గౌరీనాధశాస్త్రీ ప్రవేశించడంతో కాస్త కదలిక వచ్చింది. శివయ్య లేచి నుంచుని నమస్కరించాడు శాస్త్రి మౌనంగా వచ్చి శివయ్య ముందు కూర్చున్నారు. అంతా మూకీలా ఉంది, ఇవేమీ పట్టని పిచ్చుకల కిచకిచలు తప్ప చప్పుడు లేదు.
'శివయ్యగారూ! నేనే పాపమూ ఎరుగను ఎవరు చేసిన్రో తెలువదు విన్నారా? నామీద అనుమానం పెట్టుకోకండి" -- ఏదో అప్పచేప్పాలని వచ్చి అప్పచెప్పినట్లు చదివారు శాస్త్రిగారు.
శివయ్య పేలవంగా నవ్వాడు. "అనుమానం ఎందుకుగని ఇప్పుడు ఏం చేస్తమంటారు?"
"ఏం లేదు అది తీసివేయాలే తరవాత నేను చేసేది చెయ్యగలను"
"ఊళ్ళ అందరు చచ్చిన్రు, ఒక్కడు తొక్కి చూస్తలేడు, అందరు నా ఉప్పు తిన్న లంజకొడుకులే ఊరి కంత అన్నం పెట్టిన, ఒక్కరు వస్తలేడు గాడ్దికొడుకు వచ్చినోళ్ళు అట్ల నాటకం చూసినట్లు చూస్తాన్రు ఏం చేయమంటారు?"
శాస్త్రిగారు మౌనం వహించారు కొంతసేపు తరువాత అన్నారు. "శివయ్యగారూ! మనిషికి ప్రాణం కన్న ప్రియం అయింది లేదు, ప్రాణభయాన్ని మించిన భయం లేదు, జనం భయపడుతున్నట్లున్నరు ఏం చేయాలేనో నాకూ తోచటం లేదు."
'అయితే మీరేమీ సాయం చేయలేరా?" శివయ్య అరించాడు.
శాస్త్రీ గారు మాట్లాడలేదు పొడుం కయకోసం రొంటిన వెదికారు కనిపించలేదు. ఏదో నిలువయిన వస్తువును కోల్పోయినట్లు ముఖం పెట్టారు.
పావని రంగంలోకి ప్రవేశించింది. ఎందుకో ప్రాణం లేని వచ్చినట్లనిపించింది శివయ్యకు. అలాంటి సమయాల్లో మనిషి కనిపించడం మహాత్యంగానే ఉంటుంది.
'అమ్మా పావనమ్మా! చూసినవా , ఎవడో ఇట్ల చేసి పోయిండు ఊళ్ళ ఒక్కడు ఇటు వస్తలేడు ఇట్లయింది నా పని ఈ పీడ దూరం అయ్యేటట్లు లేదు, ఏం చేయాలేనో తోచటం లేదు చూడమ్మా, ఆ నిమ్మకాయలు - నెత్తుటి కూడు ఎవడో నా కొంపకే ఎసరు పెట్టిండు"
పావని ఒక్కసారి కలయ చూచింది. వాతావరణం ఏదో ముంచుకు వచ్చినట్లుంది. మనుషులు ప్రాణం లేని బొమ్మల్లా ఉన్నారు.
"బాబాయిగారూ!" పావని పలకరింపులోనే ఏదో సైర్యం కనిపించింది శివయ్యకు. "ప్రాణం లేని మంత్రం తంత్రాలను చూచి బెదిరిపోతున్నారు. ప్రాణం ఉన్న మనుషుల్లోని శక్తి సామర్ధ్యాలను గమనించలేకపొతున్నారు. మంత్రాలను నమ్ముకున్న వాడు బాగుపడడు. మనిషిని నమ్ముకున్నవాడు చేడిపోడు మీరు మనిషిని దూరం చేసుకున్నారు. ఈ ఊళ్ళో ఉన్న మనుషులంతా మీకు చాకిరి చేస్తున్నారు,పడిగాపులు కాస్తున్నారు, వారంతా అన్ని పనులూ చేస్తున్నారు, మీరు సంపద పెంచుకుంటున్నారు, వారు తమతమ అవసరాలకు లొంగి మీకు బానిసలయి ప్రవర్తిస్తున్నారు. మీ జీవితంలో వాళ్ళు చేయనన్న పని ఇదొక్కటే చూడండీ! మీరు ఎంత బాధపడి పోతున్నారో " ఇలా వాళ్ళు పనులు చేయకుండా ఉండిపోతారనుకొండి - మీ సంపద, మీ ఆస్ట్రి నిలవడం కాదు -- మీ ఇంట్లో పిల్లి లేవదు. మీరు పెట్టుకుంటే వాళ్ళు ఆకలితో చావరా అనుకుంటారు మీరు కాని మనిషి లొంగదలచుకోకుంటే చావడానికయినా సిద్దం అవుతాడు. మీరు నమ్ముకున్నది ఆస్తిని, అధికారాన్ని . ఆస్తికి ప్రాణం లేదు, అధికారానికి హృదయం లేదు. ఆస్తిగానీ, అధికారం గానీ తమకు తాము నిలువలేవు. వాటి నిలకడకు జనం అవసరం , మనిషి అవసరం మీరు నమ్ముకున్న ప్రాణం లేని అస్తిగానీ, ఆశికారం గానీ ఇప్పుడు మీకు సాయపడలేవు. మీకు సాయపడాల్సింది ప్రాణం ఉన్న మనిషి . మీరు ఎన్నడూ మనిషికీ ప్రాణం ఉందని భావించలేదు. వారిని మరలనీ, యంత్రాలనీ భావించారు. వారికి ప్రాణం ఉందనీ, వారికీ చీమూ- నెత్తురూ ఉన్నాయనీ , వారికీ సుఖదుఃఖాలున్నాయనీ , వారికీ అభిమానాలు ఆత్మీయతలూ ఉన్నాయనీ భావించలేదు. కూలి చేయించుకుని కనీసం కూడు వేయలేదు. పశువుల కంటే హీనంగా చూశారు. ప్రాణాలు తీశారు. ఇవ్వాళ వాళ్ళు మీకు సాయంగా రావాలని ఎలా ఆశిస్తారు? మీరు వాళ్ళతో ఆత్మీయత పెంచుకుని ఉంటే మీ కాలిలోని ముల్లును వారు పంటితో తీసేవారు. కానీ అలా చేయలేదు. ప్రాణం లేని ఆస్తిని నమ్ముకున్నారు. ప్రాణం ఉన్న మనిషిని వదిలేసుకున్నారు. మీకు సాయపడడానికి ఒక్కడూ రావడం లేదు"
పావని ఊపిరి సలుపుకోవడానికి నిలిచింది.
'అమ్మా! ఇన్ని విషయాలు ఎక్కడ నేర్చుకున్నవమ్మా?" శాస్త్రీ గారు కూతురులోని విజ్ఞానానికి పొంగిపోయారు.
"అమ్మా పావనమ్మా! ఈ పీడ వదిలే ఉపాయం చూడు నువ్వు ఏం చేయమంటే అదే చేస్త"
పావని గ్రహించింది తాను చెప్పినదంతా బూడిదలో పోసిన పన్నీరే. శివయ్యకు కావలసింది తన పని కావడం, అధికారం, సంపద -- వీటి మీద నీతులు పనిచేయవు.
"బాబాయిగారూ! ఈ మంత్ర తంత్రాలు వట్టి కల్లబొల్లి కబుర్లు నాకు వాటి మీద నమ్మకం లేదు. మనిషి మాటను మించిన మంత్రం ఉంటుందంటే నమ్మకం నాకు లేదు. తోడివానికి సాయం చేయడాన్ని మించిన ధర్మం లేదు"
'అయితే పావనమ్మా! ఆ నిమ్మకాయలు తీసేస్తావా?"
"శివయ్యగారూ! ఆ నిమ్మకాయలు మనం కాయించినవే, ఆ బియ్యం మనం పండించినవే అన్నానికి రంగు వేయగానే అందరినీ మింగేస్తుందా? చూడండి తీస్తాను ' - పావని నిమ్మకాయల వైపు బయల్దేరింది.
"అమ్మా పావనీ!' శాస్త్రిగారు లేచి నించున్నారు.
"అమ్మగారూ! పావనమ్మగారూ! మీరు తియ్యొద్దు" - మల్లమ్మ అడ్డం పోయింది.
పావని అడ్డు తొలగించుకుని పోయింది. నిమ్మకాయ అందుకుని శివయ్యగారికి చూపింది.
"శివయ్యగారూ! ఇది ఉట్టి నిమ్మకాయ . మిమ్ములను ఇందాక వణికించింది . మీరు కూడా అంతే మీరంటే ఈ ఊరి జనం గడగడలాడుతున్నారు. వాళ్ళు ఎందుకు వణికిపోతున్నారు? మీ దగ్గర ఏదో శక్తి ఉందనుకున్నారు. మీ దగ్గర ఆ శక్తి లేదని వాళ్ళు తెలుసుకున్నారనుకోండి - అప్పుడు మీరు ఈ నిమ్మకాయ లాంటివారే ఇది నిమ్మకాయ - వట్టి నిమ్మకాయ . ఇది ఇప్పుడు ఎందుకూ పనికిరాదు , చూశారా?"
పావని ముఖం ఎండకు వెలిగిపోతుంది. ఆమె వాగ్దేవిలా ఉంది. అనంత మయిన సత్యాలను వెలువరిస్తుంది. మంచిని, మానవతను పెంచడానికి అవతరించిన పావనిలా ఉంది.
పావని ముఖం వెలిగిపోతుంది. కళ్ళు కనకాంబరాల్లా ఎర్రగా ఉన్నాయి. పెదవి అదురుతుంది. స్వేదబిందువు ముక్కు చివరకు వచ్చి నిలవనా, రాలనా ? అని తటపటాయిస్తుంది.
పావని ప్రసన్నంగా ఉంది. ఆమెను చూచి ప్రసన్నుడు కావలసింది శివయ్య - భయపడుతున్నాడు అతనికి పావని చెప్పిన వాస్తవాలు తలకెక్కలేదు . నిమ్మకాయ పట్టుకుని నుంచున్న పావని మహా శక్తిలా కనిపించింది. మంత్రకత్తెగా కనిపించింది. తండ్రిని మించిన మంత్రాలు నేర్చిందనుకున్నాడు .శివయ్యకు చెమటలు పడ్తున్నాయి.
పావని నిమ్మకాయ పిండింది విచిత్రం! అందులోంచి ఎర్రని రసం వచ్చింది.
'అమ్మా పావనమ్మా! ఇహ అగు ఎరకయిందమ్మా! నీ శక్తి గ్రహించిన ఏం కావల్నంటవో చెప్పు, ఇచ్చుకుంట చాలు, నిమ్మకాయ పారెయ్యి దూరంగా పారెయ్యి పారేయమ్మా - పారెయ్యి " - శివయ్య దూరం నుంచే చేతులు జోడించి
పావని ఆశ్చర్యపోయింది తనలో ఉన్న శక్తులేమి. తాను సామాన్య స్త్రీ తాను చేసింది అతి సామాన్య కార్యం పావనికి ఏమీ అర్ధం కాలేదు. ఆమె నిమ్మకాయ వాకిట్లోకి విసిరి కొట్టింది. అక్కడున్న అన్నాన్ని కాళ్ళతో తొక్కింది. ఆ తొక్కడం తాండవమాడినట్లుంది.
"నా తల్లికి శివం వచ్చింది. నిజంగానే శక్తి అయింది" అని శాస్త్రి గారు ముందుకురికాడు పావనిని పట్టుకున్నారు.
పావని అలసినట్లుంది "ఏమిటి నాన్నా, ఇదంతా?" అడిగింది.
"ఏం లేదమ్మా! పోదాం పా నీకిప్పుడు తెలియదమ్మా! తరవాత తెలుస్తుంది" కూరుతును నడిపించుకుని వెళ్ళిపోతున్న శాస్త్రిగారిని చూచిన శివయ్య చేతులెత్తి మొక్కాడు చేతులు నేలకు ఆనించి దండాలు పెట్టాడు.
శివయ్య ఇటు చూచాడు. మల్లమ్మ నుంచొని ఉంది. "ఏందే! ఇగనన్న తీస్తావా?" శివయ్య పలుకుల్లో కటిన్యం లేదు.
మల్లమ్మ నవ్వుకుంది. మల్లమ్మకు నవ్వు వస్తుంది. నవ్వు కనిపించకుండా తల వంచుకుంది. పారక తీసుకుని ముదుకు నడిచింది. పదార్ధాలను దూరంగా తోసింది. వాకిలి ఊడ్చింది కళ్ళాపి చల్లింది. పెంటడు వచ్చాడు. పశువులను విప్పుకుని వెళ్ళిపోయాడు. శివయ్య ఇంట్లో మళ్ళీ ఊపిరి సలుపుతున్నట్లు అనిపించింది.
ఆ సాయంకాలం శాస్త్రీ గారిని పిలిచాడు శివయ్య. సుభద్రమ్మకు జ్వరం పట్టుకుంది . శాస్త్రిగారు సుభద్రమ్మకు బొట్టు పెట్టాడు తగ్గిపోతుందని చెప్పి వెళ్ళిపోతూ , ఏదో కట్టుదిట్టం చేద్దామంటూ వెళ్ళిపోయాడు.
పావనిలో ఏదో శక్తి ఉందని నమ్మింది ఊరంతా!
