Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 17


    తరువాత అతని భార్య పిడకలు చేస్తుంది. ఆవుపాలు అమ్ముతూంది. రత్తమ్మ కూలినాలికి పోతుంది. ఆ కష్టం, ఆ కులం తక్కువదనం ఆమె పెదవుల మీంచి చిరునవ్వు చెరిపివేశారు. ఆమె ముఖంలో ముకుళించిన మొగ్గలు వణుకుతుంటాయి. అవి పేదతనపు ఎండకు, జనుల కొంచెపు చూపు తుపానులకు వికసించవు.
    రత్తమ్మ దుఃఖపూరిత విశాల నేత్రాల్లో నాకు ఆమె తండ్రి శవం కనిపిస్తుంది.
    "రత్తమ్మా! ఇవ్వాళ జాతరకు కూడా వెళ్లవా?" వనితాలక్ష్మి విచారంగా అడిగింది. కాని ఆమె జవాబు వినిపించలేదు. బహుశా తల ఆడించి చెప్పి ఉంటుంది.
    "అయితే వరాలు అడగటానికి సాధువుల దగ్గరికీ వెళ్లవా?" రాజ్యలక్ష్మి బెదిరినట్లు అడిగింది. నేను గోడకు చెవిపెట్టాను.
    "రాజూ, ఇవ్వాళ నా కోరిక ఒక్కటే-ఎక్కడైనా ఒక రూపాయి దొరకాలి." ఆమె ధ్వని బావిలో నుంచి మాట్లాడినట్లున్నది.
    కాని రాజ్యలక్ష్మి, వనిత ఆమెను వదలలేదు. ఏవేవో గుసగుసలు చెప్పారు. ముచ్చట్లు చెప్పారు. ఆమెను మురిపించారు. ఆమె ఒకసారి నవ్వినట్లూ ఉంది.
    నేను వణికే చేతులతో అమ్మ పెట్టె తెరిచాను. ఒక రూపాయి నోటు తీశాను. గడపమీద పెట్టాను. నా గుండె దడదడలాడుతుంది. గడప మీది రూపాయి రత్తమ్మ అందుకోకుంటే జీవితాంతం రత్తమ్మను పొందలేననుకున్నాను. నేను తొలిసారి హనుమంతుని పటానికి మొక్కాను. రెండు ప్రేమించుకునే హృదయాల నడుమ ఉన్న లంకను ముంచేయమని ప్రార్ధించాను.
    "చిన్నమ్మా! ఏదన్నా పని చెప్పండి చేస్తా" అని పొయ్యి దగ్గర కూర్చున్న అమ్మ దగ్గరికి వెళ్ళింది రత్తమ్మ.
    "మీ అమ్మకు జబ్బుగా ఉంది. ఆమె దగ్గరికి వెళ్లు. ఈ పనికేంలే....... మా అమ్మ పండుగనాడు ఇలాంటి వాళ్ళను చేరనివ్వడు.
    దానమే ఇవ్వాలనుకుంటే గుడిదగ్గర కూడిన సాధువులకివ్వు. ఇలా చప్పుడు కాకుండా ఇస్తే దేవుడైనా చూడడు.
    "ఆగు." ఆమెను గడపమీద ఆపాను. "వెళ్ళేప్పుడు తలుపు వేసుకుంటూ వెళ్లు" అన్నాను.
    అప్పుడు నాకు పరీక్షలో పాసైన విద్యార్ధిలా సంతోషం కలిగింది-పొంగిపోయాను.
    జాతర నుంచి తిరిగివచ్చేప్పుడు బాగా అలిసిపోయాం. జాతరలో పాత సంబరాల్లేవు. నేను గాడిద బరువు మోస్తున్నాను. గాజులు, దువ్వెనలు, చెక్క బొమ్మలు, జల్లెళ్లు, కుండలు, అవికాక చాటుగా నేనొక ముత్యాల హారం కొన్నాను. అది గుండె దగ్గరున్న నా జేబులో ఉంది. ఎవరైనా నావైపు సంజ్ఞ చేస్తే అదరిపోతున్నాను. కాళ్ళకెవరో రాళ్లు కట్టినట్లున్నారు. గుంపు తోపిడిలో ఎన్నోసార్లు రత్తమ్మ ఇల్లు చేరాను కాని, ఆమె మాల ధరించలేదు. "మా నాన్న శవం చూడు.... మా నాన్న శవం చూడు....." అన్నది.
    "తొలగించండి. ఏమిటిది ఇంకా ఎందుకు తగలపెట్టరు?" నేను కేకలేస్తున్నాను.
    "ఈ ఊరి వాళ్ళకు ఇష్టంలేదు." ఆమె భయకంపిత స్వరంతో అంటుంది. మళ్ళీ జాతరకు తిరిగివస్తుంది. ఒక్కోసారి వనితకు మట్టిబొమ్మలు బేరమాడుతున్నాను. మరోసారి రాజా అదృష్టం పరీక్షించడానికి లాటరీ వేస్తున్నా.
    "రత్తమ్మా....రత్తమ్మా......" రాజ్యలక్ష్మి కేకవిని అదిరిపడ్డాను. వాస్తవంగానే రత్తమ్మ మా దగ్గరికి వస్తూంది. వెంట వాళ్ళ పిన్ని ఉంది. దండం పెట్టింది. ఊర్లోంచి వెళ్ళగొట్టిన దుఃఖం సాంతం రత్తమ్మ ముఖంలో కూడింది. ఇప్పటికీ ఆమె ఆ బట్టలే కట్టింది. కుడి చెంపకు ఏదో అంటింది. నల్లని మచ్చలా వుంది. పొయ్యి దగ్గర్నుంచి వచ్చినట్లుంది. ఆ మచ్చ అసహ్యంగా ఉంది. నాకెందుకో చిరాకనిపించింది. ఆ మచ్చను ఎవరూ చెరపరేం? వనిత రత్తమ్మ దగ్గరికి చేరింది.
    "బట్టలు మార్చుకొని రాకపోయావా?"
    "జాతరలో ఏమేమి చూశావు?"
    "చూడు నేను ఏమేమి కొన్నానో?" ఆమెను చూచి పిల్లలు ఆనందం పట్టలేనంతగా ఉంది.
    రత్తమ్మ తన స్నేహితురాండ్ర మెరిసే చీరలు చూచింది. జాతరలో కొన్న వస్తువులు చూచింది. తరవాత ఆమె దృష్టి నా ప్యాంటు మీద పడింది. ఆమె కనుల్లో అనాధ బాలల ధీనత్వం గోచరించింది.
    ఆమె నా కనుచూపు చూడడం ఇది రెండోసారి. నా మనసు చిచ్చుబుడ్డిలా ఎగిసిపోతూంది.
    'వినండి వినండి', అని చేయిచాచి బుర్రకథ వాళ్లలా అందరినీ పిలవాలనుకుంటాను. ఆ తదుపరి వినేవాళ్ళు విన్నారు, అనేవాళ్లు అన్నారు. ఏమని? దేవి రెండోసారి ఈ పురుషుని ముఖం చూసిందని. అంతేకాదు, చిరునవ్వు నవ్విందని. అంతేకాదు, ఆ పురుషుని ముందు స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయని, ఇంకా ఏమయిందయ్యా అంటే ఆకాశవాణి పలికింది......ఆకాశవాణి.
    నా చేయి మాటి మాటికి హారమున్న జేబులోకి పోతూంది. నేను ఏ ఆకాశాల్లో విహరించానో తెలియదు. వనిత నా చేయిపట్టి లాగింది.
    "కాస్త మళ్లీ గుడిదాకా వెళ్దాంపా. రత్తమ్మ వెళ్ళాలంటూంది."
    బావుందనుకున్నాను. ఇదీ మంచికే. మేమిద్దరం ఒకేసారి సాధువులను వరాలు కోరదాం. ఈ రోజు ఎలాంటిది? పవిత్ర హృదయాల నడుమ నడయాడే రావణున్ని తగలపెట్టేది.
    గుళ్ళో మళ్ళీ అవే బేరాలు.
    మెట్లమీద ఉన్న సాధువులు తమకు తగిలిన గాయాల ప్రదర్శనం ఏర్పాటుచేసి అణా వసూలుచేశారు.
    'ఇక్కడ నుంచొని దేవికి నమస్కరించండి' అని చెప్పి మరో సాధువు ఇంకో అణా వసూలు చేశాడు.
    'ఇది విష్ణుస్థానం. ఇక్కడ్నుంచే అతడు వరాలు కురిపిస్తాడు.'
    వనిత, రాజా గబగబా నాలుగేసి అణాలు మట్టిముంతలో వేశారు. రత్తమ్మ వెనక నుంచుంది కాని నేను ముందడుగు వేశాను. మా ఇద్దరికీ చెరి పావలా పుణ్యం కొన్నాను.
    మరో సాధువు మాకు బాట చూపడానికి వచ్చాడు. "ఇదిగో ఇలా రండి, ఇదిగో శివుడు, మీ ఇష్టం వచ్చిన పాపాలు శమింప చేసుకోండి. ఇష్టం వచ్చిన వరాలు కోరుకోండి." అతని ఉదార హృదయాన్ని చూస్తుంటే రైతులకు ఉచితంగా భూములు పంచిపెడ్తావని ప్రకటించే ఆచార్య వినోబాభావే గుర్తుకు వస్తున్నారు.
    ఎదుట విలయతాండవం చేస్తున్న శివస్వామి పటం ఉంది. శివుడు శవాల మీద నృత్యం చేస్తున్నాడు. శివుడు ప్రళయదేవత, ప్రళయం తరవాత అతడే ఉంటాడు. మరేమీ మిగలదు.
    దిగువన సాధువు కళ్లు మూసుకున్నాడు. ఏదో జపిస్తున్నాడు, అనేక సాంబ్రాణి పాత్రల్లోంచి సుగంధ ధూపం చుట్టుకుంటూంది. ప్రాణాలు కూడా ఆవిరిగా మారిపోతున్నట్లుంది. శరీరం సెగలు పొగలయి ఆత్మ నుంచి విడిపోతూంది. నిరాకారుడైన భగవచ్చక్తి సర్వత్రా వ్యాపిస్తున్నట్లుంది. మాకు నిద్రలో ఉన్నట్లుంది. ఏదో కలగంటున్నట్లుంది.
    ఇక్కడి ఫీజు రూపాయి. వనిత, రాజు ముందడుగు వేయడానికి జంకారు కాని రత్తమ్మ సాధువుల మాట పూర్తిగా వినకుండానే ముందడుగు వేసింది. పెళ్లికాని తల్లి తన బిడ్డను పారేసినట్లు, రత్తమ్మ అదే రూపాయని అక్కడ పడేసింది.
    "నన్ను క్షమించండి. నేను దొంగతనం చేశాను.... దొంగ........." రత్తమ్మ గునుస్తూంది.
    నాకు తొలిసారి రత్తమ్మ మీద కోపం వచ్చింది. ఆమెను పక్కకు లాగి నేనే ఈ రూపాయి ఇచ్చానని అందామనిపించింది. కాని నాకన్నా ముందే ఒక పొడుగుపాటి సాధువు ముందడుగువేశాడు. అతడు రత్తమ్మను తీక్షణంగా చూశాడు. మెడపట్టి దగ్గరికి లాక్కున్నాడు. "నువ్వు మహా పాపం చేశావు. పాప పరిహారం కోసం వచ్చావు" అన్నాడు. అతని చూపులు రత్తమ్మ శరీరాన్ని చీల్చి ఆత్మకోసం అన్వేషిస్తున్నట్లున్నాడు.
    'అయితే ఇటురా, మోక్షం ఇక్కడ లభించదు.'


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS