Previous Page Next Page 
ఆఖరి క్షణం పేజి 14

"ఏం? అర్జెంట్ గా వెళ్ళాలా తాతగారూ!" అడిగాడు ఆయన.

"అవును."

"ఏం? ఎవరికన్నా బాగోలేదా?"

"బాగుండక పోవటం కాదు."

"మరి అర్జంట్ అంటున్నారు!"

"అవునయ్యా అర్జంటే. నా కూతురు రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో వుంది."

"ఇంతకు ముందే బాగుండక పోవటం కాదు అన్నారు. మరి ఇప్పుడేమో మీ అమ్మాయి ఆస్పత్రిలో వుంది అంటున్నారు..." అనుమానంగా అడిగాడు ఆయన.

"ఆస్పత్రిలో వుండటం అంటే జబ్బుచేసి కాదయ్యా. నిండు నెలల మనిషి. కానుపు వస్తుందంటే చేర్చారు. అక్కడనుండి కబురు వస్తే, వెంటనే బయలుదేరాను. ఆస్పత్రిలో చేర్చి రెండురోజులయి ఇంతవరకూ ఏ పిల్ల పుట్టలేదంటే, నాకు కంగారు కాక ఎలా వుంటుంది? వెధవ వాన, వెధవ వాగు." మరోసారి వాగుమీద, వానమీద విసుక్కుంటూ చెప్పాడు ఆ ముసలాయన.

"విషయం అదన్న మాట. మీరేం కంగారు పడకండి తాతగారూ! వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదు అంటారు. అలాంటిదే మరోమాట చావు పుట్టుకలు. ఈ పాటికి ఎప్పుడో మీ అమ్మాయి సుఖంగా ప్రసవించి వుంటుంది. మీకు మనవడూ పుట్టివుంటాడు." అన్నాడు. ఆయన సిగరెట్ చివరి దమ్ము పీలుస్తూ.

"అలా జరుగుతుందంటావా?" ఆశగా అడిగాడు ముసలాయన.

"మీరే చూస్తారు గదా! సరిగ్గా నేను చెప్పినట్లే జరుగుతుంది." అభయమిస్తున్నట్లుగా అన్నాడు ఆయన.

తాతగారి మనస్సు ఇప్పుడు కాస్త నెమ్మళించింది. జేబులోంచి లంక పొగాకు చుట్టతీసి వెలిగించుకున్నాడు. ఆ తరువాత ఇరువురూ వేరే కబుర్లలో పడ్డారు.

బస్సు దిగివచ్చి, వాళ్లకి కొంత దూరాన నించొని వున్న శివరావు, మోహనరావుల చెవులకి వీళ్ళ సంభాషణ వినిపించింది.

"ముసలాయన విషయం వేరు. వాళ్ళమ్మాయి నిజంగానే క్షేమంగా కనవచ్చు. నా పరిస్థితి అలాంటిది కాదు తమ కన్నా మూడుగంటల ముందుగా విషం కల్సిన హల్వా బాబాయ్ తోపాటు ప్రయాణించింది. ఆ మూడుగంటల కాలాన్ని అధికమించి, తాము చంద్రం దగ్గరికి ముందుగా చేరకపోతే, ముక్కు పచ్చలారని చంద్రం ఆ హల్వా తిని... ... ..."

శివరావు ఆపైన ఆలోచించలేకపోయాడు.

తలచుకుంటే అతనికి దుఃఖం వస్తున్నది. హల్వాలో విషం కలపటం అన్నది పార్వతి తెలియక చేసిన పొరబాటు. తెలిసీ తెలిసీ చేసిన పొరబాటు తనది. ఆ విషం సీసా తెచ్చిననాడే "పార్వతీ! ఇది విషం సీసా." అని చెప్పినట్లయితే ఎంత బాగుండేది. చేజేతులారా తనే... ... ...

శివరావు కళ్ళలో సన్నటి కన్నీటి పొర కదులాడింది.

అది గమనించిన మోహనరావు, "ఏమిటి? మామయ్యా! నీవుకూడా. నిన్నిలా చూసిందంటే అత్తయ్య అసలు లేవదు. నీవు నిబ్బరంగా వుంటేనే అత్తయ్య కూడా నిబ్బరంగా వుంటుంది. నేను చెపుతున్నాను కదా! మన చంద్రానికేమీ కాదు. నువ్వే చూస్తావుగా!" అభయమిస్తున్నట్లుగా అన్నాడు.
"నాకు నమ్మకం లేదురా మోహన్!" దగ్గుత్తికతో అన్నాడు శివరావు.

"నమ్మకం ముఖ్యమని నువ్వే ఎన్నోసార్లు చెప్పావు మామయ్యా! గుర్తుందా!"

"చెప్పాను. నమ్మకం కన్నా మూడుగంటల ముందు విషం ప్రయాణిస్తున్నది. నా కళ్ళతో చంద్రాన్ని క్షేమంగా చూసేదాకా నేను ఏదీ నమ్మను." తన మాటల మీద తనకే నమ్మకం లేని శివరావు అన్నాడు.

"బస్సులో అత్తయ్య ఒక్కతీ వుంది. ఈ వాగు ఇంకో పావుగంటకి కానీ తగ్గదు. మనం బస్సులోకి వెళ్ళి కూర్చుందాం పద!" అంటూ ముందు దారితీశాడు మోహన్ రావు.

భగవంతుడా! భారం నీదేనయ్యా! మా జీవితాలను ఏం చెయ్యనున్నావో. అంతా నీ చేతుల్లోనే వుంది." మూగగా అనుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS