చిన్న ప్రయాణమైనా దూర ప్రయాణమైనా నొప్పి మాత్రయినా దగ్గర వుంచుకోవాలని ప్రస్తుతానికి ప్రయోజనం లేకపోయినా వాళ్ళంతా తెలుసుకున్నారు.
శివరావు సంగతీ, పార్వతీ సంగతీ తెలియని ఒకాయన శివరావుతో కబుర్లు వేసుకుని కూర్చున్నాడు. "మీరే వూర్లో వుంటారు? ఎక్కడికి వెళుతున్నారు? ఎంతమంది పిల్లలు ప్రశ్నల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు.
శివరావు ఆయన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఆ అని మౌనంగా వుండలేక బాధపడుతూ వుంటే,
మామయ్య అవస్థ గ్రహించిన మోహనరావు, "మావయ్యకి చాలా తలనొప్పిగా వుంది. మనం అటు వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం రండి!" అంటూ, ఆయనకి అవతలి వైపు సీటు దగ్గరకి తీసుకువెళ్ళాడు.
"ఏమండీ నాకేదో భయంగా వుందండీ!" అని పార్వతి భర్త చెయ్యి గట్టిగా పట్టుకుంది.
"భయపడి చేసేదేమీ లేదు పార్వతి! ఎలా జరాలనుందో అలా జరగక మానదు. భగవంతుడనేవాడు కర్కోటకుడని నేను అనుకోవటం లేదు." అన్నాడు శివరావు.
ఇరువురూ ఎవరి ఆలోచనలో వారు మౌనంగా వుండిపోయారు.
వాళ్ళిద్దరి కళ్ళముందు చంద్రం రూపం మాత్రం మెదులుతుంది.
క్రితం సారి శెలవుల్లో చంద్రం యింటికి వచ్చినప్పుడు రాత్రి భోజనాలు కాగానే ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.
"మృత్యువు గురించి అందరూ ఎందుకు నాన్నా! అంత భయపడతారు? భయపడినా భయపడక పోయినా అందరికీ చావు తప్పదు కదా! అలాంటి అప్పుడు నవ్వుతూ, నవ్వుతూ చనిపోతే సరిపోలేదా!" అంటూ చంద్రం మాట్లాడుతూ వుంటే,
"చావు కబుర్లు దేనికి?" అంటూ పార్వతి కోప్పడింది.
"నీకు భయమయితే మాట్లాడను లేమ్మా! నేను మాత్రం చావుకి భయపడను. చావుకి భయపడి, జబ్బులకి భయపడి, ప్రతిదానికీ భయపడుతూ వుంటే మనమేమీ చెయ్యలేము. వాదించలేము అని తరచూ మాష్టారు అంటూ వుంటారు." అంటూ అంతటితో ఆ ప్రసక్తి ఆపేశాడు చంద్రం.
శివరావుకి పార్వతికి అదే విషయం గుర్తుకు వచ్చింది ఒకేసారి.
అలా భార్య భర్తలిద్దరూ ఎవరి ఆలోచనలలో వారు వుండగానే అరగంట గడిచిపోయింది. నీరంతా పోయి వాగు పొంగు కూడా తగ్గిపోయింది.
"మరికొద్దిసేపట్లో బస్సు బయలుదేరబోతోంది." కండక్టర్ పెద్ద గొంతు వేసుకుని చెప్పాడు.
"వకతను అరిచి మరింత వుషారుగా అడిగాడు."
"ముందుకా వెనక్కా?" అని.
"మేము ముందుకు తీసుకెళ్ళే వాళ్ళమే గాని, వెనక్కి తీసుకెళ్ళే వాళ్ళం కాదు." అంటూ "పదండి ముందుకు పదండి పైకి" అంటూ చిన్న రాగం కూడా తీశాడు.
ఈ బస్సు డ్రైవరు సాధారణంగా డ్రైవ్ చేస్తున్నప్పుడు త్రాగడు. బయట చలి చలిగా వుండటంతో అందరూ బస్సు పోయినపుడు తనసీటు క్రింద దాచుకున్న సీసాలోని ద్రవాన్ని సగం తన పొట్టలోకి పోనిచ్చాడు. ఇదేమీ తెలియదు అక్కడున్నవారికి. ఆఖరికి కండక్టరు కూడా చూడలేదు.
డ్రైవర్ తో సహా అందరి మనస్సులూ కుదుటపడి బస్సు బయలుదేరుతుందీ అని అనుకుంటూ వుండగా దీని వెనుకనే ఇంకొక బస్సు వచ్చి ఆగింది.
రెండు బస్సులూ ఒకదాని వెనుక నెమ్మదిగా వాగు దాటాయి. బస్సు పది నిమిషాలు ముందుకు ప్రయాణించిన తరువాత.
బస్సు డ్రైవర్లు ఒకళ్ళ కన్నా ముందు ఇంకొకళ్ళు వెళ్ళాలనే పోటీలో పడ్డారు.
ప్రస్తుతానికి తప్పంతా వెనుక బస్సు వాడిదే.
ముందు బస్సుకన్నా తన బస్సుని ముందుగా పోనివాలనే ఉద్దేశ్యాన్ని ముందు బస్సు డ్రైవరు గ్రహించాడు. వెనుక బస్సు ముందుకు వెళ్ళటానికి వీల్లేకుండా తన బస్సుని అటూ ఇటూ త్రిప్పుతూ వెనుక బస్సుకి అడ్డుపెట్టటం మొదలుపెట్టారు.
వెనుక బస్సు వాడు సందులో వీలు చూసుకుని బస్సూ బస్సూ రాసుకునేంతగా ప్రక్కగా పోనిస్తూ ఎక్కిరించి ఇంకా ముందుకు సాగాడు.
