Previous Page Next Page 
లేటెస్ట్ లవ్ పేజి 19

సిటీలో మంచి పేరుంది. లేబర్ వార్డు మరీ రద్దీగా వుంది. అయినా ఆసుపత్రి ఆర్దర్లీగా వుంది. చాలా నీట్ గా వుంది.
అందులో తను హెడ్ నర్స్. స్టాఫ్ నర్స్ ట్రయినింగ్ పూర్తయింది. ఆసుపత్రి హెడ్ డాక్టర్ సుధాకర్ బాబు తన సర్టిఫికేట్స్ చూసి-గవర్నమెంటు వాళ్ళు ఎంత జీతం ఇస్తారో అంత పే చేస్తానన్నాడు.
తనకింకా ఉద్యోగర్హత నాలుగు సంవత్సారాలుంది.
ఈ నాలుగు సంవత్సరాలు రద్దీగా వుండే ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో వైద్యం చేయటం మంచిరాబడి. పేషెంట్స్ కాస్త బరువైన వాళ్ళు వస్తుంటారు. వారి జేబులూ బరువుగానే వుంటాయి. అందులోనూ తను 'ట్రయిన్డ్ సిస్టర్' అందరి మీదా హెడ్ గిరీ వెలగబెట్టవచ్చు. డాక్టరూ- డాక్టరమ్మల తరువాతి స్థానం తనదే,
తను ఆలోచించి మరీ చేరింది. చేరి అప్పటికి ఆరు నెలలయింది. అక్కడినుండి రోజూ తన జేబు వెళ్ళేలోపు బరువెక్కుతూనే వుంది. ఆసుపత్రి నీట్ గా వున్నట్టే-తమ దగ్గరకొచ్చే రోగులు కూడా నీట్ గా వుంటున్నారు.
ఖరీదయినవైద్యంగనుక....కలవారికి మాత్రమే ప్రవేశం.
ఆరోజు తన స్నేహం జానకమ్మగారితో ముడిబడి మలుపు తిరిగింది.
జానకమ్మగారు కనేముందు తనతో అంది-
"ఇదిగో నర్సమ్మా! నాకుగనుక మగపిల్లవాడు పుడితే-నీకు మంచి బహుమతి ఇస్తాను."
"తప్పకుండా తమకు మగపిల్లవాడే పుడతాడమ్మా" తను అంది.
"ఎట్లా చెప్పగలవ్?"
"నా మాటంటే మాటే."
"బడాయి! ఆ పుట్టే బిడ్డ మగో-ఆడో నిర్ణయం జరిగే వుంటుంది. రెండు మూడు గంటల్లో ఆ బిడ్డ నేలమీద పడుతుంది. నీ మాటకు పోనీ ఒక మహత్తు వుందనుకున్నా అదిప్పుడు పనిచేయదు. ఆడపిల్లను మగ పిల్లవాడ్ని చేయదుకదా."
"కాదు మేడమ్? మీ ముఖం చూసి చెప్పగలను. మీరు మగబిడ్డకు తల్లికాబోతున్నారు."
"అంత ఖచ్చితమా?"
"మరి....!"
"అయితే నర్సమ్మా! నాకు మగపిల్లవాడు పుట్టటం జరిగితే....నీకు పదివేలరూపాయలు ఇస్తా."
తనకు తల గిర్రున తిరిగింది.
పదివేల రూపాయలు! మరో రెండు గంటల్లో ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది. మగో-ఆడో తేలిపోతుంది. ఈ రెండుగంటల వ్యవధికి.....ఇంత రేటా? తన ఊహ నిజమైతే ఎంత బాగుంటుంది. ఏదో తను మాటే గనుక అనేసింది. అది నిజమయితే దానికింత ఖరీదు వుంటుందని తనకు తెలీదు. మొదట బహుమతి అనేసరికి-తినటానికి ఏ ప్లేటో, లేక తను కట్టుకోవటానికి ఏకోకో ఇస్తుందని తను తలచింది.
ఏకంగా పదివేలంది.
