Previous Page Next Page 
పావని పేజి 15


    శివయ్య అలా వెళ్ళగానే బ్రహ్మయ్య ప్రవేశించాడు -- పలకలు పట్టుకుని . పలకలు పావనికి అందించి "శివయ్య పగపట్టిండమ్మా, నా మీద " అన్నాడు. అతని స్వరంలో బాధల పర్వతాలున్నాయి. చీకటి కొండలున్నాయి ఆకటి సంద్రాలున్నాయి.
    "ఏమయింది మామా!" పావని అడిగింది. ఆమె చేతులు వణకుతున్నాయి. పలకలు పడిపోయేట్లున్నాయి. వాటిని కింద పెట్టింది.
    "పావనమ్మా! శివయ్య నాకు అప్పు పెట్టటం బంద్ చేసిండు పని ముట్లు ఇస్తలేడు . బాకీ కింద ఇల్లు పట్టుకుంటడట . కూలి చేసుకుంటున్న , మీ అత్త ఇయాల్నో రేపో అనేటట్లున్నది"
    "మామా! ఈ బడి బంద్ చేస్త నిన్ను కష్టాల పాలు చేసి ఈ బడి నడిపించలేను"
    "అట్లనకు పావనమ్మా! మేం కష్టాల్లనే పుట్టినం! కష్టాలతోనే పోతం బడి పెట్టి బతుకేమిటో చూపినావు నా తల నరికి ఈడ పెట్టమన్నా పెడ్త - బడి మాత్రం బంద్ చేయకు పోరాటం మొదలయింది. మధ్యన అపెడిది లేదు విజయమో - వీర స్వర్గమో - అంతే!"
    బ్రహ్మయ్యాలోని ఆవేశం చూసి పొంగి పోయింది పావని. "మామా!" అని ఏమో ఆనబోతుండగానే నర్శిమ్మ ప్రత్యక్షం అయినాడు. బల్లెం పట్టుకుని యమదూతలా.
    "పోరీ! ఈడ కూకుంటే తమ్ము న్నేవరేత్తుకుంటరే లే - పా"  -- ఉరిమాడు నర్శిమ్మ.
    "అయ్యా ! నేన్రానే సదుకుంట ఓ అయ్యా! నన్నేమనకే, సదుకుంట" - ముత్యాలు గడగడ వణుకుతూ లేచి నుంచుంది.
    "పా లంజముండ సదుకుంటదట , ఇంట్ల ఎవడు చేస్తడే!" అని నర్శిమ్మ ముత్యాలు చేయి పట్టి గుంజుకు పోతున్నాడు. రానని వెనక్కు గింజుకుంటుంది ముత్యాలు. నర్శిమ్మ దెబ్బలు కొట్టి లాక్కు పోతున్నాడు.
    పావని ప్రతిమలా నుంచొని చూస్తుంది.
    బ్రహ్మయ్య గుడ్లప్పగించి చూస్తున్నాడు.
    "ఒయ్యా! నన్ను కొట్టకే, నేను సదుకోను " - ముత్యాలు ఆక్రందన వినిపిస్తుంది.
    మిగిలిన ఇద్దరూ ముగ్గురూ పిల్లలూ " మా అయ్యా కొడ్తాడు, ,మా అయ్యా కొడ్తాడు" అని పారిపోతున్నారు.
    పావని పలకలు చూచింది నేల మీద పడి ఉన్నాయి. బ్రహ్మయ్యను చూచింది . అతని కళ్ళలో ఆవేశం కనిపించింది.  
    "పావనమ్మా ! నువ్వు కృష్ణునివి - నేను అర్జునుణ్ణి కురుక్షేత్ర సంగ్రామం షురు అయింది" అన్నాడు.
    చింతచెట్టు మీది కాకులు కావు కావు మన్నాయి.
    నేనూ మీకు తోడుంటనని ఒక కుక్క వచ్చి బ్రహ్మయ్య కాళ్ళు నాకింది.

                              9

    నిండు పున్నమి పండువెన్నెల వెన్నెల పుచ్చపూవులా పరచుకుంది. గూడెం సందడిగా ఉంది. పగలంతా వళ్ళు విరుచుకొని వచ్చిన జనం ఇంటిపనుల్లో మునిగి ఉన్నారు. పొయ్యిలు వెలుగుతున్నాయి. వంటలు సాగుతున్నాయి. ధర్మయ్య తాత గోనుగుతూ పదం పాడుతున్నాడు. పెంటయ్య తల్లి పుల్లమ్మ మంచంలో మూలుగుతుంది. పెంటడు, వెంకడు కూర్చొని కూనిరాగాలు తీస్తున్నారు.
    పావని, బ్రహ్మయ్య , కొమరయ్య గూడెంలో ప్రవేశించారు. కూనిరాగాలు తీస్తున్న వెంకడు వారిని చూచాడు. గబుక్కున లేచి నుంచున్నాడు. తన కళ్ళను తానె నమ్మలేనట్లు చూచాడు. కళ్ళు నులుపుకుని చూచాడు - వాళ్ళు మనుషులా కాదా? అన్నట్లు ' పెంటా! అటు చూడు ఎవరొచ్చిన్రో" అన్నాడు.
    పెంటడి ఉలికిపడి చూచాడు.
    "ధర్మయ్యతాతా! చూడు ఎవరొచ్చిన్రో! పావనమ్మొస్తున్నది, బ్రహ్మయ్యోస్తున్నడు, కోమరయ్యోస్తూన్నడు" అన్నాడు పలవరిస్తున్నట్లు.
    'అరే పెంటిగా! గప్పుడే నిద్రపోయినావుర - కలవరిస్తున్నావు బాపనోండ్లు మన గూడేనికి ఎందుకోస్తర్రా?" ధర్మయ్య మంచంలో పడి ఉండే అన్నాడు. అతడు లేవడానికి ప్రయత్నించలేదు.
    "ధర్మన్నా! వచ్చిందయ్యా పావనమ్మ మన పాలిటి దేవత-- వచ్చింది ధర్మన్నా! చూడు , మేం గూడ వచ్చినం" - బ్రహ్మయ్య అన్నాడు.
    ధర్మయ్య లేవడానికి ప్రయత్నించాడు - లేవలేకపోయాడు. చేయెత్తి మొక్కడానికి ప్రయత్నించాడు మొక్కలేక పోయాడు. "అమ్మా పావనమ్మా! నువ్వు మా గూడానికి వచ్చినావా తల్లీ! ఎంత దయగలదానివమ్మా! ఇంటనే ఉన్నం నీ సంగతులు - ఇని ఏం చేస్తమామ్మా  ! చూస్తున్నావు గదా నా గతి? నాకు రెక్కల్లేవు రెక్కలున్నొండ్లకూ లేనట్లే నమ్మా -- అందరి రెక్కలూ ఇరక్కొట్టిండు దొర. ఒరే ఎంకడు , ఒరే పెంటడూ ! మంచామేయ్యండిరా కూచుంటది మా తల్లి వచ్చింది. మనమీద దయ తలచి వచ్చింది "  - ధర్మయ్య మాటల్లో అదరమూ, అభిమానమూ ఉట్టి పడుతున్నాయి. పావని ఉక్కిరిబిక్కిరి  అయింది. వెంకడు తెచ్చి వేసిన మంచంలో కూర్చుంది. "మీరు కూడా కూర్చోండి " అన్నది.
    'అంటరాని వాండ్లమమ్మా, మేం ఇట్ల దూరంగా కూలబడ్తంలె" అని కూలబడ్డాడు వెంకడు బ్రహ్మయ్య, కొమరయ్యా మంచం మీద కూర్చోలేదు. దూరంగా కూర్చున్నారు.
    "వెంకయ్యా !" పావని ఏదో చెప్పబోయింది.
    "ఎంకిగా అనున్రిబాంచను మీ కాళ్ళ కాడ పడుండేటోల్లం "
    "వెంకయ్యా! మీరు బానిసలు కాదు - మనుషులు మనం అంతా మనుషులమే అందరం ఒకే తీరుగా పుట్టాం. కొందరు మిమ్ములను బానిసలను చేశారు. వారికి ఉన్న డబ్బుతో మిమ్ములను కొనుక్కున్నారు. బానిసలను చేశారు. మీరు మిమ్ములను తెలుసుకోవాలి. మీలో ఉన్న శక్తిని గ్రహించాలి అది జరిగిన్నాడు ఏ శక్తి మిమ్ములను బానిసలుగా ఉంచలేదు. మీరు కట్లు తెంచుకుంటారు రెక్కలు పెంచుకుంటారు. ఆకాశంలో ఎగురుతారు సూర్యుణ్ణి , చంద్రుణ్ణి పట్టి తెస్తారు. భూమిమీద వారితో ఊడిగం చేయిస్తారు."
    'అమ్మా! పావనమ్మా! అమురుతం కురిపించే మాటలన్నవమ్మా! మేం గోడ్లోలే చస్తం మమ్ముల మనుషులని గుర్తుపట్టినవమ్మా! కాని, మాకు తెలిసింది దొర, ఆయనిచ్చే అప్పులు, ఆయనకు చేసే చాకిరి మాకు రెక్కలేట్లోస్తయమ్మా! మా కట్లేట్ల తెగుతాయమ్మా!' ధర్మయ్య ఏదో అంతస్తు అందుకోలేక జారిపడుతున్నట్లు మూలిగాడు.
    "ఇగో ధర్మయ్య తాతా ! పావనమ్మా చెప్పేదాంట్ల సత్యమున్నదే పడుంటే పశువులోలె పడుంటం ఎదురు తిరిగితే పిల్లి కూడా పులి అయితది, ఏమంటావ్?" బ్రహ్మయ్య ఉత్సాహం కనబరచాడు.
    "ఎన్నడన్న మా గూడేనికే వచ్చినావే బ్రహ్మయ్యన్నా? జందెం తెంపుకుని వచ్చినవా ఏం?" పెంటయ్య ఎగతాళిగా అన్నాడు.
    "ఇగో ! బమ్మన్న నిజంగానే జందెం తెంపుకున్నాడు. ఈ అమ్మ చెప్పింది కులానికి పెట్టినోడు మనను ఏరు చెయ్యటానికి పెట్టిండట నిజంగా చెప్పు మనందరం కష్టం చేసుకునేటోడ్లమే నాయె మనకు కులాలేందే కులానికి పెట్టింది శివయ్యనసే- నీయవ్వ -- వాడేమో ఏల్తాండు " - కొమరయ్య కులాలను గురించి తెలిసినంత చెప్పినా ఏదో చైతన్యం వచ్చినట్లు చెప్పాడు.
    "కొమరయ్యన్నా! ఇగ మనందరం ఒకటన్నవు గద - నీయవ్వ -- ఆ దొరను పట్టుకొచ్చి ముత్యాలమ్మ కాడ మూలగంగ నరకమంటే నరకుతా ఎమేతదే, జేలుకు పోత"- పెంటయ్యలో  ఆవేశం కట్టలు తెంచుకుంది.
    "ఒరే పెంటిగా! మన కులమే అంతరా పడుంటే పీనుగులోలె పడుంటం కాకుంటే అందర్నీ చంపుతమంటం అమ్మ ఎందుకొచ్చిందో , ఏం చెప్పుతదో ఇంటవా? అట్లనే కూస్తుంటావా?" ధర్మయ్య శాంతింపజేశాడు.
    ఎవరూ మాట్లాడలేదు. వాతావరణం స్తంభించినట్లయింది. అంతా ఏదో అనంతం అయిన ఆలోచనలో మునిగినట్లయింది.
    "పావనమ్మా! వచ్చినపని చెప్పక పోతిరి" - మౌనాన్ని భంగం చేస్తూ అడిగాడు వెంకడు.
    "అమ్మకేమి పనిలేదు. మన పని కోసమే వచ్చింది "- బ్రహ్మయ్య చెప్పాడు.
    "అదే అడుగుతున్నం - ఆయమ్మ ఈడికొచ్చింది -- మేం మనుసులమని చెప్పింది పావనమ్మ ఏం చెయ్యమంటదో చెప్పండి, అగ్గిలో దూకమంటదా? పిడుగుల్లోకి ఉరకమంటదా?" పెంటయ్య ప్రతిధ్వనించాడు.
    "అవన్నీ చేయనక్కర్లేదు నేను చదువు చెప్పడానికి ఈ ఊరు వచ్చాను. చదువు మిమ్ములను మనుషుల్ని చేస్తుంది. శివయ్య గుట్టు రట్లను బయట పెడుతుంది. మీ కళ్ళు తెరిపిస్తుంది. లోకాన్ని చూచేట్లు చేస్తుంది. మీరు లోకాన్ని చూస్తే చాలు, శివయ్య కూలిపోతాడు మీరు చదువుకోవాలి. మీ పిల్లలను చదివించాలి అది అడగడానికే నేను వచ్చింది" పావని వచ్చిన పని వెళ్ళబెట్టింది.
    "నాకేమీ అర్ధమయితలేదు, చదువుకుంటే శివయ్యేట్ల పోతడు?" సందేహం వ్యక్త పరిచాడు వెంకడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS