"వెడుతున్నారా?" అని వాకిట్లోకి వచ్చాక "నాకు లెక్కలు సరిగారావు. మీరు తరచూ వచ్చి ల్యూషన్ చెబుతూ ఉండాలి" అంది మెల్లగా.
"తప్పకుండా" అంటూ అక్కణ్ణుంచి కదిలాడు.
శ్రీహర్ష హరిజనవాడ నుంచి బయటకు రాగానే ఎదురుగా ముప్పైయేళ్ళ వ్యక్తి చేతిలో చిన్న బ్యాగ్ తో వాడలోకి ప్రవేశిస్తూ కనిపించాడు.
"ఏమిటి తమ్ముడూ? ఇటునుంచి వస్తున్నావు?" అని పలకరించాడు.
"మీరెవరు?"
"నా పేరు ఆనందబాబు. డాక్టర్ ఆనందబాబు."
శ్రీహర్షకు అతనిబోర్డెక్కడో చూసినట్లు గుర్తొచ్చింది. ఆర్.ఎమ్.పి. డాక్టరు.
అతను తనని నువ్వు అని సంబోధించడం గుర్తొచ్చి శ్రీహర్ష వినీ విననట్లు ఊరుకున్నాడు.
"నువ్వు చలమయ్యగారి కొట్లో పని చేస్తుంటావు కదూ?"
జవాబు చెప్పడం ఇష్టం లేకపోయినా విధిలేక శ్రీహర్ష తల ఊపాడు.
"నా మొదటి ప్రశ్నకు జవాబు చెప్పావు కాదు?"
"ఏమిటది?"
"వాడలోకి వెళ్ళి వస్తున్నావు ఏమిటది?"
శ్రీహర్షకు అతనితో మాట్లాడటం అసహ్యమనిపించి జవాబివ్వకుండా ఊరుకున్నాడు.
"కొత్తగా వచ్చావు. ఈ ఊరు కొత్తగా వచ్చిన వాళ్ళంతా వెంటనే ఏం చేస్తారో తెలుసు. మాంచి వయసులో ఉన్నావు. జోగిని దగ్గరకు వెళ్ళి వస్తున్నావనుకుంటాను."
"మీరూ అక్కడికేనా?" అన్నాడు శ్రీహర్ష ఒళ్ళు మండి.
"నిజం కనుక్కున్నావు. కాని నువ్వెళ్ళినందుకు కాదు వాళ్ళకు తలో పెన్సిలిన్ ఇంజక్షనూ యివ్వడానికి. వాళ్ళు రాత్రంతా అడ్డమైన వాళ్ళతో...మనలో మనమాట జోగినుల బట్టి మనకి బోలెడు ఇన్ కమ్ ఉంటుందనుకో. ఎవరికయినా మంచిది. ఆనక నువ్వూ ఒకసారి వచ్చి ఇంజక్షన్ చేయించుకో. లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది. వస్తా అని చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
* * * *
శ్రీహర్ష ఇంటికి వెళ్ళేసరికి విలాస్ అతనికోసం ఎదురుచూస్తూ కనిపించాడు.
"అరె? యెప్పుడొచ్చావ్?" అన్నాడు శ్రీహర్ష సంతోషంగా.
"ఇంతకుముందే!"
"ఏమిటి విశేషం!"
"ఏమీలేదు లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది. కొన్నాళ్ళిక్కడ స్పెండ్ చేద్దామని వచ్చాను."
విలాస్ నిజంగా విలాస పురుషుడే. ఎప్పుడూ అతనికి ఏదో ఒక సంఘటన జరుగుతూ ఉండకపోతే జీవితం బోర్ గా ఉంటుంది. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. తండ్రి బిజినెస్ మాన్. అతన్ని కూడా బిజినెస్ లోకి రమ్మంటూంటే "ఇదిగో అదిగో" అని తప్పించుకుని తిరుగుతూంటాడు.
"నీకీ జోగాపురం నచ్చిందనుకుంటాను." అన్నాడు శ్రీహర్ష.
అతనన్న మాటలో నిజం లేకపోలేదు.
ఆ మధ్యాహ్నం శ్రీహర్ష చలమయ్య ఇంటికి వెళ్లాడు. ఆయన ఇంట్లో ఎక్కడో ఉన్నట్టున్నాడు. వాకిట్లో ఓ పద్దెనిమిది ఇరవై ఏళ్ల అమ్మాయి నిలబడి ఉంది. శరీరపు రంగు నలుపేగాని మొహం కళగా ఉంది. ఆరోగ్యంతో, బలంతో శరీరంలోని ప్రతి అవయవం మిడిసిపడుతున్నాయి. తలంటుపోసుకుని జుట్టు జడ వేసుకోకుండా ఒదిలేసి ఉండడంతో అది కొంత వన్నె తెస్తోంది.
"నువ్వేనా శ్రీహర్ష?" అనడిగింది.
అవునన్నట్టు తలూపాడు.
"నా పేరు వజ్రం. నాదే పుట్టినరోజు. ఇదిగో చూశావా? తలంటుపోసుకుని కొత్తబట్టలు కూడా కట్టుకున్నా. ఈ చీర బావుందా?"
శ్రీహర్ష మళ్ళీ తలూపాడు. "అన్నట్టు ఈ చీరె సెలెక్ట్ చేసింది నువ్వేనటగా? నాన్నగారు చెప్పారు."
శ్రీహర్ష ఇంకోసారి తల ఆడించాడు.
"ఏమిటి? అడిగిన ప్రతిదానికీ తల కదిలిస్తున్నావు. నీకు మాటలు రావా?"
