Previous Page Next Page 
పావని పేజి 18


    సమస్యలు ఇంత తేలిగ్గా పరిష్కారం అవుతే ఎంత బావుండును! అవి కావు. మరికొన్ని సమస్యలను మోసుకొని వస్తాయి. కలహాలు రేగుతాయి. క్షక్షలు పెరుగుతాయి. శివయ్య బావి పూడబోయిస్తాడు కాని గూడేనికి దక్కనీడు. గూడెం జనం బావి కోసం పోట్లాడలేరు. వారు శివయ్య చేతిలో నలిగే చీమలు. చీమలు ఎకమాయిన్నాడు పాముని చంపగలవు. చీమలు ఏకం కావాలి కావాలి చీమలు. ఏకం ఇంకా కాలేదు ముందు కావాలి.
    పావని తల పట్టుకుని కూర్చుంది. ఆమె రక్తం వేడెక్కుతుంది. పొగలు సెగలు కక్కుతుంది. మెదడు వీదేక్కుతుంది. ఆలోచనలతో ఆవేశాన్ని జయించాలి.  అందుకు ఆమె మధన పడ్తుంది.
    'అమ్మా! మెరేట్లనో ఉన్నారు " -- ముత్యాలు భయం భయంగా అడిగింది.
    "ముత్యాలూ! మనకు నీళ్ళు కావాలి , మనం బట్టలు ఉతుక్కోవాలి, స్నానాలు చేయాలి, ఇదిగో సబ్బులు తెచ్చా" - తీసి చూపించింది పావని ఆవేశం కొంత తగ్గింది. ప్రసన్నంగా ఉండడానికి ప్రయత్నిస్తూ అన్నది.
    "సబ్బు తెచ్చిన్రా! మా కోసమా? మా కోసమా?" అందరూ ఒకేసారి ఆశ్చర్యంగా అడిగారు.
    "అవును సబ్బు తెచ్చాను మీ కోసమే స్నానాలు చేయాలి బట్టలు ఉతకాలి"
    'అయితే ఏటికి పోదాం" - ముత్యాలు గుండె గంతులు వేస్తున్నట్లు అన్నది.
    పావనికి ఏటి విషయం తోచనే లేదు.
    "ముత్యాలూ! ఎంత మంచి దానివి నాకు ఏటి విషయం తోచనే లేదు. పదండి, ఏటికి పోదాం" అన్నది, ఏదో అత్యంత జటిలం అయిన సమస్యకు పరిష్కారం లభించినట్లు.
    "పదండి ఏటికి -- పోదాం - పోదాం" అన్నారు పిల్లలంతా.
    పిల్లలను తీసుకొని పావని ఏటికి బయలుదేరింది. పిల్లల కోడిలా ఉంది పావని. ఆమె వెంట పిల్లలు తల్లి వెంటలా సాగిపోతున్నారు. ఆమె వారికి కధలు చెబుతుంది కబుర్లు చెబుతుంది. పిల్లలంతా ఉత్సాహంగా సాగిపోతున్నారు. చాలు, ఈ పిల్లల్లో బాల సహజం అయిన ఉత్సాహం అంకురించింది. వీరు కొడిగట్టిన దీపాల్లా లేరు. అప్పుడే అంటుకుని వెలగబోతున్న దీపాల్లా ఉన్నారు.
    ఆ ఊరు చీకటి గ్రామం . ఊరికి మూడు వైపులా కొండలున్నాయి. అవి బోడిగుట్టలు కావు. చెట్టూ చేమా పెరిగిన కొండలు పచ్చగా ప్రకృతి రమణీయకంగా ఉంటాయి. కొండల మీద గువ్వల చప్పుళ్ళు, చిలకల అరుపులు , కోకిలల గానాలు రమ్యంగా ఉంటాయి. కొండల్లో ఎలుగుబంట్లు, అడవి పందుల్లాంటి జంతువులూ ఉంటాయి. కాని, క్రూరమృగాలు లేవు. క్రూరమృగం ఊళ్ళో ఉంది. అది మనిషి నెత్తురు మరిగింది.
    ఊరికి నాలుగో వైపు మంచినీరు ఏరు పారుతుంది. అది జీవనది కాదు అయినా ఎండాకాలంలో ఒక పాయ పారుతుంతుంది. అయితే, ఇది ఊరికి దూరంగా ఉంది. ఏటినీరు వాడుకునేవారు తక్కువ. ఈ ఊరికి చేరుకోవాలంటే ఏరు దాటాలి. అందుకే ఈ ఊరికె రహదారులు లేవు. రహదారులు లేకుండా ఉండాలని శివయ్య సంకల్పాన. రహదారి వేస్తె బస్సులోస్తాయి. బస్సులు నాగరికత మోసుకు వస్తాయి. తెలివి తేటలు తెస్తాయి. అవి వస్తే తన పని సున్నా అతడు నాగరికతకు అడ్డు కట్ట కట్టాడు. విజ్ఞానానికి అడ్డుగోడ నిర్మించాడు.
    దేశానికి స్వాతంత్యం వచ్చిందనే విషయం ఆ ఊళ్ళో చాలా మందికి తెలియదు. అక్కడ బస్సును చూడని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడికి పోస్టు రాదు. కరెంటు లేదు. ఇంకా వేదకాలపు సనాతన నాగరికతను పట్టుకుని పాకులాడుతుంది ఆ ఊరు. అలాంటి ఊరు ఉంటుందా అని ఆశ్చర్యపడవచ్చు కొందరు కాని అలాంటి ఊళ్ళే అనేకం వున్నాయి. ఈ భారతదేశంలో. భారతీయ తత్వశాస్త్రాన్ని గురించి బాకాలు ఊదేవారికి ఈ బడుగు గ్రామాలు తెలియవు. వారికి పుష్పకం తెలుసు. ఆనాడే విమానాలున్నాయని వీపు చరచుకుంటారు. వారికీ అప్పు తీర్చడానికి ఆలిని అమ్ముకున్న హరిశ్చంద్రుడు కనిపించాడు. కూటికి లేక కొడుకును బలి ఇవ్వడానికి అమ్ముకున్న రుచీకుడు కనిపించాడు,
    ఆ ఊళ్ళో పొలాలున్నాయి. పొలాలకు పారడానికి చెరువు ఉంది కాని హరిజనులు చెరువును తాకరాదు నీరు మైల పడ్తుంది. ఆ ఊళ్ళో కొన్ని ఇళ్ళలొ బావులున్నాయి. ఒక ఊరి బావి కూడా ఉంది. ఊరి బావి ఉమ్మడి బావి గూడెం ఊళ్ళో భాగం కాదు. అందుకోసం దాన్ని అంటరాదు. ఊరికి ఒక పక్కన ఏరుంది ఏటి నీళ్ళు "మైల" పడవు. పారే నీటికి పవిత్రత ఉంది. ఏటి నీటిని వాడుకో రాదని ఎవరూ అనలేదు. ఎంచేతనంటే , అది వారికీ అందుబాటులో లేదు. ఏటి నీటికి అంటులేదు అందుకే పావని అక్కడికి బయలుదేరింది.
    ఏటి గట్టున చెట్లున్నాయి .చెట్లు గుబురుగా ఉన్నాయి. పచ్చగా ఉన్నాయి. పరువంలో ఉన్నాయి చెట్ల మీద పిట్టలు రకరకాల అరుపులు అరుస్తున్నాయి. ఏరు ఎండిపోయింది. ఇసుక బయట పడింది. ఇసుక మీద చెట్ల బాపతు పూలు రాలి ఉన్నాయి.
    పావని, పిల్లలు గట్లు దాటారు. చెట్లు దాటారు. ఇసుక మీదికి వచ్చారు. ఇసుక మీది పూలు చూచి వారిలో అనందం పురి విప్పింది. పూలు ఏరారు. బొడ్డు మల్లెపూవు కాడ తెంపి బూరలా ఊదారు పిల్లలు పసితనపు చేష్టలతో పరుగులు తీస్తున్నారు. వారిని పట్టడం పావనికి కష్టం అయింది. ఊరికే వారి వెంట ఉరికింది. నవ్వేవారితో నవ్వింది. అందరినీ ఒకచోట కూర్చోబెట్టింది. తెల్లని ఇసుక, చిక్కని చల్లని నీడ, ఎంతో అనందం అనిపించింది. జీవితంలో ఒక కొత్త వసంతం చేరినట్లుంది. కొంతసేపు వారికి కాకి కధలు చెప్పింది.
    అక్కడునుంచి వారు నీళ్ళ వైపు సాగారు. ఒకే నీటిపాయ ఏటి మధ్య నుంచి పారుతుంది. అది పాములా వంకర్లు తిరిగి పోతుంది. నంగనాచిలా పారుతుంది ఏరు. నీరు చూడగానే ఉవ్వెత్తుగ పరిగెత్తారు పిల్లలు. నీళ్ళలో గెంతారు. నీళ్ళు తాగారు. ఒకరి మీద ఒకరు ఊసుకున్నారు. పోట్లాడుకున్నారు. కుస్తీ పట్లు పట్టుకున్నారు. పావనికి వాళ్ళని వారించడం కష్టం అయిపొయింది.
    పావని అందరినీ ఒకచోట చేర్చింది. బట్టలు విడిపించింది. అంతా దిస మొలతో ఉన్నారు. దిగంబరంగా ఉన్నారు. వారి బట్టలు తడిపించింది. బండ మీదకి తెచ్చింది. బట్టలకు సబ్బు రాస్తుంటే నురగ వస్తుంది. అది పిల్లలకు ఆశ్చర్యంగా ఉంది. నురగతో ఆడుకుంటున్నారు. నురగ ముఖాలకు రుద్దుకున్నారు. నురగ ఒకరి మీద ఒకరు విసరుకున్నారు బట్టలు శుబ్రంగా అయినాయి. పిండి అరెసుకున్నారు. తెల్లని ఇసుక మీద రంగురంగుల బట్టలు -- అనేక దేశాల పతాకాల్లా రెపరెపలాడుతున్నాయి.
    పిల్లలు స్నానాలకి నదిలోకి వెళ్ళారు. వారందరికీ సబ్బు రాసింది. ఎన్నాళ్ళ మురికో! మురికి చేరడం తేలిక వదిలించడం కష్టం పిల్లలందరికీ స్నానాలు చేయించింది. వారంతా తడిసిన ముత్యాల్లా ఉన్నారు. ఇసుక మీద ఎండలో నుంచున్నారు. తడి శరీరాలు ఎండకు మెరిసిపోతున్నాయి. వాళ్ళ వళ్ళు తుడవడానికి తువాళ్ళు లేవు.
    పావని తనను చూచుకుంది. చీర సాంతం తడిసి పోయింది. తను అలసి పోయింది. ముఖం నిండా చెమట పట్టింది. ఉప్పు పేరింది. స్నానం చేస్తే బావుండును అనిపించింది కాని, తనకు బట్టల్లేవు ఎలా స్నానం చేస్తుంది? పిల్లల బట్టలు అరాలి అరెదాకా పిల్లలు ఇసుక మీదనే ఉంటారు. వాళ్ళు గుజ్జనగూళ్ళు కట్టుకుంటున్నారు. కట్టిన గూళ్ళు కూల్చుకుంటున్నారు.
    పావని చీరె విప్పింది. పరికిణి, బ్లౌజుతో నీళ్ళల్లోకి దిగింది. బండ మీద చీర ఉతికింది. ఇసుకలోకి వచ్చింది. ఇసుక మీద చీర ఆరేసింది. చీర మీద ఇసుక చల్లింది. గాలికి లేవకుండా.
    పావని చుట్టూ చూసింది. నరసంచారం లేదు. నిర్జనంగా ఉంది ప్రదేశం. ఏరు దాటే రేవు చాలా దూరంగా ఉంది. అటు ఎవరూ రారని నిశ్చయించుకుంది . కాస్త దూరం నడిచింది. ఎత్తుగా ఒక బండ కనిపించింది. ఏటిపాయ బండను అనుకోని ఒదిగి పారుతుంది. పాయకు అడ్డం కొన్ని రాళ్ళున్నాయి. అక్కడ కాస్త లోతుగా ఉంది. అడ్డుకున్న రాతి మీంచి పడుతున్న నీరు పిల్ల జలపాతంలా ఉంది. రొద పెడ్తూ సుళ్ళు తిరుగుతూ సాగిపోతున్న నీరు కొంత దవ్వువెళ్ళి ప్రశాంతంగా సాగిపోతుంది.
    పావని ప్రవాహపు వయ్యారాన్ని చూస్తూ కూచుంది. ప్రవాహానికి, జీవితానికి దగ్గిర సామ్యం ఉంది. రెండూ అడ్డు లేనంత కాలం ప్రశాంతంగా ప్రవహిస్తాయి. అడ్డు తగిలితే జలపాతాలు సృష్టిస్తాయి!
    వాతావరణం అందంగా ఉంది. పచ్చని చెట్లు, ఎర్రని పూలు, పిట్టల కిచకిచలు  ఏటి గలగలలు , నల్లని రాళ్ళు, తెల్లని ఇసుక చిత్రకారుని తూలికతో గీసిన చిత్రంలా ఉంది.
    పావని పరవశించింది. జాకేట్టూ విప్పింది. నీళ్ళలో దూకింది. నీళ్ళలో కూచుని చేతులు చాచి, కాళ్ళు ఆడించి , స్నానం చేసింది. అలా చాలాసేపు కూర్చుంది. ఆమెకు ఆనందంగా ఉంది, ఆహ్లాదంగా ఉంది, తన్మయంగా ఉంది. పొద్దు వాలుతుండడం సహితం గమనించలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS