Previous Page Next Page 
బ్రహ్మ ప్రళయం పేజి 18

"సర్...నేను ఒక పెద్ద అపరాధం చేశాను" అంది నిజాయితీ పలికిస్తూ.
"వాట్...వాటీజ్ దట్..." అన్నాడు సర్వాధికారి అనునయంగా.
"సర్! మీరు చెప్పినట్లే ఆ సాహస్ ని పట్టుకున్నాను. కానీ...కానీ...అతను పారిపోయాడు సర్!"
ఒక్కక్షణం మౌనం -
ఆ తర్వాత అన్నాడు సర్వాధికారి "నీ తప్పేం లేదు. నీ తెలివి ఉపయోగించి నువ్వు పట్టుకున్నావ్... అతని తెలివి ఉపయోగించి అతను పారిపోయాడు. ఇటీజ్ ఆల్ ఇన్ ద గేంమ్!"
"సర్...చివరి క్షణంలో అతన్ని మళ్ళీ చూశాను. ఒక సోల్జర్ అతన్ని షూట్ చెయ్యబోయాడు. కానీ...నేను...నేను కూడా అతన్ని షూట్ చెయ్యబోయి, సోల్జర్ నే కాల్చాను..సర్!"
అని, తన రివాల్వర్, బాడ్జీ తీసి సర్వాధికారి ముందు పెట్టింది ప్రగతి. "సర్! నేను ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా వున్నాను."
పెద్దగా నవ్వాడు సర్వాధికారి. "ఇంత నిజాయితీ చూపిస్తున్నందుకు శిక్షకాదు. రివార్డు ఇవ్వాలి! ఏం రివార్డు ఇవ్వాలో నేను ఆలోచిస్తాను. నౌ యు కెన్ గో!"
మళ్ళీ సెల్యూట్ చేసి వెళ్ళిపోయింది ప్రగతి.
గుమ్మం దాకా వచ్చి ఆమె వెళ్ళినవైపే చూస్తూ వుండిపోయాడు సర్వాధికారి.
ఎంత అందమైన అమ్మాయి!
కానీ ...
అతని మొహంలో భావం మారింది. తన ఎయిడ్-డీ-క్యాంపుకి సైగ చేశాడు.
అతను దగ్గరగా వచ్చి "సర్?" అన్నాడు వినయంగా.
"ఈ పిల్ల చాలా కిలాడీ! ఆ సాహస్ ని పట్టుకున్నట్లే పట్టుకుని తనే వదిలేసింది. అయినా మనం బయటపడకూడదు. ఈ పిల్లతో వాడు తప్పకుండా కాంటాక్ట్ లో వుంటాడు. దీన్ని అబ్జర్వ్ చేస్తుంటే వాడు దొరక్క తప్పదు. ఈ పిల్లా దీని తండ్రి గంభీర్ కూడా ఖతర్నాక్ మనుషులు. అందుకే వీళ్ళు నా దృష్టిలో వుండేటట్లు మంచి పదవులు ఇచ్చి దగ్గరే వుంచుకున్నా!" అన్నాడు.
"సర్!"
"పైగా, ఇది అందమైన ఆడది! అందమైన ఆడపిల్లలని అనవసరంగా డిస్ట్రాయ్ చేసెయ్యడం నా పాలసీ కాదు" అన్నాడు సర్వాధికారి.
"సర్!" అన్నాడు ఎయిడ్ డీ కాంప్ అర్ధవంతంగా.
"ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ పులికీ, ఈ సివంగికీ హార్మ్ జరక్కూడదు. జాగ్రత్త!"
"యస్సర్!" అని వెళ్ళిపోయాడు ఎయిడ్ డీ క్యాంప్.
జరుగుతున్నదంతా ఓరకంట గమనిస్తూనే వుంది చతుర - సర్వాధికారి భార్య. ఆమె సార్థక నామధేయురాలు.
తన లేడీ సెక్రెటరీని సైగచేసి దగ్గరికి పిలిచింది.
"మేడమ్?" అంది లేడీ సెక్రటరీ వినయంగా.
"ఫీల్డ్ మార్షల్ గారు ఆ పిల్ల మోజులో పడ్డట్లు వున్నాడు. వీలయినంత త్వరలో... ఆ అమ్మాయిని ఫినిష్ చేయించు!"
"యస్ మేడమ్!" అంది లేడీ సెక్రటరీ.
ఫీల్డ్ మార్షల్ సర్వాధికారి సెక్రటరీ మిలిటరీని, పోలీసునీ అలర్ట్ చేశాడు.
"సాహస్ అండ్ అంకుష్... వాళ్ళ వివరాలు ఫలానా... వాళ్ళు ఎక్కడ దొరికినా పట్టేసుకోవాలి! డెడ్ ఆర్ అలైవ్... బెటర్ అలైవ్... క్విక్"
దేశంలో మార్షల్ లా అయితే పెట్టేశారుగానీ, అది అమలు చెయ్యడం అంత సులభమైన పనేమీ కాదు. అక్కడక్కడా అవక తవకలు జరిగిపోతూనే వున్నాయి.
ప్రభుత్వ వాహనాలూ, మిలిటరీ, పోలీసు వాహనాలూ తప్ప వేరే వాహనాలేవీ రోడ్లమీద తిరగకూడదని మిలిటరీ వారి ఆజ్ఞ! పబ్లిక్ ట్రాన్స్ పోర్టు బస్సులు కూడా ఈ కేటగిరీ కిందికే వస్తాయి.
అయినా కూడా ఒక బస్సు డిపోకి ఆర్డర్సు అందలేదు. అక్కడ నుంచి బస్సులు బయల్దేరి వెళ్ళాయి. వాటిలో శ్రీశైలం బస్సు ఒకటి. దార్లో ఆ బస్సులోనే ఎక్కేశారు సాహస్, అంకుష్.
కొన్ని బస్సులు బయల్దేరిన సంగతి మిలిటరీ అధికారులకి తెలిసింది. హుటాహుటిన మిలిటరీ జీపులు ఆ బస్సులని వెదుకుతూ బయలుదేరాయి. ఈ విషయం గురించి వైర్ లెస్ లో మెసేజ్ అందుకున్న ఒక కానిస్టేబుల్ కి, ఊరి శివార్లోకి వస్తున్న శ్రీశైలం బస్సు కనబడింది. పెద్దగా విజిలేసి ఆపాడు.
"ఏమిటి?" అన్నాడు బస్సు డ్రైవరు.
"దార్లో ఒక పెద్దవాడూ, పిల్లాడు ఎక్కారా?"
"ఎక్కారు" అన్నాడు డ్రైవరు.
పోలీసు కళ్ళు ఆనందంతో విప్పారాయి. ఛెంగున బస్సులోకి గెంతాడు.
"ఏరీ?"
"మళ్ళీ దిగిపోయారు" అన్నాడు డ్రైవరు.
"ఏమిటీ?"
"వాళ్ళు వెళ్ళాల్సింది శ్రీశైలం కాదుట. అండమాన్స్ కిట"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS