8
ఊళ్ళో స్కూలు ఉంది. స్కూలుకో భవనం ఉంది. స్కూలు భవనం కట్టించడానికి డబ్బు గవర్నమెంటు ఇచ్చింది. బిల్డింగు కట్టించినవాడు శివయ్య . తానే స్వయంగా కట్టించుకున్నా నన్నాడు శివయ్య . అందులో తన ధాన్యం నిలువ చేసుకున్నాడు. ఆ ఊరికి ఇది శివయ్య గిడ్డంగి అనే నమ్మకం -- ఎంచేతంటే , శివయ్యది కాని ఆస్ట్రి ఆ ఊళ్ళో అరుదు.
ఆ ఊరుకు స్కూలుంది . స్కూలుకో టీచర్నూ నియమించింది ప్రభుత్వం . ప్రభుత్వ సొమ్ముతో స్కూలు కట్టించాడు శివయ్య. ఆ ఇల్లు తనదేనన్నాడు. గవర్నమెంటు నియమించిన టీచర్ను తన ఉద్యోగిగానే పరిగణించాడు శివయ్య. ఊరికి వచ్చిన టీచరు చదువు చెప్పకుండా ఉండడం శివయ్య ప్రధాన లక్ష్యం . శివయ్యకు చదువన్నా, వెలుగన్నా బెదురు అతడు గుడ్లగూబ లాంటి వాడు. చీకటి ఉంటేనే రాజ్యం చేయగలడు. నిద్రలో ఉన్న కాకుల కుత్తుకలు నులిమి అధికారం నిలుపుకోగలడు. శివయ్య రెండో లక్ష్యం - వచ్చిన టీచరుతో తన సొంత లెక్కలు రాయించుకోవడం ఈ ఏర్పాటు అటు శివయ్యకూ ఇటు పంతుళ్ళకూ బాగానే ఉపకరించింది. పంతులూ, బడీ ఎవరి కోసం ఉద్దేశించబడిందో వారికి ఉపకరించడం లేదు. అసలు వారికీ వాటి అస్తిత్వం, తెలియదు.
పావని తొలిసారి చదువు చెప్పుతానని ఊళ్ళో ప్రవేశించింది. అప్పుడు తెలిసింది ఊరికి. ఆ ఊరికి ఒక టీచరు ఉందని . పావని శివయ్య ఇంట్లో లెక్కలు రాయడానికి నిరాకరించడం , స్కూలు చెపుతానని పట్టుబట్టడం వింతగా కనిపించింది. ఊరికి పావని స్కూలు నడిపించగలదని ఎవరూ ఆశించలేదు, వారికి ఆశ్చర్యం కలిగించిందల్లా శివయ్య మౌనం. పావని శివయ్య మాట విననందుకు అప్పటికే ఆ ఊరి నుంచి వెళ్ళి పోవాల్సింది . శివయ్య వెళ్ళగొట్టి ఉండాల్సింది. అలా జరక్క పోవడం వింతగా ఉంది. పావని వెనక ఏదో బలం ఉందని నిర్ణయించుకున్నారు జనులు. శివయ్యను ఎదిరించి ఊళ్ళో ఉంటుంది పావని! శివయ్యను ఎదిరించగల పావని విషయంలో కొంత గౌరవం అభిమానం పెంచుకుంటున్నారు జనం.
పావని శివయ్యకు కోరకరాని కొయ్యగా తయారయింది. ఆమెను అక్కడ్నించి పంపించడానికి ప్రయత్నం చేయకపోలేదు. కాని, అధికారులు అతనికి ఏమాత్రం సహకరించలేదు. స్కూళ్ళన్నీ నడవాలని పట్టుదలతో ఉంది ప్రభుత్వం అని చెప్పారు. శివయ్య చెప్పుచేతలలో ఉన్న అధికారులు ఎవరూ కనిపించలేదు శివయ్యకు. తన పలుకుబడి అస్తమిస్తున్నట్లనిపించింది. ప్రభుత్వ వ్యవస్థలో ఏదో మార్పు కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. డబ్బూ, పలుకుబడి అధికారుల ముందు పనిచేయడం లేదు. శివయ్య ఓటమిని అంగీకరించి పట్నం నుంచి తిరిగి వచ్చాడు. తాను చేసిన ప్రయత్నాలను గురించి మరొకరికి తెలియనీయలేదు. గౌరీనాధశాస్త్రి అంటే వారికి బుగులు అందువల్ల పావని విషయంలో మౌనం వహించాడు శివయ్య.
పావని స్కూలు ప్రారంభించాలనుకుంది. కొంతలో కొంత ఊళ్ళో సానుభూతి సంపాదించింది కాని, ఎక్కడ ప్రారంభించాలి స్కూలు? స్కూలుకు బిల్దింగుందని ఆమెకు తెలుసు. అది శివయ్య గిద్డంగిగా ఉపయోగపడుతుందనీ తెలుసు కాని, ఈ విషయంలో శివయ్యతో తగాదా పడదలచలేదు. పావని ఊళ్లోకి రావడమే తనకు ప్రమాదకరం అనుకున్న శివయ్య పావని ఊళ్ళో ఉండడాన్ని సహిస్తున్నాడు అదే తన తోలి విజయంలా భావించింది. బ్రహ్మయ్య లాంటి సానుభూతి మలి విజయంగా భావించింది. కోటలో ఉన్న మల్లమ్మ , ఆమె ఆత్మీయత తనకు ఆశీస్సులనుకుంది. ఇలాంటి విషయాల్లో ఒక్కొక్క అడుగు వేయడం మంచిది ఒక్కసారే దూకుటే కాళ్ళు విరుగుతాయి. విరిగిన కాళ్ళతో ముందడుగు వేయలేం. ఒక్కొక్క అడుగు వేస్తూ సాగుతే ఎప్పటికయినా లక్ష్యం చేరుకుంటాం, ఊరిలో ఏదో కాస్త చైతన్యం కనిపిస్తుంది బడి పెట్టడం విషయంలో అంతగా విముఖత చూపడం లేదు. బడి భవనం విషయంలో శివయ్యను కదుపుతే నిద్రలో ఉన్న పులిని లేపినట్లవుతుంది. అయినా, బడి అంటే భవనం మాత్రం కాదు - చదువుచెప్పే ఆసక్తి, సేవాభావం ఉన్న ఉపాధ్యాయులు , చదువు విషయంలో శ్రద్దా ఆసక్తి గల విద్యార్ధులు.
ఊరి మధ్యన ఒక పెద్ద చింతచెట్టు ఉంది. అది చక్కని నీడ నిస్తుంది. చెట్లు చక్కని నీడ నిస్తాయి. మనిషి ఇవ్వలేడు. పావని ఆ చెట్టు కిందనే, చెట్టు నీడనే స్కూలు ప్రారంభించింది. వేళకు ఇంటి నుంచి బయలుదేరుతుంది. ఒక కుర్చీ ఇంటి నుంచి తీసుకేళ్తుంది. అది వేసుకుని కూర్చుంటుంది. పిల్లల కోసం ఒకటి రెండు చాపలు సంపాదించింది రెండు చాపలు, ఒక కుర్చీ , చింతచెట్టు నీడ - ఇదీ పాఠశాల!
పావని చింత చెట్టు కింద కూర్చుంటుంది కాని పిల్లలు ఎక్కువగా రావడం లేదు. తొలిరోజున నలుగురు, అయిదుగురు వచ్చారు వారిని చూస్తె అనేక సమస్యలు ఎదురుయినాయి. వారికీ బట్టలు లేవు - చిరిగిన బట్టలు శుభ్రంగా లేరు - చీమిడి ముక్కులు, ఆరోగ్యంగా లేరు - బానపొట్టలు పట్నంలో తాను చదువుకున్న స్కూలు గుర్తుకు వచ్చింది - యూనిఫాంలు , కళకళలాడే ముఖాలు - ఎంత వ్యత్యాసం! ఇది ఒకే దేశం - అవి పట్నాలు - ఇవి పల్లెలు !
వచ్చిన పిల్లలకు చేతుల్లో పలకలు లేవు. - పుస్తకాలు లేవు. వారెందుకు వచ్చారో తెలియదు. ముత్యాలు వారిని వెంట తెచ్చింది -- పావని చాలా మంచిదని , చాకలెట్లు ఇస్తుందనీ పిలుచుకు వచ్చింది. పావనికి వాళ్ళను చూస్తె ఏడుపు వచ్చింది వాళ్ళకు చదువంటే తెలియదు - అక్షరం తెలియదు.
"అమ్మగారూ! నాకిచ్చింది శాన బాగున్నది వీండ్లకు గూడా యియ్యుండి" ముత్యాలు చెయ్యి చాచి అడిగింది.
పావని ముత్యాలును దగ్గరికి తీసుకుంది. చాకలెట్లు అందించింది. అందరికీ ఇమ్మంది -- ముత్యాలు మురిసిపోయింది. అందరికీ తలా ఒకటీ ఇచ్చింది -- తాను రెండు మిగిలించుకుంది. ఎవరికీ దానికి చుట్టిన కాగితం విప్పరాలేదు. గర్వంగా విప్పి చూపించింది ముత్యాలు. ఆ కాగితాలు అంతా జాగ్రత్తగా దాచుకున్నారు. అవి వింతగా ఉన్నాయి వారికీ.
'అమ్మగారూ! దీన్నేమంటారు?" ముత్యాలు అడిగింది.
"చాకలెట్లు ' -- జవాబు చెప్పింది పావని. పావనికి వాళ్ళు తనను 'అమ్మగారూ!" ఆని పిలవడం బాగనిపించలేదు వాళ్ళు తనను యేమని పిలవాలి? తాను 'టీచర్" అని పిలిచింది. వీళ్ళను అలాగే పిలవమందా ,మనుకుంది ఎందుకో అమెకది నచ్చలేదు. అది ఇంగ్లీషు పదం "పంతులమ్మా! అనమందామనుకుంది కాని అలా అనమంటే వాళ్ళు పంతులమ్మగారూ!" అంటారు. అంత కంటే "అమ్మగారూ!" అన్న పదమే బాగుందనుకుంది. ఆ పదంలో ఆత్మీయత ఉంది అనురాగం ఉంది. అనుబంధం ఉంది. టీచర్ వాస్తవంగా తల్లి వంటిది. అజ్ఞానులు -- నిరక్షరాస్యులు అనుకునే వారు ఎంత చక్కని పదాలు వాడ్తారు! ఎంత సార్ధకంగా వాటిని ఉపయోగిస్తారు /
"ముత్యాలూ! మీ అమ్మను ఏమని పిలుస్తావు?"
"అమ్మా అని పిలుస్తం"
"నన్ను కూడా అట్లాగే పిలువు "గారూ" అనకు నేను మీ అమ్మలాంటి దాన్ని కానా"
"అమ్మా" ముత్యాలు ముందుకు ఉరికి వచ్చి కాళ్ళను చుట్టేసుకుంది . "అమ్మా!" నువ్వు మా అమ్మకంటె మంచిదానివి మా అమ్మ చాకిలేత్తు ఇయ్యది' అన్నది, తల ఎత్తి పావని ముఖంలోకి చూస్తూ.
పావని గుండె చెరువయింది కనులు చేమ్మగిల్లాయని చెప్పనవసరం లేదు.
"ముత్యాలూ! అట్లానోద్దు మీ అమ్మ మంచిది" అని ముత్యాలును దగ్గరికి తీసుకుని తల నిమిరింది.
పిల్లల ఆప్యాయత, అనుబంధం పావనిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాను ఈ ఊరికి రాకుంటే ఇంత ఆత్మీయత వట్టిపోయేది కదా అనుకుంది.
పిల్లలకు ఆ కధా, ఈ కధా చెప్పి పంపించేసింది.
తెల్లవారి పలకలకోసం ప్రయత్నించింది. ఆ ఊళ్లోఅవి దొరకవు వాటితో అక్కడ పనిలేదు. వాటి కోసం తాను పట్నం పోలేదు. శాస్త్రీ గారిని తెమ్మంటే నిరాకరించారు. పావని అంటరాని వారిని అంటుకోవడమే మహాపాపం అన్నారు. ఈ పాపంలో తాను పాలు పంచుకోనన్నారు. పావని తండ్రితో వాదనకు దిగుదామనుకుంది. అంటరాని వారిని సృష్టించింది ఎవరో అడుగుదామనుకుంది. కాని మానుకుంది. తండ్రి ఈ మాత్రం అనుమతిస్తున్నారు - అదే చాలు ననుకుంది. బ్రహ్మయ్యకు డబ్బిచ్చి పలకలు తెమ్మని చెప్పింది.
ఒకనాడు చింత కింద కూర్చొని ఉంది ముగ్గురు పిల్లలు చాపల మీద కూర్చున్నారు. వాళ్ళు కాస్త శుభ్రంగా ఉన్నారు. వారికి తాబేలూ- కుందేలు కధ చెబుతుంది. శివయ్య అటునుంచి వెళ్తూ పలకరించాడు. పావని లేచి నుంచుంది. పిల్లలూ లేఛి నుంచున్నారు. ఆ క్రమశిక్షణ- ఆ వాతావరణం ఆశ్చర్యం కలిగించాయి శివయ్యకు.
"సాధించావమ్మా ! బడి పెట్టినవు - శివయ్య
"ఇదంతా మీ అనుగ్రహం"
"అవునమ్మా! ఈ పొరలు చదువుకుని ఏం చేస్తరు? ఊళ్ళేల్తారా?"
"నీదంతా ఒక పిచ్చి వీళ్ళకు చదువు ఎందుకమ్మా- సరే నీ ఇష్టం" అని వెళ్ళిపోయాడు. బడి కోసం కట్టించిన ఇంటి మీద ఆమె దృష్టి పడనందుకు సంతోషించాడు శివయ్య. చెప్పుకోనియ్యి చదువు అనుకుని సాగిపోయాడు.
