పరుగులాంటి నడకతో ఆ సెంటరుకి చేరుకున్నారు సాహస్, అంకుష్.
అయితే -
ఆ టైంలో, ఆ ఊళ్ళో పులి భయం వల్ల అందరూ పరుగులు పెడుతున్నారు కాబట్టి, ఎవరూ ప్రత్యేకంగా వాళ్ళ సంగతి పట్టించుకోలేదు.
సరిగ్గా, ఆ కారణం వల్లే మిలిటరీ వాళ్ళంతా అతని కోసం గాలిస్తున్నా కూడా అతన్ని వెంటనే ట్రేస్ చెయ్యలేకపోయారు.
సాహస్, అంకుష్ ఆ సెంటర్ కి చేరుకోగానే...
బస్ షెల్టర్ మీద కూర్చుని వున్న సోల్జర్ కి వైర్ లెస్ లో మెసేజ్ వచ్చింది.
"పులి తోకలో ఒక్క వెంట్రుక తెగిందో నీ తోక కత్తిరించేస్తా! పులికి ఏమీ కాకూడదు! సాహస్ అని ఒక రోగ్, వాడితోబాటు ఒక పిల్లాడూ టార్చర్ ఛాంబర్ లోనుంచి తప్పించుకు పారిపోయారు. వాళ్ళని పట్టుకోకపోతే, నీపని పడతా! ఇదేమాట అందరు సోల్జర్లకీ వర్తిస్తుంది! ఖబడ్దార్!"
అదే టైంకి అక్కడికి ఒక బస్సు వచ్చింది.
శ్రీశైలం వెళ్ళే బస్సు అది.
బస్ షెల్టర్ మీద స్కైలాబ్ తన ధోరణిలో తాను రన్నింగ్ కామెంటరీలాగా చెబుతూనే వున్నాడు.
"శ్రీశైలం బస్సు వస్తోంది. శ్రీశైలం నల్లమల అడవుల్లో వుంది. నల్లమల అడవులు చాలా పెద్దవి. ఆ అడవుల్లో అంతుబట్టని అద్భుతాలు చాలా వున్నాయి."
"నోర్ముయ్యరా తిక్కనాకొడకా!" అన్నాడు సోల్జరు బక్క కోపంతో. "ఒక పక్క జనాలు భయంతో చస్తుంటే నువ్వు రన్నింగ్ కామెంటరీ చెబుతున్నట్టు వాగుతావా? అసలెవడ్రా నువ్వూ. నీ పేరేమిటి?"
"స్కైలాబ్!"
"స్కైలాబ్! మళ్ళీ అదే! నీ అసలు పేరేంటి?"
"స్కైలాబే!"
"ఇంకేమీ పేరు లేదా?"
"ఉంది"
"ఏమిటది?"
"పాకెట్ రాకెట్!"
అది వినగానే మహాగ్రహోదగ్రుడై గన్ తో స్కైలాబ్ కి కపాలమోక్షం చెయ్యబోయాడు సోల్జర్.
ఆ దెబ్బను తప్పించుకుని, ఉడతలాగా క్రిందికి దిగేశాడు స్కైలాబ్. రోడ్డుకి అడ్డదిడ్డంగా పరిగెడుతూ శ్రీశైలం వెళ్ళే బస్సుకి అడ్డం వచ్చాడు.
శ్రీశైలం బస్సు డ్రైవరు ఆఖరి క్షణంలో బ్రేకు వెయ్యకపోతే, అది నిజంగానే స్కైలాబ్ జీవితానికి ఆఖరి క్షణం అయ్యేదేమో!
బ్రేకు పడింది.
బస్సు ఆగింది.
చటుక్కున, ఆ ఆగిన బస్సులోకి ఎక్కేశారు సాహస్, అంకుష్.
అది బస్సు షెల్టర్ మీదనుంచి చూశాడు సోల్జర్.
"అర్రె! వీళ్ళే ఆ పారిపోతున్న వాళ్ళు! అని గన్ ఎయిమ్ చేశాడు.
అదే టైంలో అక్కడికి చేరుకుంది ప్రగతి వున్న మిలిటరీ జీప్.
బస్సు షెల్టర్ మీద వున్న సోల్జర్ చేయబోతున్న పనిని గమనించింది ప్రగతి.
తన రివాల్వర్ తో అతని మణికట్టుకు తగిలేలా పేల్చింది. బుల్లెట్ మిస్సయింది.
బస్సు కదిలింది.
సాహస్, అంకుష్ లతో సహా!
అది ఇంకెవ్వరూ గమనించలేదు.
అది చూసి తృప్తిగా నవ్వుకుంది ప్రగతి.
వెంటనే తను ఒక షాప్ లోకి వెళ్ళి, జబర్దస్తీగా రిసీవర్ తీసి, ఒక నెంబర్ రింగ్ చేసింది.
ఫీల్డ్ మార్షల్ సర్వాధికారికి హాట్ లైన్ అది!
అప్పటిదాకా ఒక మిలిటరీ జనరల్ సర్వాధికారిని కాంటాక్ట్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు. అతనికి సాధ్యం కావడం లేదు. కానీ, ప్రగతికి వెంటనే కాంటాక్ట్ దొరికింది.
"వాట్...ప్రగతీ?" అన్నాడు సర్వాధికారి.
"సర్! నేను వెంటనే మిమ్మల్ని మీటవ్వాలి!" అంది ప్రగతి. ఆమె గొంతులో భయం, బాధ పలుకుతున్నాయి.
"ఎనీ టైం..ఎనీ టైం..." అన్నాడు సర్వాధికారి ప్రసన్నంగా.
"థాంక్యూ సర్!" అని కట్ చేసేసింది ప్రగతి.
* * * *
"రా ప్రగతీ!" అన్నాడు సర్వాధికారి.
స్మార్ట్ గా సెల్యూట్ చేసి లోపలికి వెళ్ళింది ప్రగతి.
