తొలి అధ్యాయము
అర్జున విషాదయోగము
ధృతరాష్ట్ర ఉవాచ
ధర్మక్షేత్రే కురుక్షేత్రే నమవేతాయుయుత్సవః
మామకాః పాండవాశ్చైవ కిమకురవత సంజయ 1
సంజయా! కురుక్షేత్రము, ధర్మక్షేత్రము. అచట మావారును పాండవులును సమర సన్నద్దులై చేరి ఉన్నారు. వారి వ్యవహారము ఏమి?
దీపికా వ్యాఖ్య
వ్యాసభగవానునకు అతి ప్రియమైన ధర్మపథముతో గీతాచార్యుని ఉపదేశము ప్రారంభం అగుచున్నది.
1.1. ధర్మ గుణము: సముద్రపు ధర్మము లోతు. గగనపు ధర్మము విశాలము. వేప ధర్మము చేదు. చెరకు ధర్మము తీపి.
2. ధర్మము: కర్తవ్యము. భీష్మద్రోణాదులకు యుద్దము ప్రమాదకరమని తెలియును తాము అధర్మ పక్షమున యుద్దము చేస్తున్నామని తెలియును. తమ వినాశమును తెలియును. అట్లయ్యు వారు తమ ధర్మమును, కర్తవ్యమును పాలించినారు.
3. సత్పురుషులు ఎన్ని ఆటంకములు కలిగినను తమ ధర్మమును పాలించుదురు.
4. సమాజ ధర్మము: వ్యక్తి ధర్మముగాక, సహజమునకు, తమ కర్తవ్యమును నిర్వహించుట ధర్మపాలనము అగును. 'ఉదారచరితానాంతు వసుదైవ కుటుంబకమ్' ఉదా రాచరితుడు మనవ జాతి యెడల తమ ధర్మమును నిర్వహింతుడు.
2.ధర్మక్షేత్రము: 1) ధర్మమునకు ఆకరమైన స్థలము. 2. ధర్మము ఫలించు స్థలము. 3. ధర్మము కొరకు యుద్దము జరుగుచోటు.
3. కురుక్షేత్రము: 1.ఋగ్వేదములో కురుక్షేత్రము వున్నది. ద్వాపరములోనే పరశురామ, భీష్ములకు యుద్దము జరిగింది. మరికొన్ని యుద్దాలు గూడా జరిగాయి. 2. ప్రస్తుతం అది హర్యానా రాష్ట్రములో యున్నది. అక్కడ సూర్య సరస్సు మొదలగు అనేక సరస్సులు వున్నాయి. 3. నేటికిని అక్కడ యజ్ఞయాగాదులు నిరంతరము జరుగుతూ వుంటాయి. 4. కృష్ణపరమాత్మ గీతోపదేశము చేసిన స్థలాన్ని గూడా దర్శించవచ్చు. 5. కురుక్షేత్రము అనగా కర్మ క్షేత్రము. కార్యక్షేత్రము. ఇది వ్యవహార ప్రదేశము గూడా. మునులు, ఋషులు యిచ్చట తపస్సు చేయరు. ఇది కేవలము ఇహ సంబంధము.

4. యుద్ద సన్నద్దులై యుండుట: ధృతరాష్ట్రునకు కేవలము యుద్ద సన్నద్దతయే తెలియును. అతనికి యుద్ద వ్యూహములు తెలియదు. యుద్దము తెలియదు.
5. ఇంత తెలిసినా గుడ్డివాడు "వారి వ్యవ హారమేమి, ఎట్లు ప్రవర్తించినారు" అని అడుగుట యేమిటి? 1. ధృతరాష్ట్రుడు దుష్టుడు. అతని సేన సంఖ్యా పరముగా పెద్దది అని తెల్సుకొన్నాడు. తమ విజయము నిశ్చయము అనుకొన్నాడు. అందుకే అడుగుతున్నాడు ఏమి చేసినారని. 2. వీరు కూడినది ధర్మక్షేత్రము కురుక్షేత్రము. అక్కడ వారి మనసులు మారలేదు. గదా? సంధి జరుగలేదు గదా? యుద్దము ఆగలేదుగదా? అని అతని ఆరాటము అందుకే 'కిమకురవత సంజయా' అన్నాడు.
సంజయ ఉవాచ:
దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధన స్తదా
ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్
2.దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూశాడు. ద్రోణుని సమీపించాడు. ఇట్లు అన్నాడు - 1. ఇది గొప్ప రాజకీయము. రాజులు సేనాధిపతి యొద్దకు వెళ్ళుట భీష్ముని వదలి ద్రోణుని చేరినాడు!
2. ద్రుపదునుకి, ద్రోణునికి వైరమున్నది. దాని కథా విధానం బెట్టిదనగా: ద్రోణుడు, ద్రుపదుడు ఒకే గురుకులమున సహాధ్యాయులు. విద్య ముగిసింది. ద్రుపదుడు పాంచాల రాజుయైనాడు. ద్రోణుడు పేద బాపడు అయినాడు. అతనిని దారిద్ర్యము ఎంతగానో బాధించింది. తన బిడ్డకు ఆవుపాలు తాగించలేనంత తల్లడిల్లినాడు.
అప్పుడు ద్రోణుని భార్య పాంచాలుని స్నేహమును గురించి భర్తకు తెలియపర్చింది. రాజుగాదా! నేస్తము గదా! ఒక ఆవునైనా యివ్వడా అని పంపింది. ద్రోణుడు అర్ధమనస్కరముగానే పాంచాలను చేరాడు. ఆస్థానమును ద్రుపదుని దర్శించాడు.
ద్రుపదుడు కనీసము ద్రోణుని గుర్తించలేదు. రాజెక్కడ? పేద బాపడెక్కడ? అని అవమానించి పంపినాడు.
కాలము ఎవరి వశములోనిది కాదు. 'బండ్లు ఓడలగుట ఓడలు బండ్లు అగుట' అనే సామెత కలదు. తదుపరి ద్రోణుడు హస్తినకు చేరినాడు. భీష్ముడు అతనిని ఆదరించినాడు. గౌరవించినాడు. ద్రోణుని రాజకుమారులకు గురువుగా నియమించినాడు. ద్రోణుని మనసులో ప్రతీకారేచ్చ ప్రజ్వరిల్లుతున్నది. అర్జునుని చేరదీసినాడు. అతనిని మహా విలుకానిగా సిద్దము చేసినాడు.
ఏకలవ్యుని వృత్తాంతమునకు యీ కథతో సంబంధమున్నది. ఏకలవ్యుని బొటనవ్రేలును దక్షిణగా తీసికొనుటలో కులప్రసక్తి లేదు. ఏకలవ్యుని ద్రుపదుడు చేరదీస్తాడను భయము మాత్రమే.
అర్జునుడు ద్రుపదుని పట్టి బంధించినాడు. హస్తినకు తెచ్చినాడు. ద్రోణుని కాళ్ళమీద పడవేసినాడు. ద్రుపదుడు అవమానముపాలై పాంచాలము చేరినాడు.
ద్రుపదునికి అవమాన జ్వాల మనసులో లేదా?
ద్రోణునికి యీ విషయాలు తెలియపర్చవలెననియే, దుర్యోధనుడు, ద్రోణుని చేరినాడు. ద్రుపదుని పుత్రుడు నీకు శిష్యుడు. అతడే పాండవ సేనాధిపతి అని గుర్తుచేశాడు.
3. అదేకాదు యింకను రాచకీయమున్నది. ద్రోణుడు పాండవ పక్షపాతి. అర్జునుడు అతనికి ప్రియతమ శిష్యుడు. కాబట్టి ఆ విషయములో గూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించమని హెచ్చరిస్తున్నాడు.
4. పాండవసేనను గురించి తెలియపర్చడంలో ఒక మెలిక తిప్పినాడు.
పశ్వైతాం పాండు పుత్రాణా మాచార్య! మమతీం చమూమ్
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమాతా||3
ఆచార్యా! పాండుపుత్రుల సేనను పరికించండి. ఆ సేనకు మీ శిష్యుడు, ద్రుపద పుత్రుడు దృష్టద్యుమ్నుడు నాయకత్వము వహిస్తున్నాడు. అతడు గట్టి వ్యూహము పన్నియున్నాడు.
అత్రశూరా మహేష్వాసా భీమార్జునసమాయుధి
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ 4
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్
పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరసుంగవః 5
యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః 6
అచ్చట మహాశూరులున్నారు. విశ్వాసపాత్రులున్నారు. యుద్దములో భీమార్జునులకు సమానులున్నారు. 'యుయుధానుడు' ఉన్నాడు. విరాటుడు వున్నాడు. ద్రుపదుడు వున్నాడు. వీరందరు మహారథులు.
దుష్టకేతుడు వున్నాడు. చేకితాననుడు వున్నాడు. మహావీరుడైన కాశీరాజు వున్నాడు. పురుజిత్తు వున్నాడు. కుంతిబోజుడు ఉన్నాడు. నరపుంగవుడైన శైబ్యుడున్నాడు.
యుధామన్యుడు, విక్రాంతుడు వీర్యవంతుడైన ఉత్తమోజుడున్నాడు. సౌభద్రుడు, ద్రౌపదేయులువున్నారు. వీరందరు మహారథులే.
ఆస్మాకం తు విశిష్టా యే తాన్ని బోధ ద్విజోత్తమ
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్ధం తాన్బ్రవీమి తే 7
