Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 19

"అండమాన్స్ కి బస్సెక్కడ వుంటుందయ్యా అయోమయపు మనిషీ!" అన్నాడు కానిస్టేబుల్.
"అందుకేగా వాళ్ళని దింపేశా!"
"ఏడ్చి మొత్తుకున్నట్లే వుంది. నిర్వాకం చాలుగానీ బస్సుని డిపోకి తీసుకెళ్ళిపో!" అన్నాడు కానిస్టేబుల్.
ఇంతమంది జనంలో, ఇంత హడావిడిలో ఇంక ఆ ఇద్దరినీ పట్టుకోవడం ఎంత కష్టమో అతనికి తెలుసు.

                                             *    *    *    *
చిక్కటి అడవి అది.
"కులాసానా గురూ?" అన్నాడు అంకుష్.
"అది నేనడగాల్సిన ప్రశ్న!" అన్నాడు సాహస్.
"ఇదిగో! నన్ను కిడ్ బ్రదర్ లాగా ట్రీట్ చెయ్యకు! ఇద్దరం మొగాళ్ళం! సమానమే!" అన్నాడు అంకుష్.
నవ్వి, అంకుష్ భుజం తట్టాడు సాహస్.
"ఇప్పటిదాకా చేసింది అడ్వెంచర్ కాదు. అది కిడ్స్ గేమ్. ఇప్పుడు ముందుంది అసలు అడ్వెంచర్! భయపడకుండా నాతో రాగలవా?"
"భయమా? అంటే ఏమిటి" అన్నాడు అంకుష్.
"గుడ్! ఈ అడవిలో అసలైన అడ్వెంచర్ మొదలవుతుంది. వందల కిలోమీటర్ల కొద్దీ నడవాలి. ఊహకి అందని వాటిని చూడటానికి రెడీ కావాలి. సరేనా!"
"ఎక్కడికెళ్తున్నాం?"
"టెలిస్కోప్ కొండకి!"
"అదెక్కడ?"
"నాకూ తెలీదు. వెదకాలి."
"ఏముంటుంది ఆ కొండమీద?"
"మనకు తెలియనిది ఏదో వుంటుందని తెలుసు. అంతకంటే ఇంకేం తెలీదు."
విజిలేశాడు అంకుష్.
"చాలా ఇంటరెస్టింగ్ గా వుండేటట్లు వుందే!"
"పద!"
ఉత్సాహంగా గెంతుతూ ముందు నడవడం మొదలెట్టాడు అంకుష్.
"జాగ్రత్త! జాగ్రత్త!" అని హెచ్చరిస్తున్నాడు సాహస్. మధ్యాహ్నం దాకా నడిచాక, అతను భయపడ్డంతా అయింది.
 ఒక పెద్ద చెట్టు వేరు దూలంలా భూమి బయటికి వచ్చి వుంది. దాన్ని తట్టుకున్నాడు అంకుష్. ధన్ మని కింద పడ్డాడు. ముందు నడుస్తున్న అంకుష్ కిందపడటంతో సాహస్ కూడా బాలెన్స్ తప్పి కిందపడ్డాడు.
"ఏమిటీ డిస్టర్బెన్సు?" అని వినబడిందో గొంతు, చాలా విసుగ్గా.
తిరిగి చూశాడు సాహస్.
అక్కడ ఇద్దరు మనుషులు కనబడ్డారు.
వాళ్ళ వేషధారణ కాస్త విచిత్రంగానే వుంది. ఒకతను ముఖమల్ తో చేసిన కోటూ, పైజమా వేసుకుని వున్నాడు. రెండో అతను మజ్లిన్ తో చేసిన అంగరఖా తొడుక్కుని వున్నాడు. ఎప్పటివో పద్ధెనిమిదో శతాబ్దపు ఫ్యాషన్లు అవి!
ఒక్కక్షణం సాహస్ వైపు తీక్షణంగా చూశాడు కోటువాలా.
"ఇటువైపు వచ్చిన ప్రతివాడూ ఇక్కడ తట్టుకు పడుతుంటాడు. చెట్ల వేళ్ళు దూలాలలాగా బయటికి పొడుచుకు వచ్చి వుండడం వల్ల అట్లా పడుతుంటారని నేనంటాను. 'కాదూ - ఈ స్థల మహత్యం ఇది' అని నా మిత్రుడూ వాదించుకుంటున్నాం. నువ్వెవరితో ఏకీభవిస్తావు ఆగంతకుడా? కాకపోతే కొంపదీసి నీకూ మూఢనమ్మకాలు వున్నాయా?" అన్నాడు కోటువాలా.
"మనకు అంతుబట్టనివన్నీ మూఢనమ్మకాలు అనెయ్యడం కూడా ఒక మూఢనమ్మకమే!" అన్నాడు సాహస్ క్లుప్తంగా.
కోటువాలా గుడ్లురిమి చూశాడు.
"నీకు హేతువాదం గురించి బొత్తిగా తెలీనట్లుందే! మౌఢ్యంలో నా మిత్రుడిని మించిపోయినట్లున్నావు!"
"ఏమంటాడు నీ మిత్రుడు?" అన్నాడు సాహస్.
ఫకాల్న నవ్వాడు కోటువాలా.
"రాబోయే రోజుల్లో...నేనెందుకు చెప్పడం...నువ్వే వినిపించవయ్యా!" అన్నాడు తన మిత్రుడు వైపు తిరిగి.
అంగరఖా వేసుకున్న వ్యక్తి సౌమ్యంగా చెప్పడం మొదలెట్టాడు. "శాస్త్ర విజ్ఞానం రోజురోజుకీ అభివృద్ధి చెందుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా, ఇక్కడ కూర్చుని విదేశాలలో వున్నవాళ్ళతో మాట్లాడడం, అంతరిక్షంలోకి మనుషులని పంపడం ఇవన్నీ జరుగుతాయి!"
లటిక్కున పీక పట్టుకున్నట్లు పట్టుకున్నాడు కోటువాలా.
"ఏమిటీ? ఇక్కడ కూర్చుని లండన్ లో వున్నవాళ్ళతో మాట్లాడగలవా? అంత పెద్ద గొంతు ఎవరికన్నా వుంటుందా అసలు? చెప్పు!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS