శ్రీమద్భగవద్గీత
ఇహపరాల విషయములో గీతను మించిన గ్రంథము ప్రపంచంలో మరియొకటి లేదు. ఇది సహజోక్తి మాత్రమే. మానవుడు సరియైన నడవడిలో సాగటానికి గీత ఎంతగానో ఉపయోగిస్తుంది. మానవుని ఆవేశకావేషాలను తగ్గించి మనుష్యుని సన్మార్గవర్తనునిగా తీర్చిదిద్దుతుంది. జీవితములో వచ్చిన సమస్యలను అర్ధము చేసుకొనడానికి, పరిష్కరించుకొనడానికి ఎంతగానో ఉపకరిస్తుంది.
కల్లోలాలు వ్యక్తి జీవితంలోను, సామాజిక జీవితములోను తప్పవు. కాని వానిని అవగాహన చేసుకొని ఒక నిర్ణయానికి రావడము ఎంతో పనికొస్తుంది. అన్నిటిని మించి, మానవ జీవితము తెరచాపలేనిదై, కొట్టుకొని పోతున్నపుడు గీత ఒక కాంతిరేఖయై, ఒక వెలుగు బాటయై సారథ్యము వహిస్తుంది. జీవితము 'ఇహం' మాత్రంకాదు. 'పరం'గూడ అవుతుంది. 'ఇహం'లో సాధించింది 'పరం'లోను, పరంలోను సాధించింది 'ఇహం'లోను ఉపకరిస్తుంది.
మృత్యువు జీవితానికి కామా మాత్రమే ఫుల్ స్టాప్ మాత్రము కాదు. మానవునిది జన్మజన్మల బంధము. కష్టసుఖాలు, ప్రేమలు, అనురాగాలు, ఆత్మీయతలు, ద్వేషకావేషాలు మరుజన్మలో అనుభవానికి వస్తాయి. ఈపూర్వపు పరజనక్మలు కేవలము భారతీయులకే కాదు. మానవ జాతి మొత్తానిది. ఏలననగా ఇది సహజము. కాయ పండుతుంది. రాలుతుంది. మరలా మొలుస్తుంది. ఇదే జన్మల రహస్యం. ఇది భారతీయులకు తెలియును. ఇతరులకు తెలియదు. జన్మలకు విముక్తి కలిగించుకొని పునర్జన్మ లేకుండా చేసికోవడమే మోక్షము. మోక్షము పొందడానికి గీత అనేక మార్గాలు చూపించింది. ఈ మార్గాలలో దేనికైనా ఎన్నుకొనే స్వేచ్చ యిచ్చింది.
ఇదే మార్గము తప్ప మరొక మార్గము లేదు. ఈ మార్గాన్నే నీవు పయనించాలి -అను మూర్ఖత్వము కాదు 'భారత తాత్వికత' విశాల మార్గాలను పరుస్తుంది. స్వేచ్చనిస్తుంది. ఈ మార్గాన నడవమంటుంది. 'నడవని'వాని ఖర్మ.
గీత - భారతము
గీత భారత మధ్యములో యున్నదని చెప్పబడినది. అది నిజము, ఇది ఎప్పుడు వచ్చి చేరింది అనేదే ప్రశ్న! ఉపకథల తర్వాత గీత భారతములో చేరిందని నా నిశ్చిత అభిప్రాయము.
శంకర భగవత్ పాదులు అద్వైతాన్ని ప్రవర్తింపజేశారు. వారికి వేదము అంతగా ఉపయోగించలేదు. దానిని వారు పూర్వమీమాంస అన్నారు.
వారు ఉపనిషత్తులనే ప్రమాణముగా స్వీకరించారు. ఉపనిశాత్తును వేదములో భాగము చేశారు. ఈ ఉపనిషత్తు సిద్దాంతాన్ని ఉత్తరమీమాంస అన్నారు.
గీత ఉత్తమ మీమాంస అగును. ఇందులో వేదప్రసక్తి అంతగా లేదు. గీత ఉపనిషత్తుల సారంగా పేర్కొనబడింది.
భారత అంతర్గతము
1. భారతకథలో గీత ప్రసక్తి లేదు.
2. కురుక్షేత్ర సంగ్రామములో ఎన్నో అవసరాలు ఏర్పడ్డాయి. అయినా గీత ప్రసక్తి లేదు.
3. శ్రీకృష్ణార్జునుల జీవితములో గూడా గీత దర్శనమివ్వదు.
4. యుద్దకాండల తర్వాత ఎక్కడా గీత ప్రసక్తిలేదు.
5. భీష్ముడు ధర్మోపదేశము చేస్తాడు. ఇందులో గూడా గీత వినిపించదు. మరెన్నో ఉదాహరణలకు అవకాశముంది. అయినా భారతంలో గీతయే చివరగా చేరిందనడానికి నిదర్శనము. కాని ఉపనిషత్తుల విషయములో పూర్వము చర్చించాము. ఇవి క్రీ.శ. 7-8 శతాబ్దములవని పాశ్చాత్యులు నిర్ణయించారు. కావున గీత ఆ మధ్యకాలములో భారతములో చేరిందని చెప్పవచ్చు.
ఏది ఎట్లయినను గీత మహత్తుకు గాని, మహాత్మ్యమునకు గాని మహిమలకు గాని ఏ మాత్రం అంతరాయమేర్పడదు.
ప్రజలు 'శ్రీమద్భగవద్గీత'ను దైవవాక్కుగా స్వీకరిస్తున్నారు. భజిస్తున్నారు. భక్తి కనబరుస్తారు. శ్రద్దాన్వితులు అగుచున్నారు. ఇది అత్యుత్తమ పరిణామము. దీనిని అందరూ స్వాగతించవలసిన అవసరమున్నది.
ఉభయసేనామధ్యం
ఉభయసేనా మధ్యములో గీతోపదేశము సాధ్యమేనా?
1. యుద్దములో శంఖాలు మ్రోగాయి, వాద్యాలు మ్రోగాయి. ఉభయ పక్షాలలోను,
యుద్దానికి సన్నద్ధమై సిద్దంగా యున్నారు.
2. యుద్దానికి ధర్మరాజును ఒప్పించిన వారిలో అర్జునుడే ముఖ్యుడు.
3. యుద్దానికి సన్నద్ధమై వచ్చి పారిపోయిన వానిని పిరికివానిగా భావిస్తారు.
4. పల్నాడులో బాలవర్ధి రాజు యుద్దమునుండి పారిపోయి వస్తాడు. అతని కొడుకు,
అతని భార్య మాంచాల పసుపు, కుంకుమ, గాజులు సిద్దముచేసి పెడుతుంది. సిగ్గుపడిన
బాలరాజు యుద్దానికి వెళ్ళి అమరుడైపోతాడు.
5. అర్జునుడు మహావీరుడు. ఖాండవ దహనాన్ని రక్షించినవాడు. అర్జునునిది అప్రతిహత
శౌర్యము. ద్రోణుడు అర్జునునకిచ్చి నంత విద్యా శిక్షణ యింకొకరెవ్వరికిని ఇవ్వలేదు.
6. అర్జునుని కోసమే ఏకలవ్యుని అంగుష్టము గురుదక్షిణగా తీసుకొన్నాడు.
7. అంతటి మహావీరుడు శత్రుసేనను చూచి 'నా గుండె అదురుతున్నది. నాలుక
ఆరిపోతున్నది' అని అంటాడా?
8. నాకు ఇది కేవలము కల్పనగా కనిపిస్తుంది. గీత భారతములో భాగము చేయుటకు
మాత్రమే కల్పించినట్లు నాకు స్ఫురిస్తున్నది.
9. అప్పటి ఋషులు, మునులు దనిని భారతములో చేర్చితేనే దాని గౌరవము పెరుగు
తుందని అనుకొనియుంటారు.
10. అర్జున విషాదము తర్వాత గీతలో ఎక్కడా యుద్ద ప్రసక్తి కనిపించదు.
11. ఉభయసేనా మధ్యములో 18 అధ్యాయాల భగవద్గీతను ఉపదేశించుట సాధ్యమగునా?
గీతను అర్ధము చేసుకొనుట అంత సాధారణమైన పనియా? ఈ నాటికీ గీతను
పరిపూర్ణముగా అర్ధము చేసుకున్నవారు లేరని నా పరిపూర్ణవిశ్వాసము.
ఏమైనను గీతోపదేశము, ఉభయసేనా మధ్యములోనే జరిగింది. అట్లనే కృష్ణ భగవానుడు గీతలో నిర్వచించియున్నాడు. కాబట్టి దీనినే ప్రమాణముగా తీసుకొనుట భాగ్యము.
గీత - పారాయణము
ఈ పారాయణ అను పదము ఏ మహానుభావుడు కనిపెట్టాడో కాని, దానికి బహుళ ప్రాచుర్యము వచ్చింది.
పారాయణ వల్ల ఫలితాలున్నాయని ఫలశ్రుతులు చెప్పుతున్నవి.
ఫలశ్రుతులను కాదనలేము. కాని పారాయణము ఏకాగ్రము కావాలి. అర్ధమైనా కాకున్నా, మనసు అన్యాన్ని చింతించరాదు. కేవలం భగవానుని మీదనే మనసునుంచి స్వామినే నమ్మి చేసిన పారాయణానికి తప్పక ఫలితముంటుంది. కాని 'చిత్తము శివుని మీద - భక్తి చెప్పులమీద'కుదరదు.
అశ్రద్దయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్|
అసదిత్యుచ్చతే పార్ధ న చ తత్ప్రేత్య నో ఇహ||
అర్జునా శ్రద్దలేక చేయు హోమము, దాసము, తపస్సు యితర శుభకర్మలన్నియు 'అసత్' అగుచున్నవి. దానివలన ఇహః పరములందు ప్రయోజనము శూన్యము.
గీతలోని పాత్రలు
1. ధృతరాష్ట్రుడు: రాష్ట్రమును పాలించువాడు ధృతరాష్ట్రుడు. ఇతడు గుడ్డివాడు. నాకు
అతను గుడ్డివాడు అనిపించదు పుత్రేషణ అతనిని గుడ్డివానిగా చేయించినదని నా
నిశ్చితాభిప్రాయము. అతడు పుత్రునికి కట్టుడినవాడు దుర్యోధనుని కన్నులతో
పాలించినవాడు. ధృతరాష్ట్రుని పగ తీరనిది.
2. శ్రీకృష్ణ భగవానుడు: గీతలోభగవానుని ఉవాచ అని వుంటుంది... కృష్ణ భగవానుని ఉవాచ అని యుండదు.
శ్రీ కృష్ణుడు జ్ఞానసంపన్నుడు. ఆచార్యుడు. అతడు ఆకసమంతటివాడు.
3. అర్జునుడు: అర్జునుడు నరుడు, అజ్ఞాని. స్వామి ముందు అతడు పిట్ట అంతటివాడు.
అతని ప్రశ్నలు, బాలుడు అడిగినట్లుగా వుంటాయి.
4. సంజయుడు : సమస్తమును జయించినవాడు సంజయుడు.
ఓం
నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయము దీరయేత్
శ్రీమత్ భగవత్ మానసగీత.
