Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 19


                               మనసొకచోట.....

    'హాఫిజ్ గారు వచ్చారు!" వణుకుతున్న బామ్మ తలను కదలకుండా పట్టుకొని చెవిలో మూతిపెట్టి చెప్పింది జరీనా.'
    హాఫిజ్ గారు వస్తున్నారనే కబురు విన్న బామ్మ ముగ్గుబుట్టలాంటి తల నిగ్గుదేరింది. నల్లమందు డబ్బా చప్పున దిండుకింద దాచేసింది. ఖురాన్ మంచపు పట్టె మీద పెట్టింది. కాంతి హీనములైన కన్నుల్లోంచి కారే కన్నీరు తుడుచుకుంది. ముసుగు వేసుకోవడానికి దుప్పటి వెదుకుతూంది.
    ఆమె మనుమడు సలీమ్. అతనికి ముసలమ్మ చేష్టలు బొత్తిగా గిట్టవు. డెబ్బైఅయిదేళ్ళ ముసలిదానికి ముసుగేమిటి? హాఫిజ్ గారు వస్తున్నారనే వార్త విని ముసుగుకు దుప్పటి వెదుకుతుంది. ఎటన్నా వెళ్ళాలంటే టాంగాకు తెరలు కట్టాలి. ఆడది బామ్మలా ఎండిన నారింజపండు అయినా అహంభావం చావదు. హాఫిజ్ గారికి పాపం, కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు. అయినా బామ్మ పెళ్ళిచూపులకు వచ్చినట్లు ఉలికిపడుతూంది.
    కదిలే సలీం పెదవులు చూచి బామ్మ గ్రహించింది, సలీం తనకేదో నీతి బోధిస్తున్నాడని.
    "చచ్చినా ఆడదానికి సిగ్గుభారం తప్పదు. ఇంతవరకూ పరాయి మగాని కంటపడలేదు. నీ అక్క చెల్లెళ్ళలా వెంట్రుకలు విరబోసుకుని, నోరువెళ్ళబెట్టుకొని, రొమ్ములు కనబరుస్తూ టిక్కు టిక్కుమని తిరగమంటావా?"
    ఇంతకూ ఆ హాఫిజ్ గారు ఎవరయ్యా అంటే బామ్మ శత్రువర్గంలోనివారు. బామ్మ కుటుంబానికీ, ఉప్పు నీటి బావి దారికీ కలకాలంగా కార్పుణ్యం రగులుతూంది. తగాదా వచ్చింది ఎప్పుడయ్యా అంటే తాతల కాలం నాడు. హాఫిజ్ జీ తాతకూ బామ్మ తాతకూ భూముల విషయంలో తగాదా వచ్చింది. అది అంతటితో ఆగలేదు. అగ్గి రగులసాగింది. బామ్మ తాత హాఫిజ్ గారి పెద్దల్లో ఎవరితోనో నడివీధిలో అన్నాట్ట; 'ఇవ్వాళ్టినుంచి మాకూ ఉప్పునీటి బావి వారికీ బంధుత్వాలు తెగిపోయాయి. ఇహ నుంచి మా సంతానంలో ఎవరైనా మీ గడప తొక్కితే మహాపాపం చేసినట్లే."
    ఆ అన్న పెద్దలు ఎలాంటి వారయ్యా అంటే యునానీ దేవతల్లా ప్రకృతి రహస్యాలన్నీ గుప్పెట్లో పెట్టుకున్నవారు.అందుకే వారిమాట వేదం అయింది. ఎవరూ అతిక్రమించలేదు. చచ్చినవాళ్లు చచ్చారు కాని పిల్లలను ఇచ్చిపుచ్చుకోవడం మాత్రం చేయలేదు. ఎదురుబొదురు ఇండ్లు- మూతి కుట్టుకొని ఎలా కూచుంటారు? పిల్లలు కలసి ఆడుకొనేవారు. యువతీ యువకులు స్నేహంతో ఒకరిని మించాలని ఒకరు చూచేవారు. ముసలివాళ్లు కూడా వంటరిగా కలుసుకునేవాళ్లు కాని నలుగురిలో పడితే ఒకరిమీద ఒకరు సవరించడానికి చూచేవారు.
    హాఫిజ్ గారికి ఎనభయ్యోపడి. ఆ కాలపు తిండి కాబట్టి ఈ వయస్సులోనూ కర్ర పట్టుకొని వీధిదాటగలరు. ఆరిపోనున్న కళ్ళతో విరిగిన విల్లులాంటి సులోచనాల్లోంచి మనుషుల ముఖాల్ని గుర్తించ యత్నించేవారు. కాళ్లు చేతులు-వణుకు. భూమి దగ్గరకు పిలుస్తున్నట్లు వంగిపోయారు. పైగా దమ్మురోగం. క్షణం విరామం లేదు. యముణ్ణి మోసగించి బ్రతుకుతున్నారు.
    అసలు విషయం ఏమంటే - బామ్మవారిని పిలువనంపింది. పిలిపించిన కారణం విని హాఫిజ్ గారి చల్లారిన రక్తం సెగలు పొగలు లేచింది. ఆవేశంతో ఊగిపోయారు కదలడం చాతకాకున్నా కదిలారు. ఒక చేయి కుర్రాని భుజంమీద వేశారు. మరోచేత్తో కర్ర పట్టుకున్నారు. కదిలారు బామ్మను చూడ్డానికి. వారి కర్ర చప్పుడు విన్నది. అమ్మ చిన్నకోడలు ఉరికివచ్చింది, చేయి పట్టుకొని దోవ చూపిద్దామని. హాఫిజ్ గారు విదిలించారు. 'ఇదేం నాకు కొత్తచోటా? ఈ ముంగిలిలోనే బిల్లంగోడు ఆడాం" అన్నాడు.
    హాఫిజ్ గారి మాట విని అంతా గొల్లున నవ్వారు. ఏమిటీ-వీరు ఆట- లాడారా? ఏమో? ఎవరికీ నమ్మకం కలుగలేదు.
    "బావున్నావా?" వారికి పుట్టెడు చెవుడు. చెవిటివానికి చెప్పినట్లు అరిచేవారు. బామ్మకూ చెవుడే! ఆమెకు వినిపించినట్లుంది జవాబు ఇవ్వడానికి నారి సారించింది.
    "బాగుంది ఎవర్ని ఉద్దరించడానికి. కాటికి కాళ్లు చాచుక్కూర్చున్నా. ఆ గడియ రావటంలేదు. అంతే" వణికే తలను దిండుకానిచ్చింది. ఆలోచనలో పడిపోయింది. దేన్నిగురించి ముందు వివరించాలి- దగ్గును గురించి చెప్పాలా? గుండె దడను గురించి చెప్పాలా? కాళ్లకు వచ్చిన నంజును గురించి చెప్పాలా? కీళ్ళనొప్పులను గురించి చెప్పాలా?
    అందరూ కలిసి హాఫిజ్ గారిని మంచంమీద పడేశారు, దాంతో వారు ఉక్కిరిబిక్కిరి అయినారు, కాస్త సర్దుకొని నిట్టూర్పు విడుస్తూ అన్నారు. 'బాగా చెప్పావు మనదేముంది కొసకు వచ్చాం, చేసుకున్న పుణ్యం చెట్టంతయి రక్షించింది. ఏం వెంట తీసికెళుతాం-మంచీ చెడూ రెండే' ఇంతలో ఒక నౌకరు హుక్కా తెచ్చిపెట్టాడు, గొట్టం హాఫిజ్ గారి చేతికి అందించాడు.
    బామ్మ వారి పూర్తివాక్యం వినలేదు, ఏదో పోగాలాన్ని గురించి ఆమె చెవిని పడింది.
    'కాకుంటే ఏమిటి- కలికాలం దాపురించింది. ఈ పాపాలు చూస్తున్నా ప్రాణం పోదుగదా!'
    ఆమె నల్లమందు డబ్బాకోసం వెదుకుతూంది. అప్పుడే ఆవలింతలు వస్తున్నాయి.
    "అంతా వానిలీల!" హాఫిజ్ జీ హుక్కా పొగ గుప్పుగుప్పున వదులుతూ వేలుపైకి చూపించి 'కాలం కాగిపోతూంది. చూస్తుండు ప్రళయం వస్తుంది' అని చప్పున నోరుమూసుకొన్నారు. ప్రళయం వచ్చి పడ్తుందేమో అన్నట్లు,
    "ఇదేం ప్రళయం కంటే తక్కువా?" బామ్మ ముక్కుమీద వేలేసుకొని 'హవ్వ! ఆడపిల్లలు మొగుణ్ణి కోరుకుంటున్నారు!' అన్నది.
    హాఫిజ్ గారు ఉలిక్కిపడ్డాడు. చేతినుంచి హుక్కాగొట్టం జారిపడింది, ప్రళయపు తొలిరాయి తన మీదనే పడినట్లు జంకారు. ఇంకా ఆ దెబ్బకు కోలుకోకముందే బామ్మ రాళ్లు విసరడం సాగించింది.
    "ఏడ పోయిందా పౌరుషం? మాటకు పొడుస్తాం చీరుస్తాం అని ఉరికారే! పడుచుపిల్లలు లేచిపోతున్నారు!! ఆ దేవుడు దయదలచడు ఇవన్నీ చూడ్డానికి ఇంకా నూకలుంచాడు నేలమీద"
    హాఫిజ్ గారు దగ్గుతో తల్లడిల్లారు. మాట పెకలడంలేదు. నిస్సహాయంగా చేతులు మాత్రం ఆడిస్తున్నారు.
    బామ్మకు వాస్తవంగానే బతుకంటే విసుగు పుట్టింది. జగన్నాటకం సాంతం చూచింది. భర్తమీద పెత్తనం చలాయించింది. అత్తతో తన్నులు తిన్నది. ఒక పడుచు కొడుక్కు పాడె కట్టింది. ఇద్దరి కొడుకులకు బాసింగాలు కట్టింది. వాళ్ళ కొడుకులనూ తన చేతులతో పెళ్లికొడుకులను చేసింది. ముగ్గురు అల్లుళ్ళకు స్వాగతం పలికింది. ముప్పై ఏళ్లయింది ముంజేతి గాజులు చిట్లిపోయాయి. జీవితపు హాలాహలం కూడా గ్రుక్కల కొద్ది మింగాల్సి వచ్చింది. ఇహ ఇప్పుడు వీధి వాళ్ళందరితోనూ "బామ్మ" అనిపించుకుంటూంది. ముసలిముఖపు ముడుతలు చూచి దారేపోయేవాడు నిలిచిపోతాడు. నమస్కరిస్తాడు. వినమ్రుడై బామ్మ దీవెనల కోసం వేచి ఉంటాడు. బామ్మ మనస్ఫూర్తిగా దీవిస్తే కోరిన కోరిక తీరుతుందంటారు లోకులు.
    వెండి తీగల్లాంటి వెంట్రుకల్లో దాగిన ముఖపు ముడతల్లో అనుభవాల అంబరాలు కనిపిస్తాయి. ఆమె ముఖంలో అస్తమిస్తున్న సూర్యుని అందాలు కనిపిస్తాయి. ఇవాళ్టికి ఆమె ఇంటివాళ్లకు సలసల కాగే పాలలా పరిణమించింది. మింగాలేరు కక్కాలేరు. ఆమె వాగుడుకు అంతా విసిగిపోయారు. మాట్లాడితే మా కాలంలోనైతేనా? అంటుంది. ప్రతిదానికీ తప్పుపడుతుంది. మనవలు మనవరాళ్ళది కల్తీ రక్తం అనుకుందాం-స్వంత కొడుకులూ-కూతుళ్ళకే ఆమె అంటే గిట్టేదికాదు. దేవుని దగ్గర ఈమె ఆయుర్దాయానికి సంబంధించిన లెక్క పత్రాలు ఎలుకలు ఈడ్చుకుపోయినట్లున్నాయి! అందుకే ఇంకా బతుకుతూంది.  
    ఇది చూడండి-ఏడు తరాల నుంచి ఉప్పునీటి బావివాళ్ళతో సంబంధాలు తెగిపోయాయా? ఇవ్వాళ బామ్మ మనమడు సలీం పెళ్ళాడ్తే హాఫిజ్ గారి మనవరాలు 'గజాలానే' పెళ్ళాడ్తానని కూర్చున్నాడు. ఉభయుల తల్లిదండ్రులా సంబంధం చేయడానికి సంబరంగా ఒప్పుకుంటున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS