బస్తీవాళ్ళ కోరికల్ని వీళ్లు తీర్చి ఉండాలి, లేదా పాపం, వాళ్ల గుండెల్లో కోర్కెలే లేకుండాలి. ఈ సాధువులు మా గ్రామానికి విచ్చేశారు.
ఈ వార్త ఊళ్ళో అగ్గిలా వ్యాపించింది. ఊరివాళ్ళకు ఉన్నవీ లేనివీ కోరికలు మొలకెత్తాయి. చేసిన చిన్నా, పెద్దా పాపాలు వాళ్ళను చిరాకు పరుస్తున్నాయి.
మా ఇంట్లో కూడా హడావుడిగా ఉంది గిన్నెల చప్పుళ్లు, కోళ్ళ అరుపులు మా చెల్లెళ్ళ కేకలు-రొదగా ఉంది. వసారాలో పూజకు పళ్ళాలు తయారవుతున్నాయి. మా అమ్మ చందనం, కొబ్బరికాయలు, కుంకుమ సర్డుతూంది. బలిహరణానికి అయిదు రంగుల బియ్యం ఉడుకుతున్నాయి. మా చెల్లెళ్లు మంచి మంచి చీరలు తీస్తున్నారు కట్టడానికి. వాళ్ల అలంకారాలకు అంతులేదు.
దసరా అసలు ఆడపిల్లల పండుగ. కొన్ని వారాలు ముందునుంచే సీత కథ పాడుకుంటారు. రాసలీల జరుగుతుంది. భరతనాట్యం ఆడ్తారు. పూలు, ప్రమిదల మధ్యనుంచీ చుట్టూ తిరుగుతూ సీతావనవాసానికి సంబంధించిన కథలు గానం చేస్తూ రావణుని దుష్టతలంపు మరిచిపోతారు. వారికి చిత్రాంగదా అర్జునుల ప్రేమగాధలు గుర్తుకువస్తాయి. ఒక్కొక్కసారి కృష్ణలీలలు గానం చేస్తూ వెన్నెల్లో చెట్లక్రింద, తమను తాము మరిచిపోతారు.
నా చెల్లెళ్లు పోట్లాడి మరీ కొత్త గాజులు వేయించుకున్నారు. సిగలో బంతిపూలు తురుముకున్నారు. కాళ్లకు పసుపు రాసుకున్నారు. కోడిపుంజులా వళ్లు విరుచుకునే గంజిపెట్టిన చీరలు కట్టుకున్నారు. వాళ్లు నడుస్తుంటే గాలి తాకిడికి చీరలు సవ్వడి చేస్తున్నాయి. గత నాలుగయిదు రోజులుగా ఆటల్లో మునిగి గది ఊడ్వడం సహితం మరచారు.
"నీ స్నేహితురాలు రత్తమ్మ ఇవ్వాళ కూడా మురికి చీర కట్టుకుంది. చూస్తే ఎలాగో అనిపిస్తూంది." నా చెల్లెలు వనితాలక్ష్మితో అన్నాను.
"పాపం, వాళ్ళ ఆవు చచ్చిపోయింది. ఆ దుఃఖంతో ఆటల్లో కూడా పాల్గొనలేదు" అని నీళ్ళల్లో తన నీడ చూచుకొని బొట్టు సవరించుకుంది.
ఆవు చావుకూ-ఆటకూ ఏం సంబంధం? ఆవు చనిపోతే పండుగ చేసుకోదా?
నాన్న చనిపోయి ఎంతోకాలం కాలేదు. మేము మరిచిపోలేదూ? నాన్నను వారు ప్రతి నిత్యం గీత చదవకుండా అమ్మను కొట్టేవారు కాదు. రైతుల దగ్గర డబ్బు వసూలు చేసి భూమిలో పాతిపెట్టందే మాకు సీతాఫలాలు కొనుక్కోవడానికి పైస ఇచ్చేవారు కారు. అలాంటివారు పోతే ఏడవకుండా ఎలా ఉంటాం? మా నాన్న మట్లో కలిస్తే వారు పాతిపెట్టిన ఆనందాలన్నీ వెలలికి వచ్చాయి.
"ఇప్పుడీ డబ్బంతా ఏం కాను?" డబ్బును చూచి మా అమ్మ మూర్చపోయినంత పనిచేసింది, రత్తమ్మ తల్లి వెధవరాలు అయినప్పటి వలె! ఆ తర్వాత డబ్బుల అజీర్ణంతో రోజులకొద్ది మంచంలో పడి రత్తమ్మ ధ్యాసలో రోజులు గడపసాగాను.
పనేమీ లేనప్పుడు వలపు వెల్లువ ముంచుకొస్తుంది.
మనం మన వలపుల చావుకు ఏడవం. కాని తన్నిమిత్తపదార్ధం మన నుండి దూరం అయినపుడు దుఃఖిస్తాం. అది మాత కావచ్చు లేదా గోమాత కావచ్చు.
"రత్తమ్మకు ఆవు అమ్మను మించింది." అమ్మ రత్తమ్మ యింటికి వెళ్లి మందలించి వచ్చి అన్నది. "పాపం, ఆ ఆవు వల్లనే ఇంటి ఖర్చంతా వెళ్ళేది. ఇహ వీధివాళ్లు అప్పు సహితం ఇస్తారనే నమ్మకం లేదు."
భూమిని మోసే ఆవు అలసిపోతుందట. అప్పుడది కొమ్ము మార్చుకుంటుందట అప్పుడే భూకంపం వచ్చేది. బావుంది. కాని ఆవు అలసిపడిపోతే!
నాకు భయం వేసింది. రత్తమ్మ ఇంటిని చూశాను. ఇంకా అక్కడికి దసరా చేరలేదు. ఒక తెల్ల పిల్లి గుమ్మంలో కూర్చొని పాదాలు నాకుతూంది. అప్పుడప్పుడు కళ్లు తెరిచి, ముక్కు పుటాలు పెంచి వీధిలో వండే వంటల వాసన చూస్తూంది.
అప్పుడే బాజాల వాళ్ళు వచ్చేశారు. డోళ్ళు మోగుతున్నాయి. శంఖనాదం విన్న స్త్రీలు మైమరచి, తాగినవారివలె వెంట్రుకలు విరయబోసుకొని నాట్యం సాగించారు. వీధిలోని మగాళ్ళు వేపాకు నీళ్ళలో ముంచి దిగతుడుపు తీస్తున్నారు. కాని నేడు ఏ ఆడది భర్త ప్రేమగాని, సంతానం గాని, సంపద గాని అడగలేదు. కన్నెపిల్లలు తమ కళ్ళలో కోరికల దీపాలు వెలిగించి, వాటిని తీర్చమనే వరాలు కోరడానికి రాలేదు.
వీరు దేవదాసీలు. పురుషుని ప్రేమించిన నేరానికి దేవాలయం నుండి గెంటివేయబడ్డారు. ఇది పూజా దినం. ఈ రోజు మళ్లీ వారు జ్ఞానంతో వెలుగొందుతారు. అలాంటప్పుడు అందరూ తమతమ విన్నపాలతో వీరిని ఆశ్రయిస్తారు. కాని నేటి స్థితి వేరు. సాధువుల బృందం చేరింది. అందువలన వీరి ప్రాముఖ్యత తగ్గింది. కొందరు ముదుసళ్లు మాత్రం ఆచారం ప్రకారం కేకలు పెట్టి ప్రార్థిస్తున్నారు.
చెరువులో విడవడానికి పూజపళ్ళాలు తీసుకొన్ ఆడవాళ్లు కూడుతున్నారు. వాతావరణంలో ఒక వెలుగు పరుచుకుంది. బుట్టలో రంగురంగుల పూలు విసిరితే ఎలా ఉంటుంది - అలా ఉన్నారు రంగురంగుల చీరలు కట్టిన చిన్నారులు. వీరి నల్లని శిరోజాల్లో తెల్లని నీటి బిందువుల ముత్యాలు లక్షలకొద్ది మెరుస్తున్నాయి. పళ్ళెంలో ఉన్న ప్రమిదలు నేరం వప్పుకున్న నేరస్తుల్లా గడగడలాడుతున్నాయి. అమ్మాయిలు వేరు వేరు వరుసలుగా నుంచున్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. రేయింబవళ్ళు కనిపించే ఈ అమ్మాయిలూ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ప్రియంగా కనిపిస్తున్నారు.
నేటి రత్తమ్మ నవ్వు ప్రకృతి శోభను ఎంతో పెంచింది.
నేనూ గబగబా జాతరకు వెళ్ళే ఏర్పాట్లలో మునిగిపోయాను. పట్నంలో ఎగ్జిబిషన్ కన్నా పల్లెజాతర నాకు బాగనిపిస్తుంది. జాతరలో పిల్లల్లా సంతోషపడ్తాన్నేను. అక్కడ గేదెలు, ఆవులు, కుండలు అమ్ముతారు. అప్పడాలు, ఎండుచేపలు, మేకపేగుల కూర తిని, కల్లు తాగుతారు. ఊళ్ళోని అందమైన అమ్మాయి దగ్గర నుంచుని బుర్రకథ వినవచ్చు.
ఇవ్వాళ మిత్రులకు దూరంగా ఉండాలని అనుకున్నా చెల్లెళ్ళవెంట ఉండడం మంచిది. ఊరి అమ్మాయిలంతా వాళ్ళ దగ్గరికి వస్తారు. నా ప్యాంటును చేత్తో ఇస్త్రీ చేస్తుండగా రత్తమ్మ పిలుపు లోకానికి వినవచ్చింది.
'లోనికి రావాలా రాజ్యలక్ష్మీ!'
'రావమ్మ రా-రా' వనితాలక్ష్మి అన్నది.
'రా-రా........" నేనూ పిలవాలనుకున్నాను. చీమ ఇంటికి శివుడు చెప్పివస్తాడా? వసంతం అడిగి వస్తుందా? సూర్యుడు వచ్చేముందు హెచ్చరిస్తాడా?
ఇహ గుమ్మందగ్గరికి ఎవరినీ రానివ్వరు. రత్తమ్మ అడుగుపెట్టి లోనికి వచ్చిన భూభాగం కదిలి వేరయిందనుకున్నా. అర్థంకాదు లోకం ఈరోజే దీపావళి పండుగ ఎందుకు చేయదు? ఏమీ ఒక్క సీత రాముని ఇంటికి వస్తే దీపావళి అవుతుందా?
రత్తమ్మ రోజులాగే పాత చీర కట్టుకుంది. వెంట్రుకలు చింపిరిగా ఉన్నాయి. చిరిగినా చీరలోంచి కనిపించే....
రత్తమ్మ సిగకెక్కిన పూవును మించిన అదృష్టం గల పూవు ఇహ ఈ ఊళ్ళో లేదు.
లోపలినుంచి ఆమె మాట మెల్లగా వినిపిస్తూంది. ఆమె వనితాలక్ష్మికి జడ అల్లింది. రాజ్యలక్ష్మికి నగలు పెట్టింది.
"ఇవ్వాళ పులగం వండుతారుకదూ! మా నాయన బతికి ఉన్నప్పుడు అమ్మ కూడా వండేది" అన్నది రత్తమ్మ.
షేవ్ చేసుకునేవాణ్ణి ఆగిపోయాను. గదిదాటి బయటికి వెళ్ళే ధైర్యం లేదు. ఆమె అప్పుడే మొలకెత్తిన మొలక లాంటిది. నా కంటివేడికి కమిలిపోతుందేమో, పారిపోతుందేమో!
'పులగం వండారుగా రాజూ, నీ స్నేహితురాలికి పెట్టరాదూ' అందామనుకున్నా, కాని మాట పెకల్లేదు. అమ్మకు రత్తమ్మంటే అంత అభిమానం లేదు. ఎందుకంటే వాళ్ళు మా రైతులు.
ఆ ముందున్న మట్టి ఇళ్లు జాగీర్దారు ఆస్తిగా మారకముందు ఎప్పుడో మా తాతలనాడు మా ఆస్తి అట. అందుకే ఆడవాళ్ళంతా మమ్ములను యజమానులవలె గౌరవిస్తారు.
మా ఊరివాళ్ళ జ్ఞాపకశక్తి గొప్పది. వారు మంచీ, చెడూ అన్నింటినీ గూర్చి శతాబ్దాల తరబడి గుర్తుంచుకుంటారు, వారు రత్తమ్మ తండ్రినీ మరచిపోలేదు. అతడు కాలుకుంటి అనే నెపంతో ఏ పనీ చేసేవాడు కాడు. చేలల్లో దొంగతనం చేసేవాడు. ఒకసారి సొరకాయ దొంగతనం చేస్తూంటే పంతులు పట్టుకున్నాడు. దేవుని గుడికి పిలిచాడు. అలాంటి వెధవ పనులు చేసినందుకు కులం నుంచి వారు వెలివేశారు. సుందరంపేట చెరువులో పడి చచ్చాడు.
