Previous Page Next Page 
జోగబాల పేజి 20


    మరోసారి తల ఆడించబోయి, తాను చేస్తున్న పని గుర్తొచ్చి నవ్వేశాడు.


    "అది కాదు..."


    "ఏది కాదు?"


    "అవును?"


    "ఏమిటవును?"


    "ఇదిగో" అంటూ చేతిలోని గిఫ్ట్ ప్యాకెట్ ఆమె కందించాడు.


    "ఏమిటిది?"


    "నీ బర్త్ డే కదూ. అందుకని..."


    "ఓ! ప్రెజెంటేషనా? ఇందులో ఏముంది?"


    "టాయిలెట్ సామగ్రి."


    "ఛీ" అంది.


    అతనికర్థం కాలేదు.


    "నేను మెట్రిక్ వరకూ చదువుకున్నాను. టాయిలెట్ అంటే అర్థం తెలుసులే."


    "అదికాదు? ఫేస్ పౌడర్,స్నో వగైరాలు వుండే బాక్సు."


    "ఓహో అదా? ఉండు మా నాన్నగారికి చెప్పి వస్తాను నువ్వొచ్చావనీ..."


    "చూడు వజ్రం!" అన్నాడు కంగారుగా.


    ఆమె ఒక్కసారి కళ్ళార్పి, అంతలోనే విశాలం చేస్తూ అతని వంక చూసింది. తనని పేరుపెట్టి పిలవడం ఆమెకెంతో సంతోషాన్నిచ్చింది.


    "ఇంట్లో ఓ ఫ్రెండ్ ఉన్నాడు. పాపం చాలా దూరం నుంచి వచ్చాడు. నేవెళ్ళాలి."


    "అదేమిటి? భోజనం చేసి వెళ్ళకుండా..."


    "చెప్పానుగా ఫ్రెండ్ ఉన్నాడని."


    "అయితే మాత్రం. సేమ్యా, కేసరి, రవ్వలడ్డూ, జున్ను, తమలపాకు బజ్జి, అన్నట్టు సాంబారు నేనే పెట్టాను. తెలుసా. ఉండు నాన్నగారిని పిల్చుకొస్తాను. వెడితే నా మీద ఒట్టే." అంటూ వజ్రం లోపలికి పరిగెత్తింది.


    శ్రీహర్ష ఏమయితే అయిందని అక్కణ్ణుంచి బయటకు జారుకున్నాడు.


                                                      *    *    *    *


    హరిజనవాడలోకి ఓ కొత్త కుటుంబమొచ్చింది. ఆ కుటుంబంలోని సభ్యులు నలుగురు. తల్లితండ్రి, ఇద్దరాడ పిల్లలు. ఆడపిల్లల్లో పెద్దమ్మాయికి పదిహేడేళ్ళుంటాయి. పేరు రాగిణి. రెండో అమ్మాయికి యింకా పదేళ్ళు నిండలేదు.


    వచ్చినప్పట్నుంచీ తల్లీ తండ్రీ అందరితో కలుపుగోలుగా ఉండేవారు. తండ్రి సంజీవయ్య తొందరలోనే పొలం పని సంపాదించి వెళ్ళి పనిపాటలు చూసుకునేవాడు. తల్లి గోవిందమ్మ ఇరుగుపొరుగు వారితో తలలో నాలికలా మసలుకొనేది.


    ఆ కుటుంబం అక్కడికి వచ్చిన నెలరోజులకే ఎల్లమ్మ దేవత రాగిణిని అనుగ్రహించింది. వాడలోని మహ్మకాళమ్మకు పూనకం వచ్చి రాగిణిని జోగి చెయ్యకపోయినట్లయితే కొద్దిరోజుల్లో ఆ ప్రాంతంలో కరువు వ్యాపించగలదని, ఆమెను వెంటనే జోగినిని చెయ్యాలనీ శాసించింది.


    "నువ్వు అదృష్టవంతురాలివమ్మా? ఎల్లమ్మ దేవత అనుగ్రహం చాలా తొందరగా పొందావు?" అని ఇరుగూ పొరుగూ రాగిణిని అభినందించారు."


    రాగిణి చిరునవ్వు నవ్వి ఊరుకుంది.


    "అంతా ఎల్లమ్మదేవత దయ. మాదేముంది? అన్నారు ఆమె తల్లిదండ్రులు.


    తర్వాత రెండుమూడు రోజుల్లోనే రాగిణి జోగినిగా మారిపోతుంది. ఆమెలో ఏదో ఆకర్షణ ఉంది. జోగాపురంలోని వారు, దగ్గర గ్రామాలవారు ఆమె దగ్గరకు విరివిగా రాసాగారు.


    రాత్రి ఏడు గంటలకల్లా ఆమె దగ్గరకు పొందుకోసం పురుషులు రావటం మొదలయ్యేది. రాగిణిలో ఇంకో నేర్పు ఉంది. వచ్చిన వ్యక్తిని మురిపించి, ముద్దులిచ్చి, అతని కోరిక తనివితీరా తీర్చటం కొద్దివ్యవధిలో ముగించేది. అతని దగ్గర్నుంచి డబ్బులు కూడా లాఘవంగా కాస్త ఎక్కువగానే గుంజి "చాలా అలసిపోయాను. మళ్ళీ రేపు" అని గోముగా వీడ్కోలు ముద్దులిచ్చి పంపించేది. వచ్చిన మనిషికి ఆ అనుభవం, అనుభూతి మరువరానిదిగా ఉండేది.


    అలసిపోయానని చెప్పిన రాగిణి, ఓ పదినిమిషాలన్నా గడవకముందే వచ్చిన నూతన వ్యక్తి ముందు తాజాగా తయారై, తిరిగి అన్నీ తాజాగా జరిపించేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS