Previous Page Next Page 
శ్రీమద్భగవద్గీత పేజి 16


    భారతం -స్వభావం
    
    భారతములో మార్పుల గురించి పూర్వమే ప్రస్తావించాను. కాలము మార్పు కోరుతుందని వివరించాము. కాలపు మార్పును అధిగమించగలవాడు ఎవడూ లేడు. ఆ విషయాన్ని తెలియపర్చడానికి వేదాన్ని ఉదాహరణగా గ్రహించాము.
    వ్యాసమహర్షి ధర్మ అధర్మాలను, సత్య అసత్యాలను, న్యాయ అన్యాయాలను వివరించడానికే భారత రచనకు పూనుకున్నాడు.
    
    సజీవ పదాలకు నిర్దిష్ట నిర్వచనాలు వుండవు.
    
    ధర్మమును ఇదమిద్దమని నిర్ణయించడము అసాధ్యము. ఒకచోట వ్యక్తి చర్యలబట్టి న్యాయము అన్యాయముగా, అన్యాయము న్యాయముగా మహర్షి వివరించాడు.
    ధర్మరాజు అబద్దమాడుతాడు. అది ధర్మమూ కోసమే కాబట్టి ధర్మమంటాడు. శ్రీకృష్ణుడు ఆయుధము పూననని ప్రతిన బూనాడు. వ్రతభంగము చేశాడు. సుదర్శన చక్రముతో భీష్ముని మీదకు పరుగెత్తాడు. ఆ విధముగా ధర్మనిర్ణయము అంత సులభము గాదని తెలియపర్చాడు.
    నేను రచించిన మహాభారతము 1997లో ఆవిష్కరించబడింది. తెల్లవారి ఒక పెద్దమనిషి మా యింటికి వచ్చాడు. "భారతము పూర్తిగా వ్రాసి యింకా జీవించివున్న వారు మీరే మీరు భారతములో గ్రహించినది ఏమిటి?" అని అడిగాడు. నేను యిలా అన్నాను "ధర్మము, న్యాయము, సత్యము స్వస్వరూపాలతో నాకు దర్శనమివ్వలేదు".
    అతడు "అయ్యో అలాగైతే ఎట్లా" అన్నాడు.
    "అయ్యా సమాజము, జీవితము మహత్తరములు. వాటిలోని విషయాలు అర్ధము కావడము అంత సులభముగాదు" అతను 'అంతేనా' అని చాలా నిరాశతో వెళ్ళిపోయాడు.
    ధర్మరాజు జూదములో భార్యను పనముగా పెట్టాడు. ఇది ధర్మమా? గెలుచుకున్న ద్రౌపది బట్టలు వలిచాడు దుర్యోధనుడు. ఇది అధర్మమా?
    ఈ ధర్మాధర్మ సంకోచముతోనే భీష్మాదులు సభలో నోరు మూయించింది. ఇలాంటివి భారతములో అనేక సంఘటనలు వున్నాయి. మహర్షి అట్లైన ధర్మాధర్మ విచక్షణకే భారతము రచించినాడు. ఇది భారతపు మౌలిక స్వరూపము.
    వ్యాసమహర్షి 'జయ' అను కావ్యాన్ని 14 వేల శ్లోకాలతో వ్రాశాడు అంటారు. అదే 'జయభారతం'.
    కేవలం కురుపాండవుల కథ తెలియపర్చడానికి బహుశా 14వేల శ్లోకాల జయగ్రంథము సరిపోతుంది. తదుపరికాలములో యీ జయకావ్యానికి ఉపకథలు చేరినవి. ఆ విధముగా మహా భారతము 18 పర్వాలు అయింది. దీనిలో లక్షశ్లోకాలు వున్నవి.
    నీతి తెల్సుకోవడానికి ఉపకథలు ఎంతో ఉపకరిస్తవి. కత చదవగానే నీతి స్ఫురిస్తుంది. కావ్యకథ సాంతము చదవాల్సిన అవసరముండదు.
    ఇట్టి ఉపకథలను రచించిన వారెవరు? భారతములో ఉపకథలే ఎక్కువ. అరణ్యపర్వము సాంతము ఉపకథలే. శాంతి సప్తకము శాంతము ఉపకర్తలే.
    వీటిని ఎవరు ఎందుకు వ్రాశారు అని ఆలోచిద్దాం. వ్రాసినవానికి స్వార్ధము లేదు. లేదు. తనకు పేరు ప్రఖ్యాతులు రావలయునని అనుకొనుట లేదు. కేవలము సమాజశ్రేయస్సే లక్ష్యముగా ఉపకథలను రచించినాడు. ఇవి ఏ ఒక్కవ్యక్తి చేతగాని, ఒకే కాలములో గాని రచించబడినవి కావు అని నా అభిప్రాయము. ఇది ఒక నిరంతర ప్రయత్నము. కొన్ని శతాబ్దాల పాటు జరిగి యుంటుంది. అయితే వీటన్నింతిని ఒకచోట కూర్చి పర్వతములుగా విభజించి, ఇదే మహాభారతము అని ఒప్పించి మెప్పించిన మహామహితాత్మునకు నమస్కరించాగలమేకాని ఏమి చేయగలము?
    ఇవాళ మనకు లభిస్తున్న మహాభారతము సంస్కృతములో లక్ష శ్లోకాలది. ఇంతటి బృహద్గ్రంథము మరొకటి లేదు. ఇందులోని పాత్రలు సుమారు వేయి (1000). వాటిని సజీవముగా  ఆవిష్కరించడము బృహత్ప్రయత్నమే గాని సాధారణముగాదు. దీనికి దైవబలము తోడుగానున్నదని నా అభిప్రాయము.
    దైవము సహకరించని కార్యము శిక్షించుట దుష్కరము.
    ఇంతటి సంపదను భారతజాతికి అందించిన వ్యాసభగవానుడు అన్యఋషులకు మానవజాతి ఎంతో రుణపడియున్నది. పితృ రుణము వలె యిదియు తీర్చరానిది. పితరులను వలెనే వ్యాస భగవానుని గూడా తలచుట, అతని బోధనలను ఆచరించుట వలన బహుశా కొంత ఋణ విముక్తి అవుతుందేమో.
    వ్యాస భగవానునకు జయము జయము.
    
                                  ఓం శాంతిః శాంతిః శాంతిః


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS