Previous Page Next Page 
పావని పేజి 17


    "ముత్యాలూ ! ఈ చొక్కా నీకేనమ్మా! నువ్వే ఉంచుకో ఇంకా వస్తాయి ఇస్తా"
    'అమ్మా! నేనిసువంటి అంగి ఎప్పుడు తొడుక్కోలే, శాన బాగున్నది నేను ఉంచుకుంటా" -- చొక్కాను ఎవరయినా లాక్కుపోతారేమో నన్నంత గట్టిగా పట్టుకుంది ఒక పాప.
    ఈ పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారంటే వీళ్ళ తల్లిదండ్రులకు బోలెడు నష్టం వీళ్ళు ఇంటి దగ్గర ఉంటె పిల్లలను పట్టుకుంటారు. కట్టే, కంపా ఏరుకువస్తారు ఒక్కొక్కసారి కూలికి పోయి, సోలెడు గింజలూ తెస్తారు అర్దికంతో ముడివడిలేని సమస్య కనిపించలేదు. పావనికి ఈ విషయం పాలకులకు ఎందుకు అర్ధం కాదో తెలియలేదు. వాస్తవంగా ప్రభుత్వం ఈ పిల్లలకని కొంత డబ్బు ఇస్తుంది. ఇంత కాలంగా అది వారికి అందలేదు. వీరి పేర్లు రాసి అదీ శివయ్యే కాజేశాడు.
    పిల్లలకు బట్టలు ఇచ్చినప్పుడు బాగానే ఉన్నాయి. బస్తీ నుంచి అవి ఇస్త్రీ రయి వచ్చాయి. రెండు రోజుల్లో అవి మురికి తోళ్ళు అయినాయి.
    "సీతా! మీ అమ్మ బట్టలు ఉతకదా?" అడిగింది పావని.
    "ఎట్ల ఉతుకుతదండి? మా అవ్వ పనికి పోతది పొద్దు కుంకినంక వస్తది"
    'అట్ల కాదుండి ఊతికేటందుకు నీళ్ళు యాడున్నయి? తాగేటందుకే దొరుకుత లేవు. ఊరి బాయికాడికి రానియ్యరు ఎవరన్న చేదిపోస్తే తెచ్చుకోవాలె బట్టలేమి ఉతుకుతముండి బాంచొల్లం" - వెంకడు అలా పోతూ పావని ప్రశ్నవిని సమాధానం చెప్పాడు. అతని నెత్తిన కంప ఉంది. శివయ్య పొలానికి కంచే వేయడానికి వెళుతున్నాడు.
    ఎంత చిన్నచిన్నవి సమస్యలుగా పరిణమిస్తాయి. బట్టలు లేవంటే తెప్పించింది . వాస్తవంగా వాటిని ఉతకడం ఒక సమస్య నీళ్ళు ఉండవు. స్వాతంత్యం వచ్చి ముప్పై ఏళ్ళయినా మనం వీళ్ళకు నీళ్ళు అందించలేకపోయాం . బట్టలు ఉతకడానికి నీళ్ళు మాత్రం ఉంటే సరిపోదు సబ్బు కావాలి, సబ్బూ - నీళ్ళూ కావాలి , ఉతకడానికి తీరిక కావాలి. ఉతుక్కోవాలనే ఉద్దేశం ఉండాలి. తిండికి లేనివాళ్ళు, పశువులుగా జీవిస్తున్నవాళ్ళు బానిసలయి బతుకుతున్నవాళ్ళు వీళ్ళు పాపం అనుకుంది పావని.
    అలా అనుకుని ఊరుకో బుద్ది కాలేదు పావనికి.  అదే ఆమెలోని ప్రత్యేకత. విశిష్టతా బట్టలు ఇచ్చిన తరువాత బడికి వచ్చే పిల్లల సంఖ్య కొద్దిగా పెరిగింది . వారు వచ్చింది బట్టల కోసం -- చదువు కోసం కాదు ఆవిషయం తెలుసు ఆమెకు. అయినా సంతోషించింది. ఆ పేరుతోనైనా కొందరు చదువుకుంటారు. బాగానే ఉంది కాని, ఈ మురికి కారుతున్న బట్టలూ, పిల్లలూ ఆమె మనసులో సానుభూతిని ఏర్పరచుకున్నారు. వీరికి పారిశుధ్యం ప్రభోదించడం కాదు- ప్రత్యేక్షంగా చూపించాలి.
    పావని సబ్బులు సంపాదించాలనుకుంది. కొనడం ఆమె ఉద్దేశం కాదు. ఇచ్చే వారికి ఈ పిల్లల విషయంలో సానుభూతి కల్పించాలనుకుంది. ఆ ఊరిలో ఇవ్వగల వాళ్ళు ఇద్దరే ఉన్నారు శివయ్య- జగన్నాధం . ఆమె శివయ్యను అర్ధించదలచలేదు. తాను బడి పెట్టడమే కంటగింపుగా ఉంది, సబ్బులు ఇస్తాడా/ జగన్నాధాన్ని అడిగి చూతామనుకుంది.
    ఒకనాడు ఉదయం చింత కింది బడికి వెళ్ళేటప్పుడు జగన్నాధం దుకాణానికి వెళ్ళింది. జగన్నాధం దుకాణంలో కూర్చున్నవాడు లేచి నుంచున్నాడు.
    'అమ్మగారు తోవ తప్పినట్లున్నరు, ఈడికే వస్తున్రా?" ఇకిలించాడు జగన్నాధం.
    "జగన్నాధంగారూ! మీ కోసమే వచ్చాను. మిమ్మల్ని దానం అడగడానికి వచ్చాను."
    "ఉల్లి గడ్డలు అమ్ముకునేటోన్నీ - దానధర్మాలు మాకేడ చాతనయితయి గాని వచ్చిన్రు గనక చెప్పుండి , చాతనయితే ఇస్త"
    "ఏం లేదు జగన్నాధంగారూ! బడికి వచ్చే పిల్లలున్నారు చూచారూ! పాపం వాళ్ళకు బట్టల్లేవండి."
    "తెప్పించి ఇచ్చిన్రట కద పట్నం నుంచి -- చెప్పుకుంటున్నరు. ఊళ్ళ ఇంటనే ఉన్న అమ్మగారూ! మీరెంత చెయ్యండి, ఆ లేకి ముండ కొడుకులు అంతే . సరేగాని, పెండ్లి చేసుకునెడిది ఉన్నదా లేదా? ఎందుకుండి వాళ్ళను పట్టుకొని మిడుకుతరు , మీరు బామ్మలు, కడగమంటే కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటాం -- వాళ్ళను బాగుచేసే పని పెట్తుకోకుండి , కాళ్ళు మొక్కుతా"
    పావని బాధపడింది. ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అనుకుంది. అయినా తాను పని ఉండి వచ్చింది ఊరికే పోవడం ఇష్టం లేదు.
    "జగన్నాధంగారూ , పట్నంలో కొందరు ధర్మాత్ములు వీళ్ళ కోసం బట్టలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు శుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడు మురికి కారుతున్నాయి."
    "వాండ్ల బతుకులే మురికి బతుకులు కాదుండి, సుబ్బరంగా ఉండమంటే ఉంటారా?"
    "ఉండమంటే ఎవరూ ఉండరు. వాళ్ళను ఉంచాలి. మీ సంపాదన సొంతం వాళ్ళ నుంచే వస్తుంది. వాళ్ళు మానేశారనుకొండి, మీ సంపాదన ఎలా ఉంటుంది? వాళ్ళల్లోనూ చీమూ, నెత్తురూ ఉన్నాయి. వాళ్ళలోనూ ఆవేశకావేషాలున్నాయి. వాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంటారనుకోకండి. కాలం మారుతుంది. బండ్లు ఓడలు ఓడలు బండ్లు అయ్యే కాలం వస్తుంది. మీ వ్యాపారం నడవాలంటే వాళ్ళను మంచి చేసుకోవడం అవసరం కాదంటే, మరో సింగినాదాన్ని తెచ్చి పెట్టుకుంటారు. సరే వస్తా, మీ దగ్గరికి రావడమే తప్పయింది. మీరు మనుషులేమో, ఎక్కడన్నా పిసరంత మనసుందేమో అనుకున్నా!"
    పావని ఆవేశం చూచి గడగడలాడెడు జగన్నాధం పెరుగుతున్న పావని పలుకుబడి జగన్నాధానికి తెలుసు అచ్చం శివయ్యను నమ్ముకుంటే చాలదు. పావని ప్రాపకం అవసరం అనుకున్నాడు.
    "అయ్యో, అమ్మగారూ అట్ల కోప్పడఒడిరి. ఏదో తెలిసి తెలియని మాట అన్న మీ అంతవారు మా ఇంటికి వచ్చినంక ఊరికే పంపితే పాపం తగులుతుంది. ఇంతకు ఎందుకొచ్చిన్రో చెప్పక పోతిరి- చెప్పండి ఏం కావలెవంటరో?"
    "ఏం లేదులే , నీ దగ్గరికి రావడమే తప్పు నాలుగు సబ్బులివ్వు - ఇవిగో డబ్బులు" అని సంచిలో చేయి పెట్టింది పావని.
