుడి భార్య రుక్మిణి.
* * * *
తన వంటిమీద నగలన్నింటినీ తీసింది.
ఒక ప్లాస్టిక్ బాగ్ లో పెట్టింది.
మాస్టారు వస్తారు. తనను ఆశగా అడుగుతాడు. మొదటి పేమెంతుగా తను ఈ నగల్ని అమ్మి రెండు లక్షలూ ఆయన చేతిలో పెట్టాలి.
మరో సారి తన భర్తను అడగాలి.
ఆయన ఇవ్వకపోవచ్చు. కానీ తను గట్టిగా డిమాండ్ చేతుంది. అప్పటికి కరిగి ఇస్తాననవచ్చు.
కాక మరీ మొండికేస్తే....
పంజరంలోని చిలుక ఎటూ వుంది.
దాని సున్నితమయిన మేడ తన చేతికి వస్తుంది. భగవంతుడ్ని తలచుకొని మెల్లగా దాని పీక తను నొక్కుతుంది.
కాస్సేపటికి-
సిటీ మొత్తం గందరగోళమవుతుంది.
ఒకరిద్దరు చనిపోతారు.
సైరను కూస్తుంది. గూండాలు రంగప్రవేశం చేస్తారు. షాపులన్నీ మూయిస్తారు.
అంటే....
చిలుక మెడతను నొక్కితే మతకలహాలలాంటివి ఏమయినా వస్తాయా? జనం కత్తుల్తో పొడుచుకుంటారా?
ఏమిటో ఆ సంబంధం?
జరిగిందేదో జరిగిపోగా....
తనకు రెండు మూడు రోజుల్లో కోటి రూపాయలు వస్తాయి."
ఇదేదో చిత్రంగానే వుంది.
ఒకరిరువురి మరణంమీద తను కోటి రూపాయలు సంపాదిస్తుంది.
మాస్టారు ప్రాజెక్టుకు ఈ మరణాల పునాది తప్పదా?!
సిటీలో అలజడి తప్పదా?
ఒక అలజడి తరువాత ప్రశాంతతలా-
ఒక సంక్షోభం తరువతః సంక్షేమంలా....
తనకు కోటి రూపాయలు చేతికొచ్చి ఒక మంచి ప్రాజెక్టు మొదలవుతుందా?!
తను సాధ్యమయినంతవరకూ ఆ చావుల్ని తప్పించాతానికే ప్రయత్నిస్తుంది. ఒకటికి పదిసార్లు తన భర్తనడుగుతుంది. ఆయనకిప్పుడు కోటి రూపాయలు ఒక సమస్య కాదు. కొన్నివేల కోట్ల రూపాయలున్నాయి. తనకు తెలీకుండా ఎక్కడో దాచాడు.
ఆమె అనుకుంటూ హాలులోని టీపాయ్ మీదున్న పేపరు వంక చూసింది.
ఆయనమీద వ్యాసం గుర్తుకొచ్చింది.
ఎవరో పావని. ఈయన చేయించిన, సాగించిన ఎరువుల కుంభకోణాన్ని వివరంగా వ్రాసింది. అంత వివరంగా ఈమెకు సమాచారం ఎక్కడ అందిందో!
ఆ పేపరు వార్త తరువతః ఆయన తనకు స్థిమితంగా కనపడలేదు. మాట్లాడటానికి ఐదు నిముషాల వ్యవధి కూడా ఇవ్వలేదు. కొంపలంటుకున్నట్టు ఒకటే హడావిడి.
తరువాత రుక్మిణి తనలో తాను నవ్వుకుంది.
అవును మరి! ఆ వ్యాసంతో కొంపలేం అంటుకున్నాయి. ఆ మంటలు మరింత పెద్దవి కాకుండా ఆర్పి తను నిలబడిన పీఠం కదలకుండా జాగ్రత్త పడాలి.
తాముండేది ఒక హైటెక్ సిటీ!
ప్రతి కదలిక కంప్యూటర్స్ లోకి వెళ్ళిపోతుంది.
ముఖ్యమంత్రి దృష్టికీ వెళుతుంది. వెళుతుందేమిటి? వెళ్ళే వుంటుంది. ఇలాంటి పేరు చెడిపోయే పనులతో మనీ కూడబెట్టటం తప్ప కాస్త పేరువచ్చే ప్రాజెక్టుల్లో సంపాదించిన దానిలో వందో వంతు కూడా ఖర్చుచేయరు.
మనిషి బ్రతికేది వంద సంవత్సరాలయితే.....
ఈ వందేళ్ళూ ధనం సంపాదనేగా. ఒక సంవత్సరమయినా ప్రక్క మనిషి మేలుకోసం ఖర్చు చేయరా?
ఈ మనీ వేట కూడా మనిషికి ఒక 'మానియా' కాబోలు. పుట్టుకతో పుట్టిన చెడు కట్టెలమీద మాత్రమే అంతరిస్తే మరి మనిషి జన్మ ఎందుకు?
ఈ సంపాదనంతా ఎవరినుద్దరించటానికి?
కోట్లు ముడిపెట్టి చీకటిదారుల్లో విదేశీ విమానమెక్కి స్విస్ బాంకులకు దాన్ని జేర్చి, తనను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం చేయటానికా? అంతకంటే పెద్ద క్రైమ్ ఏముంటుంది? ఒక మనిషిని ఒక ఆవేశంలో చంపితే, లేదా ఆత్మరక్షణలో చంపితే ఎప్పటికీ క్రైమ్ కాదు. లక్షలమందికి ఉపాధిలా వుపయోగపడే మనీ తీసుకుపోయి విదేశీ రాకాసి బాంకుల నోర్లకందించటం నిజంగా నేరాలకు నేరమవుతుంది.
ఇప్పుడీయన చేయబోయేది అదే!
ఒక విదేశీ పర్యటన.
అక్కడి బాన్కులతో లావాదేవీలు.
గజ దొంగలు కూడా ఇంతటి దుర్మార్గానికి పాల్పడరు.
ఉన్నవారి ఇళ్ళల్లో దోచుకుంది. తమను నమ్మినవారికి ఖర్చుచేస్తారు. వీరలా కాదు.
నమ్మినవార్ల నోర్లు కొట్టి విదేశీ గజదొంగల ఇనుపలాకర్ల కోరాల కందిస్తారు.
రేపు ఈయనా అదే కోవకు చెందుతాడు.
తనకు మాత్రం ఇవ్వమన్న కోటి రూపాయలు ఇవ్వడు.
మాస్టారు అది తన స్వార్ధానికి అడగలేదు. ఒక విద్యాయజ్ఞానికి అడిగాడు. ఈ దేశంలో మట్టిలో మాణిక్యాలున్నాయనీ వాటిని గుర్తించి సానబడితే ముందు ముందు దేశానికి వెలుగనీ చెప్పాడు.
అవును....
ఆయనెవరో అన్నట్టు పూలన్నీ వికసించాలి.
నూరు పూలు వికసిస్తేనే నూరు ఆలోచనలు వస్తాయి. ఈ దేశం బాగుపడుతుంది.
ఇప్పుడీ దేశంలో జీవితం మరింతగా కుంచించుకుపోతుంది. అందరికీ అందటంలేదు.
విద్యాలయాలు, ఆసుపత్రులు, వైజ్ఞానిక కేంద్రాలు అన్నీ ఖరీదుగా మారాయి.అవి డబ్బుకి మాత్రానే అందుతున్నాయి. మేధస్సుకు అందటంలేదు.
మాస్టారు ప్రయత్నం ఒక్కటే.
ఆ విద్యను, ఆ విజ్ఞానాన్ని సగటు విధ్యార్ధిలో వుండే వున్నతమైన మేధస్సుకు అందించాలని.
ఆలోచించినకొద్దీ అది తనకు చాలా మంచి ప్రాజెక్ట్ అనిపిస్తుంది.
ఆ ప్రాజెక్టుకు మనీ కావాలి.
మనీ లేకుండా మంచి వాళ్ళందరూ ఒక చోటుకు చేరితే ప్రాజెక్టు పూర్తి కాదా....
