Previous Page Next Page 
జోగబాల పేజి 17


    అతనికి మొహమాటంగా వుంది. కూర్చుంటూ "ఇంట్లో ఎవరూ లేరా?" అనడిగాడు.


    "అమ్మ ఉంది, నాన్న వాకింగ్ కు వెళ్ళారు" అంటూ "అమ్మా!" అని కేకేసింది.


    లోపల్నుంచి ఒక స్త్రీ వచ్చింది. ముప్పైయేడు.ముప్ఫై యెనిమిదేళ్ళ కంటే వయసెక్కువ వుండదు. అందంగా కళగా వున్న ముఖం.


    "నమస్కారమండి" అన్నాడు చేతులు జోడించి లేవబోతూ.


    "ఫర్వాలేదు. కూచోబాబూ" అన్నదామె మృదుస్వరంతో.


    ఆమెను చూస్తోంటే శ్రీహర్షకు చాలా ముచ్చటగా ఉంది.


    "ఈయన శ్రీహర్షగారని ఈ ఊరు కొత్తగా వచ్చారమ్మా. ఆ మధ్య ఓ రోజు స్కూలుకు వెడుతుంటే పరిచయమయింది." అన్నది వర్ష.


    "ఏం చేస్తుంటావు బాబూ?"


    అతను చెప్పాడు.


    "నువ్వు మాట్లాడుతూ వుండు వర్షా. నేను కాఫీ తీసుకొస్తాను" అంటూ ఆమె లోపలికి వెళ్ళింది.


    "ఈ పుస్తకాలన్నీ..."


    "మా నాన్నగారు చదువుతూ ఉంటారు. కొంతవరకూ అంటే అర్థమయినంత వరకూ నేను చదువుతూ ఉంటాను."


    "మీ నాన్నగారేమయినా చదువుకున్నారా!"


    "హైస్కూలు వరకు చదువుకున్నారు. తర్వాత పరిస్థితుల ప్రాబల్యంవల్ల చదువు కొనసాగించలేక పోయారు. మిగతా చదువంతా ఇంట్లో అభివృద్ధి చేసుకున్నదే."


    "మీ నాన్నగారేం చేస్తారు?"


    "మాకు పొలముంది. ఆయన దగ్గరుండి సొంతంగా పొలం చేయిస్తారు."


    "మీ నాన్నగారి పేరేమిటి?"


    "మయూరం"


    బయట అడుగుల చప్పుడయింది. శ్రీహర్ష తలతిప్పి చూసేసరికి ఓ నలభైఏళ్ళ వ్యక్తి లోపలకు వస్తున్నాడు. పంచె, లాల్చీ వేసుకున్నాడు. చామనఛాయ రంగుతో భారీగా హుందాగా వున్నాడు. ఆయన ముఖంలో సభ్యత, సంస్కారం ఉట్టిపడుతున్నాయి. వర్ష తండ్రిని శ్రీహర్షకు పరిచయం చేసింది. ఇంతలో ఆమె తల్లి కాఫీ తీసుకొచ్చింది. శ్రీహర్ష కళ్ళకు మయూరంగారు మట్టిలో మాణిక్యంలా కనిపిస్తున్నారు.


    "ఒక్క ప్రశ్న అడుగుతాను" అన్నాడు మొహమాటంగా.


    "అడగండి"


    "మీ వాడలో చాలామంది జోగినులున్నారు కదా!"


    "ఉన్నారు"


    "సుమారు ఎంతమంది ఉంటారు?"


    "అరవై డెబ్బయిమంది ఉంటారు."


    "వాళ్ళందరూ జోగిని వృత్తే ఆధారమా?"


    "జోగిని వృత్తిలో ఉండి డబ్బు డైరెక్ట్ గా వెలకట్టి అడక్కూడదు. కాని ప్రతి జోగినీ డబ్బు పీడించి వసూలు చేస్తూ వుంటుంది. ఒక దశకు వచ్చేసరికి 'డబ్బు డబ్బు డబ్బు' అనే పదమే నినాదం చేసుకుంటుంది. మామూలు వేశ్యలకు చట్ట భయం ఉంటుంది. వీళ్ళకు వుండదు."


    "వీళ్ళకు జోగినిగా ఉండడం తప్ప వేరే వృత్తి ఉండదా?"


    "చాలామంది పొలం వెళ్ళి పని చేసుకుంటారు. కొంతమంది ఎవరయినా చచ్చిపోయినప్పుడు నాట్యాలూ, ప్రదర్శనలు యిచ్చి శవాలమీద డబ్బులు ఏరుకుంటారు. కాని వాటన్నిటికీ ప్రాముఖ్యత లేదు. వ్యభిచారమే వాళ్ళ జీవిత పరమావధి అవుతుంది."


    వర్ష ఏదో పని ఉన్నట్లు లోపలకు వెళ్ళిపోయింది.


    "వ్యభిచారం చెయ్యడం వాళ్ళు యిష్టపడుతూ వుంటారా?"


    మయూరంగారు నవ్వారు. "ఇష్టం, అయిష్టం మొదట కొన్నాళ్ళపాటు వుంటుంది. తర్వాత తర్వాత మనసనేది చచ్చిపోయి, అదే సుఖ జీవితమన్న నిర్ణయానికి వచ్చి దానికి అంకితమైపోతూ ఉంటారు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS