Previous Page Next Page 
పావని పేజి 19


    "అమ్మా! పోదామా?" ముత్యాలు మాటవిని లోకంలోకి వచ్చింది. చుట్టూ చూచింది. తనను ఎవరూ చూడ్డం లేదు. గదా అని ఏటికి దిగువున , అల్లంత దూరంలో పశువులు నీళ్ళు తాగుతున్నాయి. పశువుల కాపరి పెంటడు పశువుల వెంట ఉన్నాడు. పావని అతన్ని చూచింది. అతడు తనను చూడలేదు గదా! ఎందుకో ఆమెకు సిగ్గు ముంచుకు వచ్చింది. ముఖం సాంతం ఎర్రబడింది. చప్పున లేచి ఉరికింది. బ్లౌజు అందుకుంది. వేసుకుంది. ఉరికి చీర కట్టుకుంది.
    పొద్దు వాలిపోతుంది పిల్లలందరికీ బట్టలు వేసింది. బయలుదేరడానికి అంతా తయారయారు . అటు పెంటని వైపు చూచింది పెంటడు పశువులను కడగడంలో నిమగ్నుడయి ఉన్నాడు. ఇటు చూచినట్లే లేదు, అయినా ఆమె కెందుకో గుండె దడదడలాడింది.
    పిల్లలంతా తయారయినారు బయలుదేరుతున్నారు. నీళ్ళు త్రాగి వస్తానని ముత్యాలు ఉరికింది. పావని వారిస్తున్నా ఉరికింది ముత్యాలు ముత్యాలు నీళ్ళు తాగడానికి పోయిన చోట గుండం ఉంది. అక్కడ ఏరు చాల లోతుంటుంది. అటు ఎవరూ వెళ్ళరు. ముత్యాలు నీళ్ళు తాగుతూ కాలుజారి గుండంలో పడిపోయింది. మునుగుతుంది. తేలుతుంది. పావని ఒక్క కేకపెట్టింది. గుండంలోకి దూకింది. పావనికి ఈతరాదు ముత్యాలు చేయి అయితే పట్టుకుంది కాని, మునుగుతుంది. తేలుతుంది. బయట ఉన్న పిల్లలంతా కేకలు పెట్టారు. పశువులను కడుగుతున్న పెంటయ్య విన్నాడు. ఉరికి వచ్చాడు. చూస్తే పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. తేలినప్పుడు చేయి ఎత్తి ఏదో చెప్పబోతూంది పావని. పెంటయ్య గుండంలో దూకాడు చూస్తుండగానే ముత్యాలును ఒక భుజం మీదా, పావనిని మరొక భుజం మీదా వేసుకుని బయటికి వచ్చాడు.
    పావని ఇసుక మీద కూలబడింది పూర్తిగా తడిసిపోయింది. నీరు కారుతుంది. పెంటయ్య చూస్తున్నాడని సిగ్గు ముంచుకు వస్తుంది. కాళ్ళకు చేతులు చుట్టి వళ్ళంతా దాచుకుంటుంది వణికిపోతుంది.
    "ఇయ్యాళ మా అమ్మకు గండం గడిచింది. ఎందుకొచ్చినవమ్మా ఇటు! నువ్వేదో దారి చూపుత వనుకున్నాం నువ్వు లేకుంటే మా గతేం కావలె తల్లీ! ఇసువంటి పనులు తల పెట్టకమ్మా!"
    "అమ్మా! తల్లీ!" పెంటయ్య సంభోధన విన్నది. పావని తలెత్తి పెంటయ్యను చూచింది. తల్లి ముందు నుంచున్న బిడ్డలా ఉన్నాడు. తల్లికి వచ్చిన ఆపదను గురించి తల్లడిల్లిపోతున్నాడు. అవును తానూ తల్లి, వీళ్ళంతా తన బిద్దలుం సిగ్గెందుకు? అసలు తనకెందుకు సిగ్గు ముంచుకు వచ్చింది? బిడ్డ ముందు తల్లికేం సిగ్గు ? అవును  - తాను తల్లి, తల్లే తాను!
    పావని లేచి నుంచుంది. వళ్ళంతా తడిసింది. తడిసిన చీర వంటికి అంటుకుపోయింది. పెంటయ్య తనను చూస్తున్నాడు. పెంటయ్య చూపులో ప్రసన్నత ఉంది. చూపులు స్వచ్చంగా ఉన్నాయి. నిర్మలంగా ఉన్నాయి.   
    పావని నిటారుగా నుంచుంది.
    'అమ్మా! బట్టలన్నీ తడిసిపోయినాయి ఏమి ఇద్దు? నా తాన పై పంచ కూడా లేదు ' -- నిర్వేదం కనబరచాడు నిస్సహాయత వ్యక్తపరచాడు.
    "ఫరవాలేదు ఇలాగే వెళ్తా ఇంటికి వెళ్ళే వరకు ఆరిపోతుంది. పిల్లల బట్టలు ఉతకడానికి వచ్చా"
    "ఎంత దయగల తల్లివమ్మా! మురికి నిండిన పిల్లలను ముత్యాలవలె చేసినవ్ అమ్మా, నీ రుణం ఎట్ల తీర్చుకుంటాం?"
    "పెంటయ్యా! అటు చూడు ఆవు ఏదో మందబాసి ఉరుకుతుంది"
    పెంటయ్య అటు చూచాడు దొంగ ఆవు ఉరుకుతుంది. కేకలు పెడ్తూ అటు పరిగెత్తాడు పెంటయ్య.
    పావని ఇంటికి చేరేవరకు సాయంకాలం అయింది. శాస్త్రిగారు కాలుకాలిన పిల్లిలా ఇంట్లోకి బయటికీ తిరుగుతున్నారు. పావనిని చూచి ప్రాణం లేచి వచ్చింది. "ఎటు పోయావమ్మా! ఇంతసేపు " ధ్వనిలో కోపం లేదు ఉద్వేగం ఉంది.
    "చెపుతా నాన్నా!" పావని లోనికి వెళ్ళింది. బట్టలు మార్చుకుంది. తల అరబెట్టుకుంది. లాంతరు వెలిగించి తెచ్చి , స్టూలు మీద పెట్టింది.
    శాస్త్రిగారు మంచంలో కూర్చుని ఉన్నారు. పావని పక్కనే కూర్చుంది. జరిగింది సాంతం పూసగుచ్చినట్టు చెప్పింది.
    శాస్తిగారు క్షణం మౌనం వహించారు.
    పావని గుండె గుబగుబలాడుతుంది.
    'అమ్మా!' శాస్త్రిగారు మౌనాన్ని చీల్చారు. "మేము అద్వైతాన్ని అధ్యయనం చేసినామమ్మా! అమ్మా పావనీ! నువ్వు అధ్వైత్వాన్ని ఆచరిస్తున్నావమ్మా!"
    పావని ఉక్కిరిబిక్కిరి అయింది. ఆమె హృదయం పొంగింది. "నాన్నా!" అని భుజం మీద వాలిపోయింది.
    'అవునమ్మా!" శాస్త్రిగారూ కళ్ళు తుడుచుకున్నారు. "శంకర భగవత్పాదులు  పిపిలికాది బ్రహ్మాండం సాంతం బ్రహ్మమయం అన్నారు వారికీ బ్రాహ్మణులు చండాలురు సమానమేనమ్మా! శంకరుల వారు చందాలాష్టకం రచించారు అమ్మా! మేం చదువుకున్నాం నీవు ఆచరిస్తున్నావు' తల మీద చేయి వేసి నిమురుతూ అన్నారు. శాస్త్రుల వారు వారిలో పుత్రికావాత్సల్యం పొంగింది గొంతు గద్గదం అయింది.
    "నాన్నా ఏడుస్తున్నావా?' కన్నీరు తుడిచింది పావని.
    "అవునమ్మా! మీ అమ్మ ఉంటే 'శాస్త్రిగారి దుఖం కట్టలు తెంచుకుంది.
    "నాన్నా! నేనే నీకు అమ్మను నాన్నా! నేను అమ్మను కానా? నేనునీకే కాదు -- ఈ ఊరంతటికీ అమ్మను అవున్నాన్నా , నిజం పెంటయ్య చెప్పాడు - నేను అందరికీ తల్లిని నాన్నా! అవును, నేను తల్లినే!"
    "అవునమ్మా! నువ్వు తల్లివేనమ్మా! ఈ ఊరికే కాదు - మంచితనానికే తల్లివమ్మా!"
    "నాన్నా! అమ్మ ఉంటె!" పావనికి దుఃఖం ముంచుకు వచ్చింది.

                                             11

    శివయ్య గొంతులో కరక్కాయ పడింది. మింగలేడు కక్కాలేడు. పావని ఊళ్ళో ప్రవేశించడంతో అతని పట్టు విడిపోతుంది. తన కాళ్ళ కాడ పడి ఉండే  జనం చదువుకుంటున్నారు. తెలివి మీరుతున్నారు. తాను అడ్డలేకపోతున్నాడు. ఆపలేక పోతున్నాడు. ఊళ్ళో బడి పెట్టకుండా ఇంతకాలం ఆపగలిగాడు. ఇహ ఆపలేక పోతున్నాడు. పంతులు తనకు లెక్కలు రాసేవాడు. ఇప్పుడు ఆ సౌకర్యం లేదు. జగన్నాధం లెక్కలు రాస్తున్నాడు కాని, అయిష్టంగా రాస్తున్నాడు. ప్రత్యేక్షంగా కాకున్నా పరోక్షంగా నయినా తాను రాయలేనని చెపుతున్నాడు. అతడు వేళకు రావడం లేదు వచ్చినా మనసుంచి పని చేయడం లేదు. ఇవ్వాళ కాకుంటే రేపయినా రాసినందుకు డబ్బు అడిగేటట్లున్నాడు!
    శాస్త్రిగారు తనను ముఖస్తుతి చేసి జీవించేవాడు. తను చెప్పిందే శాస్త్రంలో ఉందని చెప్పేవాడు. శాస్త్రి కూడా మారిపోతున్నాడు. పావని అంటరాని వారిని అంటుకున్నా మాట్లాడ్డం లేదు, పైగా ,  ఆమె చేస్తున్న ప్రతిపనికీ మౌనంగా ఊరుకుంటున్నాడు.
    బ్రహ్మయ్య తాను గద్దిస్తే కదిలేవాడు కాడు పనిముట్లు ఇవ్వనంటే కాళ్ళు పట్టుకునేంత పనిచేసేవాడు వాడు పావనికి తోడయినాడు. అగ్నికి తోడయిన వాయువులా తయారయినాడు. వాణ్ణి లొంగదీయలనుకున్నాడు తాను పనిముట్లు ఇవ్వనన్నాడు అప్పు ఇవ్వడం బంద్ చేశాడు. బ్రహ్మయ్య భార్యకు జబ్బుగా ఉంది బెదిరిస్తే లొంగి వస్తాడనుకున్నాడు. అయినా, బ్రహ్మయ్య తనను లెక్క చేయడం లేదు. పనిముట్లకు గాని, అప్పుకు గాని రావడం లేదు. పైగా, బడి పెట్టడానికి పావనికి సాయం చేస్తున్నాడు.
    కొమరయ్య పరిస్థితి చూస్తె ఆశ్చర్యం అనిపించింది శివయ్యకు.
    "దొరా! తాగని సారకు లెక్క రాసుకోటం న్యాయం కాదుండి మీరు ఏమన్నా అనుకోండి -- తాగినోనికి తాగినంత రాసుకోండి నిన్న నేను తాగలే -- నా లెక్క రాసుకోవద్దు ' అన్నాడు నిర్భయంగా. చెప్పుతో కొడితే చెప్పు తెచ్చి తన కాళ్ళ దగ్గర పెట్టిన కొమరయ్య అంత గట్టిగా అంటుంటే ఆశ్చర్యపడ్డాడు శివయ్య.
    అతనికి కోపం మండాల్సింది కొమరయ్యను చావబదాల్సింది శివయ్య అలా చేయలేదు. ఏదో అతని శక్తి సాంతం జారిపోతున్నట్లుంది. కొమరయ్యకు సారె ఇవ్వడం మానేద్దాం అనుకున్నాడు. పెట్టె అప్పు నిలిపెద్దాం అనుకున్నాడు కాని అలా చేయడం వల్ల కొమరయ్య లొంగి రాలేదు. కొమరయ్యకు ఇదివరకే డబ్బు పెట్టాడు కుండలన్నీ పచ్చిగా ఉన్నాయి. వాము కాలితే గాని కొంత డబ్బు రాదు యెంత ఆలోచించినా చేయగలిగింది ఏమీ కనిపించలేదు . కొమరయ్య డిమాండుకు లొంగాల్సి వచ్చింది. తాగిన వాని పేరనే కాతాలో రాసుకోవడానికి అంగీకరించకతప్పలేదు. దాంతో శివయ్యకు బోలెడు నష్టం వస్తుంది. సారాయి కాంట్రాక్టులో సర్కారు డబ్బు సైతం గిట్టుబాటు అయ్యేట్లు కనిపించడం లేదు.
    పెంటడు పశువుల కాపరి -- వెంకడు పొలం మీది బానిస -- వీళ్ళు కూడా తెలివి మీరుతున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS