"పెద్ద" గొంతు అఖ్ఖర్లేదు. యంత్రాలు వస్తాయి.
"నా మొహమేం కాదూ?" అది పోనీ...అంతరిక్షంలోకి మనుషులు వెళ్తారా? అంతెత్తు ఎవరన్నా ఎగరగలరా? నువ్వు ఎగురు? ఆరంగుళాలు ఎగిరితే చట్ట విరిగేలా చతికిల పడతావ్! అంతరిక్షంలోకి మనుషులు వెళ్తారా? నిజం చెప్పాలంటే నీకు పురాణాల పిచ్చి పట్టింది! మతమౌఢ్యం! మీ పుక్కిటి పురాణాల్లో జరుగుతాయ్ ఇవన్నీ! దూరదృష్టి, దూరశ్రవణం, ఆకాశ గమనం - కవులు తీరి కూర్చుని రాసిన అభూత కల్పనలయ్యా అవన్నీ! బూజు పట్టిన పాత భావాలు! అవి నిజమనుకుంటే ఎలా? హేతువాదానికి నిలవ్వు! ఆగంతకుడా! నువ్వెవరితో ఏకీభవిస్తావ్?"
వింతగా వాళ్ళవైపు చూశాడు సాహస్. అంతలోనే అంకుష్ అన్నాడు.
"మీకేం పిచ్చా వెర్రా! ఇప్పటికే టెలిఫోన్లు, టీవీలు, విమానాలూ, రాకెట్లూ, శాటిలైట్లూ అన్నీ వున్నాయిగా! ఇంక మీ వాదన ఏమిటీ?"
అంకుష్ మాటలు వినగానే ఆ వ్యక్తులు ఇద్దరూ నిర్ఘాంతపోయారు.
"ఏమిటి నువ్వంటోంది?" అన్నారు వాళ్ళు.
"నన్ను చెప్పనివ్వండి!" అన్నాడు సాహస్. అంటూ, తన వంటికి అంటిన దుమ్ము దులుపుకుని, అంకుష్ చెయ్యి పట్టుకుని, "జాగ్రత్త! మళ్ళీ పడగలవు!" అని పక్కకి లాగి నిలబడ్డాడు.
అంతే!
క్షణంలో అంతర్ధానమయ్యారు ఎదురుగా వున్న ఆ వ్యక్తులు ఇద్దరూ!
దిగ్భ్రాంతి చెంది, మొహమొహాలు చూసుకున్నారు సాహస్, అంకుష్.
"నేను చూసింది నువ్వు కూడా చూశావా?" అన్నాడు అంకుష్.
"అదే నేనూ అడగబోతున్నాను" అన్నాడు సాహస్.
"నాకు కడుపులో ఏదో వెగటుగా అయిపోతోంది" అన్నాడు అంకుష్.
"సేమ్ విత్ మీ" అన్నాడు సాహస్.
నాసియా! వెగటు ఫీలింగ్ - వామిట్ అయ్యేలా సెన్సేషన్!
ఇదంతా నాసియా వల్ల కలిగిన హల్యూసినేషనేనా?
అయినా ఇద్దరికీ ఒకే రకమైన భ్రాంతి ఎలా కలుగుతుంది?
మాస్ హిప్నాసిస్?
ఎవరు చేస్తున్నారు?
గట్టిగా తల విదిలించి, కళ్ళు నులుముకుని చూశాడు సాహస్.
ఎవరూ లేరు ఎదురుగా!
కానీ -
ఆ ఇద్దరు వ్యక్తుల మాటలు ఇంకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నట్లే వున్నాయి.
కొద్ది క్షణాలు ఆలోచిస్తూ వుండిపోయి, "పద వెళ్దాం!" అన్నాడు సాహస్.
ఇద్దరూ నడక మొదలెట్టారు.
సరిగ్గా అదే స్పాట్ నుంచి ఒక గుట్ట లాంటిది మొదలయింది. ఎక్కువ ఎత్తు లేదు. ఆరేడు అడుగుల ఎత్తున వుంది. అడుగడుక్కీ గులకరాళ్ళు తగులుతున్నాయి. నడక కష్టంగా వుంది.
అలాగే ప్రయాస పడుతూ చీకటి పడేదాకా నడిచారు ఇద్దరూ.
చటుక్కున ఆగాడు సాహస్.
"ఇప్పటిదాకా మనం దేనిమీద నడిచామో అర్థం అయిందా?" అన్నాడు ఎగ్జయిటెడ్ గా!
"దేనిమీద?" అన్నాడు అంకుష్.
సాహస్ జవాబు చెప్పేలోగానే, సుదూరం నుంచి ఒక జంతువు అరుపు!
ఫలాని జంతువు అని గుర్తుపట్టలేకుండా!
ఇద్దరూ తలలు తిప్పి చూశారు.
దూరంగా ఒక కొండ.
అప్పుడే చంద్రోదయం అవుతోంది.
కనబడీ కనబడకుండా వున్న ఆ కాంతిలో అస్పష్టంగా, రేఖా మాత్రంగా కనబడుతోంది.
ఒక శిధిల నగరం!
ఆ కొండమీద!
చాలాసేపు కళ్ళార్పకుండా ఆ కొండ మీద కనబడుతున్న శిథిల నగరం వైపే చూస్తూ వుండిపోయాడు సాహస్.
"ఏమిటి చూస్తున్నావు?" అన్నాడు అంకుష్.
"మాయానగరం!"
"ఏమిటీ ?"
"మాయానగరం!" అన్నాడు సాహస్ మళ్ళీ.
"అంటే ?"
ఒక్కసారి తల విదిల్చి, చెప్పడం మొదలెట్టాడు సాహస్.
