మోహన సైకిల్ శబ్దం విని మంచంమీది నుంచి లేచి వచ్చి తలుపు తీసింది.
కోదండపాణి లోపలకువచ్చి ఫ్రేము కుర్చీలో వెనక్కివాలి కూచున్నాడు. మోహన బీరువాలోంచి సిగరెట్ ప్యాకెట్. అగ్గిపెట్టెతీసి అతనికందించింది. అతను వాటితో బాటు ఆమె చేతినికూడా దొరకపుచ్చుకొని దగ్గరకు లాక్కొని వొళ్ళో కూచోబెట్టుకొని పెదిమలు కొరికాడు.
"అబ్బా! అంత గట్టిగానా?" అంటూ అతని నోట్లో సిగరెట్ పెట్టి అగ్గిపుల్ల గీసింది.
"ఏమిటి సడన్ గా వచ్చారు?" అనడిగింది మోహన.
"నీ మీద కంప్లెయింట్ వచ్చింది."
"నామీదా! నేనేం చేశాను? నా వృత్తి తప్ప."
"అందుకే! అదే నేరమని."
"నా సంపాదన కోసం నేను వృత్తి చేసుకొంటూంటే నేరమెలా అవుతుంది?"
"చట్ట ప్రకారం వ్యభిచారం నేరమే. మేము రైడ్స్ చేయడం నిర్భంధించడం తప్పదు."
"అయితే మా ఇంటిమీద రైడ్ చేసి నన్ను నిర్భందించడానికి వచ్చారా?"
"నీమీద రైడ్ చేసి నా చేతుల్లో నిన్ను బంధించాలని వచ్చాను."
"ఈ చమత్కారాలకేం గాని నిజం చెప్పండి. ఏం జరిగింది?"
"నిజంగా, పై అధికారులదగ్గర్నుంచి రిపీడ్ గా ఆదేశాలొస్తున్నాయి నీమీద యాక్షన్ తీసుకోమని. అఫ్ కోర్స్ నేనున్నంతవరకు యేమీ ఫర్వాలేదనుకో." అంటూ నోట్లోంచి సిగరెట్ తీసి ఆమెను దగ్గరకు లాక్కొని పెదిమల మీద మరోసారి ముద్దు పెట్టుకొన్నాడు.
"మరి ఈ ఊళ్ళో యింతమంది జోగినులున్నారుకదా. వాళ్ళమీద యాక్షన్ తీసుకోరా?"
"తీసుకోవటానికి వీల్లేదు."
"ఎందుకని?"
"వాళ్ళు జోగినులు కాబట్టి. వాళ్ళు నిత్యసుమంగళులుగా దేవుని భార్యలుగా సమాజం స్వీకరించింది కాబట్టి. అది ఓ సాంఘిక ఆచారంగా ప్రభుత్వానికి ఒప్పుకోక తప్పలేదు. కాబట్టి."
"అయితే నేనూ ఓ జోగినిగా మారిపోతాను" అంది మోహన నవ్వుతూ.
"వీల్లేదు. ఒక హరిజన వాడలోని వారికే ఆ పాత్ర ధరించే హక్కు ఉంది."
"మరెలా చెప్పండి. రోజురోజుకు జోగినుల సంఖ్య పెరిగిపోతున్న కొద్దీ నా దగ్గరకొచ్చే కస్టమర్స్ తగ్గిపోతున్నారు."
"సీజన్ బాగా డల్ గా ఉంటోంది. ఇలాగైతే ముందు ముందు మాలాంటి వాళ్ళకి గడ్డు రోజులొస్తాయనిపిస్తోంది." అంది మోహన విచారంగా.
"ఇది ఆలోచించతగ్గ విషయమే" అని కోదండపాణి ఒప్పుకున్నాడు.
"అటు పోలీసులు, ఇటు జోగినులు, మధ్య మాలాంటి వాళ్ళం నలిగిపోతున్నాం. తప్పదు."
"ఇప్పుడు నా చేతుల్లో నలిగిపోబోతున్నావు" అంటూ మొదట ఆమెను ఒళ్ళోంచి లేవదీసి తర్వాత తాను లేచి నిలబడి_మంచం వైపు లాగాడు.
* * * *
వర్షను చూసి పదిరోజులు దాటిపోయింది. శ్రీహర్షకు మొదట్నుంచీ వంటరితనం అలవాటే. నిజం చెప్పాలంటే అతడు ఒంటరితనాన్నే ప్రేమిస్తూ ఉండేవాడు. నలుగురితో మసలుతోన్నా, స్నేహితుల మధ్య ఉన్నా, అతని ఆలోచన ఒంటరితనం వైపుకే ప్రవహిస్తూండేది.
వర్ష!
ఎందుకో అతడిని ఆమె ఆకర్షించింది. ఆమెను చూడాలని పదేపదే అనిపిస్తోంది. షాపులో పని ఒత్తిడివల్ల తనకు ఇష్టమైన సమయాల్లో బయటకు రావడానికి వీలుండటం లేదు.
"సార్! బయట వసూళ్ళు కావాల్సిన బాకీలేవీలేవా?" అని అడిగాడు ఓరోజు చలమయ్యని.
