అయినా ఆమె ఒంటరే...
ఆమెకు రెండే రెండు ఇష్టం...
తను నిజంగా ప్రేమించగల వ్యక్తి లేదా తనను నిజాయితీగా ప్రేమించే వ్యక్తి- లేదా ప్రేమ ప్రపంచానికి సామ్రాజ్ఞిని చేసి ఒంటరితనం ఆ ఒంటరితనంలో ఊపిరి పోసుకొనే కలలు.
ఆమెను ఎందరు పంచుకున్నా.
ఆమె ఎందర్ని పంచుకున్నా.
ఎప్పటికీ వర్జిన్ లా కనిపించే ఎక్జయిటింగ్ పర్సనాలిటీ.... అలసి పోని, సొలసిపోని ఆమె యవ్వనం...
ఇది ఆమె గురించి క్లుప్తంగా చెప్పటమే అవుతుంది.
ఆమెకారోజు షూటింగ్ లేదు.
ఒంటరిగా లంకంత ఇంట్లో అరమోడ్పు కన్నుల వెనుక కదిలిపోతున్న కలల్ని అనుభూతిస్తూ, వాస్తవాల అనుభవాల కోసం పరితపిస్తుండగా, బెడ్ ప్రక్కనే ఉన్న ఫోన్ రింగయింది.
ఎవరు ఫోన్ చేసినా ఆమె సెక్రటరీ లేరనే సమాధానమే ఇస్తుంది.
ఆమెకు తెలుసు ఎవరి ఫోన్ కి తను పాజిటివ్ గా సమాధానం ఇవ్వవలసింది.
"ఏమిటి?" మృదుల కంఠంలో అసహనం తొంగిచూసింది.
"కాల్ ఫ్రమ్ మాస్టర్.... విక్రోలీ..." సెక్రటరీ మాటలు పూర్తి కాకుండానే "కనెక్టు మీ" అంది మృదుల ఆతృతగా.
* * * * *
4 పి.యమ్.
జాన్ మిల్లర్...
బొంబాయి సిటీ మేప్ కేసి చూస్తూ తన పి.ఎ.తో మాట్లాడుతున్నాడు.
"రూట్ నెంబర్ టూ మీదే కన్నేసి ఉంటారని నాకు అనుమానంగా వుంది. మరి మీరు దాన్నే మాస్టర్ వెళ్ళవలసిన రూట్ గా నిర్ణయించారు. అది ప్రమాదం కాదా?" పి.ఏ. తనలోని భయాందోళనల్ని వ్యక్తం చేస్తూ అన్నాడు.
ఒకింతసేపు మిల్లర్ మౌనంగా వున్నాడు.
"ఆఖరి నిమిషంలో రూట్ మార్చే ఆలోచన లేదా సార్?" పి.ఏ. తిరిగి ప్రశ్నించాడు.
"లేదు వాళ్ళేం చేయగలరో చూద్దాం. నామీద భరోసాతో నిశ్చింతగా ఉండు. మిగతా ఏర్పాట్లన్నీ ఓకేనా?" మిల్లర్ బేస్ వాయిస్ లో అన్నాడు.
"అన్నీ ఓకే. బట్...." పి.ఏ. ఆపైన మాట్లాడేందుకు సందేహించాడు.
"ఇఫ్ లు, బట్ లు మన వృత్తిలో తలెత్తకూడదు. ఏమిటో చెప్పు" అన్నాడు మిల్లర్ ఒకింత కోపంగా.
"మాస్టర్ హిందీ సినీస్టార్ మృదులవల్ల ఆకర్షితులవుతున్నారని చూచాయగా తెలిసింది. మృదులపై కూడా ఒక కన్నేసి ఉంచటం క్షేమకరమని నాకనిపిస్తోంది" పి.ఏ. బెదురుతూ అన్నాడు. ఆ విషయం అంతవరకు మిల్లర్ కి తెలీదని అతని ఉద్దేశం.
"ప్రతిక్షణం ప్రతి కోణం నుంచి మృత్యువు మాస్టర్ కోసం పొంచి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మాస్టర్ యిలాంటి ఎఫైర్ పట్ల మొగ్గుచూపటం నాకు ఆందోళన కలిగించటం లేదు గానీ, ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏమిటతని ధైర్యం..." మిల్లర్ మాటలు పూర్తవుతుండగానే గుమ్మం వేపునుంచి మాటలు వినిపించాయి.
"మిల్లర్ లాంటి కాకలు తీరిన యోధుడు, మేధావి తన రక్షణ అవసరాలు చూస్తున్నాడన్న ధైర్యం అది దాన్ని ధైర్యం అనేకన్నా నమ్మకం అంటే బావుంటుందేమో! అయినా ముఫ్ఫై యేండ్ల వయస్సులో ఉన్న మాస్టర్ కి, ముఫ్ఫై ఆరేండ్ల మృదులకు ఎలా జత కుదిరింది? వయస్సు ప్రభావం అలాంటిదేమో?"
మాటలు వినిపించిన వేపులు మిల్లర్, పి.ఏ. తలలు తిప్పి చూసారు.
అక్కడ 'ఎఫ్' నించుని వున్నాడు.
మిల్లర్ మొఖంలో మందహాసం కనిపించింది.
ఎఫ్ వచ్చి మిల్లర్ కి ఎదురుగా నిలుచున్నాడు. ఆ సమయంలో మిల్లర్ తన కెదురుగా వున్న పెద్ద టేబుల్ మీద పేర్చి వున్న బొంబాయి మహానగరపు మోడల్ సిటీకేసి చూస్తున్నాడు.
సమయం : 5-50 పి.యమ్
మాస్టర్ అసాసినేషన్ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. అటు జోహ్రా వర్గంలో- ఇటు మాస్టర్ వర్గంలో ఏం జరగనున్నదనే ఉద్విగ్నత అలుముకొని ఉంది. ప్రాణాంతకమైన పథకాల్ని, వ్యూహాల్ని చలాగ్గా పన్నగల అంతర్జాతీయ స్థాయి నేరాల నేపథ్యపు మేథస్సుగల మిల్లర్ మాస్టర్ ని కాపుకాసి ఉన్నాడు. ప్రక్క క్రిమినల్ వరల్డ్ లో కాకలుతీరిన ట్రిగ్గర్ మెన్ జోహ్రా మరోప్రక్క ఒక యజ్ఞానికి సమాయత్తమవుతుండగా మాస్టర్ ప్రయాణపు ఏర్పాట్లు మొదలయ్యాయి.
* * * * *
"ఒంటరితనం, లోన్లీనెస్ మిమ్మల్నేం విసిగించదా?" మృదుల కంఠం మధురంగా ఉంది.
మాస్టర్ నవ్వాడు.
"సమాధానం నవ్వా?" మృదుల తిరిగి అడిగింది.
"బృందావనం పూలతోటల్లో, కాశ్మీర్ మొగల్ గార్డెన్స్ లో, ఔరంగాబాద్ బీబీకా మక్బారాలో, పంచక్కి వాటర్ పంపింగ్ లోనూ, కేరళ సముద్ర పొడ్డుల వెంట, ముస్సోరి మేఘాలనంటే కొండలపైన, త్రిపుర గిరిజనుల పొదరిల్లు ముందు సయితం గతంలో నాకు ఒక్కటే అనిపించేది..." మాస్టర్ వాయిస్ హస్కీగా, ఒకింత మత్తుగా అంది.
"ఏమిటది?" మృదుల షార్ప్ గా రియాక్టు అవుతూ అడిగింది.
"నా వృత్తిలో, నా వ్యాపారంలో నేను నెంబర్ ఒన్ కావాలని, విపరీతంగా సంపాదించాలని బట్..."
"బట్....?" మాస్టర్ సమాధానం తిరగబడితే బావుండని ఆమె తాపత్రయం.
"మీ పరిచయంతో..."
"ఆ... నా పరిచయంతో..."
"నా లక్ష్యంలో మార్పు రాలేదుగాని మిగతా విషయాలపై కూడా ఆసక్తి పెరిగింది."
"మనం ఎప్పుడు కలుస్తున్నాం? ఐ మీన్ ప్రత్యక్షంగా.... ఆరునెలల నుంచి మనం యిలా ఫోన్ ద్వారా కలుస్తున్నాం. అయినా నన్ను చూడాలనే ఆసక్తి మీకు లేదా?" మృదుల అప్పటికి అలా మాస్టర్ తో ఫోన్ లో మాట్లాడటం మొదలయి సుమారు రెండుగంటలయింది.
