దేవుడి మీద భారం వేసిన శివరావు ఒక నిట్టూర్పు విడిచి మోహన్ వెనకనే బయలుదేరాడు.
9
అక్కడ బస్సు ఆగంగానే.
ముందుగా సగంమంది బస్సు దిగారు.
సగం మంది బస్సు దిగేసరికి కొద్దిసేపు తర్వాత మిగతా వాళ్ళకి కూడా తోచక వాళ్ళు కూడా బస్సు దిగారు.
బస్సు లోపల పార్వతి ఒక్కతే వుండిపోయింది.
శివరావు వాళ్ళు బస్సు దిగేటప్పటికి పార్వతి పడుకొని వుండటం వల్ల, అలసిపోయి నిద్రపోయినదేమో అనుకున్నారు.
కానీ,
జ్వర తీవ్రతవల్ల మౌనంగా వళ్ళు తెలియకుండా పడుకుందని గ్రహించలేదు. అందరూ బస్సు దిగిన తరువాత, పార్వతి చలి భరించలేక భర్తని పిలిచింది.
శివరావు పక్కనే లేకపోవటంతో ఆమె రెండు మూడుసార్లు పిలిచి ప్రయోజనం లేకపోయింది. అందరూ బస్సు దిగారన్న విషయం గ్రహించింది. తను దిగలేక అలాగే పడుకుండి పోయింది.
శివరావు బస్సులోకి వచ్చేసరికి, తీవ్రమైన జ్వరంతో, తలనొప్పితో, చలితో వణికిపోతున్నది పార్వతి.
పార్వతి మూల్గటం విని, వంటి మీద చెయ్యివేసి చూస్తూ" ఎలా వుంది పార్వతీ!" అన్నాడు.
"చలీ, తలనొప్పి బాగా వుంది!" పార్వతి చెప్పింది.
"నిజమే జ్వరం బాగా వుంది. ఇప్పుడేం చేద్దాంరా? శివరావు మేనల్లుడితో అన్నాడు.
"ఎవరి దగ్గరయినా ఏదైనా టాబ్లెట్ వుందేమో కనుక్కుంటాను!" అంటూ మోహనరావు బస్సుదిగాడు.
"బస్సు ఎందుకు ఆగింది?" పార్వతి అడిగింది.
"వానకి చిన్న వాగు వచ్చింది. ఇంకో అయిదు నిముషాల్లో వాగు ఆగిపోతుంది. ఆ అయిదు నిమిషాలు ఆగి బయలుదేరటానికి బస్సు ఆపారు" అన్నాడు శివరావు.
"అంటే మన ప్రయాణం ఇంకా వెనక్కి పోతున్నట్లే కదండీ" భరించరాని చలితో వణికిపోతూ అంది పార్వతి.
"ఫరవాలేదు. డ్రైవర్ వేగంగా తీసుకువెళతానన్నాడు. అదే ఇప్పుడు మాట్లాడి వస్తున్నాను." అని చిన్న అబద్ధం ఆడాడు శివరావు.
అదే సమయంలో మోహనరావు బస్సులోకి ఒక వైద్యుడిని తీసుకువచ్చాడు. ఆ వైద్యుడుతో పాటు మరికొందరు కూడా బస్సు ఎక్కారు.
ఆ వైద్యుడు చెయ్యి పట్టుకుని చూసి, అది చలి జ్వరంగా నిర్ణయించాడు అప్పటిక్ అప్పుడే. నూట నాలుగు పైనే జ్వరం వుందని, తడి గుడ్డ మొహాన వెయ్యమని, జ్వరానికి ఫలానా టాబ్లెట్ లు ఫలానా టైమ్ అప్పుడు వాడాలని రాసిచ్చాడు.
ఆయన దగ్గర కూడా ఫాస్ట్ ఎయిడ్ బాక్స్ లేదు. తలనొప్పి తగ్గటానికి ఒక్క ఆస్ప్రిన్ కూడా లేదు. పార్వతికి బాగా జ్వరంగా వుందని, వెంటనే ఏదో ఒక మాత్ర వెయ్యాలని ఆయన చెప్పకుండానే శివరావు వాళ్లకి తెలుసు. పరిగెత్తుకుని వెళ్ళి ఏమయినా మాత్ర తెచ్చి వేద్దామన్నా దగ్గరగా ఏదైనా వూరు కూడా లేదు.
పార్వతి జ్వరంతో తలనొప్పితో వణుకుతూ వుంటే చూస్తూ వూరుకోవటం తప్ప ఏమీ చెయ్యలేక పోయాడు శివరావు.
పార్వతికి ఏదయినా భరిస్తుందేమో కాని చలి జ్వరాన్ని భరించలేదు. కాస్త వళ్ళు వెచ్చబడితే చాలు, ఏ మాతరో మందో తెచ్చేదాకా వూరుకునేది కాదు. అలాంటి పార్వతి మొదటిసారిగా "మాత్ర వేసుకోకపోతే ఏమీ కాదులెండి! ఇంతోటి జ్వరానికే చచ్చిపోను" అంది.
శివరావు హృదయం బరువుగా మూలిగింది.
ఇప్పుడు జ్వరం కాదుకదా మరేదొచ్చినా, పార్వతి భరించే స్థితిలోనే వున్నది. కొడుకు ప్రాణం ముందు ఇవేమీ లెక్కలోకి రావు.
పార్వతికి జ్వరంగా వుందని ఎవరి దగ్గరా ఏ మాత్రా సమయానికి లేదని బస్సులో వున్నవాళ్లకి తెలిసాక, వాళ్ళు మాట్లాడుకోటానికి ఒక కొత్త టాపిక్ దొరికింది. వైద్యం మీద, మందుల మీద తలో రకంగా మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.
