రత్తమ్మ భయంతో గడగడలాడుతూంది. సాధు భయంకరంగా కనిపించాడు. అతన్ని చూస్తూ ఉండిపోయింది. ఇంతలో చుట్టుపక్కలవాళ్లు కనిపించారు. వాళ్లను చూచింది.
అప్పుడు రత్తమ్మ కళ్ళలో తండ్రి శవం తేలుతూ కనిపించింది.
సాధువు, రత్తమ్మను గుడివెనుక అంధకారం వ్యాపించిన అరణ్యంలోకి తీసికెళ్ళాడు.
మా చుట్టూ జనం ఉన్నారు. గుడిగంటలు మోగుతున్నాయి. బలి ఇస్తున్న మేకల, కోళ్ల అరుపులు మిన్ను ముడ్తున్నాయి. వరాలు కోరుకునేవాళ్ళ వరుస లేచి ఉంది. కళ్లు మూసుకొని కూర్చున్న సాధువు అమాంతంగా కళ్లు తెరచి ఆడవాళ్ళను చూస్తున్నాడు. ఒకర్తెను చూస్తున్నాడు. తన దగ్గరికి పిలుస్తున్నాడు.
మరో పడుచు సాధువు వచ్చాడు. అతడు అందంగా ఉన్నాడు. జాబు రాసుకునే ముందు వంటికి తైల మర్దనం చేసుకున్నట్లున్నాడు. నిగనిగలాడుతున్నాను. కమండలం అందుకొని ఆడవాళ్ళ మీదికి వంగుతున్నాడు. "ముందు మీ శరీరాలను శుభ్రపరచుకోండి. కళ్లనుంచి కామమును దూరం చేయండి అప్పుడు భగవంతుడు మీ ఆత్మలకు పవిత్రత ప్రసాదిస్తాడు" అంటున్నాడు. సాగిపోతున్నాడు. అలా వెళ్ళేప్పుడు స్త్రీ రక్షణ చేయాల్సివస్తూంది. వారి పైటలు దీపాలకు అంటుకోకుండా చూడాల్సివస్తూంది. అలా కొంత ఆలస్యం జరుగుతూంది.
"మా పాపాలు భూమికి భారం అయినాయి. అందుకే భగవంతుడు అదృశ్యుడు అయినాడు. మేం పాపులం.....పాపాలు చేశాం."
రత్తమ్మను తీసుకొని సాధువెటువెళ్ళాడు? చీకట్లో చాలా దూరం వరకు చూచాను. ఒకే కొట్లో కుక్కిన కైదీల్లా అనుమానాలు నా గుండెలో కూడుకుంటున్నాయి.
'దానివెంట ఎవరైనా వెళ్ళినా బాగుండేది.' అనుకుంటూంది రత్తమ్మ పిన్ని.
"హరిఃఓమ్......హరిఓమ్, శాంతి శాంతి." పడుచు సాధువు అనుమాన దృక్కుల్తో చూస్తూ నా దగ్గరికి విచ్చేశాడు. దూమపాత్ర నా ముఖం ముందుంచాడు.
"అమ్మా, మనసులో పాపం చేరనీయకు. ఇది దేవాలయం" అన్నాడు రత్తమ్మ పిన్నితో.
మేమిద్దరమూ అవమానంతో కుంగిపోయాం ఆ మాదక వాతావరణంలో నా వళ్లు జరజరలాడింది. చేసుకున్న పాపాల పశ్చాత్తాప తృష్ణ వెలికివచ్చింది. నా దేహం మాయం అయింది. పాపాలే కళ్ళకు కనిపిస్తున్నాయి. ఎదుట నిలిచిన సాధువు నన్ను పరిహసిస్తున్నాడు.
గంట గడిచింది. మేము మా హృదయాల్లోని పాపాలను దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
శివుని పటం ఎదుగుతూంది. నృత్య, తాళ స్థాయి పెరుగుతూంది. కింద శవాల రాసులు పెరుగుతున్నాయి. ప్రళయకాలం వచ్చినట్లుంది. శివుడు విలయాన్ని గురించి ప్రకటిస్తున్నట్లున్నాడు.
దూరం తరిమిన పాపాలు నామీద దాడి సాగించాయి. వివశుణ్ణయి చీకటి వైపు సాగిపోతున్నాను. నా వెనుక కొందరు స్త్రీలూ సాగారు. మేం అంధకారంలోకి అడుగువేయకముందే బైరాగి కనిపించాడు. రత్తమ్మను ఊడ్చుకొని వస్తున్నాడు.
రత్తమ్మ జుట్టు చెదిరింది. చీర అక్కడక్కడా చిరిగింది. ఆమె దేహం చెమటతో తడిసింది. నేను ఎర్రవారిన ఆమె చెంపను చూచాను. అక్కడ ఆ మచ్చలేదు. చెరిగిపోయింది.
"రాం.....రాం" బైరాగి రెండు చేతులూ ఎత్తి కళ్ళు మూసుకొని ఆకాశాన్ని చూస్తూ "ఈ దేవి చాలా మంకుది. భగవద్దర్శనం అయితే బెదిరిపోయింది" అన్నాడు. అన్నాడు అంతే, గుంపులోకి మాయం అయినాడు.
చేష్టలుడిగిన రత్తమ్మను చేతుల్లో పట్టుకున్నాను. ఈ మందిరంలో అడుగుపెడ్తే భగవంతునికి కోపం వస్తుందని నాకు తెలియలేదు. అప్పుడు ఈ గుళ్ళో అడుగుపెట్టే భాగ్యానికి మళ్ళీ నోచుకోనని అర్థంకాలేదు.
రత్తమ్మ పిన్ని భయంతో వణికిపోయింది. వనిత, రాజు రత్తమ్మ చీర సవరించారు. ముఖంమీదపడ్డ వెంట్రుకలు తొలగించారు.
'రత్తమ్మా....రత్తమ్మా' అని పిలిచారు.
"ఇహ నేను ఇంటికి రాను." రత్తమ్మ మెడ నా భుజంమీద కదులుతూంది.
"నాకు....మోక్షం....లభించింది."
మీరు మరిచిపోలేదు గదా, అది ఏరోజో గుర్తుందా? దుష్టత్వపు ప్రతిమకు అగ్గిపెట్టేరోజు.
* * * *
