ఒకటా!
రెండా!
ఒక కోటీ యాభయ్ లక్షలు.
7
ఈ రోజు,
మా కోటా పావు గ్లాసు మంచినీళ్ళు.
పావు గ్లాసు మంచినీళ్ళూ తెచ్చి ఇచ్చి, తన మానాన తను వెళ్ళిపోయాడు బాస్. మాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అది చూసి కోపం పట్టలేని రామ్ సింగ్ "పై జన్మంటూ వుంటే, ఎడారిలో పుట్టి, ఎడారిలోనే ఏడురోజులు నీళ్ళు లేకుండా వుండి ఏడ్చి, ఏడ్చి గొంతెండి చస్తావ్! పందివెధవా! కుక్క వెధవా!" అంటూ తన నోటికొచ్చినట్లు తిట్టాడు.
బాస్ మాట్లాడకుండా ముఖానే వెకిలిగా నవ్వి వెళ్ళిపోయాడు.
రామ్ సింగ్ భుజంమీద చెయ్యి వేశాను.
"తిట్టేచోట తిట్టాలేగానీ, ప్రతిచోటా తిడితే పనులు కావు బ్రదర్" సానునయంగా అన్నాను.
"ఇలాంటి లుచ్ఛా నా కొడుకులని బ్రతిమలాడినా పని కానపుడు తిట్టడమే మంచిది. కాస్త కసి అన్నా తీరుతుంది" రామ్ సింగ్ పళ్ళు కొరుకుతూ అన్నాడు కోపంగా.
"కసి తీరటం మాట అటుంచు. ఇలా కోపంగా అరవటం వలన దాహంతో నోరెండి మరింత పిడచకట్టుకు పోతుంది నోరు..."
నా మాటలకి మధ్యలో అడ్డువచ్చి_
"అందుకని తిట్టవద్దంటావా భాయ్! ఎట్లాగూ నోరెండిపోతూనే వుంది. మూడో కంటికి తెలియకుండా ఈ జైల్లో మనం చావటమూ ఖాయం. కనీసం నన్ను తిట్టనియ్యి" అన్నాడు రామ్ సింగ్.
"నీకు జీవితం మీద ఆశలేదా?" నిదానంగా అడిగాను.
"ఆశ వుంటే బ్రతుకుతామా?" ఎదురు ప్రశ్నించాడు రామ్ సింగ్.
"బ్రతుకుతామో లేదో తెలియదుగానీ ఆశ అనేది కొంతవరకూ మనిషిని బ్రతికిస్తుంది. నేను చూడు నీలాగా మరీ నిరాశలో పడిపోలేదు. అందువల్లనే నీ అంత డీలా పడకుండా, ఇంకా ఏదో ఆశతో బ్రతికేస్తున్నాను. ఏదో ఆశ మినుక్ మినుక్ మంటూ దూరంనుంచీ నాకు కనిపిస్తున్నది. అందువల్లనే కాబోలు నాకు నీ అంత దాహం వెయ్యటం లేదు. పైగా నేనొక సాధన చేశాను. నీకు చెప్పాను కూడా ఆ విషయం. మళ్ళీ చెబుతున్నాను. ఈ రోజంతా కూడా నేను నీళ్ళు త్రాగకుండా వుండగలను. పావుగ్లాసు నీళ్ళు నువ్వు త్రాగేయ్" నీళ్ల గ్లాసుని జాగ్రత్తగా పట్టుకుని రామ్ సింగ్ కు అందిస్తూ అన్నాను.
అప్పటికి ఆ గ్లాసులో పావువంతు నీళ్ళవంక ఆశగా పదేపదే చూస్తున్న రాంసింగ్ నా మాటలు వింటూనే చింకి చాటంత ముఖం పెట్టాడు. అంతలోనే ఏదో అనుమానం రాగా ముందుకు చాపిన చెయ్యి వెనక్కి తీసుకొని "నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదూ! భాయ్! ఈ నీళ్ళు నాకిచ్చి నువ్వు మరణించి నన్ను బ్రతికించాలని చూస్తున్నావు కదూ?" అనుమానంగా నన్ను చూస్తూ అడిగాడు.
"నేను మరణించి నిన్ను ఎన్నాళ్ళు బ్రతికించగలను? అవతల మనికిచ్చే కోటా నీళ్ళు తరిగిపోతున్నాయ్! ఇరువురం ఇప్పుడు మృత్యు ముఖంలోనే వున్నాం! కాస్త ముందూ, వెనకగా మనకీ గదిలో మృత్యువు తప్పదు. ఇది మనపాలిట పిరమిడ్" నవ్వుతూ తేలికగా అని "ముందు ఈ మంచినీళ్ళు త్రాగు. ఇప్పటికే నీ నోరు పూర్తిగా ఎండిపోయింది. నేనొక విద్య సాధన చేశాను. దానివల్ల మంచినీళ్ళు లేకపోయినా ఒకరోజు వుండగలను. నిన్న త్రాగిన పావుగ్లాసు నీళ్ళూ ఈరోజు అంతా నా బాడీని బ్రతికిస్తాయి. రేపు మళ్ళీ నాకు నీళ్ళు అవసరం అవుతాయి. రేపు మనకి తెచ్చే రెండు గరిటెలు మంచినీళ్ళలో ఒక గరిటె నువ్వు ఒక గరిటె నేనూ పుచ్చుకుందాం! ఊ...త్రాగు" అన్నాను నేను.
రామ్ సింగ్ ఇంకేమీ ఆలోచించలేదు. గబుక్కున నా చేతిలోంచి గ్లాసందుకుని గబగబా నీళ్ళు మొత్తం తాగేశాడు.
నేను జాలిగా అతనివేపు చూశాను. నా నోరు దాహంతో ఎండిపోతున్నది. దాహం ఆపుకునే విద్యలేవీ నాకు రావు. కాకపోతే రామ్ సింగ్ లాగా ఆహార పానీయాల విషయంలో జిహ్వచాపల్యం కలవాడిని కాను.
అన్నీ అందుబాటులో వున్నప్పుడు ఎంత బాగా తినగలనో ఏదీ అందుబాటులో లేనప్పుడు అంత బాగానూ శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలను. నా శరీరం ఎప్పుడూ నా ఆధీనంలోనే వుంటుంది.
మంచినీళ్ళు త్రాగటం పూర్తయిన తర్వాత రామ్ సింగ్ అన్నాడు. "దాహం తీరలేదు భాయ్! అయినా కొంతలో కొంత నాలుక వరకూ స్నానం చేయించి నట్లయింది"
రామ్ సింగ్ మాటలు నాకు నవ్వు తెప్పించాయ్. విషాదంగా నవ్వుకోవటం మినహా చేసేదేమీ లేక ఓ నవ్వు నవ్వి__
"మనం ఎక్కువ మాట్లాడుకోవద్దు. మాట్లాడటం వలన మరింత నోరు ఎండిపోతుంది" అన్నాను.
