Previous Page Next Page 
పావని పేజి 20


    శివయ్య కింద రకరకాల బానిసలున్నారు. అందరూ అతని గుప్పిట్లో గిలగిలా తన్నుకుంటున్నవారు, మొదటి రకం బానిసలు చేతిపనులు చేసుకునేవారు. వారికీ పనిముట్లకు అప్పులు పెడ్తాడు చేతి పనులవారు తాము సంపాదించింది శివయ్యకు అప్పగించాలి. అతను ఇచ్చింది మళ్ళీ అప్పుగా తీసుకోవాలి. బ్రహ్మయ్య కొమరయ్య అలాంటివారు.
    మల్లమ్మ మరో రకం బానిస. ఆమె భర్త అప్పుచేసి పారిపోగా బదులుగా వచ్చిన బానిస ఆమె. ఆమెకు జీతం లేదు. ఆమెకు రోజూ గింజలు ముట్టవు పులిసింది పాసిందీ ఆమె ముఖాన కొడ్తారు. రేయింబవళ్ళు గానుగ ఎద్దు కంటే కూడా హీనంగా చాకిరీ చేస్తుంటుంది.
    వెంకడు పుట్టుబానిస అంటే, అతని తండ్రీ చేసిన అప్పుకు తాను బానిస అయినాడు. తల్లి దినవారాలకు చేసిన అప్పుకు తనకు పుట్టబోయే బిడ్డలను బానిసలను చేశాడు. వెంకడికి జీతం లేదు. అతని తండ్రి చేసిన అప్పు , తను చేసిన అప్పు తీరదు. వెంకడు చేసిన చాకిరీకి ఇచ్చే ప్రతిఫలం వడ్డీ కింద పోతుంది. వెంకడికి దినభత్యం కింద గింజలు ఇస్తాడు. శివయ్య వేచ్చాలకు గాను జగన్నాధం దుకాణానికి చీటీ ఇస్తాడు. ఈ దినభత్యం అప్పులో చేరుతుంది. ఇదొక విషవలయం.
    పెంటడు పుట్టు బానిస కాడు పెంటడి తండ్రి చనిపోయాడు దినవారాలకు అప్పు పెట్టి పెంటడిని బానిసగా కొనుక్కున్నాడు శివయ్య. పెంటయ్య వేతనం వగైరాల ఏర్పాటు వెంకడిలాంటిదే.
    ఒకనాడు పెంటడు, వెంకడు కలిసి వచ్చారు. 'దొరా! జగన్నాధం ముంచుతాండు చీటికి సరింగ సరుకులు ఇస్తలేడు పైకమే ఇప్పించుండి బాంచను బతుకుతాం" అన్నారు.
    శివయ్య మండిపడ్డాడు. వాళ్ళను తిట్టాడు. చీటీ కాకుంటే డబ్బు ఇవ్వనన్నాడు . కారాలు మిరియాలు నూరాడు.
    "ఇచ్చేడిది అప్పే కాదుండి , ఎట్ల ఇస్తే ఏమైతదుండి / జగన్నాధం ముంచుతాండు ఇయ్యకుంటే వట్టి బువ్వ తిని బతుకుతాం, వద్దులెండి ' అని వెళ్ళిపోయారు. శివయ్య నివ్వెరపోయాడు. ఎంత పొగరు వీళ్ళకు? తనను ధిక్కరించి వెళ్ళిపోయారు అనుకున్నాడు. అటు తరవాత తెలిసిందేమంటే - జగన్నాధం వేరే అప్పులు పెడ్తున్నాడని "అరె పెంటడూ! పైకమే ఇస్త తీసుకపొండి" అన్నాడు.
    ఈ విధంగా ఒక్కొక్కరూ చేయి జారి పోతున్నారు, తన అధికారాలకీ దర్భానికీ ఎక్కడో చిల్లిపడింది, అది కారిపోతుంది, ఆ చిల్లిని మూయడం ఎలా?
    పావని శివయ్యకు దయ్యంలా కనిపిస్తుంది, ఆమెను తాను ఏమీ చేయలేక పోతున్నాడు . శాస్త్రిగారికి మంత్రాలు వచ్చు, పావని కూడా ఏదో శక్తిలా ఉంది. అదీకాక ఆమె గవర్నమెంటు ఉద్యోగి ఆమె చదువుకున్నది. లోకం తెలిసింది తన దగ్గర చాల లోపాలున్నాయి. మొదటిది -- తన దగ్గర అప్పులిచ్చే లైసెన్స్ లేదు. అప్పులు చెల్లించలేదని కోర్టుకు వెళ్ళడానికి వీలులేదు. లైసెన్స్ లేదనే విషయం పావనికి తెలిస్తే ప్రమాదం అంతేకాదు, హరిజన బాలుర కని ఇచ్చిన సర్కారు డబ్బు తాను కాజేశాడు. ఇంతకాలం పంతుళ్ళు తన చేతిలో ఉన్నారు . పాళ్ళు పంచుకున్నారు. అంగుష్టాలు ఎవరివి వేయించారో తెలియదు అది బయట పడినా కష్టమే. అంతేకాదు, పిల్లల కోసం వచ్చిన పాలపొడి, మొక్కజొన్న , రవ్వా పట్నంలోనే అమ్ముకుని డబ్బు తెచ్చుకున్నాడు. మరొకటి -- సర్కారు కట్టించిన బడిలో తాను గింజలు పెట్టుకున్నాడు. శివయ్య ఊరంతటినీ వణికించినవాడు తాను భయపడుతున్నాడు.
    ఈ ఆలోచనలన్నీ శివయ్యకు రావడానికి కారణం పావని పట్నం వెళ్ళటం పట్నానికి వెళ్ళిన పావని ఏం ప్రమాదం తెస్తుందో అని భయపడిపోతున్నాడు పావనిని వదిలించుకోవడానికి ఒక ఉపాయం కనిపెట్టాడు. సౌమ్యంగా వ్యవహారం పరిష్కరించాలనుకున్నాడు జగన్నాధాన్ని పిలిపించాడు.
    "పిలిచినట్ర దొరవారూ!" జగన్నాధం వచ్చాడు.
    "జగన్నాధం! శాస్త్రిగారి దగ్గరికి పోదామనుకుంటున్న, జర వస్తవా?"
    "అదెందుండి అట్లంటరు? మీరు రమ్మంటే రానంటానా? అసలు కత ఏంది? మీరు శాస్త్రి గారి ఇంటికి పోవటమేంది? పిలుస్తే రానంటుండా బాపనాయన?"
    "జగన్నాధం ! కాలాన్ని బట్టి మనం నడుచుకోవాలె రమ్మంటే రాకపోతాడాగని మనం పొతే అదోహ తీరు అక్కర పడ్డప్పుడు వసుదేవుడంతటోడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు పని మనది, ఆడికి పోయిందే మంచిది , పోదాంపా"
    "నన్నూ రమ్మంటరా!" జగన్నాధాన్ని పిలుచుకొచ్చిన నర్శిమ్మ అడిగాడు.
    "నువ్వెందుకు , పిల్లిని చంకన పెట్టుకున్నట్లు - బాకీ వసూలు చేయటానికి కాదు పోతున్నది " అని అడుగు వేశాడు శివయ్య.
    జగన్నాధం , శివయ్య అడుగులో అడుగు వేసి కదలాడు ఇద్దరూ మవునంగా సాగుతున్నారు శాస్త్రిగారి ఇంటి వైపు.
    "ఇంతకూ పనేందో చెప్పక పోతిరి తీర ఆడికి పోయినంక ఏం మాట్లాడాల్నో ఎరక కావాలెగద!" విసుగ్గా, చిరాగ్గా అన్నాడు శివయ్య.
    జగన్నాధం మాట్లాడలేదు. మవునంగానే శాస్త్రిగారి ఇంటికి చేరుకున్నారు. శాస్త్రిగారు ఖల్వంలో పొడుం నూరుకుంటున్నారు. వస్తున్నా వాళ్ళను చూచారు. అయినా, చూడనట్లే పొడుం నూరుకోవడంలో మునిగినట్లు నటించారు.
    జగన్నాధం - శాస్త్రుల వారిని పిలిచాడు. అప్పుడే చూచినట్లు శాస్త్రుల వారు లేచారు. "శివయ్యగారా! శివయ్యగారు మా ఇంటికి వచ్చిన్రా! నర్శిమ్మతో పిలువనంపితే రాకపోయినాను? రండి కూర్చోండి " అని మంచం చూపించారు.
    "శాస్త్రిగారూ ! ఎంతయిన మీరు పెద్దలు మీ దగ్గరికి మేము రావటమే మంచిదని వచ్చినం ఈ ఊరి భారం సాంతం మన ముగ్గురి మీదనే నిలిచి ఉన్నది. మీరు మా ఇంటికి వచ్చినా, మేము మీ ఇంటికి వచ్చినా గ్రామ క్షేమం కోసమే గదా!"
 "అంతేగద మరి -- ఇంకెవరు చూస్తరు మనం కాక" - జగన్నాధం.
    "పొడుం ఘాటుగా తయారయింది. ఒక పట్టు పడతారా?" శాస్త్రిగారు తన లోకపు జవాబు ఇచ్చారు.
    "అమ్మో! నస్యం పీల్చలెం గాని , పావనమ్మ కనపడదేమి? మాల గూడెం పోయిందా?" పావని పట్నం వెళ్లిందని తెలిసే అడిగాడు శివయ్య.
    "ఎక్కడికి పోయినా ఉద్యోగధర్మం మీదనే పోతుంది. ప్రస్తుతం పట్నం వెళ్ళింది."
    'ఆహా! పట్నం పోయినాది అందుకనే కనబడలేదు. ఎందుకా అని ఆలోచిస్తున్న" - జగన్నాధం ఆవులించబోయి అణుచుకున్నాడు.
    "పావనమ్మ పెండ్లికి ఏమన్న ప్రయత్నిస్తున్నారా?" శివయ్య అసలు సంగతి వెళ్ళబెట్టాడు.
    శాస్త్రిగారు క్షణం చకితులాయినారు ఈ విషయం మాట్లాడ్డానికి ఇంతదూరం వచ్చారన్నమాట అనుకున్నారు.
    "శివయ్యగారూ! ఆడపిల్ల పెండ్లి అంత చులకనగా అవుతుందాండి? నా దగ్గర బుడ్డ పైస లేదు, వేలకు వేలు కట్నం ఇచ్చినా వరులు దొరకటం లేదు. పావని ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నది. ఏదన్న కాస్త వెనకేసుకుంటే చెయ్యాలేననుకుంటున్న"
    "ఏమోనుండి చెయ్యాలే ఎన్నాళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు. ఎట్లనన్న ఆడపిల్లేగాని ఈడిపిల్ల అయితదా?" అన్నాడు జగన్నాధం.
    "శాస్త్రులుగారూ! ఇగో చూడండి పావనమ్మ పెండ్లి బాధ్యత మీ మీద ఎంత ఉన్నదో మా మీదా అంత ఉన్నది . పావనమ్మ మీ బిడ్డ అయితే మా బిడ్డ కాదా! ఇగ చూడండి , యాడనన్న సంబంధం చూడుండి ఎంతయితదో అంత ఖర్చు నేను పెట్టుకుంట పెండ్లి చేసే జిమ్మేదారి నాది  - ఇన్నారా!' శివయ్య ఉవాచ.
    "అట్లనే ఇగ మీరున్నారు గదా, సంబంధాల కోసం చూస్తా దొరకంగానే మీకు చెప్పుత, పెండ్లి చేస్త చెయ్యకుండ ఎట్లుంట? మీరు అంతమాత అన్నారు, చాలు.చేస్త , ఎందుకు చెయ్యను? పావని పెండ్లి కూతురు కావాల్నని నాకు మాత్రం ఉండదూ! శివయ్యగారూ ! ఇగ చోస్త పెండ్లి చేస్త" -- గౌరీనాద శాస్త్రి గారు ఆవేశంగా అన్నారు.
    "ఇగ చూడండి పెండ్లి కావలసిన "
    జగన్నాధం ఏదో అనబోయి శివయ్యను చూచి నాలుక కరచుకున్నాడు.
    "శాస్త్రులుగారూ! పెండ్లి కావలసిన పిల్ల అట్ల వాండ్లెంబడి తిరుగుతుంటే ఎవడన్న చేసుకుంటాడా? పెండ్లయ్యే దాకా జర ఆ గూడెం వైపు పోవద్దనుండి ఎమంటారు?"
    "ఎరకయింది తెలుసుకున్న ఇగ అట్లనే చేస్త పావని ఎక్కడికి పోదు, పెండ్లి చేసుకుంటది"
    "అంతే , అది జెప్పటానికే వచ్చినం, సంబంధం కుదరంగనే చెప్పండి, పెండ్లి చేస్తం, వస్తం మరి " - ఇద్దరూ లేచి వెళ్ళిపోయారు.
    శివయ్య ఇంటికి చేరి మురిసిపోయాడు. మంచి పాచిక వేషా ననుకున్నాడు. తండ్రికీ కూతురుకూ కయ్యం పెట్టాననుకున్నాడు ,పాచిక పారుతుందనుకున్నాడు సారాయి గ్లాసుతో గటగట తాగాడు సిగరెట్టు వెలిగించి గట్టిగా దమ్ము లాగి విస్సురుగా పొగ వదిలాడు.
    వారు వెళ్ళిన తరువాత శాస్త్రిగారు పొడుం పీల్చి ఆలోచనలో పడ్డ్డారు అనవసరంగా శివయ్య దమ్మిడీ ఖర్చు చేయడు అమాంతంగా శివయ్యకు అంత దానకర్ణత్వం  ఎందుకు పుట్టుకు వచ్చింది ? నీతి చంద్రికలో నువ్వుపప్పు కధ గుర్తుకు వచ్చింది . నువ్వులకు పరికిసరి నూపప్పు పెడ్తానని వచ్చింది పొరుగింటావిడ ఇంటావిడకు అనుమానం కలిగింది. దరియాప్తు చేస్తే తేలిన విషయం ఏమంటే -- ఆరబోసిన నూపప్పు కుక్క ముట్టింది, దాన్ని మార్చుకోవడానికి పోరుగావిడ ఈ ఎత్తు ఎత్తింది . ఎంతయినా తాను బుద్ది జాడ్యజనితోన్మధుడు పావని ఇది కనిపెట్టగలదు అనుకున్నారు. ఆలోచనతోనే కునుకు పట్టింది శాస్త్రిగారికి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS