"ఏం?"
"అలాంటి బాకీలేమయినా ఉంటే వసూలు చేసుకొద్దామని."
చలమయ్య నవ్వాడు. "అదేమిటోగాని కుర్రాడా? నువ్వు పనిలో చేరినప్పటినుంచీ బండపద్దులుకూడా వాటంతటవే వసూలవుతున్నాయి. బేరాలు కూడా పూర్వం కన్నా పెరిగాయనుకో." శ్రీహర్ష ఏమీ మాట్లాడలేదు.
"కుర్రాడా? మా యింటికి బొత్తిగా రావడం మానేశావేం."
"అవసరమేమీ లేదుకదండీ" అన్నాడు శ్రీహర్ష ఏమనాలో తెలీక.
"అవసరముంటేనేగాని రాకూడదా కుర్రాడా! మా రత్నం కూడా అడుగుతోంది శ్రీహర్ష కనబడటంలేదేమని. పోనీ ఒకపని చెయ్యి, రేపాదివారం మా వజ్రం పుట్టినరోజు? ఆరోజు భోజనానికి వచ్చేసెయ్యి."
"వజ్రమా! అమ్మగారి పేరు రత్నంగారు కదండీ."
"వజ్రం మా అమ్మాయమ్మా రత్నం మా ఆవిడ."
"అమ్మాయిగార్ని చూట్టానికి వస్తాలెండి. భోజనాలకెందుకులెండి"
"ఎందుకేమిటయ్యా! బోజనానికెవరు పిలుస్తారా అని మాలాంటి వాళ్ళం చూస్తుంటాం. నువ్వేమో..." అంటూ నోట్లో చుట్ట పెట్టుకున్నాడు.
శ్రీహర్ష ఏమీ జవాబివ్వలేదు. ఆదివారం అలా హరిజనవాడలోకి వెళ్ళి వద్దామన్న ఆలోచనలో వున్నాడతను.
ఆదివారమొచ్చింది. శ్రీహర్ష అలవాటు ప్రకారం పదింటికే నిద్రలేచాడు. లేవగానే ప్రతిరోజూ గ్రంథపఠనం చెయ్యడం అతని అలవాటు. ఆ గ్రంథాల్లో యెక్కువగా గొప్ప గొప్పవాళ్ళ జీవిత చరిత్రలూ, సాంఘిక దురాచారాలకు సంబంధించిన సమస్యలుగల రచనలూ ఉంటాయి. సమాజంలో ఏదో మార్పు, మనం మ్రగ్గుతూ దాసోహం అంటున్న అనాగరికత, వీటిని తలచుకొని అతని హృదయం ఆక్రోశిస్తూ ఉండేది.
ఏడు గంటలకల్లా స్నానం చేసి హరిజనవాడ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. దారిలో పరంజ్యోతి యెదురయ్యాడు.
"అప్పుడు ఉద్యోగం కోసం నా చుట్టూ తిరిగిన అబ్బాయివికదూ" అని పలకరించాడు.
"మీ చుట్టూ తిరగలేదండీ. ఉద్యోగం కోసం మీ దగ్గరకు కొన్నిసార్లు వచ్చాను." అన్నాడు శ్రీహర్ష సరిదిద్దుతూ.
"అదేలే. దాన్నే తిరగటమంటారు. మళ్ళీ రాలేదే నాదగ్గరకు?"
"మీ దయవల్ల చిన్న ఉద్యోగం దొరికిందండీ."
"ఎక్కడేమిటి?"
"చలమయ్యగారి కొట్లోనండీ."
"వాడిబొంద వాడిదగ్గరా? అలాంటి ఉద్యోగమైతే నేనే ఇచ్చేవాడినిగా. పోనీ ఒకపని చెయ్యి. వాడి దగ్గర మానేసి నా దగ్గర అసిస్టెంటుగా చేరు. నా వ్యవహారాలన్నీ చూస్తూ ఉందువుగాని. వాడిచ్చేదానికంటే ఓవంద రూపాయలెక్కువిస్తాను."
"థాంక్సండీ. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నారు. ఆయన దగ్గర మానెయ్యటమెందుకులెండి. వస్తానండీ" అంటూ శ్రీహర్ష ముందుకు కదిలాడు.
"ఓరి కుర్ర సన్నాసీ వేలెడులేవు. ఎక్కణ్ణుంచొ వచ్చినా ఊళ్లో చేరావు. నా మాటకే యెదురుచెప్పే మొనగాడివయ్యావా?" అని పళ్ళు నూరుతూ పరంజ్యోతి తనూ కదిలాడు.
పరంజ్యోతికి చలమయ్యమీద కోపం కలగడానికి ఒక కారణముంది. అతను వాసంతిని చేరదీసిన అయిదారు రోజుల తర్వాత చలమయ్య ఓ రాత్రి వాసంతి యింటికి వెళ్ళాడు. ఆమెను దగ్గరకు తీసుకోబోయాడు. వాసంతి అతని కందకుండా దూరంగా తొలగింది.
"తప్పు" నేను పరంజ్యోతిగారి మనిషిని. నన్ను మీరు తాకకూడదు." అంది.
చలమయ్య నవ్వాడు. "దేవత యెదురుగా నీ మెళ్లో తాళికట్టిన మనిషిని నేనని మరచిపోకు వాసంతి! నా తర్వాతే యెవరయినా. నిన్ననుభవించే హక్కు నాకు ఉంది, రా!"
"పరంజ్యోతిగారు జీవితాంతం నన్ను తన మనిషిగా చూసుకుంటానని మాటయిచ్చారు. నేనూ ఆ మాటకి కట్టుబడి ఉంటాను."
"నీ బొంద, బోగినివి మాట మీద నిలబడటమేమిటి? వాడి స్వార్థం కోసం వాడు నిన్ను ఉంచుకున్నాడు. నువ్వు పదిమందితో పోతే వాడికి సుఖరోగాలొస్తాయని భయం. జోగినికి ఎంత మందితో పోయినా పాపమేమీ ఉండదు. ఇదిగో యీ వందరూపాయలూ తీసుకో." అంటూ నోటు ఆమె మీదకి గిరాటేసి దగ్గరకు లాక్కోబోయాడు.
