Previous Page Next Page 
కోటి యాభై లక్షలు పేజి 15


    "పిడత ముఖం బాస్ గాడు. నా శరీరాన్ని ఎన్నివిధాల చిత్రహింసలు పెట్టాలో అన్ని రకాలగానూ చిత్రహింసలు పెట్టాడు. నా శరీరం ఎన్ని చిత్రహింసలయినా భరిస్తుంది. కానీ ఆకలికి, దాహానికి మాత్రం తట్టుకోలేదు. చుంచు ముఖం వెధవ! నన్ను ఇంకా నాలుగు ఉతికినా భరించేవాడిని కదా! నా విషయం ఏదో బాగా కనిపెట్టినట్లు నీళ్ళు నిప్పులు లేకుండా ఈ గదిలో పడేసి మాడుస్తున్నాడు. ఈ కాసిని నీళ్ళతో నేను రేపటిదాకా బ్రతకను కాక బ్రతకను..." రామ్ సింగ్ అలా మాట్లాడుతూనే వున్నాడు. నేను నీరసంగా కళ్ళు మూసుకొని వున్నాను.


    తన మాటలు విననట్లు రామ్ సింగు గ్రహించాడు.


    నా భుజం పట్టుకొని కుదుపుతూ "నీవు మంచినీళ్ళు తాగకుండా నాకోసం త్యాగం చేశావు కదూ! ఎందుకలా చేశావు? నిజం చెప్పకపోతే నామీద ఒట్టే" అన్నాడు రామ్ సింగు చిన్నపిల్లాడిలాగా ఒట్టుపెడుతూ.


    నేను నవ్వీ నవ్వనట్లు వూరుకున్నాను.


    "నాకు నిజం కావాలి లేకపోతే గొంతులోకి వేళ్ళు పోనిచ్చుకొని త్రాగిన నీళ్ళు కక్కేస్తాను. ఆ తరువాత నీయిష్టం" నన్ను బెదిరిస్తూ అన్నాడు.


    "కొంతవరకూ నేను దాహం ఆపుకోగలను. కానీ నేనూ మనిషినే రామ్ సింగ్! ఆకలిదప్పులు మానవుడికి సహజం. నీ మంచితనం తెలీక కరుడు గట్టిన కసాయివాడిలాగా "కోటీ యాభయ్ లక్షలు" విలువగల వజ్రాల విషయంలో నిన్ను మోసం చేయదలచాను. ఈ రెండురోజులలో నీవు నా మిత్రుడివి అయిన తరువాత నీవు నాలాగానే బాధపడి ఈ స్థితిన వచ్చినవాడివని గ్రహించి అయ్యో! నిన్ను మోసం చెయ్యబోయానే అని బాధపడ్డాను. బాధపడినందువలన ప్రయోజనం ఏముంది? పాప ప్రక్షాళన కోసం ఈరోజు మంచినీళ్ళు త్రాగకుండా వున్నాను. ఇలా ఉన్నంత మాత్రాన నా ప్రాణం పోదు. నాకెందుకో ఈ పని చేసినందువల్ల తృప్తిగా వుంది" మనస్పూర్తిగా అన్నాడు.


    "నాకు మటుకు చాలా బాధగా వుంది" రామ్ సింగ్ బాధగా అన్నాడు.


    సానునయంగా రామ్ సింగ్ భుజం మీద తట్టాను. "మనం కళ్ళు మూసుకొని పడుకోవటం మంచిది బ్రదర్! కూర్చున్నా, నడిచినా, మాట్లాడినా శక్తి తరిగిపోతుంది. పడుకుంటే కాస్త శక్తి అయినా వుంటుంది శరీరంలో" అంటూ నెమ్మదిగా నేను రెండు చేతులూ తలక్రింద పెట్టుకుని వెల్లకిలా పడుకున్నాను.


    "ఇప్పుడే చాలా బాధగా వుంది. ఇంకా ఇంకా నోరు ఎండిపోయి దాహం దాహం అంటూ అరుస్తూ చివరికి అలా అరవటానికి కూడా శక్తి లేక చివరికి నాలిక బారజాపి గుడ్లు వెళ్ళుకొచ్చి చాలా దారుణంగా బాధపడి మరణిస్తామేమో" రామ్ సింగు అన్నాడు.


    "ఇట్లా ఆలోచిస్తే ఎప్పుడో బాధపడి పోయే ప్రాణం ఇప్పటినించీ బాధపడి అప్పటికి పోతుంది" అన్నాను.


    "ఓరి భగవంతుడోయ్! నువ్వు ఎక్కడ ఉన్నావురోయ్" అంటూ రామ్ సింగు వాపోయాడు.


    "నాకు నిద్రవస్తున్నది ఇంక అరవద్దు బ్రదర్! కొద్దేసేపు నన్ను ప్రశాంతంగా నిద్దుర పోనీయ్" అంటూ కళ్ళు మూసుకున్నాను.


    "ఈ విషయంలోనయినా నీవు అదృష్టవంతుడివి భాయ్! కడుపులో ప్రేగులు కరకరా అంటూంటే నీరసం తప్ప నిద్ర ఎలా వస్తుంది? భాయ్! నిద్ర అంటూ పడితే కాసేపన్నా ఈ ఆకలిని మరచిపోదును. సరేలే నువ్వు పడుకో! పడుకునే వాడినికూడా అనవసరంగా చెడగొడటం దేనికి?" అంటూ రామ్ సింగ్ మాటలు ఆపేశాడు.


    పడుకున్నానన్న మాటేగానీ నాకు మాత్రం ఎలా నిద్రపడుతుంది? ఆకలితో ప్రేగులు లుంగచుట్టుకు పోతున్నాయి. దాహంతో నోరు పిడచగట్టుకుని పోతూంది. మరణ వేదనకి అతి ఆరంభ దశలో ఉన్నాను. ఇలా సమయం గడిచిన కొద్ది మా పని మరీ దారుణమవుతుంది. ఆ స్థితి నేను వూహించగలను.


    నా ఊహ తెలిసినప్పటినుంచీ, నేను ఎలా జీవించిందీ, గుర్తుకు వచ్చింది. గతాన్ని తలుచుకుంటూ కొద్దిసేపు వుండిపోయాను. ఆకలి బాధ గతాన్ని ఎక్కువసేపు తలవనీయటం లేదు. మళ్ళీ వర్తమానంలోకి తీసుకువచ్చి పడేస్తున్నది. ఒక మంచి తల్లికి ఒక మంచి బిడ్డగా, మంచి విద్యార్థిగా, మంచి స్టూడెంటుగా (కాలేజీలో) ఎన్ని విధాలో పైకి వచ్చాను. మంచి పేరు తెచ్చుకున్నాను.


    కానీ,


    మంచితనానికి విలువలేదు.


    జీవితంని చేజారనీయకు అని కొందరు చెబుతారు. ఈ మాట అందరికీ వర్తించదు. చేజేతులారా ఏదయినా చేయరానిది చేస్తే, అదీ తెలిసి చేస్తే, ఆ మాటన్నా అర్థం ఉంది. నేను మంచి దోవలో నడుస్తూ ఉంటే నా దారికి అడ్డంగా నేను పాదం మోపేచోట సరీగ చూసి పల్లేరు కాయలు, ముళ్ళు, సీసం పెంకులు పోశారు. ఇది నేను చేజేతులా చేసుకున్నది ఎలా అవుతుంది? తెలిసి అంటుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుతుంది.


    ఇప్పుడు నా పని అలాగే అయింది. బాస్ గాడికి కుడిభుజంగా ఉండటంవల్ల వాడి గుట్టు మట్లు అన్నీ నాకు బాగా తెలుసు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ లో ఉన్న ఈ గది గురించి అన్ని రహస్యాలూ తెలుసు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS