ఎలక్షను దగ్గిర పడుతున్నకొద్దీ ప్రచారం ఉధృతమైంది.
గోవర్ధన్ రెడ్డి మందీ మార్బలంతో జీపుల్లో తిరుగుతూ_యిరవై పాతిక ఓట్లు వీడిచేతులో వున్నాయనుకున్న ప్రతివాడినీ దువ్వి రకరకాల వ్యక్తికమైన ఆశలు చూపెడుతున్నారు అతని అనుచరులు. అప్పటికప్పుడు వాళ్ళ అవసరాలకి కొంత డబ్బు సర్దుతున్నారు.
తనని సమర్థించే కార్మికులు రిక్షాలు తెస్తామంటే కూడా రవి ఒప్పుకోలేదు. మీ రిక్షాలు కాంగ్రెస్_ఐ వాళ్ళకి కిరాయికి తిప్పి డబ్బులు తెచ్చుకోండి_ ఓట్లు నాకు వెయ్యాలనిపిస్తే వెయ్యండి, చాలు_ అన్నాడు. కాలి నడకనే నియోజకవర్గం అంతా తిరుగుతున్నాడు, కూడా నలుగురైదుగురు కార్మికులు. రాములు, సాయిలు, మరో యిద్దరు మరికొందరు కార్మికుల్ని, కూలి నాలి జనాన్ని తీసుకుని జట్లు జట్లుగా ఏర్పడి విడివిడిగా తలా కొన్ని ప్రాంతాల్లో ప్రచారం ప్రారంభించారు_అభ్యర్థుల గురించీ పార్టీల గురించీ వివరిస్తూ, వాళ్ళకి వాళ్ళకే అనిపించిన దాన్ని బట్టీ రవి సూచనలననుసరించీ_యీ పార్టీలు యిన్నాళ్ళుగా వాళ్ళకి వొరగబెట్టింది యేమీలేదనీ, రవి నిస్వార్ధంగా పేద ప్రజల క్షేమం కాంక్షించే మనిషి అనీ ప్రచారం సాగిస్తున్నారు.
రవి తనతో కేవలం నలుగురు వర్కర్లను తీసుకుని ప్రచారానికి దిగాడు. గంగిని కూడా రావొద్దన్నాడు. ఆమె విడిగా యింటింటికీ తిరిగి ఆడవాళ్ళతో ప్రచారం సాగిస్తూనే వుంది. రవి వ్యక్తుల్ని కలుసుకుని వివరించటం అర్థించటం చెయ్యటంలేదు. ఆ నేర్పు అతనికి లేదు. చిన్న చిన్న ఉపన్యాసాలు యేర్పాటు చేసుకున్నాడు. వాడకట్టుకో చిన్న ఉపన్యాస సభ. అతని ఉపన్యాసం ధోరణీ తీరూ తను మాట్లాడుతున్న ప్రాంతాన్ని బట్టి వుంటుంది. ఉపన్యసించటం అతని అసాధారణ సామర్థ్యం. కాలేజీలో ఇంగ్లీషులో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా శ్రోతలందర్నీ ఆకట్టుకునేవాడు....తను చెప్పే విషయంతో ఏకీభవించని వాళ్ళతో సహా.
ఇందులో కులాల బలం లేదు. కార్మికులు కూలి ప్రజానీకం. వీళ్ళింకా యస్సీ,బీసీ కులంగా ఏర్పడలేదు....చదువుకున్న చదువుకుంటున్న వాళ్ళలోలాగా. రవి కులం అక్కడే కాదు. తెలంగాణా ప్రాంతంలోనే సరిగా తెలియదు. ఖమ్మం దాటి, కమ్మ కులం అంటే తెలియదు. కమ్మ అని చెబితే కమ్మ కాపునా....అంటారు. కాపులో జమ చేసేస్తారు కమ్మకులం, యిప్పటి బలమైన అగ్రకులాల్లో ఒక అగ్రకులం అని తెలియదు. తెలంగాణాలో కులం దృష్ట్యా రెడ్డి కులానికి పోటీ వున్నట్లూ అనిపించదు. రాజకీయంగా....ఒక కులంగా అదొక్కటే అగ్రకులంగా అనిపిస్తుంది. అందువల్ల ఆంధ్రప్రాంతంలో లాగా, తెలంగాణాలో రాజకీయంగా కులతత్వానికి ప్రాముఖ్యత లేదు, ఐతే రాష్ట్రం అంతటా ఎన్నికలు జరుగుతున్నప్పుడు కొంత ప్రభావం వుంటుంది.
రవి రోజంతా ఉపన్యాలిస్తూనే వున్నాడు. భారీగా ఏర్పాటు చేసిన పెద్ద పెద్ద సభలు కాదు. అతి చిన్న చిన్న సభలు, వాడకట్టుకో సభ. గోవర్ధన్ రెడ్డితో యీ విషయం అంటే. "వొర్లితే ఓట్లేస్తారు? వొర్లి వొర్లి వాని నోరువోతది!" అని నవ్వాడు.
రవి ఉపన్యాసం, విషయం, సరళి, ధోరణి, భాష__తను మాట్లాడుతున్న ప్రాంతాన్ని బట్టి వుంటాయి.
సీజన్లను బట్టి అవీ ఇవీ పన్లు చేసుకునేవాళ్ళు ఎక్కువగా వున్నచోట _ "గింత కాలంగ యిన్ని పార్టీలను గెలిపించిన్రు. కమ్యూనిస్టు పార్టీని గెలిపించిన్రు. కాంగ్రెస్ పార్టీని గెలిపించిన్రు. ఓట్లేసి వాండ్లను గెలిపిస్తపోతాన్రు మీరందరు. కానైతె మనకేమి చేసిన్రు వాండ్లు? దూపయితె తాగెటందుకు నల్లాలైన యెయ్యకపాయె_ గల్లీకొకటన్న! మనమంత, చిన్న చిన్న పనులు చేస్కొనెటంద్కు, గాడీ ఖరీద్ చేసెటంద్కు, పాన్ దుకాన్ వెట్టెటంద్కు, బర్రెలను కొనుక్కొనెటంద్కు_యిట్ల మస్తు దందల కోసం సర్కార్ లోన్లు ఇస్తమని ప్రచారం చేస్త వొచ్చిన్రు. కొందర్కి యిచ్చిన్రు గూడ. కానై తె, ఆ పైసలు పూరాగా యిస్తున్నరా! సగం పైసలెగద మన చేతుల కొచ్చేది! గదంత దుఫ్తర్లల్ల గొటాల. ఈ లోన్ల ముచ్చట యీ కాంగ్రెస్ పార్టీ జేస్తున్న మోసం. యిన్నేండ్ల సంది యెట్లున్నమో యిప్పుడు గూడ అట్లనే వున్నం. మన కష్టాలు అట్లనే వున్నవి. ఏమిట్కున్నవి? వాండ్లు ఝాటాగాండ్లు. ఓట్ల కోసం ఏమైనా చేస్తరు. మన కష్టసుఖాలతోటి వాండ్లకు పనిలేదు. యాడనో మహల్స్ ల కూకొని తాగి పండుకుంటె యేమైనది? మనం గెలిపించెడి మనిషి మనలోని మనిషి, తనతోటి వుండెడి మనిషి, మన కష్టాలు చూసి యేమన్న చేయగల్గిన మనిషి కావాల......"
కార్మికులు అధికంగా వున్న ప్రాంతంలో__ "యీ కార్కానలు యీ ఫ్యాక్టరీలు ఎవరివి? వాండ్లవి. వాండ్ల సొంతం. కాని వాండ్లకా పైస యాడికెల్లొచ్చెను? అదంత మన కష్టం. మన శ్రమ. వూకెనన్న కూకుండి, మనందరితోటి దిన్ రాత్ పని చేపించుకొని ధర్మమిచ్చినట్లు జరంత పైసలిస్తున్నరు. గీముచ్చట కమ్యూనిస్తోండ్లు గూడ జేస్తరు. కాని వాండ్లల్ల యిమాన్ దారీ తోటి, మనకోసం పోరాడే టోండ్లు యాడున్నరు? గెలిచినంక కాంగ్రెస్ సర్కారి తోటి చాటుగా షరీమయ్యి మిద్దెలు కట్టుకుంటున్నరు. పర్మిట్లు తెచ్చుకొని పైకి రమాయించుకుంటున్నరు. అంతెగాని మన కష్టాలు తీరుస్తున్నరా? బోనస్ సమస్య. భత్యం సమస్య. దవఖాన సమస్య. యెన్ని సమస్యలు! ఏది తీరుస్తున్నరు? యేమన్నంటె మనకున్న జోంస్డీలను గూడ పీకిపారేస్త_అంటున్నరు. హౌస్ ప్లాట్స్ యిస్తున్నరా? ఇండ్లు కట్టిపించిస్తున్నరా? లే నామ్ కెవాస్తె యాడనన్న కట్టినగూడ _ కాంట్రాక్ట్ రోడ్ల పైసలన్ని మింగేసి కట్టిపించి యిచ్చేటిండ్లు__చూస్తున్నం గద, నాల్గు వానలు పడగానే కూలిపోతున్నవి. మన పానాలు గూడ పోతున్నవి. ఎంతసేపు వాండ్ల తకరార్ లె గాని వర్కర్ల కష్టసుఖాలు చూసేది లేదు. కలిసేది లేదు. ఎక్కడి కమ్యూనిస్ట్ పార్టీ! యెప్పుడో పాయె! ఓటు ఎవరి కెయ్యాల్నంటె__ యీ పార్టీల వాండ్లందరు లఫంగగాండ్లు, బద్మాష్ లు, ఝాటాగాండ్లు, ఇండిపెండెంట్ గ యిమాన్ గారి తోట పని చేస్తాడనిపించిన మనిషినే గెలిపిస్తే మనకష్టాలు తీర్తవి. అందుకు నన్ను కంటెస్ట్ చెయ్యమంటే చేస్తి. మన కష్టాలు చూసెడి మనిషిని యింకెవరినన్న కోరుకుంటే నేను పోటీలకెల్లి తప్పుకోని ఆయననే సపోర్ట్ చేసి మద్దతిస్త ......."
మధ్యతరగతి ఆంధ్రా ప్రాంతపు ఉద్యోగులు ఎక్కువగా వున్నచోట్ల__ "యీ వ్యవస్థ ఒక మహా విష వటవృక్షం ఐంది. శాఖోపశాఖలుగా విస్తరించింది. యీ పార్టీలన్నీ గాని శాఖలే. కమ్యూనిస్టులు వేరు పురుగులుగా తయారయ్యారు. కాంగ్రెస్ కిరాతకంగా తయారయింది. జనసంఘ్ రకరకాల భావ విద్వేషాలను రెచ్చగొట్టే వెర్రికొమ్మలా తయారైంది. యీ మహా వ్యవస్థని మార్చాలంటే దీర్ఘకాలిక పథకం అవసరం. మరో కొత్త ధృక్పథం ఆచరణ యోగ్యమైన సర్వులకూ మేలు కూర్చే కొత్త సిద్ధాంతాన్ని రూపొందించుకోవాలి. కమ్యూనిజమూ కాదు. కేపిటలిజమూ కాదు. అందరికీ అన్నీ సమకూర్చే సమసమాజం వంటి ఒక నూతనవ్యవస్థ అవసరం. కాంగ్రెస్ కాదు. ఆవడి కాంగ్రెస్ లో రూపొందించిన సోషలిస్ట్ పెట్టర్న్ విధానం నేతిబీరకాయ వంటిది. అదొట్టి నీటి మాట. బూటకం మాట. మొసలి కన్నీళ్లు కార్చటం మాత్రమే. చాలీచాలని వుండీలేని స్థితిలో బ్రతుకు దుర్భరం. కట్నాల బాధలతో, అతిథి మర్యాదలతో, పరువు ప్రతిష్టల కోసం ప్రాకులాడుతూ_ వీటికి సరిపడా ఆర్ధిక స్థోమత లేక నానా చావు చస్తున్న మధ్యతరగతి అంటూ ఒకటి వున్నదని, అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు కమ్యూనిస్టు పార్టీకి తెలియనే తెలియదు. జనసంఘ్ వింత విష బీజాలు నాటటంలో నిమగ్నమై వుంటుంది. వాళ్ళకి మధ్యతరగతి వారి హైందవ సెంటిమెంట్లని ప్రేరేపించి తమ స్వార్థానికి వాడుకోవటం బాగా తెలుసు. అంతేగానీ ఆ మధ్యతరగతి హైందవ సెంటిమెంట్ల జటిల సమస్యల ఆర్ధిక సాంఘిక కారణాలను నిర్మూలించే యోచనే లేదు. ఈరకంగా ఇప్పుడున్న పార్టీలు, మధ్యతరగతి ప్రజలకుండే సునిశితమైన సమస్యలను పరిష్కరించుకోటానికి అవసరమయ్యే ఆర్ధికస్థోమతని పెంచే ఆలోచనే లేదు....."