తనుండే ఇంటిప్రక్క ఓ ఖాళీ స్థలముంది. మూడువందల గజాలు. పదివేల రూపాయలు చెపుతున్నారు. సిటీకి అప్పట్లో అది బయట. కానీ జనం మెల్లగా అక్కడ స్థలాన్ని కొని....అక్కడక్కడ విసిరేసినట్టు ఇళ్ళు కట్టుకుంటున్నారు. తనకు స్థలంగనుక ఏర్పడితే...ముందు ముందు ఇల్లయినా కట్టుకోవచ్చు-లేదా ఖరీదువస్తే అమ్ముకోవచ్చు.
జానకమ్మగారి విషయంలో తనన్న మాటను నిజం చేయాలి. అది తన చేతిలో ఏముంటుంది?
అప్పుడే తన బ్రెయిన్ లో ఒక మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆమె ప్రక్కనే మరో ఆమె చేరింది. ఆమె పేరు లలితమ్మ. తిరుమలరావు గారని లెక్చరర్! బాగా చెప్తాడని మంచి పేరుంది. ఆయనగారి భార్యే ఆమె.
లలితమ్మ, జానకమ్మ ఒకేసారి కనేట్టున్నారు.
ఈ నైట్ తనదే డ్యూటీ....ఇరువురికీ ఆడపిల్లలు పుడితే చేయగలిగిందేం వుండదు.
అలాకాక లలితమ్మకు మగపిల్లవాడు కలిగి, జానకమ్మకు ఆడపిల్ల కలిగితే?
ఇక్కడే తన హస్తలాఘవం ప్రదర్శించాలి.
డాక్టరు__ డాక్టరమ్మ అలవైకుంఠ పురంబులో - నగరిలో - ఆ మూల సౌధంబులో....అన్నట్టు ఎక్కడో వుంటారు. రాత్రుళ్ళు అత్యవసరమయితే తప్ప బయటికిరారు.
డ్యూటీలో వున్న కుర్ర డాక్టరు నిద్రపోతుంటారు.
వార్డుకొక నర్సు.
వారికీ పెద్దగా పనివుండదు.
ఇక పని మొత్తం తనదే. లేబర్ వార్డ్. ఇరువురూ కనేట్టున్నారు, ఇరువురినీ ఆపరేషన్ థియేటర్ కు తరలించాలి. ఇరువురినీ దగ్గర దగ్గరగా వుంచాలి.
జానకమ్మగారికే మగపిల్లవాడు పుడితే నో ప్రాబ్లమ్! తను ఊహించింది కరెక్టే అయితే- ఈ లేబరు వార్డులో తను పడిన ఒక లేబరుకు ఫలితం వుంటుంది.
ఆమె అనుకొంది,
రాత్రి పదిగంటలవరకు వెయిట్ చేసింది.
విషయం డాక్టర్స్ దృష్టికి తీసుకెళ్ళలేదు.  ఆయన ఈ రాత్రికేమైనా డెలివరీ కేసులున్నాయా అంటే-
"రెండున్నాయిగాని- మాస్టారుగారి భార్య - కాంట్రాక్టరుగారి-"
"యస్ సర్! అంత ఎమర్జెన్సీ ఏం లేదు."
"ఓ.కే!" వారెళ్ళిపోయారు.
ఈ రాత్రికి తన అదృష్టాన్ని పండించుకోవాలి.
అప్పుడు తనూహించినట్టే-
సరిగ్గా అర్దరాత్రి రెండు గంటలకు....వారికి నొప్పులు అధికమయ్యాయి. తను వేరే నర్సుని ఆ సమయంలో సహాయం తీసుకోవచ్చు- కానీ తీసుకో దల్చుకోలేదు.
అక్కడ జరగబోయే హస్తలాఘవానికి వేరే సాక్ష్యం వుండగూడదు. ఉంటే తనకు నష్టం.
సరిగ్గా తను ఊహించినట్టే ఇరువురూ ఒకేసారి డెలివరీ అయ్యారు. సరిగ్గా తను ఊహించినట్టే మాస్టారుగారి భార్య మగపిల్లవాడ్ని కంది. జానకమ్మ ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ ఆ పిల్ల ఏడవలేదు.
ఒక క్షణంలో....
తను ఇరువురినీ మార్చేసింది.
అదృష్టం తనను వరించింది.
మాస్టారుగారి భార్య ప్రక్కన మాటా పలుకూ లేని ఆడపిల్లను పెట్టింది. జానకమ్మగారి ప్రక్కన కప్పు ఎగిరిపోయేట్టు ఏడుస్తున్న మగ పిల్లవాడ్ని పెట్టింది.
ఆ రహస్యం ఎవరికీ తెలియదు.
ఒక్క తనకు మాత్రమే తెలుసు.
జానకమ్మగారి ముఖంలో వేయి కాంతులు. ఒక తృప్తి.
అదే సమయంలో మాస్టారుగారి భార్య కన్నీరు మున్నీరుగా కుళ్ళి కుళ్ళి ఏడ్చింది.
ఆ పిల్ల తన ఏడ్పును పూర్తిగా మాస్టారుగారి కుటుంబానికే వదిలి ఈ లోకం వదిలిపోయింది.
తనకు రెండు రోజుల్లో జానకమ్మగారు అన్నమాట ప్రకారం పదివేల రూపాయల్ని తెప్పించి యిచ్చింది.
తన ఆనందానికి అవధులు లేవు.
ఆ రహస్యం తనకు తప్ప ఎవరికీ తెలీదు. ఈ సమయంలో దాన్ని బయటకు చెప్పినా, అది వికటించి తన ఉనికికే ప్రమాదమవుతుంది. ఏ విధమయిన ప్రయోజనం వుండదు.
జానకమ్మగారి కొడుకు__
ఒక రకంగా కొడుకు కాని కొడుకు__
పెరిగి పెద్దవాడయ్యాడు. ఇప్పుడు మంత్రిగా మారాడు. ఆయన చేతి నిండా గుండెలు తీసే జనం.
ఆయన దగ్గరకు వెళ్ళి "నీవు కంట్రాక్టరుగా రబ్బాయివి కాదు-మాస్టారు కొడుకువంటే- ఆయనే తనని బ్రతకనీకయపోవచ్చు.
మాస్టారుగారికి చెప్పినా, ఆయన తమకు జరిగినా ద్రోహానికి తనను ఏ పోలీసులకో అప్పజెప్పవచ్చు. కసిగా తనని కొట్టవచ్చు. కనుక ఆ రహస్యం తనతోతే అంతమవ్వాలి.
ఇలాగే తన అవసరాలకు జానకమ్మగారిని డబ్బులడుగుతూ, రేపు తన మనవడికి ఏదయినా ఉద్యోగం వేయించమని తల్లిచేత కొడుక్కి రికమండేషన్ లాంటిది చేయిన్చుకోవచ్చు!
ఒక ప్రయోజనం తనకు ముందు ముందు జానకమ్మగారి వల్ల జరగాలి. ఈ రహస్యం బయటపెడితే తను రెంటికి చెడ్డ రేవడిలా అయిపోతుంది.
ఇప్పుడు జానకమ్మ తన భర్త కట్టిన ఇంట్లోనో వుంటోంది.
ఆమె కొడుకు అంబరీషుడు మాత్రం ప్రభుత్వం మంత్రులకు కేటాయించే ఇంట్లో వుంటున్నాడు.
అదో హైటెక్ సిటీ.
ప్రభుత్వ వర్గాలూ- మంత్రులూ- పెద్దపెద్ద ఉన్నతాధికార్లూ- అందరూ అక్కడే వుంటారు. ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన కొన్నివేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఆ సిటీని కట్టారు.
అంబరీషుడు అప్పుడప్పుడు వచ్చి తల్లిని పలకరించి వెళుతుంటాడు. అతనికి జానకమ్మ తన తల్లి కాదనీ, ఎక్కడో వుంటున్న ఓ పేద మాస్టారుగారి భార్య జన్మనిచ్చిన తల్లనీ తెలీదు.
తను అప్పుడా మార్పు చేయకపోతే- ఈ అంబరీషుడికి ఏం పేరు పెట్టి వుండేవారో?
మాస్టారుకిష్టమైన ఏ అరుణకుమారనో, ఏ భగత్ బాబనో. ఏ బోసు బాబనో పెట్టి వుండేవాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS