పై వుద్యోగస్తులు, డబ్బున్నవాళ్ళు యెక్కువగా వున్న ప్రాంతాల్లో__అటువంటి ప్రాంతాలూ ఓటర్లూ ఈ నియోజకవర్గంలో చాలా తక్కువ. వాళ్ళు తనకి అంత ముఖ్యం కాదు. ఐనా వాళ్ళలో కొందరైనా వేస్తారనే దృష్టితో__
"Why is our human society in such a pight?
Why is there hatred between the so-callaed
Haves and haye-nots? Hatred is not the right solution for anything. Communism is sheer utopean nonsensical ideal. Stateless_ness is impossible. Equality should not be indiscriminative. Pay according to ability. Maintain such equality of opportuity justice and freedom_freedom to be what one wants to be. The state should not impose uonecessary retrictions on individual's activities, likes and dislikes etc....".
రవి ఉపన్యాసాలకి అన్ని వర్గాలవారూ ఆకర్షితులవటం గమనించిన గోవర్ధనరెడ్డి గ్రూపు గజగజలాడిపోయి - ఎదుర్కోవటం ఎలానా అని ఆలోచనలు సాగించారు.
నర్సిమ్ లు రెచ్చిపోయి, రాము, సాయిలు జట్టుని తన్నించాడు. రాములు చెయ్యి ఫ్రాక్చరైంది. భుజానికి పెద్ద గాయం అంది. సాయిలుకి బాగా దెబ్బలు తగిలాయి. మరో ఐదారుగురికి బాగానే తగిలాయి ఆ సమయానికి ఆ వార్త అందుకున్న రవి, వెంటనే అక్కడికి వెళ్ళి తన వాళ్ళందరినీ తగ్గమన్నాడు. "అంతేకాదు. ప్రతిచర్యగా వీలుచూసుకుని మళ్ళీ వాళ్ళని తన్న వొద్దు. మనని కొట్టింది కార్మికులు కాదు. కిరాయి గూండాలు. కిరాయి గూండాలకి ఓట్లు పడవు. మనకి బలం లేనట్లుగా అనుకుంటున్నారు. మనం వాండ్ల బొక్కలిర్గదంతె" అన్నాడు.
"వొద్దు గీ తీరున కిరాయి గూండాలను పెట్టి తన్నించిన్రు. పైసలిచ్చి ఓట్లు కొనేటందుకు చూస్తున్నారు. వాళ్ళిచ్చె పైసలు తీస్కొని వాండ్లకు వోట్లెయ్యకుంటే సరిపాయె" అని చెప్పి ప్రకారం చెయ్యున్రీ. అట్లచేస్తె మనమంటే అందరికి నమ్మకం పెరుగుతది. పేదప్రజలు మనవైపునే వున్నరుగద." అని రవి వివరించి ఆ రకంగా ప్రచారం చేయించటంతో, అగ్నిలో ఆజ్యం పోసినట్లు తన ఉపన్యాసాల ఆకర్షణ శక్తికి తన స్వభావం తీరుకి ఇది అదనంగా జోడించినట్లయింది.
రేపు పోలింగ్ అనగా గోవర్ధన్ రెడ్డి వర్గం బాగా డబ్బు పంచిపెట్టారు. పోలింగ్ రోజున చాటుగా తెరిచిన సారా దుకాణాల్లో తాగబోయించారు. లారీలు, వ్యాన్లు, జీపులు, కార్లు, టాక్సీలు, ఆటోలు, రిక్షాలు_ఎలక్షన్ జరుగుతున్నది ఒక నియోజకవర్గంలోనే కాబట్టి మరింత సులువుగా దొరకటంతో ముమ్మరంగా సరఫరా చేశారు.
ఓటింగ్ పూర్తి అయ్యేసరికి ఆ సరళి చూసి__ గోవర్ధన్ రెడ్డిగానీ రవిగానీ గెలుస్తాడని నిర్ధారించారు రాజకీయ పరిశీలకులు. ఓటర్లలో రవి గెలుస్తాడనే భావం యేర్పడింది.
ఓట్లు లెక్కింపు జరుగుతోంది. రవి వెళ్ళి తన పాకలో పడుకున్నాడు__గంగిని దగ్గిరికి తీసుకుని.
"కౌంటింగ్ యెట్లున్నదో తెల్సుకుందం" అని గంగి అంటే__"మనం చెయ్యాల్సిందంతా చేశాం, తీర్పు ప్రజలది. తాపత్రయం దేనికి? యీ ఎలక్షను దృష్టి నాకింతకు ముందెన్నడూ లేదు. అట్లా సంభవించింది గెలిచినా ఓడినా దిగులుపడను. పడుకో కౌంటింగ్ పూర్తయ్యేవరకూ. మధ్యలో ఎవర్నీ రావొద్దని చెప్పాను. రారు, పడుకో_" అని గంగి వీపుమీదుగా చెయ్యితిప్పి కళ్ళు మూసుకున్నాడు. ఐదు నిమిషాల్లో నిద్రపోయాడు.
గంగి రెస్ట్ లెస్ గా అటూ యిటూ కదులుతూ వుంది. బయట ఏ అలికిడి అయినట్లనిపించినా....కౌంటింగ్ పూర్తయ్యి అందరూ వచ్చారేమో అని చెవులు రిక్కించి వింటోంది.
ఆ అవస్థంతా తనొక్కతే పడాల్సొచ్చినందుకు 'మొద్దు' అని అనుకుంది రవిని ఆప్యాయతగానే.
తెల్లవారుజామున....బయట కోలాహలంగా జనం....
మేలుకునే వున్న గంగి, తడిక తలుపు తీసి బయటికి వచ్చింది.
పూలదండలతో జనం.
సంతోషంతో మాట రాక ఒక్క క్షణం ఆగి, "మీ రవీ సాబ్ నిద్రపోతున్నడు బేఫికర్ గ. ఏమాయనోనని నేనొక్కదాన్ని రాత్రంతా చావబడి!" అంది గంగి.
ఆ చప్పుడికి రవి లేచాడు.
రవీ సాబ్ జిందాబాద్ రవీ సాబ్ జిందాబాద్....రవిగారు జిందాబాద్....ప్రజానాయకుడు రవి జిందాబాద్....
రవి మెడనిండా పూలదండలు.
రవిని బలవంతంగా భుజాలమీదకి యెక్కించుకుని కూర్చోబెట్టుకుని నడుస్తున్నారు_రవికి_ దింపండి, నడుస్తాను_అనే అవకాశం కూడా ఇవ్వకుండా.
మరుసటిరోజున_రవికి ఘనంగా సన్మానం జరిపించాలనీ పుర ప్రముఖుల్నీ కొందరు మినిస్టర్లనీ పిలవాలని తీర్మానించుకున్నారు_అతని కార్మిక మిత్రులు. రవి ఒప్పుకోలేదు. "సభకి రాజ్ రెడ్డిని కూడా రప్పించవచ్చు. అది గొప్ప విషయంకాదు. ఈ చిన్న అవకాశంతో ఈ మన ప్రాంతంలోని మన స్థితిగతులను మెరుగుపరుచుకోటానికి ప్రయత్నిద్దాం" అన్నాడు రవి.
రవి ఎం.ఎల్.ఎ. క్వార్టరు అవసరం లేదు, అదే పాకలో వుందామంటే గంగి ఒప్పుకోవటం లేదు.
ఒకరోజున ఒక బంట్రోతు క్వార్టరు తాళాలు తీసుకొచ్చాడు. ఆ వేళకి రవి లేడు. గంగి వుంది. తీసుకుంది. వచ్చాక తెలిసి దెబ్బలాడబోయాడు. "అన్నీ నీ యిష్టమేనా, వూకుండు" అని కసిరింది. ఆమెవంక చూసి....తగ్గిపోయాడు.
మరుసటిరోజున, "వుంటే నువ్వుండు వెళ్ళి దాన్లో. నేనిక్కడే వుంటా" అన్నాడు.
"యీడా ఆడా కూడ వుందం" అంది గంగి.
ఆ క్వార్టరులోకి సామానూ కుర్చీలూ మంచాలూ అవీ కావాలంది.
"నా దగ్గిర ఒక్క పైసా లేదు. ఎప్పటికన్నా రెండువేలు జమయితే ఈ గుడిశ కొంటాను. నువ్వేం చేసుకుంటావో నాకు తెలవదు....నీదగ్గిరున్న వేల రూపాయలతో" అని నవ్వాడు.
మూడో రోజున ఆమె చేతికి వున్న రెండు బంగారు గాజులు అమ్మి ఆరు మంచి పేము కుర్చీలు, టీపాయ్, కిటికీలకి అందమైన తెరలు, ఒక ఇనప మడతమంచం....ప్లాస్టిక్ నవ్వారు అల్లినది....కొంది.
ఆ గాజులు అమ్మినట్లు చెప్పకుండా, "కుర్చీలు, కర్తెన్స్ గిట్లకొని డెకరేట్ చేసొస్తి" అంది.
ఆ గాజులు యెప్పుడో వాళ్ళ అన్న రాములు చేయించినవి. గంగికి రవి ఏమీ కొనలేదు. ఆమె ఏదీ కావాలని అడగలేదెప్పుడూ.
"వెళ్ళి వుండు హాయిగా." అన్నాడు.
"నువ్వు రాకుంటె యెట్ల? నువ్వు యీ గుడిసెను యిడవలేకుంటే ఈడనే వుండు. ఎమ్మెల్యే యాక్టివిటీస్ పాలిటిక్స్ తెలుస్తవి ఆడవుంటె. రెండు చోట్ల వుందం. పద." అని కదలదీసింది.
మరో కిరోసిన్ స్టవ్వు, కొన్ని అల్యూమినియం పాత్రలు, ఒక చక్కని టీ సెట్టు కొంది.
బయటిగది చూడటానికి నిండుగా చక్కగా అందంగా వుంటుంది. యిస్తే టీ యిచ్చి.