    'అగొ, అట్లడుగుతే ఇవ్వకపోయినాను మీరేమో కోప్పడబడ్తిరి - ఇగ పట్టున్రి , డబ్బులోద్దుగాని బాంచను, శివయ్యకు ఎరక కానియ్యకుండి " అని సబ్బులు అందించాడు జగన్నాధం.
    పావని సబ్బులు అందుకుంది. జగన్నాధానికి డబ్బు లివ్వలేదు. సాగిపోతుంటే అన్నాడు జగన్నాధం "వస్తుండుండి ఇట్లనే కావలసింది పట్టుకు పొతుండండి కోపం మాత్రం పెట్టుకోకుండి"
    పావని సబ్బులు సంచీలో వేసుకుని బయలుదేరింది. ఆమెకు నవ్వు వస్తుంది జగన్నాదాన్ని తలచుకుంటే . మెల్లగా అడుగుతే ఇవ్వలేదు బెదిరిస్తే దోవకు వచ్చాడు. మనిషి తత్వమే అంతేమో! ఉన్నది ఎవడు వదులుకుంటాడు? లాక్కోవాలి అంతే! తాను బెదిరించిన తీరు చూస్తె ఆమెకే ఆశ్చర్యం అనిపించింది. ఉద్యమం అన్నింటినీ నేర్పుతుంది అనుకుంది. మొన్న శివయ్య ఇంటి ముందరి వృత్తాంతం గుర్తుకు వచ్చింది తనకు. మంత్రాల మీద నమ్మకం లేదు . ఉన్నవారికి పోగొట్టడానికే తానలా చేసింది. శివయ్య తనను శక్తి అవతారం అనుకున్నాడు. అతనికి ఉన్న నమ్మకంతోనే అతన్ని పడగొట్టాలి.
    పావని చింత కిందికి చేరే సరికి పిల్లలంతా లేచి నుంచుని నమస్కరించారు. వాళ్ళలో ఆ మాత్రం క్రమశిక్షణ వచ్చినందుకు ఆమె ఉప్పొంగింది. పిల్లలతో ప్రార్ధన చేయించింది.
    "మీ బట్టలు ఎలా ఉన్నాయో చోసుకోండి"
    "బాగున్నాయి గద" - ముత్యాలు అన్నది.
    "బాగున్నాయా? మురికిగా లేవూ?"
    "ఎప్పుడూ ఇట్లనే ఉంటాయి"
    "ఎప్పుడయినా మీరు బడికి వెళ్ళారా?"
    "లేదు"
    "మీ కేవరయినా బట్టలిచ్చారా?"
    "లేదు"
    "ఎప్పుడూ జరగనివి ఇప్పుడు జరగాలి"
    "ఎట్లనంటారు?"
    "మీరు బట్టలు ఉతుక్కోవాలి స్నానం చేయాలి"
    పిల్లలంతా ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు మాట్లాడలేదు.
    "మాట్లాడరేం?"
    "మీరు చెప్పేడిది మాకేమి తెలుస్తలేదు బట్టలు ఎట్ల ఉతుక్కుంటం- తానాలు ఎట్ల చేస్తం/ ఏమి ఎరకయిత లేదు"
    "నీలు నీలేయి నీలు మా అవ్వ నీల కోసం బాయికి పోయింది. నీలు పోసెటొండలా పోయ్యలె బాయి మీద కుండ పెట్టిందని పగలు కొట్టిన్రు కుండ పోయింది నీలు లేవు " - లింగయ్య అది చెప్పుకుని ఏడుపుకు లంకించుకున్నాడు.
    పావని దగ్గరికి తీసుకుని ఓదార్చింది కాని, కుండెడు నీళ్ళ కోసం కుమిలి పోయే జనాన్ని చూచి ఆమె మనసు క్షోభించింది బడి పిల్లలందరినీ తీసుకొని ఊరి బావికి వెళ్దామనుకుంది . వీళ్ళతో నీళ్ళు తోడించి ఊరివాళ్ళకు బుద్ది చేబుదా మనుకుంది. ఊరి వాళ్ళంతా చూచి ఏడవాలి. ఈ బావి గూదానికే అంకితం అయిపోవాలి. అన్నంత ఆవేశం వచ్చింది. అవును అంతే, ఊరి బావి హరిజన బావి కావాలి ఆ ఊరికి బావి లేకుండా పోవాలి అంతే అదే ఉపాయం ఎంత బావుంటుంది! బాగానే ఉంటుంది. బావుంటుంది గూడెపువారు నీళ్ళు తోడుకు పోతుంటారు . ఊరి వాళ్ళు ఏడుస్తుంటారు - ఎడవనీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS