ఈ విషయం బామ్మకు తెలిసింది. ఇహ తలబాదుకుంది. కేకలు పెట్టి ఇల్లంతా ఒక్కటి చేసింది. తనను ముందు గోరీలో పడేసి రమ్మని కొడుకుని పట్టుకొని ఏడ్చింది. అప్పుడు ఉప్పునీటి నూతివాళ్ళ పిల్లను కోడలుగా తెచ్చుకొమ్మంది.
బామ్మ కొడుకు ఈమధ్యనే ప్రొఫెసర్ గా రిటైర్ అయి ఇంట్లో కూర్చున్నాడు. రిటైర్ అయింతరవాత కుటుంబాన్ని చక్కదిద్దాలనీ, పాత ఆచారాల్ని పట్టుకొని వేళ్ళాడాలనీ బుద్ధులు పుడతాయి. కాని వీస్తున్న గాలికి అడ్డుకట్టలు కట్టలేం. ఈ విషయం డెబ్భయ్ అయిదేళ్ళ బామ్మకు అర్ధంకాకపోవచ్చు కాని రిటైరైన ప్రొఫెసర్ అర్ధంచేసుకోగలడు కదా!
బామ్మ నిరాశ చెందింది. హాఫిజ్ గారిని పిలిచింది. ఆమె వీధికంతటికి బామ్మ. అతను కుటుంబంలో పవిత్ర విగ్రహంలాంటివారు. కొడుకులు, కూతుళ్లు, మనుమలు, మనుమరాండ్రు, మునిమనుమలు అంతా కలసి వారి సంతతి వందదాకా ఉంటుంది. వాళ్ళకే వీరంటే గిట్టదు. తమ పూర్వులు ఎవరో ఒంటెల మీద కుంకుమపూవు తెచ్చి వ్యాపారం చేశారట. వాళ్ళ సంతతిగా చెప్పుకుంటారు వీళ్లు. ఏది చెప్పినా వినాల్సిందే. ఎవడు చూచాడు వాళ్ళరాక, వంశగౌరవం కాపాడుకోవాలని హాఫిజ్ గారి ఆరాటం. హాఫిజ్ గారి ఆజ్ఞకే బలం ఉంటే "గజాలాను" పూడ్చిపెట్టేవారు. అయితే గజాలా తన తండ్రిమాటే లెక్కచేయదు.
"అదేం చిన్నపిల్లా? మెడిసిన్ చదివింది. తన మంచిచెడు ఆలోచించుకోగలదు" అంటాడు హఫీజ్ గారి అల్లుడు-గజాల తండ్రి. అల్లుని మాటవిని హఫీజ్ తల తిరిగిపోయింది. ఏమిటీ ఆడపిల్లలకూ మెదడుంటుందా? వారూ మంచీ-చెడూ ఆలోచించగలరా? అప్పుడు కర్ర అందుకొని బామ్మ దగ్గరికి బయల్దేరారు.
అందరూ ఒకే పడవలో ఉన్నారు. భయం దేనికి? అయినా బామ్మ ముళ్ళపొదలా మీదపడింది. ఒకటి దగ్గు, అటుపై విషం కక్కే బామ్మమాటలు. జవాబు కోసం పదాల అన్వేషణ. వడిగాలికి రెపరెపలాడే పతాకంలా ఉంది హఫీజ్ గారి స్థితి.
"నీ ఎత్తులన్నీ నాకు తెలుసు. అదే భూముల పగ తీర్చుకోవాలనుకుంటున్నావు- కాని జ్ఞాపకం పెట్టుకో-నువ్వు కాటికి కాళ్లుచాచే-"
బామ్మ వాక్యం పూర్తికానివ్వలేదు. అడ్డుకుంది. సాగించింది.
"అరే వచ్చావయ్యా మొనగాడు గోరీగుర్తుతెచ్చేవాడు. బుద్ధి చెప్పుకో మనుమరలుకు నీ ముఖాన్నే మసిపూస్తూంది ఏంలాభం గడ్డం తెల్లపడి?"
"ఇదిగో...... నా ..... నా ..... నా...... మనుమరాలిని ఏమన్నా అంటే......" అటువెనుక మాట పెకల్లేదు. సంజ్ఞతో వాక్యం పూర్తిచేశారు. వాదన మరి సాగలేదు. పూర్తిచేశారు. హఫీజ్ గారికి బామ్మలాంటి వకీళ్ళతో తలపడ్డం తటస్థపడలేదు.
"వచ్చాడయ్యా పెద్ద మొనగాడు- అందరికీ తెలుసు నీ మనుమరాలు వేషాలు. పెంచండి పాపాలు. పడుచుదనం పొడుచుకొచ్చిందయ్యా మిండణ్ణి ఎన్నుకోవడానికి" ఊపిరి సలుపకున్నా గబగబా అనేసింది.
"అయితే నీ ..... నీ ......" హఫీజ్ జీ కోపంతో వణికిపోయారు. చేయెత్తి ఏదో అందామనుకున్నాడు. ఇంతలో హుక్కా నేలపడి ముక్కలయింది.
"చాల్చాలు చెప్పావు. నా తప్పులు ఎన్నుతావా! శీలం కోసం పాణాలిచ్చేదాన్ని"
ఆడదానితో వాదించి ఎవడు నెగ్గాడు-హఫీజ్ జీ నెగ్గడానికి! హఫీజుగారి నరాల్లో రక్తం సలసలకాగింది. ఆ నోటిదురుసు ముసల్దానికి బుద్ధిచెప్పాలనిపించింది. చాతనైతే చేతికర్రతో బాదాలనిపించింది. ఆడదాని నోటిని ఎదుర్కోడానికి మగాడు ఉపయోగించే ఒకేఒక ఆయుధం అతని బలం-బలప్రయోగం కాని హఫీజుగారు స్థితి ఎలా ఉంది? కాలూ చేయీ కదల్చలేని అవిటి. అడుగు వేయాలంటే ఆసరా కావాలి. నోటికి బలం లేదు. కళ్లు వెలవెల పోతున్నాయి. పురుషునికి అంతకంటే అవమానకరం అయిన శిక్ష మరోటి ఉండదు.
ఈ గొడవ విన్నారు. ఇంటివాళ్లంతా పనులు వదులుకొని ఉరికివచ్చారు. ఆ మాటా, ఈ మాటా చెప్పి ఇద్దరినీ శాంతపరిచారు.
"ఏమిటిది పిల్లల్లా పోట్లాడుకొనే వయసా మీది?"
"హఫీజ్ జీ మా తాతగారితో సమానం" బామ్మ మనవరాలు జరీనా అన్నది.
"అనండి అనండి. ఇంకా అనండి. నీకే చాతనయితే నన్ను బతికి ఉండగానే పూడ్చివచ్చేదానివి" బామ్మ కోపం తారాస్థాయి నందుకుంది.
'ఈ కాలపు పోరల....హు.....మా కాలంలో.....' హఫీజ్ జీ వెక్కిరిస్తూ అని, ఆకాశం చూడసాగారు.
'కాకుంటే మా కాలంలో నయితే....' బామ్మ కోపంగా హాఫీజ్ జీని చూచింది. ఎవరో వెనక్కు నెట్టినట్లు పడిపోయింది. అలా పడడం దుఃఖతప్త భాష్పగాధల్లోకి పడిపోయింది. లిప్తలో గతంమీద పడిపోయిన తెర తొలగింది. ఎదుట అంగణంలో మామిడి చెట్టు కనిపించింది. అది ఆమె నాటిన మొక్క ఈనాడు శాఖోపశాఖలయి ముంగిలి సాంతం ఆక్రమించింది.
ఈ మొక్కను బామ్మ నాన్న తెచ్చారు. మొక్కను చూచి పిల్లలంతా గుమిగూడారు. దాంతో ఆడుకుంటామన్నారు. తమకు ఇచ్చెయ్యమన్నారు. అది మంచిజాతి మామిడి మొక్క. అందుకే నాన్న అందరినీ అదిలించారు. బామ్మకు ఇచ్చారు. బామ్మ అప్పటికి పసిపిల్ల. బామ్మ గునపం తీసుకొని తవ్వుతుంటే హఫీజ్ గారు వచ్చి పక్క కూర్చున్నారు. బామ్మ హఫీజ్ ను రజ్జూభయ్యా అని పిలిచేది. ఆమెకు ప్రాయంలో ఉన్న రజ్జూ అగుపడ్డాడు. తనచేయి పట్టుకొని లాక్కొనిపోతున్నాడు. బావుల్లో ముంచుతున్నాడు. అయినా ఆ విషయం తల్లికి ఎన్నడూ చెప్పలేదు. ఆమెకు భయం అప్పుడు ఆమె వయసెంతో గుర్తులేదుకాని చేలల్లో పిల్లలతో ఉరకడం మానేసి నెమ్మది నడక సాగించింది. అయినా అత్త పగలంతా ఆమె దగ్గరే ఉంచుకునేది. కుట్టు నేర్పే నెపంతో తన పిల్లల బట్టలు కుట్టించుకునేది. కుట్టు తప్పు పడితే సూది గుచ్చేది. అయినా నవ్వుతుండేది.
రజ్జూ బామ్మ దగ్గర్నుంచి గునపం లాక్కుపోయాడు. ఆమె విదిలించింది రజ్జూకు ఆశ్చర్యం కలిగింది. అతను బాధగా బామ్మను చూచాడు. ఒక బాష్పబిందువు ముక్కుమీద జారి, ముక్కెరలో ముత్యంలా మెరిసింది. రజ్జూ మనసుకు బానిస అయ్యే వయసులో ఉన్నాడు. మెదడు మాట మనసు వినని ప్రాయం అది.
ఉప్పునీటిబావి వాళ్ళతో సంబంధం కుదరదు. ఈ విషయం ఆమెకు బాగా తెలుసు. అయినా రజ్జూతో చింతకాయలు తెప్పించుకునేది. తల్లి ఎంతకని ఓరుస్తుంది? రజ్జూతో గట్టిగా చెప్పేసింది- "పిల్ల పెద్దది అవుతూంది-కలవడానికి రావద్దని."
రజ్జూ ఆ మాట విన్నాడు. కాళ్లు వేళ్ళాడబడ్డాయి. కాళ్లు విరిగినట్లు బల్లమీదినుంచి లేవలేకపోయాడు. ఇహ అక్కడ అతనికి మిగిలిందేమిటి? నాలుగు చేతులు కలిపి మామిడి మొక్క నాటినాడు, కన్నీటితో మొక్కను తడుపుతూ "కావాలనుకుంటే జీవితాంతం నీతో గడపాలని ఉంది" అన్నాడు. తరవాత చేతుల మట్టి దులుపుకుంటూ వెళ్లిపోయేప్పుడు 'ఆలోచించుకో' అన్నాడు.
'అయితే వెళ్ళకు' అనే పదాలు ఆమె గుండె లోతుల్ని పెకలించుకొని బయటపడ్డాయి కాని పెదవిని కదిలించలేకపోయాయి. తరవాత ఆమె ఆలోచించనేలేదు, ఆడపిల్లలకు ఆలోచన ఏమిటీ?
ఒకనాడు వీధిలో బాజాలు మోగాయి. వీధివాళ్ళంతా బొమ్మ పెళ్లి ఊరేగింపు చూడకూడారు. రజ్జు కూడా వీధిలోకి వచ్చాడు మతాబుల వెలుగు చూడ్డానికి. ఒకడు చిచ్చుబుడ్డికి నిప్పంటించాడు. చిచ్చుబుడ్డి కిలకిల నవ్వుతూ ఆకాశానికి ఎగిసింది. నవ్వుల దివ్వెలు నలువైపులా వెలిగాయి. ఇంతలో ఊడిపడ్డ నక్షత్రాల్లా నలువైపులా గాఢాంధకారం అలముకుంది. నలువైపులా చీకట్లు నడయాడాయి. అతడు అడుగు ముందుకువేశాడు. కాలిపోయిన చిచ్చుబుడ్డిని అందుకోవాలనుకున్నాడు. చేతికి చురుక్కుమని తాకింది. వేలుపట్టుకొని చాలాసేపు ఉస్సురుమంటూ ఉండిపోయాడు.
ఆరోజు బామ్మ ఆలోచనలకు అంతులేదు. కన్నీరు కాలువలు కట్టింది. అప్పగింతలప్పుడు తల్లిని పట్టుకొని భోరున ఏడ్చేసింది. 'అమ్మా, నేను నిజంగా మామిడి చెట్టును వదిలిపోతున్నానా?' అంటూ ఏడ్చింది.
నాటినుంచి రజ్జు అమ్మాయిల జోలికి పోవడం మానేశాడు. అమ్మాయిలను చూస్తే అగ్నికణాలు గుర్తుకువచ్చేవి పసిపిల్లలకు పరిచయంలేని ముఖం కనిపిస్తే భయపడ్డట్టు ఆడపిల్లల్ని చూస్తే అతనికి గుబులుగా ఉండేది.
అనంతరం అతడు ఖురాన్ను హఫీజ్-కంఠోపాఠం-చేయడంవల్ల హఫీజ్ అనే బిరుదం పొందాడు. తరవాత 'గులిస్తాన్' బోస్తాన్ చదివాడు. అతనికి చదువు చెప్పే మౌలానా తాహరలీ అతని జ్ఞాపకశక్తిని అతిగా మెచ్చుకునేవారు. హఫీజ్ పారంగాని, మాటగాని మరిచిపోడు అనేవాడు గురువు.
