వాసంతి బలమంతా ఉపయోగించి అతడిని దూరంగా తోసేసింది. "నా జోలికి వచ్చావంటే ఊరుకోను." అంది రోషంగా.
"ఏం చేస్తావు!"
"తల బద్దలు కొడతాను."
చలమయ్య ఆమె ముఖంలోకి చూశాడు. అన్నంత పనీ చేసేటట్టు కనిపించింది. "ఓ సినీ! తాళి కట్టినవాడినే తల బద్దలు కొడతానంటావే. సరే కానియ్." అని బయటకు జారుకున్నాడు. అంతకుముందే పరంజ్యోతి లోపలకువచ్చి వాళ్ళిద్దరి మాటలు వింటూ తడిక అవతల నిలబడి ఆ సంభాషణంతా వింటున్నాడు. చలమయ్య అతన్ని చూసుకోకుండా బయటకెళ్ళిపోయాక అతను లోపలికడుగుపెట్టాడు.
వాసంతి అతన్నిచూసి దగ్గరకు వెళ్ళి గుండెమీద తలవాల్చి ఏడ్చింది. అతనికి కనికరం కలగలేదు. బాధ కలగలేదు. కోరిక గురించి తప్ప ఆమె మనసు గురించి కొంచెం కూడా ఆలోచించడంలేదు.
4
ఏటిలో మడమలదాకా నీళ్ళున్నాయి. శ్రీహర్ష ఆ ఊరొచ్చినప్పట్నుంచీ చూస్తున్నాడు. ఆ నీళ్ళు తరగవు, ఎదగవు. నిరంతరం అలా మడమల యెత్తుల్లో ప్రవహిస్తూ ఉంటాయి. వర్షాకాలమొస్తే ఎలా ఉంటుందో తెలియదు. చాలామంది స్త్రీలు చలమల దగ్గర నీళ్ళు తోడుకుంటున్నారు. శ్రీహర్ష యేరుదాటి వెళ్ళడం వాళ్ళు చూశారుగానీ, పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే హరిజనవాడయేకాదు ఊళ్లో వాళ్ళ పొలాలు, తోటలూ చాలావరకూ అటుకేసి ఉన్నాయి. ఏవేవో పనులమీద ఊరివారు అటువైపు వెడుతూనే వుంటారు.
హరిజనవాడలో చాలా ఇళ్ళున్నాయి. శ్రీహర్ష భయం, సంకోచం వదిలేసి వాళ్ళకోసం ప్రత్యేకంగా తవ్వించుకున్న బావిని దాటి లోపలకు వెళ్ళాడు. అంతా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఒకరిద్దరు మాత్రం అతను యెదురైనప్పుడు ఎవరికోసం బాబూ అని పలకరించారు.
"ఇక్కడ...ఇక్కడ...అహ...ఏమీ లేదు" అంటూ ముందుకు సాగిపోయాడు.
ఓ పూరిల్లు మొదట్లో మొక్కలకు నీళ్ళుపోస్తూ వర్షం కనిపించింది. ఎప్పటిలా పరికిణీ వోణీలోనే వుంది.
మొదట ఆమె అతడిని గమనించలేదు. దగ్గరకు వెళ్ళి "వర్షా" అని పిలిచేసరికి ఉలికిపడి, వికసించిన ముఖంతో "మీరా" అంది. శ్రీహర్షకు ఏమనాలో తోచక నవ్వి ఊరుకున్నాడు.
"ఎక్కడకు బయల్దేరారు?"
"మీ కోసమే"
"నిజంగానే"
"నిజం కాకపోతే యిటువైపు నయు పనేముంది?"
"నాకోసం దేనికి?"
"కొన్ని రోజులుగా కనిపించటంలేదుగా"
"పోతే?"
"గుండె దిగులవుతుంది."
వర్ష మళ్ళీ నవ్వింది.
"రండి లోపలకు"
"రావచ్చా?"
"ఏం?"
"మీ ఇంట్లోవాళ్ళేమన్నా....?"
"అలాంటివేమీ మా యింట్లోలేవు. మా యింట్లో వుండవు రండి. కాకపోతే తలవంచుకుని లోపలికడుగు పెట్టాలి."
శ్రీహర్ష ఆమె వెంట లోపలకు వెళ్ళాడు. ఆ ఇంటిలోకి వెడుతూనే చాలా ఆశ్చర్యమనిపించింది. అవటానికి పూరిల్లే అయినా చాలా శుభ్రంగా కొంతవరకూ విశాలంగా వుంది. ఒక ప్రక్కన ఇనుప షెల్ఫ్ అందులో తీర్చిదిద్దినట్లు అమర్చివున్న రకరకాల గ్రంథాలు, మధ్య గోడలకు అందమైన క్యాలెండర్లు, రెండు మూడు చిత్ర పటాలు తగిలించి ఉన్నాయి. మడవటానికి వీలుగా వుండే రెండు యినుప కుర్చీలున్నాయి. ఒక కుర్చీని ఇవతలకు జరుపుతూ "కూర్చోండి" అంది వర్ష.
