Previous Page Next Page 
జోగబాల పేజి 18


    "ఒక్కొక్క యింటిలో ఇద్దరు ముగ్గురు జోగినులు కూడా వుంటూ వుంటారా?"


    "తల్లీ, కూతురు, మనమరాలూ_అలా తరతరాలుగా జోగినులుగా ఉన్నవారున్నారు. ఒకే యింటిలో అక్కా, చెల్లెలూ ఇద్దరూ జోగినులుగా ఉన్నవారున్నారు. మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుకునేవారికి, పాసయి ఉద్యోగాలు చేసుకునే వారికి తల్లులుగా, అక్కా చెల్లెళ్ళుగా ఉండి జోగినులుగా ఉన్నవారున్నారు."


    వాళ్ళసలు జోగినులుగా మారడానికి ముఖ్య కారణమేమిటి?"


    "కరడు గట్టుకుపోయిన పెత్తందార్ల కామదాహం. ఈ వ్యవస్థ కొంత'మందిని దేవదాసీలుగా తయారు చేసినట్లే కొంతమందిని జోగినులుగా తయారుచేసి వాళ్ళని చీల్చి చెండాడుతూ జుర్రుకుంటూ పురుషాహంకారంతో విలయతాండవం చేస్తూ చిరకాలంగా వాళ్ళను అజ్ఞానాంధకారంలో ఉంచి అందులోనుంచి బైటపడనివ్వడంలేదు. జోగిని దగ్గరకు ఆమెతో గడపడానికి వెళ్ళినవాడు తనమీదికి ఏమచ్చా, ఎవరి గుసగుసలు రాకుండా, లేకుండా ఒక కాఫీ హోటలుకు వెళ్ళినట్టు, మార్కెటుకు వెళ్ళినట్టు, ఒక రకంగా చెప్పాలంటే గుడికి వెళ్ళినట్లు వాళ్ళ దగ్గరకు వెళ్ళిరావడం అతి సామాన్యమైన విషయమైనట్లు వ్యవస్థలో ఒక సేఫ్టీతో కూడిన భాగంగా రూపొందించారు ఈ పురుషులు." మయూరంగారి గొంతులో ఆవేదన ధ్వనిస్తోంది.


    "ఒక స్త్రీ జోగినిగా ఎలా మారబడుతుంది?"


    మయూరంగారు నవ్వారు. ఆ నవ్వులో బాధా, విషాదం మిళితమై ఉన్నాయి.


    "ఊళ్ళో కరవు కాటకాలు వచ్చినప్పుడూ, వరదలొచ్చి ఊళ్ళన్నీ నాశనమైనప్పుడు కలరా, ఇంకా మనుషుల్ని పీల్చి పిప్పిచేసే వైరల్ జ్వరాలూ, మెదడువాపు జబ్బులూ వ్యాపించినప్పుడూ, ఎల్లమ్మదేవతనో, ఇంకో దేవతనో శాంతింప జెయ్యడం కోసం ఓ జోగిని తయారుచెయ్యబడుతూ ఉంటుంది. గ్రామంలో ఎవరికో పూనకమొస్తుంది. ఫలానా యువతిని జోగినిని చెయ్యమని ఎల్లమ్మదేవత శాసిస్తుంది. ఆ శాసనాన్ని అక్షరాలా అమలు పరచవలసిందే. కొన్ని కుటుంబాల్లో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత పరిస్థితుల్నిబట్టి పాప పుట్టినప్పుడే 'ఈ బిడ్డను జోగినిగా చేస్తా' అని ఎల్లమ్మ దేవతకు మొక్కు కుంటారు. ఆ పాపకు యుక్తవయసు రాగానే..." అంటుండగా ఓ పదమూడు, పధ్నాలుగేళ్ళ అమ్మాయి లోపలికి వచ్చింది. పరికిణీ, గౌనూ వేసుకుంది. లేతగా, అమాయకంగా వికసించబోయే మొగ్గలా ఉంది.


    "వర్ష ఉందా మామయ్యా?" అనడిగింది.


    "లోపల ఉంది వెళ్ళమ్మా" అన్నాడు మయూరం.


    ఆ అమ్మాయి ఎంతో చనువున్నట్లు లోపలికి వెళ్ళి పోయింది.


    "ఇదిగో ఈ పిల్ల పేరు రాజీ. వరుసగా పిల్లలు పుట్టి చచ్చిపోతూంటే ఈ పాప పుట్టగానే నీకు దీన్ని జోగిచేస్తాం అని మొక్కుకున్నారు తల్లిదండ్రులు. రేపోమాపో రజస్వల కాగానే..." ఆయన గొంతు గద్గదికమై వణికింది.


    శ్రీహర్ష గుండె కళుక్కుమన్నట్లయింది.


    "ఇలాంటి వాతావరణంలో యెందుకుంటున్నారు? అనడిగాడు ఒక క్షణం నిశ్శబ్దంగా గడిచాక.


    "ఇక్కడ పుట్టిపెరిగాను ఎక్కడికి పోతాను? నాకున్న పొలం అంతా ఇక్కడే వుంది. అదే నా జీవనాధారం. పోనీ అమ్ముకుని వేరే చోటికి వెళ్ళిపోదామా అంటే మా పెద్దవాళ్ళ అజ్ఞానం వల్ల డాక్యుమెంట్లూ అవీ పర్ ఫెక్ట్ గా లేవు. కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు."


    "పోనీ ఇక్కడేవుండి ఈ దురాచారాన్ని రూపుమాపడానికి ప్రయత్నించవచ్చుగా."


    "ఈ దురాచారం ఈ ఒక్క ఊళ్లోనేలేదుగా శ్రీహర్షగారూ. మన రాష్ట్రంలో ఎన్నో చోట్ల కర్ణాకటలో, మహారాష్ట్రలో తీవ్రంగా వ్యాపించి ఉంది. ఊడలతో సహా పాతుకుపోయి ఉన్న ఈ దురాచారాన్ని చూసి బాధపడడం కన్నా ఒక్కణ్ణి ఏమి మార్పు తీసుకురాగలను?"


    "మీరు ఒక్కరే పోరాడనవసరం లేదు. మీకు సాయంగా నేనుంటాను" అన్నాడు శ్రీహర్ష ఆవేశంగా.


    మయూరంగారు నవ్వారు. నిస్సహాయత, ఆవేదన, తపన మిళితమై ఉన్నాయి ఆ నవ్వులో.


    ఆయన వ్యక్తిత్వాన్ని శ్రీహర్ష అర్థం చేసుకున్నాడు. క్రమంగా ఆయనకు ఇంకా ఇంకా దగ్గరవ్వాలనుకున్నాడు.


    "ఇహ వస్తాను" అంటూ లేచాడు.


    "వర్షా?" అని పిలిచారు మయూరంగారు. వర్ష బయటికి వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS