"లో జ్వరం ఐవుంటుంది. ధెర్మోమీటర్ కే తెలుస్తుంది, పైకి వొళ్ళు వెచ్చగా అనిపించదు" అన్నాడు శ్రీపతి.
"ప్రేమ జ్వరమేమొ!" అన్నాడు యింకొకతను.
"ప్రేమజ్వరమైతే వొళ్ళు కాలిపోదూ?" అన్నాడు నిరంజనరావు.
"ప్రేమజ్వరం ఐతే వొళ్ళు వేడెక్కదు. మనసే వేడెక్కుతుంది. ప్రేమజ్వరం తరవాతి జ్వరం విరహజ్వరం __దానికైతే వొళ్ళు వేడెక్కుతుంది. కామ జ్వరానికైతే కొవ్వు వేడెక్కుతుంది. సుఖ జ్వరానికైతే సుఖం వేడెక్కుతుంది. ఆడితే ఓ యాంటీబయాటిక్ మోతాదుతో తగ్గిపోతుంది" అన్నాడు శ్రీపతి.
"ఆర్యా, జ్వరములు యెన్నిరకంబులు?" అన్నాడు నిరంజనరావు.
"జ్వరాలు నానా రకాలు. ఏడుపు జ్వరాలు, అలక జ్వరాలు, చేదు జ్వరాలు, యీర్ష్య జ్వరాలు_వస్తా. మరోసారి మాటాడుకుందాం మిగతా సవాలక్ష జ్వరాల గురించి." అని చటుక్కున లేచి గదిలోకి నడిచి __ సగందాకా చదివిన నటాన్ సన్ పుస్తకం, "లిటరేచర్, ఫిలాసఫీ అండ్ సోషియల్ సైన్సెస్" తెరిచాడు శ్రీపతి.
76
అటు సికింద్రాబాదూ యిటు హైదరాబాద్ లలోని రాంనగరూ ఆ పరిసర ప్రాంతాలు, ముషీరాబాద్ లో కొన్ని భాగాలూ కలిసిన అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పడిన ఖాళీకి బై ఎలక్షన్ నిర్ణయించారు జనవరి మూడో వారంలో.
మార్చిలో ఎలక్షన్లు. పోలిగ్ తేదీలు యింకా వెల్లడించలేదు. ఫిబ్రవరి రెండోవారంలో పార్టీల అభ్యర్ధుల్ని ప్రకటించారు. ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థిగా గోవర్ధన్ రెడ్డి పేరు ప్రకటించారు.
కాలేజీలలో యిటీవల యూత్ కాంగ్రెస్ ప్రాబల్యం తగ్గుతున్నట్లనిపించి, తన ఆధిక్యత తగ్గుతూండటం గమనించుకున్న గోవర్ధన్ రెడ్డి, మంత్రివర్గంలో వున్న తన బంధువు వొకరి ద్వారా ప్రయత్నించి సీటు సంపాదించాడు. ఆ ప్రాంతంలో బాగా పలుకుబడి వున్న రాజ్ రెడ్డి మద్దతు ఇవ్వటానికి అంగీకరించాడు. రాజ్ రెడ్డికి నేరుగా రాజకీయాలలో ప్రవేశించే తలంపు లేదు. ఆ అండతో తన వ్యాపారాలు పెంపు చేసుకునే తలంపు వున్నవాడు, రామనాధం మెషీన్ టూల్స్ లోంచి నర్సిమ్లు బయటికి వొచ్చేశాక అతనిని చేరదీసి తన ఫ్యాక్టరీల్లో పని ఇచ్చి, ప్రాముఖ్యత యిచ్చాడు. కూలీ నాలీ జనాన్నీ కార్మికుల్నీ అతను జమ చెయ్యగలడు.
జనసంఘ్, తమ అభ్యర్థిగా మాధవరావు అని ఒకతనిని ప్రకటించింది ఆ పార్టీ. ఈ నియోజకవర్గంలో జనసంఘ్ కి బలం అంతగా లేదు. ముషీరాబాద్ ప్రాంతంలోని వుద్యోగస్తులు, చదువుకున్నవాళ్ళు, మధ్య తరగతి ప్రజలు, కాస్త వున్నవాళ్ళు, పై వుద్యోగస్తులు....ముఖ్యంగా హిందువుల్లోంచి ఓట్లు పడతాయి. వాళ్లలోనూ కొందరు ఇందిరాగాంధీ పార్టీకే ఓటు వేస్తారు.
ఇకపోతే కమ్యూనిస్టుపార్టీకి అదివరలో బాగా బలం వుండేది. ఒకప్పుడు ఆ పార్టీకి యీ నియోజకవర్గం పెట్టనికోటలాంటిది. కాని పార్టీ చీలిపోయిన తరవాత ఆ ప్రాబల్యం పోయింది. ఒక దశలో ఇరుపక్షాలు కలిసి ఒక అభ్యర్థిని నిలబెట్టే అవగాహన ఆలోచన యత్నాలు ఒక స్థాయిలో జరిగినా....ఇంటి కుక్క ఇంటి కుక్కని చేరనివ్వదన్నట్లుగా వాళ్ళ మధ్య సయోధ్య సాధ్యపడలేదు. సి.పి.ఐ., సి.పి.ఐ.(యం), చెరో అభ్యర్థిని నిలబెట్టారు.
అటు మెషీన్ టూల్స్ ఫ్యాక్టరీ వర్కర్లు, ఇటు రాంనగర్ వాసులు పట్టుబట్టారు, రవిని పోటీ చెయ్యమని. అతనికి మనసులో యిష్టంగానే వుంది. ఇండిపెండెంటుగా నామినేషన్ దాఖలు చేశాడు.
పోతే మరో ముగ్గురు, ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. కానీ వాళ్ళకి డిపాజిట్లు దక్కినా గొప్పే.
నామినేషన్లు ఉపసంహరించుకునే గడువులోగా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఐదువేల డబ్బు యిచ్చి, యింకా ఇతర ఆశలు కల్పించి ఉపసంహరింపచేయించాడు రాజ్ రెడ్డి.
ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని__అనధికారికంగానే కావొచ్చు_ బాహాటంగానే వాడుకుంటున్నాడు గోవర్ధన్ రెడ్డి. డబ్బుకి లోటులేదు. బాగా స్థితిపరుడు. ఖర్చు పెట్టటానికి వెనకాడే తత్వమూ కాదు. రాజ్ రెడ్డి రవిని తనకి అనుకూలంగా మలుచుకుని తన మిల్లులో పని యిచ్చి ఆ ప్రాంతంలో అతని పలుకుబడిని తగ్గించాలని చాలా కాలంగా యత్నిస్తూ రకరకాల ఆశలు చూపెడుతూ వచ్చినా లొంగనందున రవి పట్ల అతనికి వైరం వుంది. అందుకు యింకా యెన్నో కారణాలు వున్నాయి. రాజ్ రెడ్డి దగ్గర పనిచేసే కార్మికుల్లో చాలామంది రాంనగర్ లోనూ ఆ పరిసర ప్రాంతాల్లోనూ వున్నారు. వాళ్ళు తమ సమస్యల గురించి సంప్రదిస్తూండటం, ఆ వైషమ్యానికి ముఖ్య కారణం.
గోవర్ధన్ రెడ్డికి రవి అంటే వైరం ఏమీలేదు. వ్యక్తిగతంగా ఒకరికొకరు తెలియనూ తెలియరు_ ఒకరిని గురించి ఒకరు వినటం తప్ప. రవిని పోటీ చెయ్యవద్దని రాయబారం పంపించి విఫలమయ్యాడు. ఎలక్షన్లలో సోదిలోకి కూడా రాలేనివాడు, అంతగా రాయబారం జరిపించినా వినలేదని గుర్రుగా వుందిప్పుడు గోవర్ధన్ రెడ్డికి.
కాంగ్రెస్_ఐ నాయకులు ముమ్మరంగా ప్రచారం సాగిస్తున్నారు. అటు కమ్యూనిస్టుపార్టీలూ బాగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ రెండు పార్టీలకీ ఏదొకరకంగా మంచి ప్రాబల్యం వుంది ఆ ప్రాంతంలో. రాజకీయ కోవిదులు పరిశీలకుల అంచనా ప్రకారం కాంగ్రెస్ ఐ గెలవటం తథ్యం. తప్పితే సి.పి.ఐ.(యం) గెలవచ్చునని. కానీ కాంగ్రెస్_ఐ గెలవటం తథ్యం అని చివరికి నిర్ధారించారు. ఆఫీసర్లు వుద్యోగస్తులు కాంగ్రెస్_ఐకి ఓటు చేస్తారు....కొందరు జనసంఘ్ అంటే ప్రత్యేక అభిమానం వున్నవాళ్ళు తప్ప. రాజ్ రెడ్డికి ఆ ప్రాంతంలో అందరితోనూ దగ్గిరి సంబంధాలున్నాయి. వర్కర్లు తెలుసు. కాగా, నర్సిమ్లు రవిమీద కక్షగా దీక్షతో అహోరాత్రులు కృషి చేస్తున్నాడు. కార్మికులు కూలీ నాలీ జనం ఓట్లను అతను రాబట్టగలడు.
రాములు, సాయిలు, యింకా చాలామంది రవి తరపున ప్రచారం చేస్తున్నారు. గంగి నలుగురు ఆడవాళ్ళను పోగుచేసి గుడిశ గుడిశకీ వెళ్ళి చెబుతోంది. ఐతే, చదువుకున్నవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళ ఇళ్ళకి ఆమె వెళ్ళటం లేదు.
రవికి వున్న కాస్త బలమూ అతని స్వభావమూ, ఉపన్యాస సామర్థ్యం. గోవర్ధనరెడ్డి ఉపన్యసించటంలో పూజ్యం. నుంచుని గట్టిగా అరిచినట్లుగా నాలుగు ముక్కలు అనగలడు. అయితేనేం, అతని తరపున వేదిక మీద మాట్లాడే ప్రముఖులు యెందరో వున్నారు.
రవికి, వ్యక్తిగతంగా ఆ ప్రాంతంలోని బీదసాదలతో చక్కని సంబంధాలున్నాయి. యిలా ఎలక్షన్ అనే భావం మనసులో ఏమాత్రం లేకుండానే తన స్వభావాన్ననుసారించి అవసరాల్లో వున్నవాళ్ళకి తనతో ఐంది చేస్తుంటాడు_ వెనకటినుంచీ. ఆ రకంగా, సీజన్లను బట్టి వుండే అవీ ఇవీ పనులు చేసుకుని బతికేవాళ్ళు, కార్మికులు అతనికి కొందరు సన్నిహితంగా తెలుసు.
