"అరె వెంకిగా , నీది మొద్దు మెదడురా! అమ్మకున్న తెలివి నీకున్నదా! ఆమె ఈడి కెందుకు రావాల్రా -- బువ్వ లేకనా బట్టలేకనా? శివయ్యకు ఎదురు నిలబడ్డది - మనకు తెలివి చెప్పుతాంది చెప్పినట్టు చెయ్యరాదు ?" కొమరయ్య బోధించాడు.
'అలాకాదు కొమరయ్యా! మనం అన్నీ తెలియచెప్పాలి వెంకయ్యా! మీరు బానిసలు ఎందుకు అయినారు ?"
'ఏమో నా బొంద, నాకేమెరిక బాంచను అంత ఎరికయితే ఈ దొర మా మీద ఇట్టెందుకు సవారి చేస్తడు?"
'అదేరా ఏరిక కావాలె చదువుకుంటే అన్ని ఎరికయితాయి దొర మనని చదువు కొనియ్యకుండ చేస్తాండు సర్కారు బడి కట్టించిందా, అందులో గింజలు పోసుకున్నాడు " అన్నాడు బ్రహ్మయ్య.
"ఆ గింజలు కాలీ చేయించాల్నే ఏమన్న కానీ" -- పెంటయ్య నిజంగానే కాళీ చేయిస్తున్నట్లు అభినయించాడు.
"అరె పెంటిగా! ఊరుకో , చెప్పెడిది ఇను" - ధర్మయ్య వారించాడు.
"వచ్చిన బడి పంతులును లెక్కలు రాసేటందుకు పెట్టుకున్నాడు. పావనమ్మ వచ్చింది, వాని రోగం తిప్పింది. లెక్కలు రాయన్నది బడి పెట్టింది" - బ్రహ్మయ్య .
"బాగ రోగం కుదిరింది " - అరచేతిలో గుద్దుకొని అనందం అనుభవించాడు వెంకడు.
"శివయ్య మొదటిసారి లోంగిండు"
'ఆవుగద, కండ్లపడ్తనే ఉండే' -- అందరూ ఒకేసారి అన్నారు -- శివయ్య అధికారం డొల్లి పోతుంటే చూస్తున్నట్లు.
'అట్లని ఊరుకుండను కున్రా? పావనమ్మకు సాయం చేసిన్నని నాకు పనిముట్లు ఇయ్యటం బంద్ చేసిండు బాకీలు తీర్చామంటే నా ఇల్లు గుంజుకుంట నంటుండు పొరలు బడికి పోకుండ బెదిరిస్తుండు ఇల్లు పొతే పోయే, కూటికి లేకుంటే బాయే , ఊరు బాగుపడాలే, శివయ్యకు బుద్ది చెప్పాలని ఇట్లవచ్చిన" -- బ్రహ్మయ్య అన్నాడు.
'చెప్పల్నే ఓ బ్రహ్మయ్యన్నా , చెప్పాలే, ,మా అమ్మను పొట్టన పెట్టుకున్నాడు. మా అయ్యాను చంపిండు చెప్పుదం, బుద్ది అందరం కలసి చెప్పుదం పొరల్ను బడికి పంపిస్తం , మేం చదువుకుంటాం - ఇగ సరేనా?" వెంకడు అన్నాడు.
'చాలురా ఎంకడు, గామాత్రం చెప్పినవు ఇగ మనందరం ఒక్కటే గద ఏమంటావ్?" కొమరయ్య అడిగాడు.
అందరం ఒక్కటే!
మనందరం ఒక్కటే!
అందరూ ముక్తకంఠంతో అన్నారు. పావని అనందాతిరేకంతో తబ్బిబ్బయింది. తాను ఒక్కతి ఊళ్ళో ప్రవేశించింది. వంటరిగా ఏం చేయగలనని భయపడింది. ఇప్పుడు తనకు బలం దొరికింది. బలం కలిగింది. ఈ బలంతో తాను ముందుకు సాగవచ్చు.
పావనిని సాగనంపడానికి వెంకడు, పెంటడు చాలా దూరం వచ్చారు. వారిలో ఉత్సాహం తొణికిసలాడుతుంది.
బల్లెం పట్టుకున్న నర్శిమ్మ తాగి తూలుతూ వస్తున్నాడు. వీళ్ళను చూచాడు నిలిచాడు.
"ఏయ్! ఎవడ్రా అక్కడ?" మాట తడబడ్తుంది . కాళ్ళు వెళ్ళాడుతున్నాయి.
"ఎవడంటున్నావా? నీ మొగుడు " అన్నాడు పెంటడు అంతా గొల్లుమని నవ్వారు.
"ఏమన్నరు? తిరుగుడు కొచ్చిన్రా! ఒరే , జర ఉషారుగ తిరుగుండి, దొంగలు పడ్తాన్రట పోన్రి ఇడిచి పెడ్తోన్న.
కాలిల ముల్లిరిగే.
కానలేవా మల్లి"
అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు.
10
గెలుపు మనిషితో గంతులు వేయిస్తుంది. ముందడుగు వేయడానికి ప్రోత్సహిస్తుంది. పావని ఈ మాత్రం గెలుపు లభిస్తుందని ఊహించలేదు. పల్లెకు వచ్చినప్పుడు ఆమెకు నిరాశ ఆవహించింది. ఆమె ఒక ఉద్దేశ్యంతో వచ్చింది ఒక లక్ష్య సాధనకు వచ్చింది. పల్లెలో బడి పెట్టాలని, తద్వారా కొంత వెలుగు ప్రసరింప చేయాలనేదీ ఆమె ఆశయం ఆమెను పంపించింది గవర్నమెంటే అయినా పల్లె పరిస్థితి చూస్తె తాను ముందడుగు వేయలేను అనుకుంది . శివయ్య తనను అసలు నిలువనీయడు అనుకుంది . శివయ్య తనను నిలువనిచ్చాడు ఇది తనకు గెలుపు శివయ్యకు ఓటమి! అ ఊరి జనాన్ని చూస్తె నిరాశ కలిగింది అంతా శివయ్య అడుగుజాడన నడిచేవాళ్ళు అతను చావమంటే చచ్చేవాళ్ళు లేవమంటే లేచేవాళ్ళు ఊళ్ళో అందరి ప్రాణాలూ శివయ్య గుప్పిట్లో ఉన్నాయి.
పావని నిరాశ చెందలేదు నిరుత్సాహ పడలేదు ప్రయత్నించి చూతామనుకుంది. బ్రహ్మయ్యను కదిలించింది బ్రహ్మయ్యతో చైతన్యం చూచింది. చైతన్యం అందరిలోనూ ఉంటుంది. పరిస్థితుల ప్రభావం వల్ల దానికి మసి పడ్తుంది. ఆ మసి తుడవాలి అంతే . దీపశిఖ దానంతట అదే బయట పడుతుంది దీపం తన వెలుగును దాచుకోదు మరో దీపాన్ని వెలిగిస్తుంది, బ్రహ్మయ్య కొమరయ్యలో చైతన్యం రగిలించాడు. ఈ చైతన్య జ్వాల గూడెం దాకా పయనించింది. పెంటయ్య, వెంకయ్య ధర్మయ్యలలో కాస్త దీప్తి కనిపించింది. చైతన్యం సాహసానికి దారి తీస్తుంది. గూడెంలో జనం సాహసించారు పిల్లలను బడికి పంపడానికి, రాత్రిళ్ళు వాళ్ళు చదువు'కోవడానికీ అంగీకరించారు. కోటలోని మల్లమ్మకూ కొంత తెలివి వస్తుంది. శివయ్య అజేయుడు కాడని ఆమె గ్రహించింది అంతేకాదు, తన అందాన నిలిచేవారున్నారని గుర్తించింది నిమ్మకాయలూ, రక్తపు కూడూ ఇంటి ముందు పోసింది శివయ్యను గడగడలాడించింది. ఆనాటి ఆమె ఆనందాన్ని అక్షరీకరించడం అసాధ్యం! శివయ్య కూడా గడగడలాడ్తాడని నిరూపించింది.
అన్నింటినీ మించింది శాస్త్రిగారి పాత్ర ముత్యాలును అంటుకున్నవాడే భయపడింది. పావని ఆనాటి ఉదంతం తరవాత పెదవి కదపలేదు శాస్త్రిగారు. శాస్త్రిగారి అంతరంగంలో ఏదో అనంతం అయిన మార్పు వస్తుంది. శివయ్యను వారు చిన్నతనం నుంచి చూస్తున్నారు దీవిస్తున్నారు, కీర్తిస్తున్నారు. శివయ్య శాస్త్రి గారికి దండాలు పెడ్తున్నాడు దానాలు చేస్తున్నాడు. పావని బదిలీ విషయంలో అర్ధించారు శాస్త్రిగారు కాదు పొమ్మన్నాడు. శివయ్య నిజ స్వరూపం ఆనాడు గ్రహించారు శాస్త్రిగారు. శివయ్య రావణసురుడని తెల్చుకున్నారు. పావని ఈ ఊరికే తేవడానికి ప్రయత్నం విరమింతాం అనుకున్నారు. అయినా పావని వచ్చేసింది. ఆ రావణుని ముందు పావని నిలువలేదనుకున్నారు. పావని బాల, అబల రాక్షసుని తాకిడికి ఆమె తట్టుకోలేదనుకున్నారు. పావని గంగా స్రవంతి అని వారికి తెలియదు. మెల్లగా పారినా మహా వృక్షాల్ని పెకలించ గలదని వారు గ్రహించలేదు. అందుకే కాస్త భయపడ్డారు. ఆమెను అద్దడానికి ప్రయత్నించారు. కాని, పావనికి చేదోడు వాదోడు లభించడం వారికి సంతృప్తి నిచ్చింది. వారిని పటుక్కున్న వ్యధల్లా పావని అంటరాని వారిని అంటుకుంటుందని అందుకూ ఒక సమాధానం లభించింది శాస్త్రిగారికి. రావణుని సంహరించడానికి రాముడు కోతులనూ, ఏలుగ్గోడ్లను చేరదీశాడు రాక్షసులను సంహరించడానికి నారాయణుడు అనేక అవతారాలు ఎత్తాడు. వామనుడయి బలిచక్రవర్తిని బిచ్చం అడిగాడు. రాక్షసులను సంహరించడానికి ఎలాంటి ఎత్తు ఎత్తినా తప్పు లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతకూ శివయ్య రాక్షసుడని గ్రహించారు శాస్త్రిగారు -- చాలా కాలం తరువాత , అదీ పావని వల్లనే. పావనికి కలుగుతున్న గెలుపు తమ గెలుపుగానే భావిస్తున్నావు శాస్త్రిగారు. సనాతనాచారాలు తొడుగును విప్పి, కొంత కాలం చిలక్కోయ్యకు తగిలించేశారు.
గ్రామ వాతావరణం కూడా కొంతలో కొంత మారింది. శివయ్య అజేయుడు కాడని జనం తేల్చుకున్నారు. పావని ఊళ్ళోకి రావడాన్ని సహించడనుకున్న శివయ్య సహిస్తున్నాడు. పావనితో లెక్కలు రాయించుకోవలసిన శివయ్య రాయించుకోవడం లేదు. జగన్నాధంతో రాయించుకుంటున్నాడు. పావని బడి పెట్టడాన్ని బలవంతాన్నయినా మాన్పించాల్సిన శివయ్య మిన్నకున్నాడు మొన్నటి నిమ్మకాయల ఉందంతంతో పావని మీద గౌరవం మరీ పెరిగిపోయింది పావని శివయ్యను ఎదిరిస్తుంది, గడగడలాడించింది. దాంతో ఆమె శక్తి స్వరూపిణి అయింది ఊరికి.
పావని పగటిపూట చింత చెట్టు కింద చదువు చెప్తుంది. ఇంటి నుంచి కుర్చీ, చాపలు పట్టుకుని వచ్చేది ఇప్పుడు వేళకు పెంటయ్య వస్తున్నాడు కుర్చీ, చాపలు చెట్టు కింద వేసి, తన పనిమీద వెళ్ళిపోతున్నాడు. చింతచెట్టు కింద పావని కూర్చుంటే చాపల మీద నలుగురు, అయిదుగురు కంటే పిల్లలు ఉండడం లేదు. ఆ పిల్లలను చూస్తుంటే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వాళ్ళకు బట్టలు ఉండడం లేదు. బరిబాత వస్తున్నారు వాళ్ళను యూనిఫాంలో రమ్మని తాను అనలేదు. బ్రహ్మయ్యను పట్నం పంపింది ఇక్కడి పరిస్థితి వివరంగా రాసి, ఆదుకొమ్మని తన మిత్రులకు రాసింది వాళ్ళు కొన్ని పాతబట్టలు పంపించారు. ఆ బట్టలు తొడిగించిన్నాడు పిల్లల ముఖాల్లో అనందం చూస్తుంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి.
'అమ్మా! ఈ అంగి శాన బాగుంది. నాకే ఇస్తరా, మల్ల గుంజుకుంటరా?" ముత్యాలు చొక్కా పట్టుకొని బేలగా అడుగుతుంటే పావని కడుపు చెరువు అయింది పాత బట్టల కోసం పాకులాడే ఈ బాలురు భావిభారత పౌరులు మాత్రమె కాని , పాలకులు కాలేరు అనుకుంది.
